ప్రపంచవ్యాప్తంగా అస్తవ్యస్త పరిస్థితులు రాజ్యం చేస్తున్నాయి. మన దేశం విషయానికొస్తే ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల కోతకు తోడు పరీక్షపత్రాల లీకేజీలతో యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాధారణంగా ఏదీ పట్టనట్టుగా ఉండే జెన్‌జీ.. ఇప్పుడు ఆలోచించడమే కాదు.. కదం తొక్కడమూ మొదలుపెట్టిందని.. ఢిల్లీలో ఉద్యమం తేటతెల్లం చేసింది. కాకపోతే యువత ఇంతటితో ఆగే పరిస్థితి లేదు. రేపటి రాజకీయాన్ని కొత్తగా నిర్వచించాలనే ఆకాంక్షతో కదులుతున్నాయి. సంప్రదాయ రాజకీయ విధానాల్ని బద్దలుకొడుతూ.. సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే దిశగా కదిలే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. యుద్ధం మెజార్టీ దేశాలకు ఆర్థిక సంక్షోభం తెచ్చిపెట్టింది. మన దేశంలో యుద్ధానికి తోడు ఎల్‌నినోతో తీవ్ర నిరాశ అలముకుంది. వీటితో పాటు ఉద్యోగాల కోతలు, రూపాయి పతనం, ధరల పెరుగుదలతో సామాన్యుడు కుదేలౌతున్నాడు. ఇది చాలదన్నట్టుగా వరుసగా లీకౌతున్న ప్రశ్నాపత్రాలతో విద్యార్థి లోకం కూడా జూలు విదిల్చే పరిస్థితి వచ్చేసింది.
వరుస యుద్ధాలతో ప్రపంచ దేశాలు ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఈ సంక్షోభాలను సమృద్ధిగా ఉన్న ఆహారధాన్యాలు గల దేశాలు గుడ్డిలో మెల్లగా ఎదుర్కున్నాయి. కానీ ఇప్పుడు ఆ దేశాలకు కూడా తెరిపిన పడే అవకాశం ఇవ్వకుండా ఎల్‌నినో వచ్చేసింది. మన దేశంలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కారణంగా ఎడాపెడా ఉద్యోగాల కోతలు అమలౌతున్నాయి. ప్రజల ఆదాయాలు బాగా తగ్గిపోయాయి. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. మరోవైపు పెట్రోల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. దీంతో ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. ఇలా ఒక్క మన దేశమే కాదు.. ప్రపంచంలో ఏ దేశం పరిస్థితి చూసినా.. అంతటా అస్తవ్యస్త పరిస్థితులే రాజ్యం చేస్తున్నాయి.
ఇరాన్ యుద్ధ ప్రభావం కేవలం అమెరికా, ఇరాన్‌లకే పరిమితం కాలేదు. ప్రపంచబ్యాంక్ ఈ ఏడాది అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను కోవిడ్ కాలం తర్వాత అత్యంత కనిష్టంగా 2.5 శాతానికి తగ్గించింది. మధ్యప్రాచ్య దేశాల జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుండి 1.3 శాతానికి పడిపోయింది. వ్యవసాయానికి కీలకమైన ఎరువుల ధరలు ఏకంగా 47 శాతం పెరిగాయి. భారతదేశంలో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కమర్షియల్ ఎల్‌పీజీ ధరలు విపరీతంగా పెరగడంతో పాటు వంటగ్యాస్ కొరత ఏర్పడి సామాన్యులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అంతకు మించిన సమస్యలు వచ్చే సంకేతాలు కాదు.. ఏకంగా క్లారిటీ కనిపిస్తోంది.
యుద్ధం కారణంగా ప్రపంచం ఎదుర్కుంటున్న మరో పెద్ద సమస్య ద్రవ్యోల్బణం. ఇప్పటికే పలు దేశాల్లో రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం నమోదవుతోంది. దీంతో వివిధ దేశాల కరెన్సీలు నేలచూపులు చూస్తున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సమస్య ఉంది. ఒక్కో రకమైన పరిస్థితులున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుత అంచనాలు మాత్రమే. ఇక ముందు జరగబోయే యుద్ధం, దాని తీవ్ర పర్యవసానాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు చేతులెత్తేశాయి. మిగతా దేశాల్లోనూ ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని హెచ్చిరించి.. చేతులు దులుపుకుంటున్నాయి. అంటో రాబోయేది గడ్డు రోజులేననే విషయం ఇప్పటికే తేటతెల్లమైంది. ఇప్పటికే అన్ని రంగాలూ పడకేసి.. ప్రజలకు తీవ్ర నిరాశానిస్పృహలు ముంచుకొచ్చేశాయి.
ఇరాన్ యుద్ధం ఆగే ప్రసక్తే లేదని తేలిపోవడంతో.. నిరాశలో మునిగిన ప్రపంచానికి.. ఎల్‌నినో ప్రభావం ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఇప్పటికే మన దేశంలో ఎల్‌నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతంలో ఎన్నో సంక్షోభాల నుంచి దేశాన్ని బయటపడేసిన వ్యవసాయ రంగమే.. ఇప్పుడు ఎల్‌నినోతో సంక్షోభంలోకి వెళ్లే దుస్థితి నెలకొనడంతో.. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ఇంధన, సరఫరా సమస్యలు వచ్చి.. ధరలు పెరిగి.. ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ఆర్థిక సంక్షోభం వచ్చేసింది. కాకపోతే ఆర్థిక సమస్యలు వచ్చినా.. వ్యవసాయం బాగుంటే ఏదోలా నెట్టుకురావచ్చనుకున్న సామాన్యుడి ఆశలపై ఎల్‌నినో నీళ్లు చల్లింది. ఇప్పుడు ఎల్‌నినో కారణంగా వర్షాభావంతో.. సాగువిస్తీర్ణం భారీగా తగ్గింది. కరోనా సమయం నుంచీ ఊహించని పంటల దిగుబడులతో.. ఇతర దేశాలను ఉదారంగా ఆదుకున్నాక కూడా.. మనకు తిండిగింజలకు కొరత రాలేదు. కానీ ఇప్పుడు ఎల్‌నినో ఆ పరిస్థితిని రివర్స్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయం కుదేలై.. పంటల దిగుబడులు తగ్గితే.. ఆహార సమస్య వచ్చి.. అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అప్పుడు అటు ఆర్థికంగా చితికిపోయి.. ఇటు ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో.. సామాన్యులు మరింతగా విలవిల్లాడటం ఖాయమనే అంచనాలు అందర్నీ భయపెడుతున్నాయి. సరే ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా సామాన్యుడే సమిధగా మారుతున్న వాస్తవం కూడా అందరికీ తెలిసిందే. మధ్యతరగతి నడ్డివిరిగే పరిస్థితులు ఒకదానితర్వాత ఒకటిగా చాలా వేగంగా ఏర్పడుతుండటం.. దీర్ఘకాలిక సంక్షోభాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.
మొత్తం మీద వరుస సంక్షోభాలు, గడ్డు పరిస్థితులు సామాన్యుల జీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. దీనికి తోడు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభుత్వాలు.. ప్రజల అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమౌతున్నాయి. దీంతో తమ పనేదో తమది అన్నట్టుగా ఉండే యువతలో కూడా కదలిక వచ్చింది. ఎటుచూసినా సమస్యల వలయమే కనిపిస్తుందనే భావనతో ఉన్న విద్యార్థులకు.. వరుసగా జరుగుతున్న పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలు.. ఆగ్రహం తెప్పించాయి. అనుకోకుండా వచ్చే ప్రతికూల పరిస్థితుల్ని పక్కనపెడితే.. తమ నిర్వాకంతో ప్రభుత్వాలు చేజేతులా తెచ్చిపెడుతున్న విద్యా సంక్షోభాల్ని మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదని జెన్‌జీ ఓ దృఢ నిశ్చయానికి వచ్చేసింది. అలాగే సంప్రదాయ నిరసనలతో పని కాదని కూడా డిసైడైపోయింది. ఎవరేమనుకున్నా.. తమ పద్ధతిలో ఆందోళనలు చేస్తేనే.. ప్రభుత్వాలకు గట్టిగా ఝలక్ ఇస్తేనే.. పరిస్థితులు మారతాయని గట్టిగా నమ్ముతోంది. ఆ ఉద్దేశంతోనే పలు దేశాల్లో జెన్‌జీ ఉద్యమాలు నడిచాయి. నడుస్తున్నాయి.
అదివరకే నెలకొన్న రాజకీయ వ్యవస్థలను సవాలు చేసేంత బలంగా జెన్ జీ ఉద్యమాలు ఎదగడానికి కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. మొదటిది, ఒకే పార్టీలు అధికారాన్ని శాసిస్తూ ఉండటం వల్ల ఎన్నికలు అర్థరహితంగా అనిపించేలా రాజకీయాలు ఉండాలి. రెండవది, రాజకీయ ప్రముఖులపై బహిరంగ అవినీతి, పెరుగుతున్న ప్రజాగ్రహం తరచుగా కనిపిస్తుంది. మూడవది, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం తమ భవిష్యత్తు అనిశ్చితంగా ఉందని భావించే యువతలో నిరాశను కలిగిస్తాయి. నాల్గవది, రాజకీయ పార్టీలు తరచుగా వంశపారంపర్యంగా అవకాశాలు , అనుచరులు, కొందరి నియంత్రణలో ఉండి, కొత్తవారికి తక్కువ అవకాశాన్ని కల్పిస్తాయి. ఛాన్స్ రాకపోతే యువతలో సాధారణంగా నిరాశ నెలకొంటుంది.
మన దేశంలో కూడా ఇటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. దేశంలో 25 ఏళ్ల లోపు వయసున్న వారు 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. చాలా మంది యువత నిరుద్యోగం, విద్యాపరమైన ఒత్తిడి, ద్రవ్యోల్బణం, సామాజిక పురోగతికి సంబంధించిన ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. యువ ఓటర్లు తమ కుటుంబాల నుండి రాజకీయ విశ్వసనీయతను పొందే అవకాశం కూడా తక్కువగా ఉంది. వారు మరింత వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటారు. పార్టీ కల్చర్ కంటే సమస్యలు, పనితీరు ఆధారంగా నాయకులకు మద్దతు ఇస్తారు. ఏతావాతా జెన్‌జీ ఆలోచనల్ని అందుకోవడం.. సంప్రదాయ పార్టీలు, నేతలకు నేల విడిచి సాము చేస్తున్నంత కష్టంగా ఉందని చెప్పటానికి సంకోచించాల్సిన పని లేదు.

