Story Board: రెండున్నర నెలల పాటు రాజకీయ వేడి రాజేసిన.. బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. బీహార్లో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తున్న జాతీయ పార్టీలకు, పరువు కాపాడుకోవాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీలకూ.. ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే అనడంలో సందేహం లేదు. గతంతో పోలిస్తే ఈసారి బీహార్ ఎన్నికల ప్రచారంలో కాస్త మార్పు కనిపించింది. ఈసారి కులాలు, మతాల కంటే అభివృద్ధి, సంక్షేమం గురించి ఎక్కువగా చర్చ జరిగింది. అలాగని కుల ప్రభావం అసలు లేదని కాదు. క్షేత్రస్థాయిలో కొన్ని వర్గాలతో ముఖాముఖిలో మాత్రమే అవసరాన్ని బట్టి నేతలు కులం కార్డు ప్రయోగించారు. బీహారీలో ఆలోచనలు ఏంటనే విషయంపై ఏ పార్టీకైనా క్లారిటీ వచ్చిందా.. లేదా అనేది తేలలేదు. కానీ కొత్తతరహా ప్రచార వాతావరణం మాత్రం కనిపించింది. చిన్న పార్టీలు కూడా కొత్త అంశాల్ని జనం ముందు పెట్టాయి. దీంతో ప్రధాన పార్టీలు కూడా తమ ప్రచార వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. బీహారీలు తమకేం కావాలో వివిధ సర్వేల్లో చెప్పిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశాయి. ఇంతకుముందులా గుడ్డిగా ఓటేసేది లేదని ఓటర్లు తేల్చేయడంతో.. అన్ని పార్టీలకూ గుబులు మొదలైంది. ప్రచారం బాగానే చేసినట్టు కనిపిస్తున్నా.. ఫలితంపై ఏ పార్టీ నమ్మకంగా లేదు. ఎవరు గెలిచినా.. స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కుతారనే అంచనాలు అందర్నీ భయపెడుతున్నాయి. పొరపాటున హంగ్ వస్తే.. అసలు సిసలు పొలిటికల్ గేమ్ చూస్తామని కూడా అంటున్నారు. మరి బీహారీలు ఎవరిని గట్టెక్కిస్తారనేది తేలాల్సి ఉంది.
దేశ రాజకీయాలపైనా ప్రభావం చూపేలా బీహార్ ఎన్నికలుంటాయి. బీహార్ అనేక ప్రాంతీయ పార్టీల కలయిక. గిరిజన ఆదివాసీ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, వీటికితోడు జాతీయ పార్టీలు ఇలా అనేక పార్టీలు బీహార్‌లో తలపడుతున్నాయి. ఈ సారి జరుగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు పరీక్షే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన నితీష్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైనవి. అయితే అన్ని పార్టీలు రాజకీయ బురద జల్లుకుంటుండంతో ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో రెండు కూటములు ఏర్పడ్డాయి. ఎన్డీయే పక్షాన బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ రామ్విలాస్, మహాఘట్ బంధన్ తరపున కాంగ్రెస్, ఆర్జేడీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ స్థాపించి సొంతంగా బరిలోకి దిగుతున్నారు. ఈ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆయన అంతగా ప్రభావం చూపనప్పటికీ, ఓట్లు భారీగా చీల్చే అవకాశం ఉందని అంచనా. కింగ్ మేకర్ అవుతానని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు ఫలితాలు రాబడతారనేది ఆసక్తికరమైన అంశం. మైనారిటీ ఓట్లు సైతం బీహార్‌లో భారీగా ఉన్నాయి. మజ్లిస్ పార్టీ బీజేపీకి బీ టీంగా వ్యవహరిస్తున్నదని వస్తున్న ఆరోపణల తరుణంలో ఇండియా కూటమి మజ్లిస్‌ను పక్కనపెట్టింది. దీంతో మజ్లిస్ కొత్త కూటమి కట్టి బరిలోకి దిగింది. ఈ కూటమి ఎవరి విజయావకాశాలు దెబ్బతీస్తుందనేది చూడాల్సి ఉంది. మైనారిటీ ఓట్లు ఎటువైపునకు పడతాయో అన్నది అంతుచిక్కటం లేదు.
కమ్యూనిస్టు పార్టీలు సైతం యువతకు పెద్దపీట వేస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను బరిలో నిలిపాయి. బీహార్-జార్ఖండ్ సరిహద్దులో ఉన్న గిరిజన తెగల కోసం కొన్ని స్థానాలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా సైతం బరిలో నిలిచింది. ఈ విధంగా అనేక పార్టీల కలయికతో బీహార్ ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఏ కూటమి అధికారం చేపట్టినా స్వల్ప మెజారిటీతోనే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ ఎన్నికలు కీలకంగా మారడానికి ప్రధాన కారణం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. భారత ఎన్నికల సంఘం ఫేక్ ఓటర్లను తొలగించడానికి బీహార్‌లో ఉన్న ఓటర్ల జాబితాను వడపోసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణ వచ్చింది. సుప్రీం కూడా జోక్యం చేసుకొని ఈ ప్రక్రియను అందరికి ఆమోదయోగ్యం అయ్యేవిధంగా ఉండాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల సంఘం మొత్తం ప్రక్రియను 3 నెలల్లో పూర్తిచేసి 68 లక్షల ఓటర్లను తొలగించింది. ఇది పెద్ద ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ఎన్నికల సంఘం 2025, సెప్టెంబర్ 30 నాటికి 7.5 కోట్ల ఓటర్లతో నూతన జాబితాను విడుదల చేసింది. దీనికి తోడు చిన్న పార్టీలు సైతం ఓట్లను చీల్చే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ప్రధాన పార్టీలకు చిన్నపార్టీల నుంచే కాకుండా.. రెబల్స్, స్వతంత్రుల నుంచి కూడా ముప్పు పొంచి ఉంది.
ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ, మహాఘట్ బంధన్ కూటములు.. ఓటర్లపై తాయిలాల జల్లు కురిపించాయి. అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడమే తమ లక్ష్యమని ప్రకటించింది. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2లక్షల వరకు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో మెగా లెర్నింగ్ సెంటర్లతో బీహార్‌ను ప్రపంచ అభ్యాస కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలిపింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తమ పార్టీ మై-బహిన్ మాన్ యోజనను ప్రారంభిస్తుందని ప్రకటించారు. 2026 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ఈ పథకాన్ని అమలు చేస్తామని, దీని కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ. 30 వేలు అందిస్తామన్నారు. రాష్ట్ర ఉద్యోగుల పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, పోలీసు సిబ్బందితో సహా అన్నిశాఖల ప్రభుత్వ సిబ్బందిని వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నియమించేలా చూస్తామన్నారు.
బీహార్లో ప్రతి పార్టీ ఓ అజెండా అనుకుని ఎన్నికల బరిలోకి దిగింది. కానీ ప్రచారంలో దిగాక అనివార్యంగా వ్యూహం మార్చి.. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మొదట్లో నితీష్ వర్సెస్ తేజస్విగా ఉన్న ప్రచారం.. తర్వాత మోడీ వర్సెస్ రాహుల్ గా రూపాంతరం చెందింది. ఈ పరిణామం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో గత ఎన్నికల ఫలితాల్ని బట్టి.. ఇప్పుడు అంచనాలు వేయటం.. ఈసారి ఫలితం ఇవ్వకపోవచ్చనే చర్చ జరుగుతోంది. బీహార్ మహిళలు, యువత కీలకంగా మారనున్న ఎన్నికల్లో.. అభ్యర్థుల గుణగణాలు, పనితీరు, బ్యాక్ గ్రౌండ్ కూడా గెలుపోటముల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలున్నాయి.
