Site icon NTV Telugu

Story Board: బంగారం, వెండి మించిన పెట్టుబడి లేదా..? మధ్యతరగతి వాళ్లు ప్రణాళికలు మార్చుకోవాలా..?

Story Board On Gold Vs Silv

Story Board On Gold Vs Silv

Story Board: బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు. 2025 లో బంగారం ధరలు దాదాపు 70 శాతం మేర పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. అంటే ఎంత ధరలు పెరిగాయో చెప్పాల్సిన పనిలేదు. మరొకవైపు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కరోజు కిలో వెండి ధరపై తొమ్మిది వేల రూపాయలు పెరిగింది. పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు, కిలో వెండి ధర మూడు లక్షల రూపాయలకు చేరువలో ఉంది. బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్బోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, దిగుమతులు తగ్గడం బంగారం ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు.

ఇప్పుడు బంగారం కంటే వెండిపై పెట్టుబడి పెట్టేవారు అధికంగా కనిపిస్తున్నారు. తమ వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను కూడా విక్రయించుకుని కొందరు ప్రయోజనం పొందుతున్నారు. వచ్చే ఏడాది కూడా ధరలు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. గత ఐదు రోజులుగా ధరల్లో ర్యాలీ కారణంగా బంగారం సగటు రేటు రూ.5800 మేర పెరిగింది. శనివారం కూడా బంగారం ధరలు భగ్గుమన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 11.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1200 మేర ధర పెరిగింది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.1100 మేర పెరిగి రూ.1,29,450కు చేరుకుంది. వెండి ధరల్లోనూ ర్యాలీ కొనసాగుతోంది. కిలో వెండి ఒక్కసారిగా రూ.11 వేల మేర పెరిగింది రూ.2,51,000 వద్ద ట్రేడవుతోంది. వచ్చే ఏడాది కూడా ధరల పెరుగుదల కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 4534 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి 79.25 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ప్రభావం భారత్ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది. ఈ ఏడాది బంగారం ధరలు 70 శాతం మేర, వెండి ధరలు 140 శాతం మేర పెరిగాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, లోహాల సరఫరాలో అంతరాయాలు, యూఎస్ ఫెడ్ మళ్లీ ప్రామాణిక వడ్డీ రేటును 25 బేస్ పాయింట్స్ మేర తగ్గిస్తుందన్న అంచనాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

వచ్చే ఏడాది బంగారం, వెండి ధరలను ప్రధానంగా ఏడు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. అందులో మొదటిది వడ్డీ రేట్లు. వడ్డీ రేట్లు తగ్గితే, బంగారం వంటి వడ్డీ లేని ఆస్తులపై పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా మారుతుంది. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, వచ్చే సంవత్సరం వడ్డీ రేట్ల సరళి ఈ లోహాల ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది. రెండవది అమెరికా డాలర్ విలువ. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మూడవది సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. గత కొన్నేళ్లుగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి, ఇది వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇవి కాకుండా భౌగోళిక ఉద్రిక్తతలు, మాంద్యం భయాలు, ఈటీఎఫ్ పెట్టుబడులు, పారిశ్రామిక డిమాండ్ కూడా ధరలను ప్రభావితం చేయనున్నాయి.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ దెబ్బకు.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన కారణంగా బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ఠాల్ని తాకగా.. ఇప్పుడు అదే ఫెడ్ అంచనాలతో అంతకంతకూ ఇంకా పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా బంగారం, వెండి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతి రోజూ సరికొత్త గరిష్ఠాల్నినమోదు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీ స్థాయిలో పెరిగి జీవన కాల గరిష్ఠాల్ని తాకాయి. ఫెడ్ వడ్డీ రేట్లను వచ్చే ఏడాది కూడా తగ్గిస్తుందని సంకేతాలు అందాయి. ఇదే బంగారం, వెండి ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. అప్పుడు యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి.. ఇదే సమయంలో బంగారం ఆకర్షణీయంగా మారుతుందని చెప్పొచ్చు. దీంతో అటువైపు పెట్టుబడులు పెరుగుతుండటం.. అలాగే బంగారం ధర పెరుగుతుండటం జరుగుతోంది.

మరో నాలుగు రోజుల్లో ముగియనున్న 2025 సిల్వర్‌నామ సంవత్సరంగా రికార్డులకు ఎక్కనుంది. మార్కెట్‌లో వెండి ధరలు పరుగులు తీస్తూ బంగారం తళుకులు వెలవెలబోయేలా ఆకాశాన్నంటుతున్నాయి. నూతన గరిష్ట స్థాయిలకు చేరుకోవడమే కాకుండా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 154 శాతం పైగా వృద్ధి చెందిందంటే ఏ స్పీడ్‌తో పరుగులు తీసిందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది డిసెంబర్‌ 26న కేజీ వెండి రూ.91,600గా ఉంటే అదిప్పుడు ఏకంగా రూ.2,36,350ని తాకి రికార్డులు సృష్టించింది. అక్టోబర్‌ 28న అంతర్జాతీయ మార్కెట్లో కేజీ వెండి ధర 45.43 డాలర్లుగా ఉంటే అదిప్పుడు నూతన గరిష్ట స్థాయి 72.70 డాలర్లకు అంటే రెండు నెలల్లో 69 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి 72.70 డాలర్లు తాకడం ఇదే తొలిసారి. గడిచిన ఏడాదికాలంలో పది గ్రాముల బంగారం ధర రూ.77,730 నుంచి 79.10 శాతం పెరిగి రూ.1,39,216కు చేరింది. బంగారం కూడా నూతన గరిష్ట స్థాయిలకు చేరినా ఏడాదిలో వెండి పరుగుతో పోలిస్తే వెనుకపడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లైతే ఈ ఏడాది కాలంలో కేవలం 10 శాతం రాబడులను మాత్రమే అందించాయి.

పారిశ్రామికంగా ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్‌ విద్యుత్, సెమీకండక్టర్స్, డేటా సెంటర్స్, రక్షణ పరికరాలు వంటి అనేక విభాగాల్లో వెండిని వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న సిల్వర్‌లో 60 శాతం పారిశ్రామిక అవసరాలకే వినియోగిస్తారంటే వెండి ఎంత కీలకపాత్ర పోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2024లో సుమారు రెండు కోట్ల కేజీల వెండిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించినట్లు అంచనా. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఏఐ, సెమీ కండక్టర్స్‌ వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందుతుండడంతో సిల్వర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఉత్పత్తి కంటే పారిశ్రామిక డిమాండ్‌ పెరుగుతుండటం వెండి ర్యాలీకి ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు యుద్ధ భయాలు, అమెరికా టారిఫ్‌ బెదిరింపులతో పెట్టుబడులను బంగారం, వెండి, ప్లాటినం, కాపర్‌ వంటి కీలక లోహాల్లోకి తరలిస్తుండటంతో అన్నీ రికార్డు స్థాయి ధరలకు చేరుకున్నాయని, ఒడిదుడుకులు అధికంగా ఉండే వెండి మరింత ఎక్కువగా పెరిగిందంటున్నారు. దీనికితోడు మన దేశీయ కరెన్సీ ఈ ఏడాదిలో 8 శాతంపైగా పతనం కావడం మరింత కలిసొచ్చిందంటున్నారు.

కేవలం వారం తిరగకముందే కిలో సిల్వర్ రేటు ఏకంగా 48 వేల రూపాయల మేర పెరగడం ఒక రికార్డుగా నిలిచింది. పారిశ్రామిక అవసరాలకు వెండి వినియోగం పెరగడం మరియు గ్లోబల్ మార్కెట్‌లో సరఫరా లోపాలు ఉండటం వల్ల ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పండుగలు లేదా పెళ్లిళ్ల సీజన్‌లో పెరిగే ధరలు, ఈసారి అంతకు మించి అదుపులేకుండా పెరుగుతున్నాయి. మరోవైపు, వెండితో పోటీపడుతూ బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ధరల పెరుగుదల ఈ విధంగానే కొనసాగితే మున్ముందు మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

గత ఇరవై ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మతిపోతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000వ సంవత్సరంలో రూ.4,400 ఉండగా.. 2005 నాటికి రూ.7 వేలకు పెరిగింది. 2010లో తులం బంగారం ధర రూ.18,500గా ఉండగా.. 2015 నాటికి రూ.26,300కి చేరుకుంది. 2020లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,600గా ఉంది.ప్రస్తుతం తులం బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరువైంది. పసిడి ప్రతి ఐదేళ్లకు సగటున 50 నుంచి 60 శాతం దాకా పెరుగుతూ చ్చింది. ఏడాదికి కనీసం 15 శాతం రేటు పెరుగుతోంది. నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగినా.. తులం బంగారం రూ.లక్షకు చేరడానికి మరో పదేళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తప్పని నిరూపిస్తూ.. ఐదేళ్లు తిరక్కుండానే.. పుత్తడి లక్షన్నర రూపాయలకు చేరువై.. ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలు కొడుతోంది.

మన దగ్గర పెట్టుబడి మార్గాల విషయానికొస్తే బంగారంతో పాటు భూమి కూడా ఉంది. ఎక్కువ మంది భారతీయుల దృష్టిలో ఉన్న పెట్టుబడి ఆప్షన్లు ఇవే. ఇక్కడ భూమిపై పెట్టుబడి బెస్ట్ ఆప్షన్ అయినా.. చిన్న మొత్తాలతో కొనుగోలుకు వెసులుబాటు ఉండటం సామాన్యుల్లో కనకాన్ని కింగ్‌ని చేస్తోంది. పాతికేళ్ల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.4 వేలు. అదే ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరువైంది. అంటే 2000వ సంవత్సరంలో 5 తులాలు బంగారం కొనుంటే.. ఇప్పుడు దాని విలువ ఏడున్నర లక్షల రూపాయల పైమాటే. రీసెంట్ గా ఈక్విటీల్ని డామినేట్ చేసిన కనకం.. భవిష్యత్తులో ఇంకే రీతిలో పరుగులు పెడుతుందనేది ఊహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు.

ఇక సుదీర్ఘకాలంగా బంగారంతో పోలిస్తే చిన్నచూపు చూస్తున్న వెండి.. తారాజువ్వలా దూసుకుతోంది. పసిడితో పోలిస్తే దాదాపుగా రెట్టింపు వేగంతో పరుగులు తీస్తోంది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు కూడా కాస్త ఆగి.. వెండి వైపు చూసే స్థితి కనిపిస్తోంది. మొదట్నుంచీ ధనికులు భూమిపై, మధ్యతరగతిపై బంగారంపై పెట్టుబడి పెడుతూ వచ్చారు. దీనికి ప్రధాన కారణం ఆదాయ స్థితిగతులే అనే వేరే చెప్పక్కర్లేదు. తులం బంగారానికి ఈరోజుకీ లక్షన్నర రూపాయలు సరిపోతాయి. అదే కేజీ వెండి కొంటే రెండున్నర లక్షల రూపాయలు చాలు. కానీ భూమి కొనాలంటే మాత్రం కోటి రూపాయలు కావాలి. అంత డబ్బు ఒకేసారి మధ్యతరగతి వారి దగ్గర అందుబాటులో ఉండే అవకాశమే లేదు. అందుకే మిడిల్ క్లాస్ లో ఇప్పుడు గోల్డ్ రష్ నడుస్తోంది. మొన్నటిదాకా భూమిని బంగారంగా భావించిన మధ్యతరగతి ఇప్పుడు నేరుగా బంగారంపైనే పెట్టుబడి పెట్టి.. కోటీశ్వరులు కావచ్చనే అంచనాతో.. తమ పెట్టుబడి ప్రణాళికలు మార్చుకుంటున్నారు. అంతకు మించి వెండిపై పెట్టుబడి పెట్టి.. దండిగా లాభాలు ఆర్జించే దారుులు వెతుకుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంక్‌ల కంటే ముందు ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ షో డేటా ప్రకారం..గత నవంబర్‌లో 37 నెలల తర్వాత చైనా సెంట్రల్ బ్యాంక్ తన విదేశీ మారక నిల్వల కోసం బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి మార్చి వరకు చైనా సెంట్రల్ బ్యాంక్ 120 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. చైనా సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వ 2068 టన్నులకు పెరిగింది. సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు కేవలం చైనా సెంట్రల్ బ్యాంక్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలోని చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంకుల మొత్తం కొనుగోలు 126 టన్నులుగా నమోదైంది. అలాగే ఇందులో చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రధాన వాటాను కలిగి ఉంది. 2023కి ముందు 2022 సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల కోసం బంగారం కొనుగోలును పెంచాయి. సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో 1136 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఇది 2021లో కొనుగోలు చేసిన దానికంటే 152 శాతం ఎక్కువ. 55 ఏళ్లలో సెంట్రల్ బ్యాంకులు చేసిన అతిపెద్ద కొనుగోలుగా చెప్పవచ్చు.

ద్రవ్యోల్బణంతో పాటు కరెన్సీ విలువ పతనాన్ని తట్టుకొని నిలబడగలిగే ఏకైన సాధనం బంగారం. ప్రభుత్వాల్లో అనిశ్చితి, ఈక్విటీ మార్కెట్లలో కుదుపులు వంటి సందర్భాల్లో పెట్టుబడులు బంగారం వైపు మళ్లుతుంటాయి. అంతేకాదు… ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే ఏకైన సాధనం బంగారం. అందుకే బంగారానికి అంత డిమాండ్‌. ఇక బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా శ్రేయస్కరం అనేది మార్కెట్‌ నిపుణుల విశ్లేషణ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్టు ప్రకారం భారత దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు 24 వేల టన్నులు. దీని విలువ 58 లక్షల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ. భారత్‌లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28 శాతం ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో 28 శాతం భారత్‌లోనే ఉంది. బంగారం గురించి, దాని విలువ గురించి అందరికీ అవగాహన ఉంది. కానీ ఈ స్థాయిలో వెండి పరుగును మాత్రం నిపుణులు కూడా ఊహించలేదు. పైగా తేరుకుని అంచనాలు వేద్దామన్నా.. ఏ ఊహకూ అందని విధంగా వెండి దూసుకుపోతోంది. ఇప్పటివరకూ బంగారాని కంటే వెనుకబడ్డ వెండి.. ఇన్నాళ్ల కసి తీర్చుకునేలా నాన్‌స్టాప్‌గా వెలుగులీనుతోంది.

వెండిలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ ఏడాది కలిసొచ్చింది. కాకపోతే, ఈ వెండి బ్రేకవుట్ దేనికి సంకేతం అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఓ వైపు ప్రపంచం మొత్తం ఎలక్ట్రిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే, మరోవైపు సప్లై తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వెండి కొత్త యుగంలోకి ప్రవేశించింది అని చెప్పుకోక తప్పదు. ఇది విలువైన లోహంగా మారబోతోందని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం, వెండిని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమా అని ఆలోచిస్తున్న వారికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆభరణాల కోసం అయితే ధరలు తగ్గే వరకు వేచి చూడకుండా, అవసరమైనప్పుడు కొనుగోలు చేయడం లేదా విడతల వారీగా కొనడం మంచిది. పెట్టుబడి కోసం అయితే, గోల్డ్ ఈటీఎఫ్, సావరీన్ గోల్డ్ బాండ్ల ద్వారా పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.

కోటక్ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ రిపోర్టుల ప్రకారం, 2026లో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా కొనసాగుతుంది. పోర్ట్‌ఫోలియోలో 70% బంగారం, 30% వెండి ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక నిపుణుల ప్రకారం.. బంగారం ధరలకు ఫెడ్ రేటు కోతలు, కేంద్ర బ్యాంకుల బలమైన కొనుగోళ్లు, ETFలలో పెట్టుబడుల ప్రవాహం ప్రధాన ఆధారాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు, వెండికి పారిశ్రామిక రంగాల నుంచి బలమైన డిమాండ్, సరఫరా లోటు కలిసి ధరలను పైకి నడిపిస్తున్నాయి. ముందు రోజుల్లో ధరలు హెచ్చుతగ్గులతో కొనసాగినా, ఫెడ్ విధానాలు, డాలర్ కదలికలు, భౌగోళిక రాజకీయ పరిణామాలే బంగారం-వెండి మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

2025 సంవత్సరం రెండు విలువైన లోహాలకు బలమైన సంవత్సరం. బంగారం, వెండి ధరలు అపూర్వమైన వృద్ధిని సాధించాయి. రెండిటి ధర ఏడాది పొడవునా పెరుగుతూనే ఉంది, ఇది ఇప్పటివరకు అత్యధిక రాబడిని అందించిన సంవత్సరంగా నిలిచింది. పెట్టుబడి విషయానికి వస్తే, దీర్ఘకాలిక, స్థిరమైన పోర్ట్‌ఫోలియోకు బంగారం ఉత్తమ ఎంపిక అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా SIPల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచి రాబడిని సంపాదించడానికి ఒక అద్భుతమైన మార్గం. అయితే, వెండి మార్కెట్ అవకాశాల ఆధారంగా పెట్టుబడి వ్యూహంలో సరిపోకపోతే, ఒకేసారి కాకుండా కాలక్రమేణా క్రమంగా చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టాలి. ధరల హెచ్చుతగ్గులను నిర్వహించడానికి పెట్టుబడిదారులు SIPల ద్వారా క్రమంగా కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు, అయితే వ్యూహాత్మక ఏకమొత్త పెట్టుబడులు అనుకూలమైన మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, SIP ద్వారా పెట్టుబడి పెట్టడం ఉత్తమం. వెండికి పారిశ్రామిక డిమాండ్ కొనసాగుతుంది, ఇది నిర్మాణాత్మక అసమతుల్యతను సృష్టిస్తుంది. దీని అర్థం వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయి. వెండిలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. వచ్చే ఏడాది కూడా ఈ రెండు లోహాల పరుగుకు బ్రేక్‌ పడకపోవచ్చని మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. ఎలా చూసుకున్నా తులం బంగారం రూ. 3లక్షలకు, కిలో వెండి రూ.5 లక్షలకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

అమెరికాలో వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయనే అంచనాలు, డాలర్‌తో క్షీణిస్తున్న రూపాయి మారకం రేటు, ఆరు ప్రధాన కరెన్సీలతో కొనసాగుతున్న డాలర్‌ మారకం రేటు పతనం, కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు. సురక్షిత పెట్టుబడిగా ఈ రెండు లోహాలకు ఉన్న పేరు, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం, డిమాండ్‌కు తగ్గట్టుగా లేని ఉత్పత్త.. పసిడి, వెండిని ఆకర్షణీయ పెట్టుబడి సాధనాలుగా మారుస్తున్నాయని చెప్పక తప్పదు. ఈ ఏడాది బంగారం, వెండి అందించినంత భారీ స్థాయి లో మరే ఇతర పెట్టుబడులు మదుపరులకు లాభాలు పంచలేదు. అందుబాటులో ఉన్న ఏ పెట్టుబడి సాధనం కన్నా.. పసిడి, వెండిపై పెట్టుబడులు సురక్షితమే కాదు.. అత్యంత లాభాలు కూడా ఇచ్చాయి. మదుపుపై పెద్దగా అవగాహన లేని వాళ్లు కూడా చాలా తేలికగా పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉండటం.. బంగారం, వెండి మార్కెట్ పై మరింత క్రేజ్ పెంచుతోంది.

డబ్బులు లేకపోయినా.. ఉన్నంతలోనే.. అది ఒక గ్రాము అయినా సరే బంగారమే కొనుక్కోవాలనుకుంటారు సామాన్యులు. అందులోనూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారానికి ప్రత్యామ్నాయమే లేదు. పెట్టుబడులు పెట్టడానికి స్టాక్‌మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌, బాండ్లు ఉన్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్లు ఎప్పుడు కుప్పకూలుతాయో తెలీదు. బాండ్లలో పెడితే ఎక్కువ రిటర్న్స్‌ రావు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టాలంటే.. చిన్న మొత్తాలు కుదరదు. అందరి దగ్గరా పెద్దమొత్తాలు ఉండవు. ఎక్కడ పెట్టుబడి పెట్టినా.. అవసరానికి వెంటనే చేతికి డబ్బులొస్తాయన్న గ్యారెంటీ లేదు. సో, ఏరకంగా చూసినా బంగారమే సురక్షితం. అందుకే, బంగారానికి అంత డిమాండ్. బంగారం సురక్షితమే అనే సంగతి ఎప్పుడో తెలిసినా.. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు దాని విలువ మరింత పెరుగుతుంది. అంతా బాగున్నప్పుడు వంద నోటుకు ఉండే విలువకు.. డబ్బులకు కటకట ఉన్నప్పుడు దాని విలువకూ భౌతికంగా ఏమీ తేడా ఉండదు. కానీ మనపై చూపే సానుకూల ప్రభావంలో చాలా తేడా ఉంటుంది. కష్టకాలంలో బంగారం తోడుంటే.. ప్రపంచాన్ని జయించవచ్చనే నమ్మకం మనతో ఉన్నట్టే అంటారు ఆర్థికవేత్తలు. పైగా ఇప్పుడు కొనకపోతే ఇక దొరకదేమో అనే భావన కూడా పసిడికి డిమాండ్ పెంచేస్తుంది. అటు పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులన్నీ ఒక్కసారిగా బంగారం వైపు మళ్లించేస్తారు. కానీ మొన్నటిదాకా బంగారం అత్యంత లాభదాయకం కంటే ఎంతమందికి అర్ధమైందో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం బంగారం, వెండి విలువ, దానిపై పెట్టుబడి పెడితే వచ్చే ప్రతిఫలం గురించి తెలియని వారు లేరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంతగా సామాన్యుడికి కూడా బాగా అర్థమయ్యేలా, మనసుకు పట్టేలా ఈ రెండు లోహాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అంతేకాదు స్టాక్‌మార్కెట్లు, ఈక్విటీల్ని కూడా దాటేసి.. ఆ రంగంలో ఉన్న పెట్టుబడిదారుల్ని కూడా తమవైపు ఆకర్షిస్తున్నాయి. ఏతావాతా కేంద్ర బ్యాంకులు, సాధారణ మధ్యతరగతి, కొత్తగా మార్కెట్‌ పెట్టుబడిదారులు.. ఇలా ముప్పేట దాడితో.. బంగారం, వెండికి డిమాండ్ తారస్థాయికి చేరింది. దీనికి పారిశ్రామిక డిమాండ్ కూడా తోడై వెండి ఉజ్వలంగా వెలుగులీనుతోంది. ఈ డ్రీమ్ రన్ ఇలాగే కొనసాగటానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version