Story Board: ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నా.. అందరి దృష్టీ బెంగాల్ ఎన్నికల మీదే కేంద్రీకృతమైంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీని బలంగా ఢీకొడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో టీఎంసీ గెలిచినా.. మమతను ఓడించి.. బీజేపీ సంచలనం సృష్టించింది. ఈసారి ఇంకాస్త కష్టపడితే దీదీని గద్దె దింపటం పెద్ద కష్టం కాదని కాషాయ పార్టీ తలపోస్తోంది. అందుకు అనుగుణంగానే కొన్ని నెలల ముందు నుంచే పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. నిజానికి మొదట్లో సర్ మీద బెంగాల్లో దుమారం రేపటానికి దీదీ ప్రయత్నించారు. అయితే బీహార్‌లో సర్ ఆయుధం పనిచేయకపోవడంతో.. ఆమె ఆ ఆయుధం పనిచేయదని గ్రహించారు. ఈలోగా రోహింగ్యాలను మమత ప్రోత్సహిస్తున్నారని, ఆమె జాతివ్యతిరేకి అని బీజేపీ దూకుడుగా ఆరోపణలు చేసింది. దీంతో అప్రమత్తమైన దీదీ.. వ్యూహాత్మకంగా బెంగాలీ అస్త్రాన్ని బయటకు తీశారు. కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు కూడా మమతను కాస్త కలవరపెడుతోంది. బెంగాల్ బీజేపీలో మమత స్థాయి నేత ఎవరూ లేరనేది టీఎంసీ ధీమా. అది నిజమే అయినా.. అధికారంలోకి రావటానికి ఆ కారణం అడ్డంకి కాదని కాషాయ పార్టీ నేతలు అదే పనిగా చెబుతున్నారు. మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయ రచ్చ షురూ చేసిన ఈ రెండు పార్టీలు.. ఈసారి ఎన్నికల్లో ఎలా ఎదుర్కుంటాయి..? బెంగాలీలు ఎవరి పక్షాన నిలుస్తారు..? అనేవి ఆసక్తికరమైన ప్రశ్నలే అని చెప్పటంలో సందేహం లేదు.
ఇప్పటికే ఏదైనా రాష్ట్రానికి మోడీ వచ్చేముందు ఈడీ వస్తుందని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్‌లో కూడా మోడీ రాకముందే ఈడీ వచ్చేసింది. అయితే అమిత్ షా వచ్చాకే ఈడీ వచ్చిందని మమత కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా రాజకీయ ప్రత్యర్థులపై ఈడీని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈడీ సాయంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. అయితే మమత వాదనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. మమత కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైతే సరిపోయేది. కానీ అలా చేస్తే దీదీ ఎందుకవుతారు..? ఆమె ఎప్పటిలాగే తనకు అలవాటైన పద్ధతులో ఈడీతోనూ వీధిపోరాటానికి సిద్ధపడ్డారు. అనూహ్యంగా ఈడీ సోదాలు చేస్తున్న ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లి.. తన అధికారిక వాహనంలో కొన్ని ఫైళ్లు తెచ్చేశారు. దీంతో షాకైన ఈడీ అధికారులు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రే.. చట్టాన్ని ఉల్లంఘించి సాక్ష్యాలు మాయం చేశారని ఆరోపించారు.
ఈడీ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం ఏమిటనే విషయాన్ని పక్కనపెడితే.. అసలు మమత తీసుకొచ్చిన ఫైల్లో ఏముందనే సంగతి మిస్టరీగా మారింది. ఆ ఫైల్లో తమ పార్టీ వ్యూహాలు, అభ్యర్థుల సమాచారం ఉందని మమత చెబుతున్నారు. కాదు కాదు మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన కీలక సాక్ష్యాలున్నాయని ఈడీ అంటోంది. పైగా ఓ కార్పొరేట్ కంపెనీ ఆఫీస్‌పై దాడి చేస్తే మమత ఎందుకు భయపడుతున్నారని కాషాయ పార్టీ నేతలు పొలిటికల్ ర్యాగింగ్ షురూ చేశారు. గత ఎన్నికలకు ముందు నుంచీ టీఎంసీకి రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ఐప్యాక్.. ఈ ఎన్నికలకు కూడా అవే సేవలు అందిస్తోంది. దీంతో ఆ ఆఫీస్‌లో తమ అభ్యర్థుల సమాచారం లేకుండా ఎలా ఉంటుందని టీఎంసీ నేతలు నిలదీస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఇదే అదనుగా టీఎంసీని డిఫెన్స్‌లోకి నెట్టేసే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. రాజకీయ సలహాదారు అయితే.. సలహాలివ్వాలి కానీ.. పార్టీ అభ్యర్థుల జాబితా, వారి సమాచారం అంతా తన దగ్గర పెట్టుకోవడం ఏంటని, అందుకు దీదీ ఎలా సమ్మతించారని అడుగుతున్నారు. ఈ రచ్చ కాస్తా.. బెంగాల్ దాటి ఢిల్లీకి చేరింది. హస్తినలో టీఎంసీ ఎంపీలు అమిత్ షా కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. వారిని అరెస్ట్ చేయడంతో.. నిరసన తెలిపే హక్కు లేదా అనే ప్రశ్నలు వినపించాయి. ఈ వ్యవహారం ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది.
మమత ఈడీపై పోరాటాన్ని వీధుల్లోకి తీసుకెళ్లారు. కోల్‌కతా నగర వీధుల్లో ఐదు కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీ తీశారు. అధికారం కోసం బీజేపీ ఎంకైనా దిగజారుతోందని ఆరోపించారు. ఓట్లు చోరీ చేస్తారు. బెదిరిస్తారు. తప్పుడు కేసులు పెడతారు. ఏకంగా ఈడీని ఉపయోగించి.. ప్రత్యర్థుల వ్యూహాలు దొంగిలించే కుట్రకు కూడా వెనుకాడటం లేదనేది మమత వాదనగా ఉంది. మమత ఈ విషయాన్ని ఇంతటితో వదిలేరా లేరని బీజేపీ కూడా ఓ అంచనాకు వచ్చింది. ఇప్పటికే ఎంఐఎం అధినేత ఒవైసీ సభలు, ర్యాలీలకు అనుమతివ్వని మమత సర్కారు రేపొద్దున తమ నేతల సభలకు కూడా అడ్డుపడే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. కానీ అలాంటి పనులు బీజేపీకే అలవాటని టీఎంసీ కౌంటరిస్తోంది.
కొంతకాలంగా దీదీ సర్కారుపై బీజేపీ వ్యూహాత్మక దాడి చేస్తోంది. దశాబ్దన్నరగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత.. బెంగాల్‌కు ఏం ఒరగబెట్టారని అడుగుతోంది. బెంగాల్‌కు వెనకబాటుతనం, ఆయుధాల్ని మాత్రమే కానుకగా ఇచ్చారని చురకలు అంటిస్తోంది. బీజేపీ దూకుడుకు ఎక్కడికక్కడ టీఎంసీ నేతలు అడ్డుకట్ట వేస్తున్నా.. తాను కూడా బరిలోకి దిగాల్సిందేనని ఫిక్సైన మమత.. అదను చూసి రంగంలోకి దిగారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు బెంగాల్ లో బలమైన శక్తిగా ఉన్న వామపక్షాలు కూడా ఇప్పుడు నామమాత్రం కాగా.. కాంగ్రెస్ కూడా బాగా బలహీనపడింది. దీంతో బెంగాల్ పొలిటికల్ గ్రౌండ్ మొత్తం బీజేపీ, టీఎంసీ కోసం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ అవకాశాన్ని వాడుకుని రెండు పార్టీలూ ఢీ అంటే ఢీ అంటున్నాయి. పదిహేనేళ్ల క్రితం బెంగాల్‌లో కమ్యూనిస్టుల కంచుకోటను దీదీ కూల్చితే.. ఐదేళ్ల క్రితం బీజేపీ మమత పీఠాన్ని కదిలించినంత పనిచేసింది. ఈసారి ఎన్నికలు దీదీ పంతానికి, బీజేపీ పట్టుదలకు మధ్య అసలైన పోటీగా జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈడీ తెరపైకి రావడంతో.. ఈడీ వర్సెస్ మమత పోరుగా రాజకీయ పోరాటం మొదలైంది.
గత 60 ఏళ్ల బెంగాల్ రాజకీయ చరిత్రను చూస్తే, రాష్ట్ర అధికార పీఠంపై కమ్యూనిస్టులున్నా, కాంగ్రెస్ ఉన్నా, టీఎంసీ ఉన్నా ఎన్నికల టైంలో హింస మాత్రం ఆగడం లేదు. గత కొన్ని నెలల్లో జరిగిన పలు ఘటనలను నిశితంగా పరిశీలిస్తే, ఈసారి కూడా రక్తపాతం జరిగే అవకాశాల్ని తోసిపుచ్చలేం అనిపిస్తోంది. గత ఏడాది చివరి రెండు నెలల్లో రాజకీయ ప్రతీకార చర్యలకు ఐదుగురి ప్రాణాలు బలయ్యాయి. అయితే ఈ హత్యలకు రాజకీయ ప్రతీకారాలు కాకుండా.. టీఎంసీలో గ్రూపుల గొడవే కారణమనే చర్చ జరుగుతోంది. అందుకే ఈ రక్తచరిత్రకు ముగింపు కావాలంటే.. కాషాయ పార్టీని ఆశీర్వదించాలని కమలనాథులు హోరెత్తిస్తున్నారు.
ఈసారి బెంగాల్‌లోనూ కాషాయ జెండాను ఎగరవేయాలనే కృతనిశ్చయంతో ఉంది బీజేపీ. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సువేందు అధికారి సహా టీఎంసీకి చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. దీదీకి కుడి భుజమైన సువేందు.. పార్టీలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతాను సువేందునే ఓడించారు. కానీ, ఈసారి మాత్రం టీఎంసీకి చెందిన అసమ్మతి నేతలను పార్టీలోకి చేర్చుకునే ప్రణాళిక లేదని, దీని వల్ల పార్టీ ఓటు శాతం గణనీయంగా పెరుగుతుందని ఆశించడంలేదని బీజేపీ చెబుతోంది. దీనికి బదులు టీఎంసీ కార్యకర్తలను చేర్చుకుంటే బీజేపీ ఇంకా దూకుడుగా, మరింత సమర్థవంతంగా ఎన్నికల్లో ముందుకెళ్తుందని భావిస్తున్నారు. అంతేకాదు, పార్టీలో కొత్త నాయకులను చేర్చుకోవడం వల్ల ఇప్పటికే ఉన్నవారిని పక్కనబెట్టాల్సి వస్తుందని, కార్యకర్తలను చేర్చుకుంటే ఆ పరిస్థితి ఉండదని అంటున్నారు. బిహార్‌లో బీజేపీ, జేడీయూ సహా దాని మిత్రపక్షాలు కుల సమీకరణాలను సరిగ్గా అమలు చేసి విజయం సాధించాయి. కానీ, బెంగాల్‌లో పరిస్థితి దీనికి విరుద్దం. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అక్కడ కుల రాజకీయాలకు అంతగా ఆస్కారం లేదు. అందుకే ఇక్కడ బీజేపీ ప్రాంతీయ, మత సమీకరణాలపై ఫోకస్ పెట్టింది.
బెంగాల్‌లో ముస్లిం జనాభా సుమారు 30 శాతంగా ఉంటుంది. కానీ, కేవలం 30 నుంచి 40 స్థానాల్లోనే వీరి ప్రభావం ఉంటుంది. బీజేపీ విశ్లేషణ ప్రకారం.. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో టీఎంసీకి గణనీయంగా ఓట్లు వస్తాయి. కానీ ఇది చాలా కొద్ది నియోజకవర్గాలకు పరిమితం కావడంతో ఆ పార్టీ గెలుచుకునే స్థానాల సంఖ్యపై పెద్దగా ప్రభావం ఉండదు. ఎన్నికలో గెలిచిన స్థానాలే కీలకం కానీ ఓట్లు కాదు. దీనికి కౌంటర్‌గా ఇతర ప్రాంతాల్లో హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా లబ్ది పొందాలని బీజేపీ ఆశిస్తోంది. ఈ విషయంలో తమ పార్టీ బలమైన స్థితిలో ఉందనేది బీజేపీ నేతల అంచనా. కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ చొరబాటుదారుల విషయంలో పదేపదే మమతా బెనర్జీపై బీజేపీ దాడి చేస్తోంది. సరిహద్దులు దాటి వచ్చిన అక్రమ చొరబాటుదారులు ఓటర్ల జాబితాలో చేరుతున్నప్పటికీ.. ఆమె కన్నెత్తి చూడటం లేదని ఆరోపిస్తోంది. అయితే, తృణమూల్ మాత్రం బీజేపీని స్థానికేతరులని ఆరోపిస్తోంది. గుజరాత్ నుంచి వచ్చే శక్తులు బెంగాల్ వ్యతిరేకులు అని ఎదురుదాడి చేస్తోంది. కానీ బెంగాల్‌లో బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎన్నికలకు 5 నెలలు ముందుగానే ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని ఐదు జోన్‌లుగా విభజించి, ఆరు రాష్ట్రాల నుంచి 12 మంది సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీకి దాదాపు 30 – 40 శాతం ఓట్లు వచ్చాయి. మరో 10శాతం సాధిస్తే.. మమతా బెనర్జీ సర్కారును సాగనంపవచ్చనేది ఆ పార్టీ ప్లాన్. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలూ వినియోగించుకోవాలని అమిత్‌షా ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టీఎంసీని ఉక్కిరిబిక్కిరి చేయాలనేది కాషాయ పార్టీ వ్యూహంగా ఉంది. గతంలో సువేందు బలాన్ని అతిగా ఊహించుకుని నష్టపోయామని, ఈసారి అలా కాకుండా బీజేపీకి అలవాటైన సంస్థాగత, క్షేత్రస్థాయి పకడ్బందీ వ్యూహరచనతో తొడ గొడుతోంది.
అలాగే ఓటర్లను ఆకట్టుకోవటానికి కూడా ప్రత్యేక వ్యూహం అనుసరిస్తోంది. వందేమాతరంపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా బెంగాల్ తో భావోద్వేగపరమైన సంబంధం కోసం తాపత్రయపడ్డ బీజేపీ.. లోకల్ సెంటిమెంట్ విషయంలో మమత కంటే తామేం తక్కువ కాదంటూ నిరూపించుకునే ప్రయత్నం చేసింది. మమత రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి.. కోల్‌కతా లాంటి మెట్రో నగరాన్ని పాడుబెట్టేసి.. కేవలం స్థానికత పేరుతో తేరగా అధికారం అనుభవిస్తున్నారని.. బీజేపీ పోలింగ్ బూత్ స్థాయిలో ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం కొంప ముంచుతోందని గ్రహించిన టీఎంసీ.. విరుగుడు వ్యూహరచన చేస్తోంది. అధికారం కోసం కపట ప్రేమ ఒలకబోసేవారిని నమ్మొద్దని కౌంటర్ ఇస్తోంది. ఈ ప్రచారంలో దేన్ని బెంగాలీలు నమ్ముతారనేది విజేతను నిర్ణయించనుంది.
గతంలో బెంగాల్ విజేతను భద్రలోక్ నిర్ణయించేది. కానీ గత రెండు దశాబ్దాల్లో పరిస్థితి మారి మిడిల్ క్లాస్‌ది అప్పర్ హ్యాండ్ అయింది. మొన్నటిదాకా దీదీకి దీటైన నేత లేకపోవడం వల్లే గెలవలేకపోతున్నామని బెంగాల్ బీజేపీ అధిష్ఠానానికి సాకులు చెప్పేది. కానీ ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో గెలుపు తర్వాత అలాంటి కుంటి సాకులు కుదరవని అమిత్‌షా తేల్చిచెప్పేశారు. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలు పార్టీలో తమ తలరాతను కూడా మారుస్తాయనే విషయం లోకల్ బీజేపీ నేతలకు అర్థమైపోయింది. అందుకే గతానికి భిన్నంగా చాలా సీరియస్‌గా కార్యాచరణ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. దీనికి తగ్గట్టుగా కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయికి వెళ్లిన సీనియర్ నేతలు.. మెరుగైన సమన్వయ బాధ్యతలు నిర్వర్తించే పనిలో పడ్డారు. ఓవైపు అమిత్ షా, మరోవైపు జోన్ ఇంఛార్జుల నుంచి వచ్చే టార్గెట్లకు అనుగుణంగా బెంగాల్ బీజేపీ నేతలు పనిచేయక తప్పని స్థితి నెలకొంది. గత ఎన్నికల్లో సువేందు అధికారి తీరుపై అసంతృప్తి ఉన్నా.. తప్పనిసరై ఆయన్నే ప్రతిపక్ష నేతగా కొనసాగించిన బీజేపీ.. ఎన్నికల విషయంలో మాత్రం కేవలం ఆయనపైనే ఆధారపడి రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదనే మూడ్‌లోకి వచ్చి పనిచేయాల్సిందేనని నేతలకు తేల్చిచెప్పింది. అందుకు తగ్గట్టుగానే కదులుతున్న బీజేపీ శ్రేణులు.. గత ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ హింసకు కూడా గెలుపు రూపంలో ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1977 నుంచి ఏకధాటిగా పశ్చిమ బెంగాల్‌ను పాలిస్తున్న వామపక్ష ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ అనూహ్యంగా ఓడించారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని కూడా వెస్ట్ బెంగాల్లో పూర్తిగా నాశనం చేసింది. 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలవకుండా మమతా బెనర్జీ అడ్డుకోగలిగారు. ఆమెకు ఎదురు నిలిచిన రాజకీయ శత్రువులు మొత్తం కనుమరుగై పోయారని మమతా బెనర్జీ భావిస్తున్న తరుణంలో.. అకస్మాత్తుగా బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ హఠాత్ పరిణామానికి మొదట్లో కాస్త తడబడ్డ మమత.. తర్వాత బాగానే తేరుకున్నారు. తన పోరాటపటిమను కొత్త శత్రువుకి కూడా గట్టిగానే చూపించారు. కాకపోతే మునుపటి ఎన్నికల కంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం చెమటోడ్చాల్సి వచ్చిన మాటను టీఎంసీ కూడా కాదనలేదు.
కానీ ఏ మాటకు ఆ మాటే. మమతా బెనర్జీ బెంగాల్ రాజకీయంలో తల పండిపోయారు. ఆమెను ఓడించడం అంత తేలిక కాదని బీజేపీకీ తెలుసు. మమతా బెనర్జీకి రాజకీయాల్లో ఫైటర్ గా గుర్తింపు ఉంది. ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పట్నుంచీ.. సీఎం అయ్యాక కూడా ఎప్పుడూ పోరాట పంథాను వీడలేదు. యూత్ కాంగ్రెస్ నేతగా ఎలా ఉన్నారో.. బెంగాల్ సీఎంగా కూడా అలాగే ఉండటం మమత ప్రత్యేకత. ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరగా ఉన్నాననే ఫీలింగ్ కలిగించడంలో దీదీ విజయవంతమౌతున్నారు. అయితే మమత పాలనపై చాలా విమర్శలు కూడా ఉన్నాయి. మమత అతి దూకుడే.. ఆమెకు ఒక్కోసారి కష్టాలు తెచ్చిపెడుతుంది. స్థానికంగా ఉన్న ప్రత్యర్థుల్ని అణగదొక్కడం ఎప్పటికైనా ముప్పేనని మమత గ్రహించలేకపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు సీట్లు గెలిచినప్పుడు కూడా.. దీదీ కాషాయ పార్టీని సీరియస్ గా తీసుకోలేదు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు నడిపినవాళ్లకే దిక్కు లేదు.. బీజేపీ ఏం చేస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మమతకు తలబొప్పి కొట్టింది. స్థానిక ప్రత్యర్థుల్ని బలహీనపరిచిన కారణంగా ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీ భర్తీ చేసిందని ఆలస్యంగా అర్థమైంది. తృణమూల్ ఆగడాలతో బెదిరిపోయిన లెఫ్ట్ కార్యకర్తలు బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. టీఎంసీ కార్యకర్తల దాడికి కనీస ప్రతిఘటన ఇవ్వాలన్నా.. కాషాయ జెండా నీడ తప్పదని గ్రహించారు. దీంతో బీజేపీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ బలం బాగా పెరిగింది. ఆ బలంతోనే 2021 ఎన్నికల్లో మమతకు ముచ్చెమటలు పట్టేలా చేసింది కాషాయ పార్టీ. ఇప్పుడు ఏకంగా గెలిచేస్తామని సవాల్ విసురుతోంది.
మమత పార్టీ కార్యకర్తల అవినీతికి తోడు.. టీఎంసీ నేతల్లో కూడా అవినీతి పెరిగిపోయింది. శారదా, నారదా కుంభకోణాలు తృణమూల్ కాంగ్రెస్ ను వేలెత్తి చూపించాయి. దీనికి తోడు బొగ్గు స్కామ్ లో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యను సీబీఐ ప్రశ్నించడం కూడా కలకలం రేపింది. బీజేపీ వ్యూహాత్మకంగా మమతను వదిలేసి ఆమె రాజకీయ వారసుడైన అభిషేక్‌ను పదే పదే టార్గెట్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ఎన్నికలను చావోరేవో అన్నట్టుగా చూస్తున్నారు మమతా బెనర్జీ. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న దీదీ.. ఇప్పటికే బెంగాలీల్లో లోకల్ సెంటిమెంట్ రాజేశారు. బెంగాల్ కూతురు కావాలో.. గుజరాత్ నుంచి వచ్చే బయటివాళ్లు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెబుతున్నారు.
అధికారం కోసం తృణమూల్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న తరుణంలో.. బెంగాల్ లో కీలకమైన మైనార్టీలు ఎటువైపు మొగ్గుచూపుతారు, వీరి ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక రోహిగ్యాలది వేరే కథ. కేవలం తమ పార్టీ ఓటుబ్యాంకు కోసమే మమత వీరి అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తుందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఇటీవలే జరిగిన సర్‌లో ఏకంగా 58 లక్షల ఓట్లు తొలగించారు. వీటిలో మెజార్టీ టీఎంసీ ఓట్లేనని బీజేపీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. వీరంతా చొరబాటుదారులని, ఓటు బ్యాంక్ కోసం దీదీ దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడుతున్నారు. తద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యాంటీ బంగ్లాదేశ్ సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2011 నుంచి మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 42 పార్లమెంటు నియోజకవర్గాల్లో 29 మంది ఎంపీలని మమతా బెనర్జీ గెలిపించారు. ఈ ట్రెండ్ ప్రకారం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలవాలి. మమతకు ఉన్న ప్రధాన అడ్వాంటేజ్ ఆమెకు ఓటు వేసే 28 శాతం మంది ముస్లిం ఓటర్లు. మరోవైపు బీజేపీ కూడా వేగంగా పుంజుకుంటోంది. కానీ మమతా బెనర్జీపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఆ పార్టీ ఎంతవరకు క్యాష్ చేసుకోగలదనేది కీలకం. బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. దేశ రాజకీయాలపై ప్రభావం చూపటం ఖాయం అని చెప్పటంలో మరో మాటకు తావు లేదు.
