Storyboard: గతంలో బీమారు రాష్ట్రంగా ముద్రపడ్డ బీహార్.. ఇప్పుడిప్పుడే ఆ ఛాయలు తొలగించుకుని.. అభివృద్ధి బాటలో నడుస్తోంది. గత పాతికేళ్లుగా నితీష్ బీహార్ ను ప్రశాంతంగా ఉంచి.. సుశాసన్ బాబుగా ముద్రపడ్డారని జేడీయూ గొప్పగా చెప్పుకుంటుంది. కానీ రాజకీయ జిమ్మిక్కులతో నితీష్ కుర్చీ పదిలంగా ఉంచుకుంటున్నారని, అసలైన ప్రజాభిమానం లాలూ కుటుంబం వెంటే ఉందనేది ఆర్జేడీ మాట. రాజకీయ విమర్శల సంగతి పక్కనపెడితే.. బీహార్ స్థితిగతుల్లో గతానికీ, ఇప్పటికీ మార్పు వచ్చిన మాట నిజం. దేశవ్యాప్తంగా వలసపోయే బీహారీలు కూడా బీహార్ కు కొత్త రాజకీయ అస్తిత్వాన్ని తెచ్చిపెట్టారనడంలో సందేహం లేదు. దీంతో మునుపటితో పోలిస్తే ప్రస్తుతం బీహార్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఓట్ల చోరీ ఆరోపణలు.. ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం చేయాలని ఫిక్సైంది ఇండియా కూటమి. ఇప్పటికే రాహుల్ గాంధీ సస్రాం నుంచి మొదలుపెట్టిన ఓటర్ అధికార్ యాత్ర బీహార్లో 23 జిల్లాల మీదుగా సాగనుంది. ఈ యాత్రలో రాహుల్ కు తేజస్వి కూడా జత కలిశారు. ఓట్ల చోరీ విషయంలో బీజేపీ దొంగాట ప్రజలకు తెలిసిపోయిందని, ఆ ప్రభావం ఫలితాలపై కచ్చితంగా ఉంటుందని ఇండియా కూటమి ధీమాగా ఉంది. అదే సమయంలో ఈసీ ఇచ్చిన కౌంటర్లు.. వాస్తవాల్ని కళ్లకు కట్టాయని బీజేపీ ఆరోపిస్తోంది. బీహారీలకు మోడీపై నమ్మకం ఉందని ఆ పార్టీ వాదిస్తోంది.
బీహార్ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వివాదానికి దారితీసింది. ఎస్ఐఆర్ పేరుతో పౌరసత్వానికి ప్రూఫులు అడగటం.. లేనిపోని డాక్యుమెంట్లు కావాలనే కారణంతో.. లక్షల్లో ఓట్లు తొలగిస్తున్నారనేది విపక్షాల ఆరోపణ. ఈసీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని.. ఓట్ల చోరీకి తెరలేపిందని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఇదే పని చేసి గతంలో మహారాష్ట్రలోనూ ఫలితాన్ని మార్చేశారని ఆయన విరుచుకుపడుతున్నారు. ఆయన విమర్శలకు ఈసీ కౌంటర్ ఇచ్చినా.. అందులో పసలేదనేది ఇండియా కూటమి అభిప్రాయం. రాహుల్ యాత్రతో అప్రమత్తమైన బీజేపీ కూడా కుదిరినప్పుడల్లా మోడీతో బీహార్లో సభలు పెట్టిస్తోంది. ఆ సభల్లో మోడీ రాహుల్ విమర్శల్ని తిప్పికొడుతున్నారు. దీంతో బీహార్ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ప్రచార హోరు మొదలైపోయినట్టైంది.
ఓట్ల చోరీని ప్రధానాంశం చేయాలనే నిర్ణయం వెనుక ఇండియా కూటమి బలమైన వ్యూహరచన చేస్తోంది. 2014 నుంచీ బీజేపీ, మోడీ దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారనే వాదనను బాగా జనంలోకి తీసుకెళ్లాలనే లైన్ తీసుకుంది. మొత్తంగా ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరిగేలా చూడటమే ప్రధాన అజెండాగా పెట్టుకుంది. తమ వాదనను జనం పూర్తిగా నమ్మకపోయినా.. వారి మనసులో ఏ మూలో కాస్త అనుమాన బీజం మొలకెత్తినా.. కాగల కార్యం ఓటర్లే పూర్తిచేస్తారనే నమ్మకంతో ఉంది. ఇప్పటికే ఓట్ల చోరీ ఆరోపణలకు కౌంటర్ల విషయంలో బీజేపీ నేతలు కుప్పిగంతులు వేస్తున్నారని, వారికి ఎన్డీఏ పక్షాల నుంచి మద్దతు కరువైందని ఇండియా కూటమి భావిస్తోంది. అయితే ప్రతిపక్షం మిథ్యా ప్రపంచంలో బతుకుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. బీహారీలకు అవసరమైన అంశాలను వదిలేసి.. ఓట్ల చోరీ పేరుతో లేనిపోని రగడతో సాధించేదేమీ లేదనేది ఆ పార్టీ భావన. జనం పదేపదే తిరస్కరించిన రాహుల్ తో ఇండియా కూటమికి ఏమీ ఒరగబోదని కూడా ఎన్డీఏ ఎద్దేవా చేస్తోంది.
ఓట్ల చోరీ విషయాన్ని బీహారీలు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారనేది అసలైన విషయం. ఈ ప్రాతిపదికనే ఓట్ల చోరీ ప్రచారం కొనసాగుతుందా.. ఆగిపోతుందా అనేది తేలిపోతుంది. ఎందుకంటే ఓట్ల చోరీపై ప్రజాభిప్రాయం తెలుసుకోవటానికి బీహార్ ఎన్నికల్ని మించిన అవకాశం పార్టీలకు లేదు. అందుకే ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రావాలని ప్రతి పార్టీ కోరుకుంటున్నాయి. ఓట్ల చోరీపై భారీ ఆశలు పెట్టుకుని.. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో బీహార్లో యాత్ర చేస్తున్న రాహుల్.. ఆశిస్తున్న ఫలితాలు వస్తాయా.. లేదా అనేది కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతున్న అంశం. రాహుల్ ఆరోపణల్నే నమ్ముకుని.. ఆయనతో భుజం కలిపి నడుస్తున్న తేజస్వి కూడా ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్నారు. అయితే ఎన్డీఏ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాహుల్ ఓట్లచోరీ ప్రచారానికి యాత్ర చేస్తున్నా.. అట్నుంచి విమర్శలు, కౌంటర్లే తప్ప.. ఈ అంశానికి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఉద్దేశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల చోరీ ప్రధానాంశం కాకూడదనే లక్ష్యంతో ఎన్డీఏ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే మోడీ కూడా సభల్లో బీహార్ అభివృద్ధి గురించి పదేపదే మాట్లాడుతున్నారు. మెరుగైన బీహార్ కోసం ఎన్డీఏకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.
దేశంలో యూపీ తర్వాత బీహార్ కీలక రాష్ట్రంగా మారిపోయింది. దీనికి తోడు బీహారీ వలస కార్మికులు దేశమంతా ఉండటంతో.. బీహార్ ఎన్నికల ప్రభావం ఇతర రాష్ట్రాల ప్రజల మీద కూడా ఉంటుందని పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. పైగా ఎన్నికల కోసం తాము వలసపోయిన ప్రాంతాల నుంచి తరలివచ్చే బీహారీలు.. తమతో పాటు దేశవ్యాప్త ప్రజల మనోగతాన్ని మోసుకొస్తారనేది కూడా అంచనా. అందుకే బీహార్ ను మినీ భారత్ సమరంగా కూడా కొందరు అభివర్ణిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలుగా తీసుకోకూడదని.. పార్టీలపై దేశప్రజల అభిప్రాయానికి ప్రతిబింబంగా చూడాలనే అభిప్రాయాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే అగ్రనేతలు రంగంలోకి దిగి వ్యూహరచన చేస్తున్నారు. ఇక్కడ తెరపైన కనిపించే ప్రచార హడావుడి కంటే.. చాప కింద నీరులా పనిచేసే తెర వెనుక వ్యూహాలే కీలకమనడంలో సందేహమే లేదు.
ఇప్పుడు బీహార్లో ఎవరి కింగ్ అయితే.. జాతీయ రాజకీయాల్లోనూ వారి హవానే నడుస్తుందనే విశ్లేషణలున్నాయి. ఓట్ల చోరీ ఆరోపణలతో ఇండియా కూటమి నిజంగా ఎన్డీఏను గట్టిగా ప్రతిఘటించిందా.. లేదా అనేది ఇప్పుడు తేలిపోనుంది. అందుకే ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. గతానికి భిన్నంగా కాంగ్రెస్ చాలా ముందుగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం.. బీహార్ పై ఆ పార్టీ పెట్టుకున్న ఆశలకు అద్దం పడుతోంది. మరి బీహారీలు ఓట్లచోరీ ఆరోపణల విషయంలో రాహుల్ తో కనెక్ట్ అవుతారా..? ఆయన ఆరోపణల్ని రిసీవ్ చేసుకుంటారా.. లేదా..? ఈ ప్రశ్నలే ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల్ని తేల్చుతాయని భావిస్తున్నారు. ఓట్ల చోరీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందా.. లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది.
