ఏపీని వరుస తుపానులు తీవ్రస్థాయిలో వణికించాయి. అర్నబ్ సృష్టించిన ఉత్పాతం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. మురసు రూపంలో మరో ముప్పు దూసుకొచ్చింది. ఇప్పటికీ అర్నబ్ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ జరిగని తరుణంలో.. ఇప్పుడు మురసు ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి.. వరుస తుపానులు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం మిగిల్చాయనే అంచనాలున్నాయి.
ఏపీలో ఆర్నాబ్ తుఫాన్ వేలాది కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. మూడు రోజుల పాటు ఏపీ మీద దండయాత్ర చేసింది. ఒక రోజంతా ఏపీ మీదనే నిలిచి ఉంది. దాంతో ఊహకు అందని విధంగా భారీ నష్టం సంభవించింది. ఆ నష్టం నుంచి కోలుకోక ముందే.. మురసు తుపాను ముంచుకొచ్చి బీభత్సం సృష్టించింది. ఇంకాతుపాను ప్రభావం పూర్తిగా తొలగకపోవడంతో.. ఎంత నష్టం సంభవిస్తుందోననే భయాలు వ్యక్తమౌతున్నాయి.
రాష్ట్రంలో ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రాథమికంగా 4600 కోట్లు వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటన అనంతరం మాట్లాడుతూ ఊహించని నష్టం అన్నారు. తాను అయితే క్షేత్రస్థాయిలో అర్నబ్ తుఫాను ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూశానని ఆయన చెప్పారు. భారీగానే మౌలిక సదుపాయాలకు నష్టం వచ్చిందని అన్నారు. 15 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేల కూలాయని ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 12,500 చెట్లు నేల కూలాయని అన్నారు. అలాగే పెద్ద ఎత్తున వరిపంట కూడా దెబ్బతిందన్నారు.
మురసు తీవ్ర తుపాను తీరం దాటింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 గంటల మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 100-110 కి.మీ వేగంతో కొన్నిసార్లు 120 కి.మీ వేగంతో గాలులు వీచాయని వెల్లడించింది. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణాతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
మురసు తుపాను ప్రభావంతో అర్ధరాత్రి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒంగోలులో తీవ్ర ఈదురుగాలులతో పాటు కుండపోత వాన కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాన్ తీవ్రతకు జనం భయాందోళన చెందుతున్నారు. సముద్ర తీర ప్రాంతాలైన కొత్తపట్నం, పాకాల, ఉలవపాడు, ఉప్పుకొండూరుపై తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రాణనష్టం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సహాయం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
చీరాలలో ఈదురు గాలులు పెరగడంతో తీర ప్రాంతానికి విపత్తు నివారణ బృందం చేరుకుంది. చీరాల, చినగంజాం, అద్దంకిలో గాలివానకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బాపట్ల జిల్లాపై మురసు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తీర ప్రాంతంలో భారీగా ఈదురుగాలులతో పాటు అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో పలుచోట్లు వర్షాలు కురిశాయి.
తుపాను ప్రభావంతో నెల్లూరు తీర ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరులో 12, తీరంలో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లకుండా మత్స్యకారులను పోలీసులు అప్రమత్తం చేశారు. నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మురసు ప్రభావంతో అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ వర్షం కురిసింది. అరగంటపాటు ఏకధాటిగా వాన కురవడంతో వీధులు జలమయమయ్యాయి. హైటెన్షన్ విద్యుత్ లైన్లకు చెట్లకొమ్మలు తగలడంతో మంటలు ఎగిసిపడ్డాయి.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి చిరు జల్లులు పడుతున్నాయి. బుడమేరు పరిధిలో కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారుల పర్యటించారు. బుడమేరు పరిధిలో అధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టరు తెలిపారు. తుపాను వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఆర్టీజీఎస్ సీఈవో సూచించారు. తీరప్రాంత వాసులు పునరావాస కేంద్రాలకు తరళివెళ్లాలన్నారు.
ఒంగోలు దక్షిణంగా తీరం దాటిన మురసు తుపాను కారణంగా ప్రాథమికంగా 3 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 22 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరులో అత్యధికంగా 31.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు నగరంలో 30 సెం.మీ కుంభవృష్టి కురిసింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడి కేంద్రం నుంచి అన్నివిధాలా సహా అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తకాదు. పడిన ప్రతీసారి గోడకు కొట్టిన బంతిలా పునరుజ్జీవమవడమూ కొత్తకాదు. హుదూద్ నుంచి తిత్లీ వరకు తీర ప్రాంతాలు కల్లోలమయ్యాయి. ఇప్పుడు కూడా అర్ణబ్ తుఫాన్ తీరం దాటింది.. కానీ విధ్వంసం ఇంకా మిగిలే ఉంది. నేలవాలిన పంటలు.. కూలిన విద్యుత్ స్తంభాలు.. దెబ్బతిన్న రహదారులు.. నీట మునిగిన గ్రామాలు. అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌కు మిగిల్చిన గాయాలు అన్నీఇన్నీ కావు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రానికి 4,563 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరి ఈ విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకునేదెప్పుడు? పునరుద్ధరణకు నిధులెన్ని? పునర్నిర్మాణానికి పట్టే సమయమెంత అనే ప్రశ్నలు సవాల్ విసురుతున్నాయి.

