Story Board: కొందరు ఆరంభశూరులుంటారు. ఇంకొందరు ప్రారంభించి..మధ్యలో వదిలేస్తారు. మరికొందరు మాత్రం మాటల్లో కాదు…చేతల్లో చేసి చూపిస్తారు. మూడోరకమే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. చెప్పింది చేసి చూపిస్తోంది. ఎన్నికలు ముందు అలవికానీ హామీలిచ్చినా…ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా…వాటిని అమలు చేయడంలో మాత్రం వెనుకంజ వేయలేదు. రైతులకు రుణమాఫీ చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. భారీగా ఉద్యోగాలు కల్పించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వర్షం వస్తే…హైదరాబాద్‌లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయడానికి అవకాశం ఉండదు. వర్షం పడితే…నీరు ఎక్కడికక్కడే ఆగిపోతుంది. ట్రాఫిక్ కష్టాలు ఇక మాటల్లో చెప్పలేం. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. ఎంతో మంది నిరాశ్రయులుగా మారిపోయేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌పై ఫోకస్ చేసింది. ప్రభుత్వ భూములను కాపాడటం…కబ్జాలకు అడ్డుకట్టం వేయడం…అక్రమ కట్టడాలను కూల్చివేయడం…లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడం…వంటి అంశాలతో హైడ్రా షురూ అయింది.
హైడ్రా ప్రారంభించిన వెంటనే హీరో నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టడంతోనే…ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినట్లు హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఒక్క కూల్చివేతతో హైడ్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ ప్రజలు…హైడ్రాకు జేజేలు పలికారు. అయితే కాలం గడుస్తున్న హైడ్రా కూల్చివేతలపై అనేక విమర్శలు వచ్చాయి. పేదల గుడిసెలను కూల్చివేస్తోందని…లేనోళ్ల పొట్ట గొడుతోందని…పలువురు శాపానార్థాలు పెట్టారు. దశాబ్దాల పాటు రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ముతో ఇళ్లు నిర్మించుకుంటే…అన్యాయం చేస్తారా అంటూ బాధితులు ప్రశ్నించారు. అయినప్పటికీ హైడ్రా ఎక్కడ తొందర పడలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. అక్రమ కట్టడాలు, ప్రభుత్వం భూములను కబ్జాల నుంచి విడిపించింది. హైడ్రా చర్యలతో వేల ఎకరాల ప్రభుత్వ భూమి…కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించింది.
మూసీనది పరివాహాక ప్రాంతంలో కూల్చివేతలకు హైడ్రా వెళితే అనేక మంది అడ్డుకున్నారు. మూసి పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులకు…మరో చోట ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది. కొందరు అంగీకరించారు. మరికొందరు మాత్రం హైడ్రా చర్యలను వ్యతిరేకించారు. కాలం గడిచే కొద్దీ హైడ్రా విలువ నగర ప్రజలకు తెలిసి వచ్చింది. హైడ్రా ముందు భారీ వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాలకు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. అయితే ఈ ఏడాది గతంలో కంటే భారీ వర్షాలు కురిసినా…లోతట్టు ప్రాంతాలు మునగలేదు. ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లలేదు. రోడ్లపై నీరు భారీగా నిలవడం లేదు. ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. ఎందుకంటే హైడ్రా చేపట్టిన చర్యలు సత్పలితాలు ఇచ్చాయి.
ప్రభుత్వమైనా…వ్యక్తులైనా…సంస్థలైనా సదుద్దేశంతో మంచి పనులు ప్రారంభిస్తే…వాటి ఫలితాలు మరోలా ఉంటాయని చెప్పేందుకు హైడ్రా బెస్ట్ ఎగ్జాంపుల్. హైడ్రా ప్రారంభంలో అనేక విమర్శలు వచ్చాయి. పేదోళ్లనే టార్గెట్ చేస్తోందని…బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల జోలికి వెళ్లడం లేదని…ప్రతిపక్షాలతో పాటు పేదలు దుమ్ముత్తిపోశారు. అయితే అప్పుడు విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. హైడ్రా వద్దన్న వాళ్లే ఉండాలని…అక్రమ కట్టడాలు, కబ్జాలను కూల్చివేయాలని మద్దతు ఇస్తున్నారు. హైడ్రాను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు, నేతలు సైతం…శభాష్ అంటున్నారు. నగరంలోని అనేక చెరువులను భూకబ్జాదారుల నుంచి కాపాడి…పునరజ్జీవం పోసింది. నిజాం కాలం నాటి కుంటలకు ప్రాణం పోషింది. దీంతో నగరంలోని గొలుసుకట్టు కుంటల్లో నీటి నిల్వ పెరగడంతో…భూగర్భ జలాలు పెరిగాయి. ఎట్లున్న చెరువులు…ఎట్లాయే అంటూ నగర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
కబ్జాదారులు కోరల్లో చిక్కుకుని…మాయమైపోయిన చెరువు బతుకమ్మకుంట. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా అన్యక్రాంతమై కాంక్రిట్ జంగిల్లో కలిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఆ చెరువుకు ప్రాణం పోసింది. మధ్యలో అనేక అవరోధాలు ఎదురైనా, వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమిస్తూ ఐదు నెలల్లో పునరుద్ధరించింది. కబ్జా కోరల్లో చిక్కి విలవిలలాడిన బతుకమ్మకుంట కొత్త కలను సంతరించుకుంది. చెరువుల పునరుజ్జీవంలో భాగంగా అంబర్‌పేటలో 7 కోట్ల వ్యయంతో హైడ్రా బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది. ఆ ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన హైడ్రా… 2 వేల మంది మహిళలు బతుకమ్మ ఆడుకునేలా ఏర్పాట్లు చేసింది. హెచ్ఎండీఏ నిధులు, ప్రభుత్వ సూచనలతో బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన విమోస్ టెక్నాలజీ సంస్థ పునరుద్దరించింది.
హైదరాబాద్‌కు లేక్ సిటీ అనే పేరుంది. మహానగరంలో ఒక్కొక్కటిగా చెరువులు కనుమరుగవుతున్న దశలో…అంబర్ పేటలోని బతుకమ్మకుంట తన పేరును సార్థకం చేసుకుంది. కబ్జాల కోరల్లో చిక్కుకున్న బతుకమ్మకుంట హైడ్రా రాకతో జీవం పోసుకుంది. నాడు కంపచెట్లు, వ్యర్థాలతో నిండిన బతుకమ్మకుంట, నేడు జలకళతో చూడముచ్చటగా తయారైంది. కబ్జాల చెరను విడిపించుకుని ఆహ్లాదకర వాతావరణంతో కనువిందు చేస్తోంది. అంబర్‌పేట మండలంలోని బాగ్‌అంబర్‌పేటలో 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో చెరువు ఉండేది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎర్రకుంటగా పిలిచేవారు. చుట్టుపక్కల ప్రజలంతా ఎర్రకుంట వద్దే బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం వల్ల బతుకమ్మకుంటగా వ్యవహరించేవారు. కాలక్రమంలో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటున్న తరుణంలో అక్రమార్కుల కన్ను బతుకమ్మకుంటపై పడింది. చెరువు స్థలాలను పెద్ద ఎత్తున ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కొన్నాళ్లకే చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. కబ్జాకు గురై అడవిలా మారింది. అక్కడ పలుమార్లు హత్యలు కూడా జరిగాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు స్థానికులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. శాస్త్రీయంగా అధ్యయనం చేసిన హైడ్రా కబ్జా జరిగినట్లు హైడ్రా నిర్దారణకు వచచింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బతుకమ్మ కుంటను పునరుద్దరించే కార్యాచరణను ఆచరణలో చూపెట్టారు. బతుకమ్మకుంట బతికే ఉందని…హైడ్రా రుజువు చేయడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బెంగళూరుకు చెందిన విమోస్ టెక్నాలజీ సంస్థకు చెరువు పునరుద్దరణ బాధ్యత అప్పగించింది. ఐదు నెలల్లోనే బతుకమ్మకుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. చెరువుల పునరుద్దరణతో నగర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హైడ్రాకు బతుకమ్మ కుంట ప్రేరణగా నిలిచింది. ఇటీవల వర్షాలకు బతుకమ్మకుంటలోకి వరద నీరు చేరడంతో అక్కడ ముంపు సమస్య తప్పింది.
