Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?

Story Board

Story Board

ఢిల్లీలో గాలి నాణ్యత…స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏక్యూఐ 400 దాటడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పంట వ్యర్థాల దహనం, టపాసులు కాల్చడం వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. కాలుష్యం దెబ్బకు కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. దేశ రాజధాని ఢిల్లీని…వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి వేళ ఏక్యూఐ డేంజర్‌ లెవల్‌ని క్రాస్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో నాలుగు వందల మార్క్ దాటింది. ఫలితంగా హస్తినవాసులు…ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశరాజధానిలో.. గాలిని పీలిస్తే రోజుకు 30 సిగరెట్లు తాగినంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌ ఎందుకు మారింది? గ్రాప్‌-3 ఆంక్షల్ని అమలుతోనైనా పరిస్థితి మెరుగుపడుతుందా ?

ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా క్షీణిస్తోంది. దీపావళి పండుగ వేళ నగరాన్ని విషపూరిత పొగమంచు కమ్మేసింది. ఇప్పటికే తీవ్రంగా ఉన్న వాయు కాలుష్యం…మరింత పెరగడంతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీపావళి రాత్రి కాలుష్యం పెరగడంతో ఇవాళ తెల్లవారుజామున పరిస్థితి మరింత దిగజారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన వివరాల ప్రకారం, పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలోకి వెళ్లిపోయింది. వాయు నాణ్యత సూచీ 400 మార్కు దాటింది. ఉదయం 4.20 గంటల సమయంలో ఐటీఓ ప్రాంతంలో 406 AQI నమోదైంది. ఇది తీవ్రమైన కాలుష్య స్థాయిని సూచిస్తోంది. తెల్లవారుజామున 1.30 గంటలకు రాజీవ్ చౌక్‌లో 381, ఉదయం 4 గంటలకు సౌత్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో 360 AQI నమోదైంది. గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

శుక్రవారం 382గా ఉన్న ఏక్యూఐ శనివారం 369కి తగ్గింది. అయితే ఆదివారం ఉదయానికి మళ్లీ 383కు చేరుకుంది. దీపావళి తర్వాత 400 మార్కును దాటడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నా కాలుష్య తీవ్రత మాత్రం కొనసాగుతోంది. రాబోయే రోజుల్లోనూ పరిస్థితి మెరుగుపడే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం గాలి నాణ్యత సూచీ 383గా నమోదైతే…దీపావళి తర్వాత 400 మార్కును దాటేసింది. దీంతో నగరం మొత్తం అత్యంత పేలవమైన విభాగంలో కొనసాగుతోంది. హస్తినలోని ఇందర్‌లోక్ సహా పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో కాలుష్య సూచీ 400 దాటడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో ఉదయం వేళల్లో రోడ్లపై దూరంగా ఉన్న వాహనాలు, ఇతర వస్తువులు కనిపించడం కష్టంగా మారింది. ఇప్పటికే వాహనాల పొగ, పరిశ్రమల కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు టపాసుల పొగ కూడా తోడవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

గత రెండు రోజుల గణాంకాలను పరిశీలిస్తే దిల్లీ గాలి నాణ్యతలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం…ఢిల్లీలోని 54 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో 24 చోట్ల కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. మిగిలిన ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత అత్యంత పేలవమైన విభాగంలోనే ఉంది. సోనియా విహార్‌లో అత్యధికంగా 463 AQI నమోదవగా, జహంగీర్‌పురిలో 450గా నమోదైంది. ఆర్కే పురంలో 448 పాయింట్లుగా ఉంది. పంజాబీ బాగ్, ఐఐటీ దిల్లీ, ద్వారక, రోహిణి వంటి ప్రాంతాల్లోనూ కాలుష్య సూచీ 400 దాటింది. ఆనంద్ విహార్‌లో 328, నరేలా ప్రాంతంలో 395 పాయింట్లుగా నమోదైంది. ఇండియా గేట్ పరిసరాల్లోనూ ఏక్యూఐ 398గా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. దీంతో ఒక్కసారిగా కాలుష్యం పెరిగిపోయింది.

ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. గాలి నాణ్యత మరింత దిగజారే అవకాశం ఉందన్న అంచనాలతో దీపావళికి రెండు రోజుల ముందే వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లో మూడో దశ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. అయినప్పటికీ దీపావళి రాత్రి టపాసుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించ లేకపోయారు. మరోవైపు వాహనాల కాలుష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి కారణాలు కూడా ఢిల్లీ గాలి నాణ్యతపై ప్రభావం చూపనున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీతో పాటు హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఎన్‌సీఆర్ పరిధి ప్రాంతాలకు ఈ చర్యలు వర్తిస్తున్నాయి. గ్రాప్-3లో భాగంగా అత్యవసరం కాని నిర్మాణ, కూల్చివేత పనులను నిలిపివేశారు. మట్టి తవ్వకాలు, భూమిని చదును చేయడం, రోడ్ల నిర్మాణం వంటి దుమ్ము ఎక్కువగా వెలువడే పనులపై ఆంక్షలు విధించారు. అత్యవసర ప్రాజెక్టులకు మాత్రం కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ అనుమతి ఇచ్చారు. రాళ్ల క్రషర్లు, మైనింగ్ కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించారు. వాహనాల విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ నాలుగు చక్రాల వాహనాలు దిల్లీతో పాటు నిర్దేశించిన ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో తిరగకుండా నిషేధించారు. BS-3 పెట్రోల్‌, BS-4 డీజిల్‌ కార్లు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపట్టారు. అంతర్రాష్ట్ర డీజిల్ బస్సులు రాజధానిలోకి ప్రవేశించడం లేదా అక్కడ తిరగడంపై ఆంక్షలు విధించారు. కంకర రోడ్లపై ఇసుక, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాహన ఉద్గారాలను అరికట్టడానికి ప్రైవేట్ కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ లేదా హైబ్రిడ్ విధానాలు అమలు చేయాలని ఆదేశించింది సర్కార్‌. 5వ తరగతిలోపు చిన్నారులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది.

ఢిల్లీలో కాలుష్యం ఒక్కరోజులో పెరిగింది కాదు. చలికాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గాలి వేగం తగ్గడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోతున్నాయి. దీంతో నగరంపై పొగమంచు పొరలా ఏర్పడుతోంది. దీనికి తోడు వాహనాల నుంచి వెలువడే పొగ, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కూడా కాలుష్యాన్ని పెంచుతున్నాయి. మొత్తం కాలుష్యంలో వాహనాల వాటా 21.4 శాతంగా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. దీపావళి సందర్భంగా టపాసుల వినియోగం కూడా గాలి నాణ్యతపై ప్రభావం చూపింది. ప్రైవేట్‌ ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, బయటకు వెళ్లాల్సిన ప్రజలు కాలుష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.