Story Board: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. సిటీలో ఉన్నా, పల్లెలో ఉన్నా.. ఎక్కడున్నా సరే.. ఇంట్లో వంట గ్యాస్ అయిపోయిందని బుక్ చేద్దామని చూస్తే.. అమాంతం పెరిగిన ధర చూసి షాక్ అవుతున్నాం. కేవలం గ్యాస్ మాత్రమే కాదు.. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, నిత్యావసరాలు కొందామన్నా రేట్లు మండిపోతున్నాయి. దీనికంతటికీ కారణం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం. ఎందుకిలా.. వాళ్లు యుద్ధం చేసుకుంటే మన జేబులకెందుకు చిల్లు పడుతోంది? అనే డౌట్ మనకు రావచ్చు. కానీ, ప్రపంచీకరణ పుణ్యమా అని గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న అలజడి రేగినా.. దాని మొదటి దెబ్బ పడేది చమురు దిగుమతులపై ఆధారపడిన మన భారతదేశం పైనే. అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల.. మన దేశంలో మన లాంటి సామాన్యులపై గ్యాస్ ధరలతో పాటు ఇంకా చాలా ఆర్థిక భారాలు పడుతున్నాయి.
మన దేశానికి అవసరమైన వంట గ్యాస్ లో దాదాపు 90 శాతానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ఇరాన్ యుద్ధం కారణంగా సముద్ర వ్యాపారానికి కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం మూసుకుపోయింది. దీంతో గ్యాస్ సప్లై చైన్ దెబ్బతింది. ఫలితంగా ఇటీవలే గ్యాస్ సిలిండర్‌పై దాదాపు రూ.60 వరకు భారం పడింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల రెస్టారెంట్లలో తినే భోజనం ధరలు కూడా పెరిగిపోయాయి. కొన్నిచోట్ల హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఆతిథ్య రంగంలో ఉపాధి పొందుతున్న వారికి, ఆహార సరఫరా రంగంలో పనిచేసే గిగ్ వర్కర్లకు ఆదాయం లేకుండా పోయింది. యుద్ధం మొదలైన కొన్ని రోజుల్లోనే ముడిచమురు ధరలు భారీగా పెరగటం మొదలైంది. ఇండియా 85శాతానికి పైగా ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది కాబట్టి, ఆటోమేటిక్‌గా మన దగ్గర రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. చమురు ధరలు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందనీ, తద్వారా మన జీడీపీ గ్రోత్ తగ్గుతుందని కొన్ని నివేదికలు ఇప్పటికే హెచ్చరించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే సరుకుల రవాణా ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు పెరగడంతో ఉల్లిపాయలు, టమాటాలు, పప్పు దినుసులు, నూనె ప్యాకెట్ల ధరలు 10% నుంచి 15% వరకు పెరిగాయి. సబ్బులు, షాంపూల వంటి FMCG వస్తువుల తయారీకి వాడే ముడి పదార్థాల రేట్లు కూడా పెరగడంతో సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులైంది.
సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్ లాంటి గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. వీరు ప్రతి సంవత్సరం 50 బిలియన్ డాలర్లకు పైగా డబ్బును రెమిటెన్స్ రూపంలో ఇండియాకు పంపుతారు. ఈ డబ్బు మన స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా మారుతోంది. అలాగే.. దేశ వృద్ధికి కూడా ఉపయోగపడుతోంది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోని కొన్ని ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు మూతపడుతున్నాయి. దీంతో చాలా మంది ప్రవాస భారతీయులు.. ముఖ్యంగా తెలుగు వారు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రవాస గల్ఫ్ భారతీయులపై ఆధారపడిన కుటుంబాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2024-25లో భారత్ 60.65 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతిని ఎగుమతి చేసి రూ.50,312 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించింది. ఇందులో రూ.36,139 కోట్లు పశ్చిమాసియా నుంచే రావడం ఈ మార్కెట్ ప్రాముఖ్యతను చూపుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, యూఏఈ, యెమెన్ దేశాలు కలిసి మొత్తం ఎగుమతుల్లో 67 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇరాన్ దిగుమతులు గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుముఖం పట్టాయి. 2018-19లో 14.83 లక్షల టన్నుల బాస్మతి బియ్యం కొనుగోలు చేసిన ఇరాన్, 2024-25 నాటికి 8.55 లక్షల టన్నులకు తగ్గించింది. తాజా నిరసనలు, యుద్ధ పరిస్థితులు మరింత ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా చెల్లింపు హామీలు కల్పించాలని ఎగుమతిదారులు కేంద్రాన్ని కోరుతున్నారు. డిమాండ్ పడిపోతే ధరలు తగ్గి రైతుల ఆదాయం నేరుగా దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు.భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు పంపిన సుమారు 60 వేల నుంచి 70 వేల టన్నుల బాస్మతి బియ్యం సముద్రంలోనే నిలిచిపోయింది. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో కొన్ని నౌకలు నిలిచిపోయాయి. ఈ పరిణామం బాస్మతి ఎగుమతిదారులకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో భారత్ 5.38 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం అధికం. మొత్తం ఏడాదికి 6.5 మిలియన్ టన్నుల రికార్డు లక్ష్యాన్ని చేరుకోవాలని పరిశ్రమ భావించింది. అయితే అమెరికా యుద్ధోన్మాద పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం సందేహాస్పదంగా మారిందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక దేశీయ మార్కెట్లు ఇప్పటికే బేర్‌మంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సెన్సెక్స్ మరింత డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ వంటగదిపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. గత వారం వరకు నిలకడగా ఉన్న వంటనూనె ధరలు, యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఒక్కసారిగా పైకి కదిలాయి. సామాన్యుల బడ్జెట్‌ను దెబ్బతీస్తూ ధరలు పెరగడం మార్కెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడకపోతే ఈ పెరుగుదల మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ప్రముఖ బ్రాండ్ల నూనెల ధరలు ఇప్పటికే పెరిగాయి. వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే ఈ బ్రాండ్ల ధరలు పెరగడంతో రిటైల్ వ్యాపారుల వద్ద నిల్వలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తున్న నిపుణులు, రాబోయే రోజుల్లో నూనెల ధరలు అదనంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ప్రణాళికలను తలకిందులు చేసేలా ఉంది.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సముద్ర రవాణా మార్గాల్లో ఏర్పడుతున్న అడ్డంకులుగా ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు ఆటంకం కలగడం సరఫరా గొలుసును దెబ్బతీస్తోంది. యుద్ధం కారణంగా రవాణా నౌకల భద్రతపై ఆందోళన పెరగడం, బీమా ఖర్చులు అధికమవ్వడం వంటి కారణాలు వంటనూనెల దిగుమతి వ్యయాన్ని పెంచుతున్నాయి. దీంతో విదేశాల నుండి వచ్చే ముడి నూనెల ధరలు భారత్‌లో కూడా ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ఇలాగే కొనసాగితే భారత దేశీయ మార్కెట్‌లో వంటనూనెల కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల పెరుగుదల సామాన్యుడికి శాపంగా మారనుంది. యుద్ధం ఎక్కడో వేరే ఖండంలో జరిగినా, దాని తాలూకు నిప్పు రవ్వలు మన జేబులను కాలుస్తూనే ఉన్నాయి. పెరిగిన గ్యాస్ ధరలు, కూరగాయల రేట్లు, పడిపోయిన రూపాయి విలువ.. ఇవన్నీ మన మధ్యతరగతికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఇరాన్ యుద్ధ భయంతో నౌకల రవాణాపై సందిగ్ధం నెలకుంది. దీంతో రవాణా చార్జీలు పెరగడంతో పాటు సరఫరా ఆగిపోయి హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు నెలకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల అదనపు భారం పడుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు హైదరాబాద్ నుంచి వెళ్లే మందుల వాటా సుమారు 5.5 శాతం తగ్గింది. దీనివల్ల ఒక్క మార్చి నెలలోనే ఎగుమతులపై సుమారు రూ.5 వేల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని ఫార్మెక్సిల్ సంస్థ అంచనా వేసింది. భారత ఫార్మారంగంలో 40శాతంఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఓడల రవాణా తగ్గిపోవడంతో ముడిసరుకు దిగుమతి భారంగా మారింది. దాంతో ఔషధ కంపెనీలు తమ ఉత్పత్తుల మీద ధరలు పెంచాయి. దీంతో కీలక ఔషధాల ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఇన్సులిన్, వ్యాక్సిన్ వంటి శీతల నిల్వతో రవాణా చేసే మందుల ఖర్చు కంపెనీలకు భారంగా మారుతోంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే పరోక్షంగా రోగులపై అదనపు భారం పడుతుందని, వైద్య పరికరాలు, ఔషధాల ధరలు పెరగుతాయని, దిగుమతి చేసుకునే పరికరాలు, డయాగ్నస్టిక్ భాగాలు రావడం ఆలస్యం అవుతోంది. అలాగే పశ్చిమాసియా నుంచి వైద్య చికిత్సల కోసం మన దేశానికి వచ్చే వారి సంఖ్య తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే ఔషధ రంగంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాలేదు.అవి గ్లోబల్ సప్లై చైన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం, భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో 50 శాతం వాటా కలిగిన హోర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఒ ప్రమాదకరమైన మలుపులో ఉంది. జల సంధి అధికారికంగా మూసివేయకపోయినా అక్కడ పెరిగిన ఇన్సూరెన్స్ రేట్లు, దాడులకు భయంతో షిప్పింగ్ కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు 4500 భారతీయ ఎగుమతిదారులు, 1800 మంది దిగుమతిదారులు ఈ మార్గంపై ఆధారపడి ఉన్నారు. షిప్పింగ్ కంపెనీలు ఇప్పుడు వార్ రిస్క్ సర్ఛార్జ్, ఎమర్జెన్సీ ఫ్యూయల్ సర్ఛార్జ్ వంటి కొత్త పన్నులను విధిస్తున్నాయి. దీని వల్ల కంటైనర్ రవాణా ఖర్చు ఏకంగా రెండు వేల నుంచి మూడు వేల డాలర్ల వరకు పెరిగింది షిప్పింగ్ ఆలస్యం వల్ల వస్తువులు చేరడానికి పట్టే సమయంలో మరో పది నుంచి ఇరవై రోజులు పెరుగుతోంది. ఆసియాలోనే అతి పెద్ద ఆటోమొబైల్ విడిభాగాల మార్కెట్ అయిన ఢిల్లీలోని కశ్మీర్ గేట్‌లోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్, రబ్బర్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు పెరిగాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం విడిభాగాల తయారీ ఖర్చు 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగింది.
ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల కార్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు కూడా పెరగనున్నాయి. మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి సంస్థలు ఇప్పటికే రెండు శాతం ధరల పెంపును ప్రకటించాయి. షూస్, ప్లాస్టిక్ ఆధారిత దుస్తుల ధరల 8 శాతం నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. వాహన తయారీ సంస్థలు కరోనా సమయంలో చేసినట్టుగానే క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అల్యూమినియం, కాపర్, ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయినప్పటికీ భారత్ విడిభాగాలు దిగుమతుల్లో చైనా వాటా 30 శాతంగా ఉంది. జర్మనీ, దక్షిణ కొరియా నుంచి కూడా దిగుమతులు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితుల్లో ధరల నియంత్రణ అనేది తయారీదార్లకు ఒక సవాల్‌గా మారింది. నేటి పరిస్థితులు చూస్తుంటే 1970 నాటి అంతర్జాతీయ సంక్షోభాన్ని గుర్తు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం చమురు మాత్రమే కాదు, టైల్స్, పేపర్, పెట్రోకెమికల్ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఇరాన్ యుద్ధం ప్రభావం ఇండియాలోని చమురు సరఫరా, ధరలపైనే కాదు.. ఔషధాల తయారీ, సరఫరాపై కూడా పడుతోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మందుల ధరలు 10-15 శాతం పెరిగాయని ఔషధ రంగ వ్యాపారులు చెబుతున్నారు. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ధరలు పెరగడమే కాకుండా, మందుల లభ్యత కూడా తగ్గిపోతుందని ద ఫెడరేషన్ ఆఫ్ ఫార్మ ఎంట్రప్రెన్యూర్స్ తెలిపింది. దేశంలో ఔషధాల తయారీ, ధరలపై తీవ్ర ప్రభావం తప్పదని హెచ్చరిస్తోంది. నిజానికి ఇండియాను ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచానికి ఔషధాల్ని అందిస్తుందని దీని అర్థం. ప్రపంచంలో 20 శాతం జెనరిక్ ఔషధాల్ని ఇండియానే ఉత్పత్తి చేస్తుంది. అయితే, దీనికి కావాల్సిన ముడి సరుకు 70 శాతం చైనా నుంచే అందుతుంది. అలాగే యాంటీ బయాటిక్స్ కోసం 87 శాతం చైనాపైనే ఆధారపడాల్సి ఉంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి సహా, ఎర్ర సముద్రం, సూయెజ్ కెనాల్ వంటి మార్గాల్లో రవాణా కష్టతరంగా మారింది. చాలా వరకు కార్గో వాహనాలు సముద్ర మార్గంలో చిక్కుకుపోయాయి. ఇంతకుముందు 20 రోజుల్లో జరిగే రవాణా ఇప్పుడు 45-50 రోజులు పడుతోంది. దీంతో రవాణా ఛార్జీలు ఐదు రెట్లు పెరిగాయి. కంటైనర్‌కు 3,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు యుద్ధానికి సంబంధించిన సర్ ఛార్జీలు కూడా విధిస్తున్నారు. ఇదే సమయంలో ఇండియన్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు తక్కువ మొత్తంలోనే స్టాక్ నిల్వ చేసుకుంటున్నాయి. ఔషధాల తయారీలో వాడే పీవీసీ కాంపౌండ్స్, బాటిల్స్, ఫిల్మ్, ఫాయిల్స్ వంటి ధరలు పెరిగాయి. ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఔషధాల తయారీ, సరఫరా ఖర్చులు పెరిగితే, మందుల ధరలు కూడా పెరుగుతాయి.
యుద్ధం ప్రభావం నిర్మాణ రంగంపై భారీగా పడింది. టైల్స్ ధరలు 15-20% పెరిగాయి. స్టీల్ ధర టన్నుకు రూ.5 వేలు, ఎలక్ట్రిక్ మెటీరియల్స్ 15-20%, ప్లంబింగ్ మెటీరియల్ ధరలు 20 శాతంపైగా, అల్యూమినియం ధరలు 10-15% పెరిగాయి. సిమెంట్ ధర కూడా భారీగా పెరిగింది. యుద్ధం ఆగేదాక ఇబ్బందులే. ఇది భారీ ప్రభావానికి ప్రారంభ దశ. బల్క్ డీజిల్ ధరలు పెంచడంతో నిర్మాణ ప్రాజెక్టుల్లో వాడే జేసీబీలు, ఎక్స్‌కవేటర్లు, జనరేటర్ల వాడకం ఖర్చులు పెరిగాయి. గ్యాస్ కొరతతో గుజరాత్‌లోని టైల్స్ పరిశ్రమల్లో ఉత్పత్తి నెమ్మదించింది. ఎలక్ట్రికల్ కేబుల్స్‌లలో వాడే కాపర్ ధరలు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు భారీగా అవసరమయ్యే వాణిజ్య గ్యాస్ సమస్యను పరిష్కరించడం పెద్ద సవాల్‌గా ఉంది. మెటీరియల్స్ సకాలంలో రాకుంటే నిర్మాణరంగ ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం నిర్మాణ రంగాన్ని కూడా కుదేలు చేస్తోంది. గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రంగులు, స్టీల్, సిమెంట్, ప్లాస్టిక్, శానిటరీ వేర్, టైల్స్ తదితర వస్తువుల ధరలు పది రోజుల వ్యవధిలోనే 20 నుంచి 50 శాతం మేర పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయి గృహ నిర్మాణదారులు, బిల్డర్లు హడలెత్తిపోతున్నారు. ఇంటి నిర్మాణంలో సిమెంట్ ఖర్చు 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. ఈ ధర పెరిగితే ఇంటి ఖర్చుపై ప్రభావం పడుతుంది. సిమెంట్, స్టీల్, ఇసుక వల్ల నిర్మాణ ధరలు తడిసి మోపడవుతున్నాయి. ఇప్పటికే తాపీ మేస్త్రీలు, కూలీల ధరలు పెరిగాయి. ముడి సరుకు ధరలు పెరగడం వల్ల సిమెంట్, స్టీల్ ధరలు పెరుగుతున్నాయి. స్టీల్ ధరలు టన్నుకు రూ.20 వేలకు పైగా పెరిగినట్లు బిల్డర్లు చెబుతున్నారు. డిమాండ్‌కు తోడు ఉత్పత్తి, సరఫరాలో ఖర్చు పెరగడంతో ధరలు పెరిగాయని కాంట్రాక్టర్‌లు వాపోతున్నారు.
గల్ఫ్ నుంచి భారత్‌కు వచ్చే నగదులో ఎక్కువ వాటా వ్యక్తిగత బదిలీదే. అసలు గల్ఫ్‌కు అంత మంది ఎందుకు వెళ్తారు ? అనే ప్రశ్నకు సమాధానం అక్కడి జీతమే. బ్లూ కాలర్ వర్కర్లు అంటే ప్లంబర్, కార్పెంటర్ సహా తయారీ, నిర్మాణ రంగాల్లో పని చేసే వారు నెలకు తక్కువలో తక్కువ 30వేల నుంచి లక్ష రూపాయల వరకూ సంపాదిస్తారని అంచనా. గల్ఫ్ దేశాల్లో పని చేసే వారిలో 65-70% మేర ఈ బ్లూ కాలర్ జాబ్స్ చేసే వారే. ఆ స్థాయిలో జీతాలు వస్తున్నాయంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. కానీ యుద్ధం కారణంగా ఈ ఆశలు అడియాసలు అవుతున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులు తప్పనిసరి సెలవులు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చేశాయి. అంటే ఆ మేరకు జీతాలకు కోత పడినట్టే లెక్క. ఎప్పుడైతే విదేశాల నుంచి భారత్‌కు నగదు భారీగా పంపుతారో అప్పుడు దేశీయంగా విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక స్థిరత్వం వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఓ భరోసా కలుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి, విదేశీ రుణాలను తీర్చేందుకు ఇవి అవసరం అవుతాయి. కొన్ని అంచనాల ప్రకారం గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నగదు వాటా దేశ జీడీపీలో 3-3.5% మేర ఉంటుంది. విదేశాల నుంచి నగదు రావడం వల్ల దేశీయంగా కొనుగోలు శక్తి పెరుగుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని సార్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కన్నా కూడా ఈ విదేశీ నగదు బదిలీలే ఎక్కువగా నమోదవుతుంటాయి. ఓ రకంగా దేశీయంగా వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు ఈ నగదు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఎగుమతులు, దిగుమతుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకూ వీలవుతుంది. ఇక మరో విధంగా చెప్పాలంటే ఈ నగదును కొందరు కరెన్సీ ఆఫ్ కేర్‌గా అభివర్ణిస్తుంటారు. కుటుంబాల భద్రత కోసం పంపే నగదు కావడంతో వాటికి ఆ పేరు. ఇందులో 60% మేర ఫ్యామిలీ మెయింటెనెన్స్‌తో పాటు ఆరోగ్యం, విద్య కోసం ఖర్చు చేస్తున్నారు. ఇలా వస్తున్న నగదులో 20% మేర బ్యాంకులలో డిపాజిట్ అవుతున్నాయి. ఇక మరో 10% మేర రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు ఉపయోగపడుతున్నాయి. నిజానికి రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో ఈ నగదు బదిలీ ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తోంది కేంద్రం. ఆశించిన స్థాయిలో ఇది ఉంటుందని భావించగా యుద్ధం కారణంగా ప్రస్తుతానికి ఓ కుదుపు వచ్చింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి.. దాని ప్రభావం గ్యాస్ ధరలపై పడింది. పశ్చిమాసియాకు చేరాల్సిన 11.8 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు సంక్షోభంలో చిక్కుకున్నాయి. వీటిలో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. యుద్ధం భారతీయ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కీలక నైట్రోజన్ ఆధారిత యూరియా సరఫరాకు యుద్ధం గండికొడుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి నుంచి హర్మూజ్ జలసంధి, దాని పరిసర సముద్ర మార్గాల దిగ్బంధం వల్ల ఎరువుల ధరలు పెరిగిపోయాయి. టన్ను యూరియా ధర 720 డాలర్లకు, అమ్మోనియా 600 డాలర్లకు చేరుకుంది. డీఏపీ వంటి మిశ్రమ ఎరువుల ధరలు టన్నుకు వెయ్యి డాలర్లకు చేరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో యూరియా ధర కూడా వెయ్యి డాలర్లను దాటవచ్చు.
తాజా యుద్ధంతో గల్ఫ్ నుంచి వచ్చే ఎల్‌ఎన్‌జీపై ఆధారపడిన ఇండియాలోని యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి స్థితిగతులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్‌ఎన్‌జీ కొరత ఇలాగే కొనసాగితే యూరియా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో ఇప్పటికే పలు ప్లాంట్లు మూతపడ్డాయి. భారత్ తన మొత్తం ఎల్‌ఎన్‌జీ అవసరాలలో 60-70శాతం కోసం గల్ఫ్‌పై, ముఖ్యంగా ఖతార్‌పై ఆధారపడుతోంది. యుద్ధం వల్ల ఆటంకాలు ఏర్పడటంతో భారతీయ యూరియా, ఎరువుల ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది. యుద్ధం త్వరగా ఆగకపోతే ఎరువుల ఉత్పత్తి గణనీయంగా తగ్గి, వచ్చే ఏడాది మన ఆహార ఎగుమతులు 30-40శాతం తగ్గిపోవచ్చు. నిరుడు గల్ఫ్ నుంచి భారత్ చేసుకున్న ఎరువుల దిగుమతుల విలువ సుమారు 370 కోట్ల డాలర్లు. గల్ఫ్ ఎరువులు మన ఆహార భద్రతకు కీలకం. ఇరాన్ యుద్ధం ఇలాగే కొనసాగితే భారతీయ రైతులు రసాయన ఎరువులకు తీవ్ర కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వంపై సబ్సిడీ భారం భారీగా పెరుగుతుంది. భారత సాగు రంగం ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ సరఫరా గొలుసులతో బలంగా అనుసంధానమై ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడల్లా ముందుగా ప్రభావం పడేది చమురు ధరలపైనే. వ్యవసాయంలో ట్రాక్టర్లు, నీటి పంపులు, వ్యవసాయ యంత్రాల వినియోగం, పంటల రవాణాకు డీజిలే ప్రధాన ఆధారం. ఇంధన ధరలు పెరగడంవల్ల ఈ ఖర్చులు తడిసి మోపెడు అవుతాయి.
యుద్ధం వల్ల చమురు సరఫరాకు అంతరాయం కలగడంతో అనేక దేశాల్లో ఇంధన ధరల్లో మార్పులొచ్చే అవకాశముంది. వ్యవసాయ దిగుబడులను పొలాల దగ్గర నుంచి మార్కెట్లకు తరలించడానికి రవాణా ఖర్చులు పెరిగిపోతే, రైతుల రాబడికి గండి పడుతుంది. ఆహారోత్పత్తుల ధరలూ అధికమవుతాయి. ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం, చమురు ధరలు 10శాతం పెరిగితే, ఆహార ధరలు కూడా 2-3శాతం మేర పెరిగే ప్రమాదముంది. నత్రజని వంటి ఎరువుల తయారీకి ప్రధాన ముడిసరకు- సహజ వాయువే. భారత్ కొన్నిరకాల ఎరువుల కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు ఏర్పడి ఎరువుల ధరలు పెరగవచ్చు.దాంతో వరి, గోధుమ, పత్తి, చెరకు వంటి పంటల ఉత్పత్తి వ్యయం భారమవుతుంది. అలాగని, రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తే, దిగుబడులు తగ్గి దేశ ఆహార భద్రతకు విఘాతం కలుగుతుంది. పశ్చిమాసియా దేశాలు మన వ్యవసాయ ఎగుమతులకు ముఖ్యమైన మార్కెట్లు. భారత్ నుంచి ఏటా సుమారు వంద కోట్ల డాలర్ల విలువైన బియ్యం, తేయాకు ఒక్క ఇరాన్‌కే వెళ్తున్నాయి. అక్కడ చెలరేగిన యుద్ధం, ఆంక్షల మూలంగా సరకు రవాణాకు అంతరాయం కలిగి, చెల్లింపులు జాప్యమవుతాయి. నౌకా రవాణా, బీమా ఖర్చులు పెరిగిపోతాయి. పర్యవసానంగా ఎగుమతిదారుల లాభాలు కోసుకుపోతాయి.
కొన్నివారాలపాటు యుద్ధం కొనసాగడం వల్ల కలిగే నష్టాన్ని భారత్ ఇప్పటికే తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల ద్వారా పూడ్చగలదు. కొంతకాలంపాటు విదేశాల నుంచి వచ్చే డబ్బు తగ్గినా.. ఆ తర్వాత పరిస్థితి సర్దుకుంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ దీన్ని తట్టుకోగలదు. కానీ, యుద్ధం ఆరు నెలలు, అంతకు మించి కొనసాగితే మాత్రం అలా చేయడం కష్టం. అప్పటికి మన వద్ద ఉన్న విదేశీ నిల్వలు వేగంగా కరిగిపోతుంటాయి. చమురు దిగుమతి బిల్లులు భారీగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. సామాన్యుల గృహ, వాహన రుణాల తాలూకూ నెలవారీ చెల్లింపుల మొత్తం పెరుగుతుంది. ఈ పరిణామాలన్నీ మన ఆర్థిక వ్యవస్థకు అగ్నిపరీక్షగా మారతాయి. మొత్తం మీద ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నా.. దాని ప్రభావం మన మీద గట్టిగానే ఉండబోతోంది. యుద్ధంలో ఒక్కరోజు గడిచేకొద్దీ.. దాని పర్యవసానాల తీవ్రత పెరుగుతుంది. అదే నిష్పత్తిలో భారత్‌పై పడే ప్రభావం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర యుద్ధం జరగకపోయినా.. మనం మాత్రం అత్యంత అప్రమత్తంగా యుద్ధ పరిస్థితుల్ని గమనిస్తూ.. అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే ఎక్కడ ఏ సమస్య పుట్టుకొస్తుందో చెప్పడం కష్టం.
