Story Board : భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వీయ నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను నిరోధించేందుకు వీలుగా మార్గదర్శకాలు తెచ్చే యోచన చేస్తున్నామని తెలిపింది. ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
సోషల్ మీడియా అనేది ఇప్పుడు మహమ్మారిగా మారింది. రాజకీయ పార్టీలే కాదు ..కొన్ని వ్యాపార సంస్థలు, వ్యక్తులు కూడా సోషల్ మీడియా టీముల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం వరకూ ఓకే కానీ తమ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసుకోవడం కోసం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ సోషల్ మీడియా సైన్యాలు ఈ విషయంలో ఎప్పుడో హద్దులు దాటిపోయాయి. వారికి చట్టపరమైన భయం లేకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.
ఈ అంశంపై సెన్సార్ షిప్ ఉండాలన్న పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అయితే సెన్సార్ షిప్ కన్నా.. స్వీయ నియంత్రణ పాటించడమే మేలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడుతోంది. అయితే చట్టపరమైన భయం లేనప్పుడు.. ఈ స్వీయ నియంత్రణ అనేది రాజకీయ పార్టీల సైన్యాలకు అసలు ఉండదు. అక్కడే ఎక్కువగా దుర్వినియోగం జరుగుతోంది. సోషల్ మీడియా ఆనకొండ కంటే డేంజర్. వాటి బారిన పడని వారు ఇప్పటి వరకూ లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పడి ఉంటారు. అయితే వ్యక్తిగత వినియోగం దారి తప్పినప్పుడు దాని దుష్ఫలితాలు అనుభవించినప్పుడు స్వీయనియంత్రణ ఎంత అవసరమో సోషల్ మీడియా వినియోగదారుకు తెలుస్తుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇతరులకు ఆయుధం అయినప్పుడే అసలు సమస్య వస్తోంది .
ఓ టీవీ ఛానల్ పెట్టాలంటే ఎన్నో అనుమతులు కావాలి. కానీ ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే.. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. ఏదైనా ప్రసారం చేయవచ్చు. ఏదైనా పోస్టు చేయవచ్చు. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ.. మెజార్టీ యూట్యూబ్ ఛానెళ్లు బరితెగిస్తున్నాయి. ఓపెన్ గా మాట్లాడుతున్నామనే పేరుతో బండ బూతులు తిడుతున్నారు. వ్యక్తిత్వ హననానికి వెనుకాడటం లేదు. ఓ వ్యక్తినో, సంస్థనో దుమ్మెత్తిపోయటానికే యూట్యూబ్ ఛానెళ్లు నడుపుతున్నవారు చాలామంది కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో విశ్లేషణల్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. అలాగే నచ్చని విధానాలపై విమర్శలకు కూడా అవకాశం ఉంటుంది. కానీ బూతులు మాట్లాడటం విమర్శ అనిపించుకోదు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల ప్రసారాలు బాగానే ఉన్నా.. మెజార్టీ యూట్యూబ్ ఛానెళ్లు మాత్రం భ్రష్టుపట్టిపోయాయి. తమకు తెలిసిన సమాచారం.. నిజమో.. కాదో కూడా నిర్థారణ చేసుకోకుండా యథాతథంగా ప్రసారం చేస్తున్నారు. అసలు కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల కంటెంట్ కు ఆధారాలు కూడా లేవంటే నమ్మాల్సిందే. సంప్రదాయ మీడియాలో ఆధారాల్లేకుండా న్యూస్ రాదు. అలా వస్తే వెంటనే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నోటీస్ వస్తుంది. కానీ సోషల్ మీడియాకు ఆ భయం లేదు. ఎవరైనా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉండటం.. మేలు కంటే కీడే ఎక్కువ చేస్తోంది. అందుకే మొదట యూట్యూబ్ ఛానెళ్లు పెట్టే విషయంపై నియంత్రణ ఉండాలనే డిమాండ్ వస్తోంది. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టాలంటే..ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలనే నిబంధన పెట్టాలి. ఆ తర్వాత ఆ ఛానెల్ కు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ద్వారా అనుమతి వచ్చేలా చూడాలి. అలాగే ఎంఐబీ కూడా సంప్రదాయ మీడియాను పర్యవేక్షించినట్టే.. సోషల్ మీడియా ను సూపర్ వైజ్ చేయటానికి ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసుకోవాలి. అప్పుడే భావప్రకటన స్వేచ్ఛ హద్దుల్లో ఉంటుంది.
హద్దుల్లేని అసభ్యతను యథేచ్ఛగా అందిస్తున్న సోషల్ మీడియా.. సమాజాన్ని వేగంగా చెడగొడుతోంది. సోషల్ మీడియా బారిన పడి యూత్ పాడైపోతున్నారు. ఎక్కువ గంటలు సోషల్ మీడియాకు ఎంగేజ్ అయ్యేవాళ్ల ప్రవర్తనలో విపరీతమైన తేడాలొస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ డిజిటల్ ఫ్లాట్‌ఫాంకి అలవాటైపోయారు. దాంతో వాళ్ల బిహేవియర్‌లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్తోపాటు ఇతర విషయాలు కూడా ఉంటాయి. వాటిలో ఇతరులకు హానిచేసేలా ప్రేరేపించే కంటెంట్ ఉండొచ్చు. అవన్నీ చూస్తున్నప్పుడు మెల్లగా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది చెడు అని తెలిసినప్పటికీ అవి ఇంట్రెస్టింగ్గా ఉండడంతో కంటిన్యూ చేస్తారు. ఏ డిజిటల్ ప్లాట్‌ఫాం అయినా యూజర్‌కు నచ్చే కంటెంట్‌నే రెకమెండ్ చేస్తూ ఉంటుంది. అలాంటి వీడియోలే తరచూ కనిపిస్తుంటాయి. అవి చూస్తూ ఒక రకమైన మైకంలో పడిపోతుంటారు. ఉదాహరణకు ఇద్దరు మనుషులు తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటి అంశాలతో వీడియో చేసి, థంబ్నెయిల్లో కూడా అట్రాక్ట్ చేసేలా.. టైటిల్స్ పెడుతుంటారు. దానికి తగ్గట్టే ఫొటోలు ఎడిట్ చేస్తారు. సాధారణంగా కాసేపు కాలక్షేపానికో, కొత్త విషయం తెలుసుకోవడానికో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఓపెన్ చేస్తారు. అంతే… ఓపెన్ కాగానే రకరకాల కంటెంట్‌తో ఫొటోలు, వీడియోలు అట్రాక్ట్ చేస్తుంటాయి. దాంతో కొన్నిసార్లు అసలు విషయం మర్చిపోయి కనిపించిన వీడియోలన్నీ చూస్తూ ఎంటర్టైన్ అవుతూ టైం కూడా మర్చిపోతుంటారు. అలాంటి వీడియోలను షేర్ కూడా చేస్తుంటారు. అలా అవి వైరల్ అవుతుంటాయి. అలాంటి కంటెంట్‌కి బాగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు.
ఇప్పుడు సొసైటీలో జరిగే ఎన్నో విషయాలకు సోషల్ మీడియా కూడా ముఖ్య కారణం అవుతోంది. అందులో మంచీ.. చెడూ తేడా లేకుండా వైరల్ అవుతోంది. ఒకరు మంచి మెసేజ్ ఇచ్చే వీడియో చేస్తే.. అది చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వడం మంచి విషయం. కానీ, అదే ఒక క్రైమ్‌ని ప్రోత్సహించే వీడియో చూసి దాన్ని ఇన్స్పైర్ అయితే..? ముఖ్యంగా యూత్.. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్‌లో వాళ్లే ఎక్కువ ఉన్నారు. వీళ్లంతా డిజిటల్ అగ్రెషన్‌కు గురైనవాళ్లు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూసిన క్రైమ్‌కి ప్రభావితం అయి, అవే ఆలోచనలతో ఉంటారు. అవకాశం రాగానే వాళ్లలో ఉన్న అగ్రెషన్‌ని బయటకు తీస్తారు.
సోషల్ మీడియా భావి పౌరులపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది. పిల్లలు, యువత కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లవలలో ఇరుక్కుని యాంత్రికమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం విద్యాసంస్థల్లో చదివే పిల్లలు పాఠ్యాంశాలతో పాటు మానసిక వికాసం అందించే పాఠ్యేతర పుస్తకాల పట్ల సైతం ఆసక్తి చూపేవారు. ఎప్పుడైతే మనిషి అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చిందో, అప్పుడు పుస్తకాలు చదివే అలవాటు కనుమరుగై.. సామాజిక మాధ్యమాలతో కాలం వెళ్లబుచ్చే సంస్కృతి నెలకొంది. నేడు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలు మనిషిని శాసిస్తున్నాయి. అంతిమంగా ఇప్పుడు సమాజాన్ని సోషల్ మీడియా శాసించే పరిస్థితి వచ్చిందంటే నమ్మాల్సిందే. అలాంటి శక్తివంతమైన సోషల్ మీడియాని తిట్లు, శాపనార్థాలు, వ్యక్తిత్వ హననాలకు ఉపయోగించడం కంటే దుర్మార్గం మరొకటి లేదు. న్యూస్ పేరుతో నోటికొచ్చిన భాషలో బూతులు తిట్టడం, విశ్లేషణల పేరుతో అవతలి వారిపై దుమ్మెత్తిపోయడం యూట్యూబ్ ఛానెళ్లకు పరిపాటిగా మారింది. ఇటీవల అసలు కేసుల కంటే.. సోషల్ మీడియా పోస్టుల కారణంగా వస్తున్న కేసులు కూడా పెరుగుతున్నాయి. చివరకు కోర్టులు కూడా విసిగిపోయేంతగా పరిస్థితి విషమించింది. ఇక సోషల్ మీడియా న్యాయవ్యవస్థనూ వదలడం లేదన్నది మరో ట్రాజెడీ. కొన్ని సందర్భాల్లో తామూ సోషల్ మీడియా బాధితులమేనని జడ్జిలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
