Site icon NTV Telugu

Story Board: ఎన్నికల సమయంలో ఉచితాలు బాధ్యతారాహిత్యం..

Story Board About Election

Story Board About Election

Story Board: ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఎంత ముఖ్యమో.. సామాజిక పురోగతి కూడా అంతే ప్రధానం. సామాజిక అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాలు ముందడుగు వేయాలి. అట్టడుగు వర్గాలకు చేయూత ఇవ్వడం తప్పనిసరి. అప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగై.. దేశాభివృద్ధిలో భాగం పంచుకోవడం కుదురుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే రాజ్యాంగంలో సంక్షేమం రాజ్య భావనకు పెద్దపీట వేశారు. దీనికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పథకాలు అమలు చేసి.. మెరుగైన ఫలితాలు సాధించాలి. స్కీముల్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలే కానీ.. ఎన్నికలు రాగానే ఓటర్లను భ్రమల్లో ముంచెత్తే ఉచితాలకు గేట్లెత్తడం బాధ్యతారాహిత్యం అవుతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సంక్షేమానికి, ఉచితాలకు మధ్య ఉన్న తేడాను నిర్వచించిన విధానాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. సంక్షేమానికి కూడా ఓ లక్ష్యం ఉండాలని, అంతేకాని గుడ్డిగా పథకం ఇస్తున్నామంటే ఇస్తున్నాం అన్నట్టుగా ఉండొద్దని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన హితవుని ఇప్పటికైనా పార్టీలు చెవికెక్కించుకోవాలి. కానీ నేటి తమిళనాడు ఎన్నికల్లో పార్టీల మ్యానిఫెస్టోలు చూస్తుంటే.. సుప్రీంకోర్టు హితవు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే పరిణమించిందని చెప్పక తప్పదు.

దేశంలో సంక్షేమం పేరిట ఉచితాలు అందించే రాష్ట్రాలలో తమిళనాడుదే అగ్రస్థానం. ఆ రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు గత రెండు దశాబ్దాలకుపైగా ఎన్నికలలో ప్రజలను బుట్టలో వేసుకోవడానికి పోటాపోటీగా ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు వెర్రితలలు వేసే స్థాయికి చేరిపోయాయి. తొలుత మహిళల్ని ఆకట్టుకోవడానికి అన్నాడీఎంకే తమిళనాడులో టేబుల్‌ ఫ్యాన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తామంది. పోటీగా డీఎంకే కూడా యువతకు ట్యాబ్‌లు, లాప్‌ట్యాప్‌లు, టీవీలు తదితర ఖరీదైన బహుమతుల ఆశ చూపింది. ప్రస్తుతం తమిళనాడులో అనేక ఉచితాలతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చదువుకునే బాలికలకు నెలకు రూ.1000ల నగదు, రూ.24,000 వార్షిక ఆదాయం కలిగిన పేద కుటుంబాల వధువులకు రూ.50,000 నగదు, ఒక బంగారు నాణెం అందిస్తున్నారు. నిరాశ్రయులైన మహిళలకు, వికలాంగులైన పురుషులకు ఉచిత కుట్టు మిషన్‌లు అందిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.1000ల పెన్షన్‌, యువతకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం, పేదలకు ఉచితంగా గృహాలు, ఉచిత వైద్యం, 2 కోట్ల వినియోగదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సదుపాయం మొదలైనవి ఎన్నో ఉన్నాయి.

రూ.4 లక్షల 40 వేల కోట్ల వార్షిక బడ్జెట్‌ కలిగిన తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏటా లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేస్తోంది. రాష్ట్రానికొచ్చే సొంత రాబడి, కేంద్రం అందించే గ్రాంటులు అన్నీ కలిపితే వచ్చే మొత్తం కేవలం రూ.3 లక్షల 30 వేల కోట్లు. రాష్ట్ర వార్షిక ఆర్థికాభివృద్ధి రేటు చూస్తే 7-8 శాతం మించడం లేదు. కానీ, అప్పులు మాత్రం ఏటా 20 నుంచి 25శాతం పెరుగుతున్నాయి. ఇప్పటికే తడిసిమోపెడుగా ఉన్న ఉచితాల చిట్టాకు మరికొన్ని చేరుస్తామని, తమకు అధికారం ఇవ్వాలంటూ ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే తాజాగా ఓ ప్రకటన చేసింది. అధికారంలో ఉన్న డీఎంకే తామేమీ తక్కువ తినలేదన్నట్లు మరికొన్ని ఉచిత పథకాలకు రూపకల్పన చేస్తోంది. ఇప్పుడు తమిళనాడులో కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ పార్టీ కూడా ఉచితాల విషయంలో తగ్గేదే లేదని తొడ కొడుతోంది. ఈ మూడు పార్టీలు తమిళనాడులో ఇచ్చిన హామీల విలువ లెక్కగడితే.. సగటున 60 వేల కోట్ల రూపాయల వరకు ఉంది. అసలు ఏ ఒక్క పార్టీ ఇచ్చిన వాగ్దానాలైనా అమలు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. నిజంగా అన్నీ అమలు చేస్తే.. తమిళనాడు ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదనేది నిపుణుల అంచనా. అదే జరిగితే ప్రగతిశీల రాష్ట్రంగా ఉన్న తమిళనాడు కూడా బీమారు రాష్ట్రంగా పరువు మాసే అవకాశం ఉంది. ఇలా కొన్ని రాజకీయ పార్టీలు బాధ్యతా రహితంగా ప్రజలకిస్తున్న ఈ ఉచితాలు ఓ అంటువ్యాధిలా దేశం మొత్తం పాకుతున్నాయి. దక్షిణాదిలో మొదలైన ఈ జాడ్యం క్రమంగా ఉత్తరాది రాష్ట్రాలకూ అంటుకుంది.

ఒకవైపు సంపన్నులకు ఎన్నో రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వాలు పేదలకిచ్చే సబ్సిడీలు, ఉచితాలపై ఎందుకు వెనక్కు పోవాలని ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు. పేదలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించడం అంటే అది క్యాపిటలిస్ట్‌ మనస్తత్వం అని దుయ్యబట్టేవారూ ఉన్నారు. విద్య, వైద్యం మినహా మిగతావేవీ ఉచితంగా ఇవ్వరాదని చెబుతున్న వారిని పేదల వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. ప్రజా బాహుళ్యంలో ఉన్న ఈ భిన్నాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని.. కొందరు సీనియర్‌ రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయమంటూ ఉచితాలను వ్యతిరేకిస్తున్నారు గానీ.. దానిని ఓ విధానపరమైన అంశంగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో చర్చకు పెట్టకపోవడం విషాదం. ఈ ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.

అసలు అన్నీ ఉచితమైనప్పుడు ప్రజలు ఎందుకు పనిచేయాలి? అనే భావన ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. ఉచిత పథకాలు సరైన లక్ష్యంతో, ఆర్థిక క్రమశిక్షణతో అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం, అవి ఉచితాలు ఇవ్వడం దేశ ఆర్థిక వ్యవస్థకు హానికరం కావచ్చు.. ఎప్పుడూ ప్రభుత్వం డబ్బు ఇస్తే కొంతమంది స్వయం ఉపాధి, వ్యాపారం, పొదుపు వంటి విషయాల్లో ఆసక్తి తగ్గించే ప్రమాదం ఉంటుంది. దీనితో కుటుంబాల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినవచ్చు.. ప్రభుత్వ డబ్బు ఎక్కువ భాగం ఉచిత పథకా‌లకు వెళ్తే కొత్త రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, పరిశ్రమల నిర్మాణానికి నిధులు మిగలకపోవచ్చు.. ప్రభుత్వం ఎక్కువగా అప్పు తీసుకుంటే, ఆ డబ్బు తిరిగి చెల్లించాలి. పన్నులు పెంచడం ద్వారా, చార్జీలు పెంచడం ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉచిత విద్యుత్ పథకాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లోకి వెళ్తాయి. అప్పుడు ప్రభుత్వం ఆ నష్టాలను భరించడానికి మరింత రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఎన్నికలకు ముందు ప్రజలు అడిగినా, అడగకపోయినా, సాధ్యమైనా కాకపోయినా హామీలు ఇవ్వడం. పూర్తిగా న్యాయం చేయలేకపోవడం చూస్తూనే ఉన్నాం.

ఉచిత పథకాలపై అడ్డూ అదుపూ లేకుండా భారీగా పెడుతున్న ఖర్చు.. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థికవ్యవస్థల్ని కుదేలు చేస్తోంది. ఈ భారీ వ్యయం వల్ల రాష్ట్రాల ఆదాయంలో దాదాపు 62 శాతం కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఉచితాలకే సరిపోతోంది. ఫలితంగా.. రోడ్లు, రైల్వేలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సిన మూలధన వ్యయం దారుణంగా తగ్గిపోతోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అప్పులు చేసి మరీ వినియోగం కోసం ఖర్చు చేయడం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉందని, కేవలం నగదును చేతిలో పెట్టడం వల్ల పేదరికం తగ్గడం లేదని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు బ్రెజిల్‌లో విజయవంతమైన బోల్సా ఫ్యామిలియా తరహా విధానాన్ని అనుసరించాలని ఆర్థిక సర్వే సూచించింది. కేవలం ఉచితంగా డబ్బులు ఇవ్వకుండా, దానికి కొన్ని నిబంధనలను జోడించాలని పేర్కొంది. ఉదాహరణకు.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందే కుటుంబాలు తమ పిల్లలను ఖచ్చితంగా బడికి పంపడం, సకాలంలో టీకాలు వేయించడం వంటి సామాజిక బాధ్యతలను నెరవేర్చాలి. అంతేకాకుండా, ప్రతి పథకానికి ఒక ముగింపు గడువు ఉండాలని, ప్రజలు ఎప్పటికీ ప్రభుత్వంపైనే ఆధారపడకుండా వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేలా పథకాల రూపకల్పన ఉండాలని సర్వే ప్రతిపాదించింది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడి మరీ ఇస్తున్న నగదు బదిలీలు, వారు తిరిగి ఉపాధి రంగంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని, ఇది దేశ ఉత్పాదకతపై ప్రభావం చూపుతోందని నివేదిక పేర్కొంది. సంక్షేమం అనేది ఒక భద్రతా వలయంగా ఉండాలి తప్ప, అది అభివృద్ధికి ఆటంకం కాకూడదని ఆర్థిక సర్వే గట్టిగా చెప్పింది.

కానీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా నడుస్తున్న నేటి ఉచిత రాజకీయాలు దేశాభివృద్ధికి పెనుముప్పుగా తయారయ్యాయి. ఓటర్లను ప్రలోభపెడుతున్న పార్టీలు ఆర్థికవ్యవస్థను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను చెరిపివేస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి ప్రజలకు రోజువారి కనీస సదుపాయాలు రాయితీ ధరతో సులభంగా పొందేందుకు ఇచ్చే సంక్షేమ పథకాలను, ఎలాంటి హేతుబద్ధత లేకుండా విలాసాలను కూడా అవసరాలుగా భ్రమింపజేస్తూ ఉచితంగా ఇస్తూ అవి సంక్షేమ పథకాలుగా పార్టీలు చెబుతున్నాయి. అధికారమే పరమావధిగా సరికొత్త ఉచిత హామీలు ఇవ్వడంలో పార్టీలు తమలో తామే పోటీపడుతున్నాయి. భారత రాజకీయాలకు శాపంగా మారిన ఈ ఫ్రీబి కల్చర్​ తొలగించకపోతే దీర్ఘకాలంలో దేశాభివృద్ధి కుంటుపడే అవకాశం పుష్కలంగా ఉంది. అహేతుకమైన ఉచితాలను ప్రకటించే పార్టీల గుర్తింపు రద్దు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అశ్విని కుమార్ ఉపాధ్యాయ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. సాధారణ బడ్జెట్ కంటే ఉచిత బడ్జెట్ ఎక్కువగా ఉంటుందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలు నిష్పక్షపాత ఎన్నికలు అనే భావనకు విఘాతంగా మారుతున్నాయి. ప్రజల డబ్బుని ఎగురవేసి ఓట్లు సంపాదించే మార్గాలుగా పార్టీలు ఉచితాలను తీర్చిదిద్దుతున్నాయి. ఉచిత విద్యుత్తు, ఉచిత రవాణా లాంటి దారి తెన్నులేని, ప్రణాళిక లేని పథకాలు ఆయా సంస్థలను నిర్వీర్యం చేసి మొత్తంగా మూసివేతకు దారి తీయవచ్చు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు రుణ భారం పెరిగి ప్రాధాన్య రంగాలపై తగిన నిధులను వెచ్చించలేకపోతున్నాయి.

ఉచితానుచితాలను నిర్ణయించేలా, ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను గుర్తించేందుకు నిపుణుల కమిటీని నియమించాలి. రుణ భారం పెంచే ఆర్థికవృద్ధిని నష్టపరిచే ఉచితాలను రద్దు చేయాలి. ఈసీ అధికారాలపై గల పరిమితులను తొలగించాలి. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాలి గానీ, పార్టీలకు ఓట్ల వరంగా మారకుండా చూడాలి. రాజకీయ పార్టీల భవిష్యత్తును, అధికారాన్ని నిర్ణయిస్తున్న ఈ ఉచితాల వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. సరైన ప్రణాళికతో ఉత్పాదకతను పెంచేలా పథకాలు ఉంటే ఆర్థిక అభివృద్ధికి దోహదకారి అవుతాయి. ఎంపిక చేసిన వస్తు సేవల ఉత్పత్తి పెరగటం, ఆదాయ అసమానతలు తగ్గటం, దీర్ఘకాలికంగా శ్రామిక శక్తి ఉత్పాదకత పెరగటం జరుగుతుంది. ప్రజలు పేదరికం నుంచి బయటపడడం, ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం, మధ్యతరగతి వర్గాలు మిగిలిన డబ్బును పొదుపుకు మళ్ళించడం, దినసరి కూలీలకు భద్రత సమకూరటం, వృద్ధులు అసహాయులకు అపన్నహస్తం అందించటం, విద్య, వైద్య సదుపాయాల కల్పన వల్ల జీవన ప్రమాణం పెరిగి మానవ అభివృద్ధి జరుగుతుంది. ప్రజల వ్యక్తిగత ఆదాయాలు పెరిగి వస్తు వినియోగ సంస్కృతి పెరగటం, డిమాండ్ సప్లై చైన్లు పెరగటం, ఆదాయ వృద్ధి వల్ల స్థూల దేశీయ ఉత్పత్తి పెరగటం సంక్షేమ పథకాల ఉద్దేశమై ఉండాలి. కానీ ఇవాళ సంక్షేమమంటే ఓటు పథకంగా మార్చేశారు.
ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది.

రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే.. తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలు. ఎన్నికల ఏరు దాటి, అధికారపు ఆవలి గట్టు చేరేలా, లెక్కలేకుండా ప్రజాధనం వెచ్చించి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకే ఈ ఉచితాలు తప్పకుండా అభివృద్ధికి అవరోధమే. సమ్మిళిత అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల అవసరం ఉన్నప్పటికీ అన్నీ ఒకే గాటన కట్టలేం. సదరు సంక్షేమ కార్యక్రమాలకు, ఓట్లు రాల్చే ఫక్తు ఉచితాలకూ మధ్య నుంచే సన్నని పొరను ఎప్పుడో చెరిపేశాయి రాజకీయ పార్టీలు. పౌరుల్ని మనుషులుగా కాకుండా ఓటర్లుగానే చూసే సంస్కృతితో.. సంక్షేమ పథకాల ముసుగులో రాయితీలు, ఉచితాలు, ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థల్ని ఛిద్రం చేస్తున్నాయి. రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్య భావనకు అనుగుణంగా ప్రవేశపెట్టిన పథకాలు చాలావరకు విజయవంతమయ్యాయి. పేదలకు రేషన్ పథకం.. ఆకలిచావుల్ని దాదాపుగా అరికట్టింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆకలితో చనిపోయే పరిస్థితి ఎవరికీ లేదు. మధ్యాహ్న భోజన పథకం.. స్కూల్ డ్రాపవుట్స్ సమస్యకు చెక్ పెట్టింది. గణనీయ సంఖ్యలో పిల్లలు బడిబాట పట్టారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, సబ్సిడీలు.. ఆహారధాన్యాల సమస్యను తీర్చేసింది. ఇలా ఎన్నో పథకాలు అంచనాలకు మించిన విజయాలు సాధించాయి. కానీ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటిస్తున్న పథకాలే.. కొంప ముంచుుతన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వాటిపైనే అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్య, వైద్య రంగాల్లో ఏం చేసినా తప్పు కాదని సుప్రీం చెప్పడం.. ప్రభుత్వాలకు కళ్లు తెరిపిస్తుందేమో చూడాలి.

ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో ఖజానాను ఖాళీ చేయడంపైనే పార్టీలు దృష్టిపెడుతున్నాయి. ఉత్పాదకతను పెంచడం, శ్రామిక శక్తిని వినియోగించడంపై ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు. ఓట్ల కోసం ఉచిత వాగ్దానాలు చేయడమే పనిగా మారిపోయింది. ఈ పోకడ ఏ ఒక్క రాష్ట్రానికో ఇది పరిమితం కాదు.. అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఉచిత పథకాలనే ఓట్లు కురిపించే ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఉచితాలు లేకపోతే కొంప మునిగిపోతుందని, రాజకీయ మనుగడే ఉండదన్నంతగా ఫీలైపోతున్నాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలూ ఉచిత పథకాలను సానబెడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరిని మించి మరొకరు ఆల్ ఫ్రీ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం మోపుతున్న పథకాలను ఏ పార్టీ వ్యతిరేకించలేని పరిస్థితిలో ప్రతి పార్టీ ఉచిత పథకాలే ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాల్సివస్తోంది. సంక్షేమం పేరుతో అడ్డూ అదుపు లేకుండా హద్దులు దాటి ఉచిత పథకాలు అందజేస్తుండటంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది.

ఉచిత హామీల అమలుపై తగినంత స్పష్టత లేకపోతే అది ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. రాష్ట్రాలకు ఒకవైపు పన్నుల ఆదాయం తగ్గుతున్నా సబ్సిడీలపైన, ఉచితాలపైన మరోవైపు వ్యయం మాత్రం పెరిగిపోతోంది. ఏతావతా దీర్ఘకాలంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడానికి దోహదపడని చెల్లింపులన్నీ ఉచితాలుగానే పరిగణించాలి. ప్రభుత్వాలు ఉచిత వరాలెన్ని ప్రకటించినా విద్య, వైద్యాలపై మనం చేస్తున్న ఖర్చు నిరుపేద దేశాలకన్నా చాలా తక్కువే. ఏటా అనేక రాష్ట్రాల బడ్జెట్‌ పరిమాణం పెరిగిపోతున్నా విద్యా వైద్యాలపై, మౌలిక వసతుల నిర్మాణంపై ఖర్చు మాత్రం తక్కువగానే ఉంటోంది. కాబట్టి కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కాకుండా నిజమైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధనకు ప్రభుత్వాలు నిధులు వెచ్చించాలి. ఒక హామీ ఇచ్చే ముందు.. అది సాధ్యమా కాదా, ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా, ఐదేళ్ల పాటు నడిపించగలమా లేదా అనేది చూసుకోవడం కనీస ధర్మం. కానీ మాయమాటలు చెప్పటానికి లెక్కలు చూసుకోవాల్సిన పనిలేదంటున్నాయి పార్టీలు. గల్లా పెట్టెలో డబ్బుల్లేకపోయినా పథకాలు అమలుచేస్తే.. అది భవిష్యత్‌ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కనీసం రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే.. ఇక పథకాలు అమలు చేసి ఏం లాభం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పథకాలు ఇచ్చుకుంటూ పోయి అభివృద్ధి చేయలేకపోతే ప్రజలు తిరగబడే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అదే జరిగితే.. భవిష్యత్‌ తరానికి చెడ్డపేరు తప్ప మరొకటి మిగలదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు ఏది ఉచితం..? ఏది సంక్షేమం..? అనే ధర్మ సందేహాలు పుట్టుకొచ్చాయి. వీటిపై కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్య భావన ఏంటో స్పష్టంగా విశదీకరించింది. విద్య, వైద్యం విషయంలో ఏం చేసినా.. ఉచితాల కిందకు రాదని, కానీ ఎన్నికల్లో గెలుపు కోసం, ఓటుబ్యాంకును కాపాడుకోవడం కోసం ఇష్టారాజ్యంగా ఇచ్చే పథకాలు మాత్రం తీవ్ర అభ్యంతరకరమని తేల్చిచెప్పింది. సంక్షేమం అంటే నిరుపేదలకు కనీస అవసరాలు తీర్చాలనే కానీ.. పలుకుబడి ఉన్న వ్యక్తులకు అన్నీ దోచిపెట్టమని కాదని.. సుప్రీం ఘాటుగానే వ్యాఖ్యానించింది. అసలు రెవిన్యూలోటుతో సతమతమౌతున్న రాష్ట్రాలు.. ఎక్కడ్నుంచి డబ్బులు తెచ్చి పథకాలిస్తాయని కూడా సుప్రీం ప్రశ్నించింది. ఈమధ్యకాలంలో తెలివిమీరిన పార్టీలు.. చేయాల్సిన సంక్షేమాన్ని కూడా గాలికొదిలేసి.. కేవలం ఉచితాలపైనే ఫోకస్ పెంచిన వాస్తవం మన కళ్ల ముందే ఉంది. ఈ బరితెగింపు వైఖరినే సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

సమాజంలో అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు ఉండాల్సిందే. అలాగే ఎవరికి నచ్చినట్టుగా వారు ఎదిగేందుకు వీలుగా సర్కారు చేయూత ఇవ్వాల్సిందే. కానీ సంక్షేమ అమలులో యుక్తాయుక్త విచక్షణ కీలకం. ఎవరికి ఏది అవసరమో అది అందివ్వాలే కానీ.. అనవసరంగా అవసరం లేనివారికి అప్పనంగా పథకాలు ఇవ్వకూడదు. మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ రంగానికి రైతులు, పారిశ్రామిక రంగానికి కార్మికులు, సేవా రంగానికి శ్రామికులు చాలా కీలకం. ఈ వర్గాల్లో ఎక్కడ సంఖ్య తగ్గినా.. ఆ ప్రభావం మొత్తం రంగం మీద ఉంటుంది. అందు కేవలం ట్యాక్స్ పేయర్స్ నే కాకుండా.. పేదల్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందరి సర్వతోముఖాభివృద్ధి కోసం సంక్షేమం అమలు చేయాలి. అంతిమంగా ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరగడమే లక్ష్యం కావాలి. అంతే కానీ పేద, ధనిక అంతరాలు మరింత పెరిగేలా పథకాల ప్రకటనతో మాత్రం నష్టమే ఎక్కువగా జరుగుతుంది. పార్టీలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నవారు, పలకుబడి ఉన్నవారికి మాత్రమే పథకాలు అందితే.. అది ప్రజాధనాన్ని దోచిపెట్టడమే అవుతుంది. అదే నిజంగా పేదరికంలో ఉన్నవారికి గౌరవంగా బతికేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. సంక్షేమ రాజ్య భావన పరిపూర్ణమవుతుంది. ఇలా సంక్షేమానికి, ఉచితాలకు మధ్య ఉన్న సన్నటి విభజన రేఖను పార్టీలు కూడా చిత్తశుద్ధితో అర్థం చేసుకోవాలి. ఎవరో కొందరు పన్నులు కడుతుంటే.. ఆ డబ్బును మొత్తంగా సమాజ ప్రగతికి వినియోగించకుండా.. కేవలం కొన్ని వర్గాలకు మేలు చేసే సంక్షేమం కోసమే ఖర్చు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. మొత్తం మీద సంక్షేమానికి, ఉచితాలకు మధ్య విభజన రేఖను గుర్తించి.. సంక్షేమం కూడా అభివృద్ధి కోసమే అనే అవగాహనను పార్టీలు, ప్రభుత్వాలు పెంచుకున్నప్పుడే ఈ వేలం వెర్రి ఉచితాల సమస్యకు శాశ్వత సమాధానం దొరుకుతుంది.

Exit mobile version