Storyboard: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ప్రకటించారు. చట్టం ప్రకారం స్పీకర్ చెప్పింది కరెక్టే. స్వచ్చందంగా గెలిచిన పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం.. అంటే రాజాసింగ్ లాగా పార్టీకి రాజీనామా చేయడం లేదా విప్ ను ధిక్కరించడం .. ఈ రెండు అంశాల్లో ఏదో ఒకటి చేస్తేనే అనర్హత వేటు పడుతుంది. ఆ ఎమెల్యేలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరామని ఎప్పుడూ చెప్పలేదు. కండువాలు కప్పించుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వారు అనధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. అధికారికంగా మాత్రం అంటే రికార్డుల పరంగా మాత్రం కాదు. అయితే వీరు చట్టాన్ని తప్పించుకోగలరు కానీ.. ప్రజల్ని మోసం చేయగలరా అన్నదే అసలు ప్రశ్న. సాంకేతిక అంశాల సంగతి సరే.. నైతికత సంగతేంటనేది కూడా ఆలోచించాల్సి ఉంది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీదనే. ఆ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారు. ఇప్పుడు వారే వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ప్రజల్ని మోసం చేయడమే. కానీ ఇలాంటి మోసాలను .. నియోజకవర్గ అభివృద్ది కోసం.. ప్రజల కోసం అని చెప్పి అదే పనిగా చేస్తూ వస్తున్నారు ఎమ్మెల్యేలు. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపులు ఓ ఉద్యమంలా జరిగాయి. ఓ సారి ఫిరాయించి గెలిచినా.. తర్వాత మాత్రం చాలా ఎక్కువ మంది ఓడిపోయారు. వారిలో చాలా మంది అడ్రస్ లేకుండా పోయారు. తమ నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్లను ప్రజలు క్షమించడం చాలా అరుదుగా ఉంటుంది. అంటే ఫిరాయింపుల విషయంలో సాంకేతిక అంశాల కంటే నైతిక విలువలకే పెద్దపీట అని జనం అభిప్రాయపడుతున్నట్టే.
పార్టీ ఫిరాయింపులకు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా తయారయ్యాయి. అన్ని పార్టీలూ తలో చెయ్యీ వేసి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమే ఇక్కడ అసలు సిసలు విషాదం. ఫిరాయింపులకు పాల్పడినప్పుడు రాజ్యాంగం 10వ షెడ్యూల్ కింద అటువంటి వారి శాసన సభ్యత్వాల రద్దును కోరుతూ దరఖాస్తులు పెట్టుకోడానికి అవకాశం ఉంది. ఈ దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. కానీ స్పీకర్ పాలక పక్షంలో భాగమైపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. లేకపోతే చాలా ఆలస్యం చేస్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా స్పష్టం చేయలేదు. అందువల్ల స్పీకర్ విచక్షణకే ఇది మిగిలిపోతోంది. గతంలో మహారాష్ట్రలో శివసేన వర్గాల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యాన్ని గమనించి చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇప్పుడు కూడా హైకోర్టు జోక్యంతోనే.. స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటించారని, లేదంటే మరింత కాలయాపన చేసి ఉండారనేది బీఆర్ఎస్ వాదన.
ఎమ్మెల్యేలు ఫిరాయించింది అధికార పార్టీలోకే కాబట్టి.. వారి పదవులకు గ్యారంటీ ఉంటుంది. ఐదేళ్లు స్పీకర్ వారిని కాపాడుతారు. స్పీకర్ ఉన్న పవర్ వారికి రక్షణగా ఉంటుంది. కానీ ఆ తర్వాత సంగతి ఏమిటన్నది ఇక్కడ కీలక విషయం. వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకు మళ్లీ వెళ్లాలి. అప్పుడు వారిని చూసిన ప్రతి ఒక్కరికి తమను మోసం చేశారన్న భావన వస్తుంది. అప్పుడు ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారు. పార్టీ పిరాయింపులు అనేది ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిన ఓ తప్పిదమే. కాకపోతే.. ప్రజలు ఐదేళ్లకోసారి మాత్రమే శిక్షిస్తారు. అదే వీరి ధైర్యంగా కనిపిస్తోంది. సర్కారు మారగానే విపక్షాల నుంచి అధికార పక్షంలోకి నేతలు వలసపోతారు. కానీ అలా వచ్చిన వారిని చేర్చుకుంటే అదో రకం రాజకీయం. కానీ ఆ ఫిరాయింపులకు చట్టబద్ధత తేవడానికి మరికొంతమందిని పోగుచేసుకుని రమ్మని చెప్పడం.. ఏకంగా శాసనసభాపక్షాల్ని విలీనం చేసుకోవడం ఏం రాజకీయమని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. రాజకీయ విలువలన్నింటికీ తిలోదకాలిచ్చిందని కాంగ్రెస్ చెబుతోంది. అదేమంటే తామేం మఠం నడపట్లేదు.. రాజకీయ పార్టీ నడుపుతున్నామని కేసీఆర్ సెటైర్లు వేశారని గుర్తుచేసుకుంటోంది. అలాంటి పార్టీ ఇప్పుడు పార్టీ మారిన వారిపై అనర్హత, నైతికత అంటూ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందంటోంది.
రాజకీయంలో విలువలు ఎప్పుడూ ప్రధానమే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కోసారి వేసే తప్పటడుగుల్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా చేసిన పనుల్ని ఎవరూ సమర్థించే పరిస్థితి లేదు. పదేళ్ల పాటు ఫిరాయింపుల వ్యవహారంలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎవ్వరి మాటా విన్న పాపాన పోలేదు. పవర్లో ఉన్నాం.. మాకు ఎదురేముంది అనే ధోరణితో ముందుకెళ్లారు. ఎవర్నీ లెక్కచేయలేదు. ఓదశలో ప్రజల మాటనూ చెవికెక్కించుకోలేదు. రాజకీయ పునరేకీకరణ అనే పేరుతో వచ్చిన వారిని వచ్చినట్టుగా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. సమయం, సందర్భం, అదను లాంటి పదాలకు ఎక్కడా తావివ్వలేదు. ప్రతి రోజూ 24బై 7 ఫిరాయింపులకు ప్రోత్సాహమే. అదేదో మిషన్ అన్నంత సీరియస్ గా జరిగింది వ్యవహారం. దీన్ని ఏమని చెప్పుకోవాలో కూడా తెలియని దుస్థితి. ఫిరాయింపుల విషయంలోనూ కేసీఆర్ ధోరణి పరాకాష్ఠ అనేది కాంగ్రెస్ మాట. అసలు ఎక్కువ మాట్లాడితే ఫిరాయింపుల్లో కేసీఆర్ కు ఎవరితోనూ పోలికలేదని ఆ పార్టీ చెబుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే ఉండాలనే కుట్రతో కేసీఆర్ నిస్సిగ్గుగా ఫిరాయింపు రాజకీయం చేశారని, ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి లేదనేది కాంగ్రెస్ నేతల విమర్శ. అధికారం ఉన్నప్పుడు ఇష్టారీతిగా వ్యవహరించబట్టే.. ఇప్పుడు బీఆర్ఎస్ కు కనీస ప్రశ్నలు అడిగే హక్కు లేకుండా పోయిందనే వాదన కూడా వినిపిస్తోంది.
మొత్తం మీద ఫిరాయింపుల విషయంలో అన్ని పార్టీలూ దోషులే. అన్ని పార్టీలూ బాధితులే. ఎవరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షాల పీక నొక్కేసి.. అవి లేకుండా చేయటమే లక్ష్యంగా.. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎవరేమనుకుంటే మాకేం అని నిస్సిగ్గుగా వ్వయహరిస్తున్నారు. ఆఖరికి పెద్దల సభ అయిన రాజ్యసభను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. 2019లో ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయాక.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు.దీనికి టీడీపీ అదిష్ఠానం పరోక్ష ప్రోత్సాహం కూడా ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల వ్యవహారశైలి మరీ వింతగా ఉంది. మొదట విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇక మరో రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య ఎంపీ పదవిని, వైసీపీ సభ్యత్వాన్ని వదులుకుని.. బీజేపీలో చేరి.. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇంకో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కూడా ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈయన కూడా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. విజయసాయి, మోపిదేవి రాజీనామాలపై చాలా ఊహాగానాలున్నాయి. విజయసాయి కేసుల భయంతోనే రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. మోపిదేవి కూడా పరోక్షంగా అధికార పార్టీకి లబ్ధి కలిగించే పనిలో ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఈ వాదనలో నిజానిజాల సంగతి పక్కనపెడితే.. వీరిద్దరి వ్యవహారశైలి మాత్రం అనుమానాస్పదంగా ఉందని చెప్పకతప్పదు. ఏతావాతా అన్ని పార్టీలూ కలిసి రాజ్యసభను కూడా విజయవంతంగా భ్రష్టు పట్టించారు. రాజ్యసభ పెద్దల సభ అని, దానికంటూ కొన్ని విలువలు ఉంటాయని ఆశించడం.. ఇక అత్యాశేనని తేలిపోయింది. ఇంకా చెప్పాలంటే లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్యేలకు మించి రాజ్యసభలో ఫిరాయింపులు.. సరికొత్త పోకడలు సంతరించుకున్నాయంటే నమ్మాల్సిందే.
తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల పర్వం రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది. 2004 ఎన్నికల తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంది. అయితే వారిని అధికారికంగా కాంగ్రెస్ లో చేర్చుకోకుండా ప్రత్యేక బ్లాక్ గా చివరి సమావేశాల దాకా గుర్తించి చివరి సెషన్ లో అప్పటి స్పీకర్ కే ఆర్ సురేష్ రెడ్డి వారి మీద వేటు వేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం కండువా కప్పారు. వీటిపై వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా స్పీకర్ ఎటూ తేల్చకుండా… చివరిదాకా నాన్చారు. అదే ఏడాది తెలంగాణలో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి టీఆర్‌ఎస్ మరో లొసుగును వాడుకుంది. మూడింట రెండొంతుల మంది మరో పార్టీలో కలిస్తే… అనర్హత వేటు తప్పుతుందనేది 2003లో చేసిన సవరణ. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో 15 సీట్లు గెలిచింది. వీరిలో నుంచి 12 మంది ఒక్కసారిగా వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరలేదు. ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురు చొప్పున విడతల వారీగా గులాబీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎప్పటికప్పుడు స్పీకర్‌కు అనర్హత పిటిషన్లు ఇస్తూనే ఉంది. ఇలా వెళ్లిన వారు 12 మంది కాగానే.. తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని స్పీకర్‌కు వీరొక లేఖ ఇచ్చారు. ముందుగా టీడీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్లను తేల్చకుండా.. తర్వాత 12 మంది టీఆర్‌ఎస్‌లో కలుస్తున్నామని ఇచ్చిన లేఖను స్పీకర్ ఆమోదించారు. వారు టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు బులెటిన్‌ను విడుదల చేశారు.
2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 63 సీట్లు వచ్చాయి. ఇవి మ్యాజిక్ ఫిగర్ కంటే మూడు మాత్రమే ఎక్కువ. దీంతో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. దీంతో అలాంటి అవకాశానికి తావు లేకుండా విపక్ష నేతల్ని ఆకర్షించాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. టీడీపీకి ఉన్న మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీ మారడంతో.. శాసనసభాపక్షం విలీనమైనట్టు స్పీకర్ ప్రకటించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 88 సీట్లు సీట్లు వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 28 సీట్లు ఎక్కువ. అయినా సరే కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. 19 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది నేతల్ని ఆకర్షించారు. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక్కడ కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా జాగ్రత్తలు తీసుకుని శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నారు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా ముగ్గురు టీడీపీ సభ్యుల్ని తమకు అనుబంధ సభ్యులుగా మార్చుకుని.. సాంకేతికంగా అనర్హత వేటు పడకుండా జాగ్రత్తపడింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల నేతలూ పరిస్థితులకు తగ్గట్టుగా ఎవరి వ్యూహం వారు అనుసరించి.. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని వాడుకుంటూ వచ్చారు. గత పదేళ్లలో ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే 2014కు, 2018కి చిన్న తేడా ఉంది. 2014లో టీఆర్ఎస్ కు పెద్ద మెజార్టీ రాలేదు కాబట్టి.. ఫిరాయింపులు అవసరమే అనే వాదన వినిపించింది. కానీ 2018లో భారీ మెజార్టీ ఇచ్చాక కూడా.. అవసరం లేకపోయినా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
రాజకీయ పార్టీలు ఎక్కడ్నుంచో దిగి రాలేదు. ప్రజల్లో నుంచి పుట్టాయి. ఆ ప్రజలకు కచ్చితంగా జవాబుదారీగా ఉండాలి. అంతేకానీ అధికారం ఉంది కదా అని లెక్కలేనితనంతో ఉంటే.. ప్రజలకు దూరమౌతారు. అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలతోనూ సోదరభావంతో మెలగాల్సిందే. లేకపోతే రాజకీయ స్రవంతిలో అంటరాని పార్టీగా ముద్ర పడుతోంది. అలాంటి పరిస్థితిని ఫేస్ చేయడం చాలా కష్టం. ఎన్ని కష్టాలొచ్చినా.. బాథ చెప్పుకోవడానికి తోడుండాలి. ఆ తోడు కూడా లేకపోవడం వచ్చిన కష్టం కంటే ఇంకా దుర్భరం. ఇప్పుడు బీఆర్ఎస్ అలాంటి స్థితిలోనే ఉందనే చర్చ జరుగుతోంది. ఈ దుస్థితి కూడా కేసీఆర్ స్వయంగా కొనితెచ్చుకున్నదే అనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ అధికారం ఉందని రాజకీయం కోసం అన్ని విలువల్నీ తుంగలో తొక్కారు. రాజ్యాంగం ఒకటుందని మర్చిపోయారు. ఏకంగా కొత్త రాజ్యాంగం కావాలని డిమాండ్ చేశారు. పవర్లో ఉంటే ఏమైనా చేయొచ్చు.. ఎలాగైనా చేయొచ్చనే కోణంలో ఆలోచించి.. పరిస్థితి విషమించేదాకా తెచ్చుకున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా ఓటమి సహజం. కానీ అధికారంలో ఉన్నప్పుడు అహంకరించిన పార్టీకి.. ఓటమి పాలైనప్పుడు అవమానం తప్పదు. ఎవరైనా కన్నూమిన్నూ గానకుండా విర్రవీగితే.. గర్వభంగం తప్పదని చరిత్రలో చాలసార్లు రుజువైంది. కానీ నేతలకు మాత్రం ఎప్పటికప్పుడు పరగడుపే. అధికారం రాగానే.. మేం ప్రత్యేకం.. మిగతావారికి జరిగింది మాకెందుకు వర్తిస్తుందనే భ్రాంతిలో పడిపోతారు. ఆ భ్రాంతిలోనే చేయకూడని పనులన్నీ చేసేస్తారు. తీరా అధికారం పోయాక ఎంత విచారించినా ఏం లాభం. అప్పుడలా చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదని ఆలోచించినా.. ఫలితం శూన్యమే. ఈ ఆలోచన అధికారంలో ఉన్నప్పుడు ఏ కాస్త ఉన్నా.. బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలున్నాయి. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి.. రాజకీయ విలువలకు పాతరేసి.. ఎవరన్నా లెక్కలేకుండా వ్యవహరించి..తోటి పార్టీల్ని పూచికి పుల్లల్లా తీసిపారేసి.. ఇప్పుడు ఎవర్ని మద్దతు అడుగుతారు.. ఎవరూ కలిసిరావడం లేదని ఎలా అంటారనేది ఆలోచించుకోవాలి.
దేశంలో ఫిరాయింపుల చరిత్ర బ్రిటిష్ పాలనా కాలం నుంచే ప్రారంభమైంది. సెంట్రల్ లెజిస్లేచర్ సభ్యుడు శ్యాంలాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి బ్రిటిష్ వారికి మద్దతివ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫిరాయింపునకు మరో ఉదంతం చెప్పుకోవాలంటే.. ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం 1937లో కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. 1967లో ఎమ్మెల్యే గయాలాల్ ఒక రోజులోనే మూడు సార్లు ఫిరాయించి ఆయారామ్ గయారామ్ అనే అపఖ్యాతికి అంకురార్పణ చేశాడు. ఈ ఫిరాయింపులను నివారించడానికి 1967లో నాల్గవ లోక్‌సభ సమయంలో వైబి చవాన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ 1968లో ఒక నివేదికను సమర్పించింది. ఇది పార్లమెంట్‌లో ఫిరాయింపుల నిరోధక బిల్లును సమర్పించడానికి మొదటి ప్రయత్నానికి దోహదం చేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టం అవసరమన్న ప్రజాభిప్రాయం పెరగడంతో 1984లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో కొత్త ఫిరాయింపుల నిరోధక బిల్లును ప్రతిపాదించారు. అనేక చర్చల తరువాత 1985 జనవరి 30, 31 తేదీల్లో లోక్‌సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించాయి. 1985 ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోద ముద్రవేశారు. రాజ్యాంగానికి 52వ సవరణ ద్వారా 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం ఏర్పడింది.ఈ చట్టాన్ని మరింత ప్రభావంతం చేయడానికి 2003 లో సవరణ కూడా జరిగింది. ఇలా ఎన్ని నిబంధనలను సవరించి చట్టాన్ని పటిష్టం చేసినా ఫిరాయింపుల పీడ విరగడ కావడం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే.. అసలు ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చాకే ఫిరాయింపులు పెరిగాయనే వాదన బలపడుతోంది. ఏ పద్ధతిలో అయితే ఫిరాయింపులకు రాచబాట పడుతుందో.. చట్టం పూసగుచ్చినట్టుగా తెలియనివారికి కూడా చెబుతోందని ఆది నుంచీ విమర్శలున్నాయి. ఈ లొసుగులు కూడా లేకుండా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింతగా పదును తేల్చాలనే డిమాండ్ ఉన్నా.. పార్టీలు మాత్రం అంత ఆసక్తి చూపించడం లేదు. మరీ ఎక్కువగా చట్టాన్ని బిగదీస్తే.. రాజకీయంగా తమకు గాలి ఆడదని అంతర్గతంగా భావిస్తున్నాయి. ఇప్పటిలాగే చట్టం ఉందా అంటే ఉంది. ఫిరాయింపులూ అడ్డూఅదుపూ లేకుండా సాగాలని అనే భావనతో కనిపిస్తున్నాయి.
ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న నిబంధనల గందరగోళాన్ని.. పార్టీలు తమకు అనువుగా మార్చుకుంటున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక రాజకీయ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు, పార్టీ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా తటస్థంగా ఉన్నా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఒకవేళ సభ్యుడు పార్టీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నా లేక అతడు ఆ విధంగా వ్యవహరించిన తేదీ నుంచి పదిహేను రోజుల్లోగా పార్టీ అతడిని క్షమించినా సదరు సభ్యుడిపై అనర్హత వేటు పడదు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సభ్యుడు మరో పార్టీలో చేరితే లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఒక నామినేటెడ్ సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే చట్టసభలో సభ్యత్వం పొందిన తేదీ నుంచి ఆరు నెలలకు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. రాజకీయ పార్టీలో చీలిక వచ్చి రెండు గ్రూపులు ఏర్పడినప్పుడు వారిపై అనర్హత వేటు పడదు. ఒక రాజకీయ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు ఫిరాయించినప్పుడు వారిని పార్టీ చీలిక గ్రూపుగా పరిగణిస్తారు. అయితే ఈ నిబంధనను 2003లో చేపట్టిన 91వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.
ఒక పార్టీ వేరొక రాజకీయ పార్టీలో విలీనమైనప్పుడు సదరు పార్టీ సభ్యులకు అనర్హత వర్తించదు. వినీనం తర్వాత కొత్త పార్టీ ఆవిర్భవించవచ్చు లేదా వీరంతా విలీనం చేసుకున్న పార్టీ సభ్యులుగా పరిగణనలోకి వస్తారు. విలీనమైన పార్టీకి చెందిన సభ్యుల్లో కొంతమంది ఆ విలీనాన్ని అంగీకరించకపోతే, వారు ఒక ప్రత్యేక గ్రూపుగా కొనసాగుతారు. విలీనమయ్యే పార్టీకి చెందిన సభ్యుల్లో 2/3వ వంతుకు తగ్గకుండా సభ్యులు అంగీకరించినప్పుడు మాత్రమే ఆ విలీనం ఆమోదం పొందుతుంది. ఒక సభ్యుడిపై అనర్హత వేటు విధించే విషయంలో స్పీకర్ లేదా చైర్మన్‌దే తుది నిర్ణయం. 2003 మే 5న అప్పటి ప్రభుత్వం 97వ రాజ్యాంగ సవరణ చట్టం- 2003 పేరుతో లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది. స్టాండింగ్ కమిటీకి ఈ బిల్లును పంపగా.. ఆ కమిటీ కొన్ని సిఫారసులను చేసింది. వీటిని బిల్లులో చేర్చి 2003, డిసెంబర్ 16న లోక్‌సభ, 18న రాజ్యసభ ఆమోదం తెలిపాయి. 2004 జనవరి 1న రాష్ట్రపతి ఈ బిల్లును 91వ రాజ్యాంగ సవరణ బిల్లు-2003గా ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లో ఉన్న పార్టీ చీలికకు సంబంధించిన నిబంధనలను ఈ చట్టం తొలగించింది. పదవ షెడ్యూల్‌లోని రెండవ పేరాలో పేర్కొన్న విధంగా ఒక సభ్యుడు అనర్హతకు గురైతే.. అతడు మంత్రి పదవి లేదా మరే విధమైన రాజకీయ పదవిని పొందడానికి వీల్లేదని ఈ బిల్లు స్పష్టం చేసింది. సదరు సభ్యుడు అనర్హతకు గురైన తేదీ నుంచి గడువు ముగిసే వరకు లేదా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే వరకు ఈ అనర్హత వర్తిస్తుంది.
ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ, ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలోకి దూకే ఆయారామ్.. గయారామ్‌ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత అస్థిరతను, గందరగోళాన్ని సృష్టిస్తోంది. అంతేకాదు రాజకీయాల్లో విలువలకు సమాధి కడుతోంది. అలా జరగకూడదంటే.. ఓ పార్టీ నుంచి గెలిచిన సభ్యుడు.. మరో పార్టీలో చేరాలంటే.. తన పదవికి, పార్టీకి రెండింటికీ రాజీనామా చేయాలి. తన ఎన్నిక నిర్వహణ ఖర్చును ఈసీకి చెల్లించాలి. తర్వాత ఐదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలి. ఆపైన కావాలంటే వేరే పార్టీలో చేరొచ్చు. ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తే తప్ప.. ఫిరాయింపుల సంస్కృతికి అడ్డుకట్ట పడే అవకాశం కనిపించటం లేదు. లేకపోతే ప్రజాస్వామ్యంలో పవిత్రమైన ఎన్నికలకు అసలు విలువే లేకుండా పోతోంది. రేపొద్దున ఎవరు ఏ పార్టీ సభ్యులో ఏరోజుకారోజు స్పీకర్లను అడిగి తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చే రోజు ఎంతోదూరంలో లేదు. అన్ని పార్టీలు కూడబలుక్కుని ఆ రోజుని తొందరగా తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి.