OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

Gold

Gold

కొంతకాలంగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఏడాది క్రితం గరిష్ఠ స్థాయికి చేరిన ఈ విలువైన లోహాల ధరలు తగ్గటం వినియోగదారుల్ని గందరగోళపరుస్తోంది. ఈ పతనం ఎందాకా కొనసాగుతుందనేది సామాన్యులకు అంతుచిక్కడం లేదు. ప్రస్తుత ధరల దగ్గర బంగారం, వెండి కొనొచ్చా.. లేదా అనే సందేహాలు వస్తున్నాయి. అటు నిపుణులు కూడా బంగారం, వెండి భవిష్యత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం.. పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతున్న అంచనాలు, అమెరికా ట్రెజరీ బాండ్ ప్రతిఫలాలు పెరగడంతో ఈ లోహాల మెరుపు తగ్గుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ప్రస్తుతం లక్షా ముప్ఫై వేల రూపాయలకు దిగొచ్చింది.

కొన్నాళ్లుగా అనిశ్చితికి మారుపేరుగా ఉన్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం డౌన్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. ఓ దశలో రికార్డు స్థాయి గరిష్ఠాలకు చేరిన ఈ విలువైన లోహాలు.. అప్పటిదాకా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల గురించి పట్టించుకోని వారిని కూడా ఆకర్షించి కొత్తగా పెట్టుబడులు పెట్టించాయి. అయితే కొద్దిరోజుల క్రితం మొదలైన బంగారం, వెండి ధరల పతనం ఆగకుండా కొనసాగుతుండటంతో.. ఎక్కువ రేట్ల దగ్గర కొన్నవాళ్లలో ఆందోళన కనిపిస్తోంది. ఈ ధరల పతనం మరింతగా కొనసాగి.. చివరకు పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పడిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అటు నిపుణులు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో లేకపోవడంతో.. ఇప్పటికీ బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. శుభకార్యాలు పెట్టుకున్నవారికి ఈ ధరల తగ్గింపు భారీ ఉపశమనమే అని చెప్పాలి. మొన్నటిదాకా కొండెక్కిన బంగారం ధరల్ని చూసి దిగాలు పడ్డ వధూవరుల తల్లిదండ్రులకి.. ప్రస్తుత ధరలు ఊరటనిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలతోనే బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని కొందరు విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా పరిణామాలు, చమురు ధరలు, యుద్ధం స్థితిగతులే బంగారం, వెండి ధరల్ని నిర్దేశిస్తాయనే విషయంపై అనుమానాలు వద్దంటున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. దాంతో బంగారం, వెండి లాంటి వడ్డీ ఇవ్వని లోహాలపై మదుపర్లకు ఆసక్తి తగ్గింది. ఈ కారణాలతోనే బంగారం, వెండి ధరలు భారీగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,82,000కు, కిలో వెండి ధర రూ.4,25,000కు చేరగా.. గురువారం నాటికి బంగారం రూ.1,30,690కు, వెండి రూ.1,80,000కు చేరాయి. అంటే గరిష్ఠాల నుంచి వెండి ధర 60 శాతం, బంగారం ధర 25 శాతం తగ్గాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు, ఎల్‌నినో కారణంగా వర్షాభావంతో పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడిన తరుణంలో.. లోహం రూపేణ పసిడి, వెండి కొనుగోళ్లు గణనీయంగా తగ్గడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెబుతున్నారు.

అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా నమోదవడం, ఆర్థిక గణాంకాలు బలంగా ఉండటంతో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లు పెంచొచ్చనే అంచనాలు మార్కెట్‌లో బలపడ్డాయి. అమెరికా ట్రెజరీ బాండ్లపై ప్రతిఫలం పెరుగుతోంది. ఫలితంగా వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడులు పెట్టడం కంటే, బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ఆకర్షణీయంగా మారుతోంది. ఇదే సమయంలో అమెరికా డాలర్‌ బలపడింది. బంగారం లావాదేవీలు డాలర్ల రూపేణ జరుగుతాయి. ఫలితంగా ఇతర దేశాల కొనుగోలుదారులకు పుత్తడి మరింత ఖరీదైనదిగా మారుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెట్టుబడిదారులు లాభాలు స్వీకరించేందుకు విక్రయాలు ప్రారంభించగా, మళ్లీ ధర తగ్గడం మొదలైంది. ధరలు ఇంకా పతనం అవుతాయనే ఆందోళనతో మదుపర్లు విక్రయాలకు దిగుతున్నారు.

అంతర్జాతీయ విపణిలో ఔన్స్‌ బంగారం ధర 3,737 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది జనవరిలో నమోదైన గరిష్ఠ ధర 5,600 డాలర్లకు పైగా ఉండగా, ప్రస్తుతం 31 శాతం తగ్గింది. దేశీయంగా మాత్రం బంగారం ధర 26 శాతమే తగ్గింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత, దేశీయంగా పసిడి దిగుమతిపై పన్ను పెంచడం ఇందుకు కారణాలని చెబుతున్నారు. ధరలు మరింత తగ్గొచ్చనే అంచనాతో అత్యవసరమైన వారు మినహా, భవిష్యత్తు అవసరాల కోసం బంగారం కొనుగోళ్లను అత్యధికులు వాయిదా వేస్తున్నారు.

మార్కెట్‌ విశ్లేషకుల అంచనాల ప్రకారం, 10 గ్రాముల మేలిమి బంగారానికి రూ.1,30,000 వద్ద కీలక మద్దతు లభిస్తుంది. అంతకంటే దిగినా రూ.1,25,000 వరకు రావచ్చని పేర్కొంటున్నారు. కిలో వెండి ధర కూడా రూ.1,60,000 వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. క్రిస్మస్‌ తరవాత మళ్లీ ధరలు క్రమంగా పెరగొచ్చనీ అంచనా. అందువల్ల ధరల పరిస్థితిని పరిశీలిస్తూ, దశలవారీగా బంగారం కొనుగోలు చేయడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో స్వల్పకాలంలో పతనం కనిపించినప్పటికీ, 2027 నాటికి బంగారం ధర మళ్లీ పుంజుకుంటుందని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు తమ అంచనాలు వెలువరిస్తున్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ 2027 చివరినాటికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు 4650 డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉంటే మరింత ఎక్కువే పెరిగే అవకాశాలు ఉన్నాయని జేపీ మోర్గాన్ వంటి సంస్థలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. అందుకే కొనుగోలుదారుల విషయానికి వస్తే అవసరం ఉన్న వారు ఒకేసారి కాకుండా, ధర తగ్గిన ప్రతిసారీ బంగారాన్ని దశలవారీగా కొనుగోలు చేయడం మంచి వ్యూహమని విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు.

కొందరు విశ్లేషకులైతే.. బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్ష స్థాయికి చేరే అవకాశం ఉంది. వెండి ధర కూడా కిలోకు రూ.1.50 లక్షల దిగువకు రావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఇవి మార్కెట్ అంచనాలు మాత్రమే. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ, వడ్డీ రేట్లలో మార్పులను బట్టి ధరలు మళ్లీ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఏదేమైనా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు వచ్చిన మార్పులు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులను భయపెట్టిన ఈ ధరలు ఇప్పుడు అదే వేగంతో కిందికి దిగివస్తున్నాయి. ముఖ్యంగా గత అక్టోబర్ నెల నుంచి మొదలైన ధరల పతనం నవంబర్‌లోనూ కొనసాగుతోంది. మధ్యలో కొన్ని రోజులు ధరలు పెరిగినా, గత 10 నుంచి 15 రోజులుగా మాత్రం భారీగా తగ్గుతున్నాయి. ఒకప్పుడు బంగారం ధర 10 గ్రాములకు రూ.2 లక్షలకు చేరుతుందేమోనని భయపడి కొనుగోలు చేసినవారు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అయ్యో.. అప్పుడే కొనకుండా మరికొన్ని రోజులు ఆగి ఉంటే తక్కువ ధరకే ఎక్కువ బంగారం వచ్చేదని బాధపడుతున్నారు. వెండి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక దశలో కిలో వెండి ధర రూ.4 లక్షలకు చేరువ కావడంతో, భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని భావించి చాలామంది కొనుగోలు చేశారు. బంగారం కంటే వెండిలోనే ఎక్కువ లాభాలు వస్తున్నాయనే అంచనాతో మధ్యతరగతి ప్రజలు కూడా పెట్టుబడుల కోసం వెండి కొన్నారు. కానీ ఇప్పుడు ధరలు భారీగా తగ్గడంతో వారిలో ఆందోళన మొదలైంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎంతలా పడిపోయాయో గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. గత నెల అక్టోబర్ 19వ తేదీన bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,47,570గా ఉంది. అయితే నవంబర్ 19వ తేదీ నాటికి అదే బంగారం ధర రూ.1,30,690కు పడిపోయింది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.16,880 తగ్గింది. ఇంత భారీగా ధరలు తగ్గడం కొనుగోలుదారులకు శుభవార్త అనే చెప్పుకోవాలి. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,19,800 వద్ద కొనసాగుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనాలనుకునేవారికి ఇది బంపర్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.

వెండి ధరలు కూడా బులియన్ మార్కెట్‌లో భారీగా తగ్గుతున్నాయి. గత నెల అక్టోబర్ 19వ తేదీన హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,10,210గా ఉంది. కానీ నవంబర్ 19వ తేదీ నాటికి కిలో వెండి ధర రూ.1,80,000కు దిగివచ్చింది. అంటే నెల రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ.30,220 తగ్గింది. ఒకప్పుడు వెండి ధరలు మరింత పెరుగుతాయని భావించి కొనుగోలు చేసినవారికి ఈ తగ్గుదల షాక్ ఇస్తోంది. అదే సమయంలో ఇప్పుడు వెండి కొనాలనుకునేవారికి మాత్రం కొంత ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలను బట్టి రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో మళ్లీ పెరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.