Site icon NTV Telugu

Story Board : బంగారం పెరుగుదలకు కారణం అదేనా..?

Storyboard

Storyboard

బంగారం ధర మళ్లీ ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరువ అవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల తరుణంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1, 03, 320కి చేరింది. ఈ ధరలు చూశాక అసలు బంగారం ఎలా కొనాలా అని సామాన్యులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మరోవైపు పండగల సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇలాంటి టైమ్ లో పసిడి అందుబాటులో లేకుండా పోవడం సామాన్యుడికి మింగుడుపడటం లేదు. తులం బంగారం రూ.లక్ష పెట్టి కొని కూతుళ్ల పెళ్లిళ్లు చేయడం మధ్యతరగతి తండ్రులకు తలకు మించిన భారంగా మారింది. కానీ భారతీయ సమాజంలో పెళ్లంటే.. బంగారం తప్పనిసరి. అలాంటి పసిడి కొనే పరిస్థితి లేకపోవడంతో.. చాలా కుటుంబాల ప్లాన్లు తల్లకిందులౌతున్నాయి. కొంతమంది ఇతరత్రా ఖర్చుులు తగ్గించుకుని, మరికొంతమంది బడ్జెట్ ఇంకా పెంచుకుని ఏవో తంటాలు పుడతున్నారు. కానీ మెజార్టీ మిడిల్ క్లాస్ తండ్రులు మాత్రం దేవుడిపైనే భారం వేసి నెట్టుకొస్తున్నారనే చెప్పాలి.

పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో.. బంగారం కొనుగోలు చేయాలని చాలామంది పసిడి ప్రియులు బంగారం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే ఊహించని విధంగా వారికి బంగారం ధరల షాక్ తగులుతోంది. జూలై నెలలో కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపించిన బంగారం ధరలు ఈ నెల మొదటి వారంలో ఊహించని విధంగా భారీ పెరుగుదలను నమోదు చేశాయి.భారతీయులకు బంగారు ఆభరణాలు అంటే ఎంత ఆసక్తి ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, పండగల సమయాల్లో కచ్చితంగా గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేస్తుంటారు. ఆడపిల్ల పెళ్లి సమయంలో వారికి బంగారం పెడతారు. ఇది మన దగ్గర ఎప్పటినుంచో సంప్రదాయంగా ఉంది. ఇంకా ఏదైనా చిన్న పిల్లల ఫంక్షన్ల సమయాల్లో బంగారాన్నే గిఫ్ట్‌గా ఇస్తుంటారు. అంతటి డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ దృష్ట్యానే రేట్లు ఉంటాయి. ఇక ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా బంగారానికి ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేట్లు కూడా రికార్డు స్థాయి గరిష్టాలకు ఎగబాకుతున్నాయి.

ఒకవేళ బంగారం ధరలు తగ్గినా.. తులం బంగారం మహా అయితే రూ.లక్షకు చేరుతుంది. అది కూడా మిడిల్ క్లాస్ కు భారమే అనడంలో సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఇప్పట్లో బంగారం మాటెత్తకపోవడమే మంచిదని సామాన్యులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో డాలర్ ప్రభావితం అవడం, యూఎస్ విధిస్తున్న సుంకాలు వెరసి బంగారం ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా డాలర్ బలం పుంజుకుంటే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. ప్రపంచ విపణిలో బంగారం ధరలకు డాలర్ విలువకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రస్తుతం గ్లోబల్ ఉద్రిక్తతల మధ్య మార్పులకు లోనవుతున్న బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి.

ట్రంప్ టారిఫ్ లు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేశాయి. మార్కెట్లలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఇలాంటి సంక్షోభ, సంక్లిష్ట సమయాల్లో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉంటుంది. తద్వారా పెట్టుబడిదారులు ఇటువైపు మొగ్గుచూపుతారు. దీంతో రేట్లు కూడా పెరుగుతుంటాయి. భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ పెద్ద మొత్తంలో దిగుమతి సుంకాల్ని విధించారు. ఇంకా.. మళ్లీ మన దేశంపై అదనంగా 25 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న కారణంతో అదనంగా సుంకాలు, పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణాలతోనే గోల్డ్ రేటు భారీగా పెరగ్గా.. మళ్లీ రష్యా చమురు వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్‌తో చర్చలేం ఉండవని ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో బంగారం రేట్లు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. ఆల్ టైమ్ హైని నమోదు చేశాయి.

అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్‌ విలువ క్షీణించడం వంటివి కూడా పసిడి వైపు పెట్టుబడులు మళ్లడానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చిప్‌ దిగుమతులపైనా 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్‌ బెదిరింపులకు దిగుతుండడంతో మరోసారి వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇవి బంగారానికి డిమాండ్‌ పెంచుతున్నాయి. ఇప్పటివరకు పన్ను మినహాయింపు కింద ఉన్న స్విట్జర్లాండ్ బంగారంపై కొత్త టారిఫ్ వల్ల ప్రపంచ పసిడి మార్కెట్లో సరఫరా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రధానంగా అమెరికా జాబ్ మార్కెట్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల కోత ప్రభావం బంగారంపై డైరక్ట్ గా పడుతోంది. భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా పసిడి పరుగుకు కారణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు. జూలైలో విడుదలైన నాన్‌ఫార్మ్ పేరోల్స్ డేటా బలహీనంగా ఉండటంతో.. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో సెప్టెంబర్‌లో జరగనున్న ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందని 94 శాతం ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలన్నీ పసిడి పరుగుకే ఓటేస్తున్నాయి.

బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. గత ఇరవై ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మతిపోతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000వ సంవత్సరంలో రూ.4,400 ఉండగా.. 2005 నాటికి రూ.7 వేలకు పెరిగింది. 2010లో తులం బంగారం ధర రూ.18,500గా ఉండగా.. 2015 నాటికి రూ.26,300కి చేరుకుంది. 2020లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,600గా ఉంది.ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,03,000గా ఉంది. పసిడి ప్రతి ఐదేళ్లకు సగటున 50 నుంచి 60 శాతం దాకా పెరుగుతూ చ్చింది. ఏడాదికి కనీసం 15 శాతం రేటు పెరుగుతోంది. నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగినా.. తులం బంగారం రూ.లక్షకు చేరడానికి మరో పదేళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తప్పని నిరూపిస్తూ.. ఐదేళ్లు తిరక్కుండానే.. పుత్తడి రూ.లక్ష దాటి సామాన్యుల్ని బెదరగొడుతోంది.

ఇటీవలి కాలంలో మన దేశంలో కేవలం నగల కోసమే కాకుండా బంగారాన్ని పెట్టుబడిగా చూసే ధోరణి కూడా పెరిగింది. మన దగ్గర పెట్టుబడి మార్గాల విషయానికొస్తే బంగారంతో పాటు భూమి, ఫిక్స్ డ్ డిపాజిట్లున్నాయి. ఎక్కువ మంది భారతీయుల దృష్టిలో ఉన్న పెట్టుబడి ఆప్షన్లు ఇవే. కాకపోతే బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే భూమిపై పెట్టిన పెట్టుబడికే ఎక్కువ ప్రతిఫలం వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. పాతికేళ్ల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.4 వేలు. అదే ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.1,04.000. అంటే 2000వ సంవత్సరంలో 25 తులాలు బంగారం కొనుంటే.. ఇప్పుడు పాతిక లక్షల రూపాయలు అవుతాయి. అదే 2000వ సంవత్సరంలో రూ. లక్ష పెట్టి భూమి కొంటే.. అదిప్పుడు రూ. కోటి అవుతుంది. అదే పాతికేళ్ల క్రితం రూ.లక్ష ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే.. ఇప్పుడు రూ.16 లక్షలు అవుతుంది. ఇక్కడ ఫిక్స్ డ్‌ డిపాజిట్ కంటే బంగారంపై ఎక్కువ ప్రతిఫలం వస్తోంది. కానీ దాని కంటే భూమి మీద పెట్టే పెట్టుబడికి మరింత ప్రతిఫలం వస్తుందని రుజువైపోతోంది. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న పసిడి ధరను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. బంగారం కంటే భూమిపై పెట్టుబడి పెట్టడమే మేలనే అభిప్రాయాలు వస్తున్నాయి. గత రికార్డులు చూసినా ఇదే విషయం స్పష్టమౌతోంది.

గతంలో బంగారం సామాన్యుడికి అందుబాటులో ఉన్నప్పుడు భూమి కొనడం కంటే పసిడి కొనడమే తమకు వీలుగా ఉంటుందనే భావన ఉండేది. కానీ ఇప్పటి ధరలు, వచ్చే ప్రతిఫలాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. డబ్బుంటే కచ్చితంగా బంగారం కంటే భూమిపై పెట్టుబడి పెట్టడమే మేలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి మధ్యతరగతి ఈ దిశగా ఆలోచిస్తుందా.. లేదా అనేది చూడాల్సిన విషయం.

Exit mobile version