Story Board: పాతికేళ్ల తెలుగు రాజకీయాలు తీవ్ర మార్పులకు లోనయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పోటీ నుంచి తెలంగాణ ఏర్పాటు , ఆపై ఏపీ, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వరకు పరిణామక్రమం సాగింది. ఉద్యమాలు, సంక్షేమ పథకాలు, డిజిటల్ ప్రచారం, మరియు రాజకీయ స్థిరత్వ చర్చలు ఈ కాలంలో కీలకంగా మారాయి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2014 తెలంగాణ ఏర్పాటు వరకు ఉద్యమ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య, తెలంగాణలో BRS, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. జనసేన వంటి పార్టీలు కొత్త సమీకరణాలకు తెరలేపాయి. పాలకులు సంక్షేమానికి, అభివృద్ధి నినాదాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరగడం, ఓటర్లను ఆకర్షించడానికి సరికొత్త వ్యూహాలు, కుల సమీకరణాలు ఈ పాతికేళ్ల రాజకీయాలను శాసించాయి. 2000 నుంచి 2025 వరకు, రాజకీయాలు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా సామాజిక, ఆర్థికాంశాలను కూడా ప్రభావితం చేశాయి. ఈ కాలంలో సామాజిక వర్గాల ప్రభావం, సామాజిక మాధ్యమాల పాత్ర, కార్పొరేట్ విద్యావ్యవస్థ వల్ల యువత రాజకీయ దృక్పథంలోనూ మార్పులు వచ్చాయి.
తెలుగు రాజకీయాల్లో గత పాతికేళ్లు ఎన్నో మరపురాని జ్ఞాపకాలు మిగిల్చాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తెలుగు రాజకీయం ప్రముఖ పాత్ర పోషించింది. ఈ పాతికేళ్లలో పదేళ్లు యూపీయే, పదేళ్లు ఎన్డీఏ ప్రభుత్వాలు కేంద్రంలో కొలువుదీరాయి. ప్రతి సర్కారులోనూ తెలుగు రాష్ట్రాల నేతలే కీలక పాత్ర పోషించారు. అంతకుముందు సంకీర్ణ సర్కారులోనూ తెలుగు రాష్ట్రాల నేతలదే ప్రముఖ పాత్ర. మొత్తంగా ఈ పాతికేళ్లలో తెలుగు రాజకీయం రాష్ట్రస్థాయిలోనే కాకుండా.. జాతీయ స్థాయిలో కూడా తన మార్క్ చూపించింది. అసలీ శతాబ్దం మొదలయ్యేనాటికే టీడీపీ కీలక భాగస్వామిగా ఎన్డీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ తర్వాత పదేళ్ల పాటు యూపీయే రాజ్యమేలినా.. ఆ సర్కారుకు తెలుగు రాష్ట్రాల నుంచి గెలిచిన ఎంపీలే ఆయువుపట్టుగా నిలిచారు. పదేళ్ల యూపీయే పాలన తర్వాత మళ్లీ టీడీపీ భాగస్వామిగా ఎన్డీఏ సర్కారు ఢిల్లీలో గద్దెనెక్కింది. ఇప్పటికీ అదే సర్కారు కొనసాగుతోంది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా.. తర్వాత రెండు రాష్ట్రాలైనా.. ఎంపీల సంఖ్యతో సంబంధం లేకుండా.. జాతీయ రాజకీయాల్లో తెలుగు ప్రభావం కనిపిస్తూనే ఉంది. జాతీయ స్థాయిలో రెండు ప్రధాన కూటములకు తెలుగు రాష్ట్రాలు కీలకం కావడంతో.. ఎవరూ వీటి పాత్రను విస్మరించలేని స్థితి ఉంది. అలా మునుపటితో పోలిస్తే.. దేశ రాజకీయాల్లో తెలుగు రాజకీయ ప్రభావం బాగా పెరిగింది. అంతేకాదు మిగతా రాష్ట్రాల్లోని పార్టీలు కూడా తెలుగు రాజకీయాన్ని అనుసరించడం.. కొండొకచో అనుకరించడం కూడా మొదలైంది. ఇక తెలుగు రాజకీయాల్లో జరిగే ప్రతి కీలక పరిణామం.. ఎంతోకొంత జాతీయ రాజకీయాన్నీ ప్రభావితం చేసింది.
2000ల ప్రారంభంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర, హైటెక్ పాలనపై దృష్టి పెట్టారు. 2014, 2024 లో ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చి అమరావతి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు. 2004-2009 మధ్య వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి భారీ సంక్షేమ పథకాలు రాజకీయాన్ని మార్చాయి.దేశ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబునాయుడు పాత్ర హైలెట్ అవుతోంది. సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్‌గా చంద్రబాబు వేసిన బాటను.. మిగతా నేతలు కూడా అనుసరిస్తున్నారు. సమయం, సందర్భం కలిసొచ్చిన ప్రతిసారీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నిసార్లు అవకాశాన్ని సృష్టించుకుని మరీ ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అల్టిమేట్‌గా ఇంకెంతమాత్రం తెలుగు రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరగదని.. జాతీయ రాజకీయాలే.. తెలుగుప్రజలను పరిగణనలోకి తీసుకోక తప్పదనే అనివార్యతను కల్పించాయి ఇక్కడి పార్టీలు. తెలుగునాట ప్రతి పార్టీకి సొంత అజెండా ఉన్నా.. వాటిల్లో ఏకసూత్రంగా జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేయాలనే విషయం మాత్రం అంతర్లీనంగా కనిపిస్తోంది. గత శతాబ్దంలో ఢిల్లీ్లో అస్తిత్వం కోసం పోరాటం చేసిన తెలుగు పార్టీలు.. ఆ పోరాట ఫలితంగా కొత్త శతాబ్దిలో హస్తినలో పట్టు సాధించగలిగాయి. గత పాతికేళ్ల ప్రయాణంలో.. ఆ పట్టును మరింత పటిష్ఠం చేసుకుని.. తెలుగు పార్టీల పాత్ర లేని జాతీయ రాజకీయం కుదరదనే పరిస్థితి తెచ్చారు.
పార్లమెంట్‌లోనూ తెలుగు రాష్ట్రాల ప్రస్తావన క్రమంగా పెరుగుతోంది. దేశంలో కీలకాంశాలపై తెలుగు నేతల అభిప్రాయాలేంటో తెలుసుకోవటానికి జాతీయ మీడియా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మొత్తంగా హస్తినలో తెలుగు మాటకు ఎక్కువ మన్నన దక్కుతోంది. ప్రధానమంత్రులు స్వయంగా కొన్ని విషయాల్లో తెలుగు నేతల్ని పనిగట్టుకుని సంప్రదిస్తున్నారు. ఎప్పటికప్పుడు దేశ భవిష్యత్తుకు సంబంధించి కీలక సూచనలు చేయడంలోనూ మనోళ్లు ముందుంటున్నారు. అలా కేవలం ఎంపీల సంఖ్యతోనే కాకుండా.. ఉదాత్తమైన ఆలోచనలతోనూ కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చని రుజువు చేస్తున్నారు. తెలుగు నేతలు జాతీయ రాజకీయాల్లో చాలా విలక్షణంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పట్టుబడుతూనే.. మరోవైపు దేశ సమగ్రత విషయంలో రాజీలేని వైఖరితో ఇతర రాష్ట్రాలకూ నాయకత్వ లక్షణాల విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో రాజకీయానికీ.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయానికి ఉండే తేడా ఏంటో మన నేతలు గత పాతికేళ్లలో చాలా ప్రభావశీలంగా దేశానికి చూపగలిగారు. అలా మన ఓటర్ల లోతైన ఆలోచనాసరళిని కూడా ఢిల్లీకి పరిచయం చేశారు. దీంతో ఉత్తరాది మాదిరిగా ఊకదంపుడు ప్రచారం ఇక్కడ నడవదని గ్రహించిన జాతీయ నేతలు కూడా.. ఇక్కడకు వచ్చేసరికి ప్రత్యేక శ్రద్ధతో ప్రచారశైలి మార్చుకుంటున్నారు. ఒకప్పుడు జాతీయ నేతలు తెలుగు రాష్ట్రాలకు రావడమే ఎక్కువ అన్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు జాతీయ నేతలైనా తెలుగు రాష్ట్రాలకు రాక తప్పని స్థితి వచ్చేసింది. అలాంటి అనివార్యతను తెలుగు రాజకీయమే కల్పించింది. అప్పటిదాకా ఎంపీల సంఖ్య చూసుకుని.. తెలుగు రాష్ట్రాల్ని తక్కువ అంచనా వేసిన జాతీయ నేతలకు.. ఇక్కడకు తరచుగా వస్తుండటంతో.. తెలుగు ఓటర్ల ప్రభావం బాగా అర్థమైంది. తెలుగు ఓటర్ల ప్రభావం కూడా ఓ స్థాయి వరకు దేశవ్యాప్తంగా ఉంటుందనే సంగతి అవగాహనకు వచ్చింది. ఒక్కసారి ఈ రాజకీయ కిటుకు అర్థమయ్యాక.. తెలుగు నాట జాతీయ నేతల పర్యటనలు పెరిగిపోయాయి. కేవలం ఎన్నికల సమయంలో వచ్చే అలవాటు మానుకుని.. సందర్భం కుదిరిన ప్రతిసారీ.. అవసరమైతే అవకాశం సృష్టించుకుని మరీ ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా తెలుగు నాట తరచుగా పర్యటిస్తున్నారు. తద్వారా తెలుగు ఓటర్ల ఆదరణ తమపై ఉండాలని కోరుకుంటున్నారు.
ఈ శతాబ్ది మొదలైన ఏడాదికే తెలుగునాట టీఆర్ఎస్ పేరుతో కొత్తా పార్టీ పురుడు పోసుకుంది. ప్రత్యేక తెలంగాణ నినాదం ఎత్తుకున్న కేసీఆర్.. కొత్త పార్టీ పెట్టి కదం తొక్కారు. ఆరు దశాబ్దాల ఆకాంక్షను మరోసారి తట్టిలేపి.. భావోద్వేగాలు రగిలించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ సభలతో.. అందరి దృష్టినీ ఆకాంక్షించారు. మఖలో పుట్టి పబ్బలో పోయే పార్టీగా విమర్శలు వచ్చినా.. వాటిని దీటుగా ఎదుర్కుని నిలబడ్డారు. చివరకు తెలుగునాట ఏ పార్టీ అయినా.. తెలంగాణలో ఓట్లు కావాలంటే.. తమతో పొత్తు పెట్టుకోక తప్పని స్థితి కల్పించారు. అప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్.. అప్పట్నుంచి తెలుగు రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయంపాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చింది. అంతకుముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు టీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.
తెలుగునాట పదేళ్లు విపక్షంలో ఉన్న తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పథకాలతో జోరు చూపించి.. రైతు అనుకూల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఈ సర్కారు హవా సాగుతుండగానే.. 2008లో సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. తిరుపతిలో అట్టహాసంగా ఆవిర్భవించిన పీఆర్పీ.. వెనువెంటనే జరిగిన 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగింది. అయితే చిరంజీవి సీఎం అవుతారన్న అంచనాలు తలకిందులయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లుంటే.. పీఆర్పీ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. దీంతో కొన్నాళ్ల పాటు పీఆర్పీని స్తబ్ధత ఆవరించింది. వైఎస్సార్ నేతృత్వంలో 2009 ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అయితే రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని నెలలకే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం.. తెలుగు ప్రజలకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. కేసీఆర్ నిరాహారదీక్షతో రాష్ట్రం అట్టుడికింది. చివరకు కేంద్రం తెలంగాణ ఇస్తామనే ప్రకటన చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు పీఆర్పీకి కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో 2011లో పీఆర్పీ అధికారికంగా కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆ తర్వాత చిరంజీవి కేంద్రమంత్రి అయ్యారు.
పీఆర్పీ విలీనానికి కొద్ది నెలల ముందే తెలుగునాట మరో ప్రాంతీయ పార్టీ పుట్టింది. వైఎస్సార్ కుమారుడు జగన్ కాంగ్రెస్ వైఖరి మీద అసంతృప్తితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో జగన్ పార్టీ సత్తా చాటింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్ లో పాసై.. అపాయింటెడ్ డేట్ వచ్చింది. ఈ సమయంలోనే సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా.. ఎన్డీఏ కూటమికి మద్దతివ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా 2014లో ఎన్నికలు వచ్చేశాయి. ఈ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగినా.. విభజనను చూచాయగా ప్రతిబింబిస్తూ ప్రాంతాల వారీగా ఆయా పార్టీల ఆధిపత్యం చూపాయి. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లతో అధికార పగ్గాలు చేపట్టగా.. విభజిత ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. ఇక్కడ టీడీపీ, బీజేపీ భాగస్వామ్య పార్టీలుగా అధికారంలో పాలు పంచుకున్నాయి.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజకీయం కాస్త మారింది. 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మరింతగా బలం పుంజుకుని.. రెండోసారి అధికారంలోకి వచ్చింది. అదే 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ నేతృత్వంలో వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మూడేళ్లకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుంది. పేరు మారిన తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఓటమి ఎదురైంది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో రేవంత్ నేతృత్వంలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ఏపీలో 2024లో జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు భాగస్వాములుగా ఏర్పడ్డ కూటమి విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. తద్వారా పార్టీ స్థాపించిన దశాబ్దానికి అధికారంలో పాలు పంచుకోగలిగింది జనసేన. ఓవరాల్‌గా ఈ పాతికేళ్లలో తెలుగునాట పుట్టిన ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్, వైసీపీ సొంతంగా అధికారం దక్కించుకున్నాయి. జనసేన కూటమి భాగస్వామిగా అధికారంలో పాలు పంచుకుంది. ఒక్క పీఆర్పీ మాత్రమే అధికారం దక్కకుండా కాంగ్రెస్ లో విలీనమైంది. కానీ విలీనం తర్వాత అధికార పార్టీలో భాగంగా పరోక్షంగా అధికారం అనుభవించింది.
గత పాతికేళ్ల చరిత్రను చూస్తే.. మరే రాష్ట్రంలోనూ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ప్రాంతీయ పార్టీలు పుట్టిన, విజయవంతమైన దాఖలాలు కనిపించవు. తద్వారా తమకు రాజకీయ చైతన్యం ఎక్కువని తెలుగు ప్రజలు మరోసారి నిరూపించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగునాట పుట్టిన ప్రతి ప్రాంతీయ పార్టీ తనదైన శైలిలో రాజకీయం చేసింది. ఎప్పటికప్పుడు కొత్త నేతల్ని తయారుచేసింది. అప్పటివరకూ ఎక్కువ అవకాశాలు రాని వర్గాలను అక్కున చేర్చుకుంది. తద్వారా సామాజిక ఉద్యమాలకు, అన్ని వర్గాల ప్రజల డిమాండ్లకూ కొత్త ఊపిరి పోసింది. ప్రతి పార్టీ రాష్ట్ర స్థాయిలో రాజకీయం చేస్తూనే.. జాతీయ స్థాయిలోనూ కీలకాంశాలపై అధ్యయనం చేస్తూ.. తమ అభిప్రాయాన్ని చాటిచెప్పింది. ఎవరి శక్తి మేర వారు రాజకీయం చేసి.. మరిన్ని పార్టీలకు స్ఫూర్తి నిచ్చారు. అటు ప్రజలు కూడా ప్రతి పార్టీని ఎంతోకొంత ఆదరించి.. ఎప్పుడూ కొత్తనీటికి అవకాశం ఇస్తామని చాటిచెప్పారు. దేశ రాజకీయాల్లో తెలుగు రాజకీయం వేరయా అని ఇక్కడి పార్టీలు మరోసారి నిరూపించాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.
రాజకీయాల్లో పాతికేళ్లు తక్కువ సమయం ఏం కాదు. ఈ పాతికేళ్లలో తరం మారుతుంది. తెలుగు రాజకీయాల్లోనూ అదే జరిగింది. గత పాతికేళ్లలో ప్రాంతీయ పార్టీల కీలక నేతల వారసులు, వారసురాళ్లు రంగప్రవేశం చేశారు. తమ రాజకీయ వారసత్వం నిలబెట్టుకున్నారు. మొదటిగా దివంగత సీఎం వైఎస్ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన జగన్.. వైసీపీ ఏర్పాటుతో.. ఏపీ సీఎం అయ్యి సంక్షేమ పాలనను కొత్త పుంతలు తొక్కించారు. ఆ తర్వాత కేసీఆర్ వారసుడిగా కేటీఆర్.. టీఆర్ఎస్ సర్కారులో మంత్రిగా తనదైన పనితీరు కనబరిచారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌కు సింగిల్ మెజార్టీ సాధించటం.. కేటీఆర్ కెరీర్లో ఓ మైలురాయిగా చెబుతారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు వారసుడిగా తెరపైకి వచ్చిన లోకేష్.. ఏపీ మంత్రిగా తన మార్క్ పనితీరు చూపించారు. మరోవైపు పార్టీ పరంగానూ మెరుగైన పనితీరుతో కార్యకర్తల మెప్పు పొందారు. తెలుగునాట వారసులు తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే.. వారసురాళ్లు మాత్రం ఝలక్ ఇచ్చారనే చెప్పాలి. ఏపీలో వైఎస్ కూతురు షర్మిల.. తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత తమ సోదరులపై తిరుగుబాటు చేశారు. షర్మిల వైఎస్సార్టీపీ స్థాపించి తెలంగాణలో అదృష్టాన్ని పరీక్షించుకుని విఫలమయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఏపీ పీసీసీ చీఫ్‌గా సెటిలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడు జగన్‌ను అడుగడుగునా టార్గెట్ చేశారు. తెలంగాణలో లిక్కర్ కేసులో జైలుకెళ్లిన కవిత బెయిల్ పై వచ్చిన దగ్గర్నుంచీ సొంత పార్టీలో రాజకీయ ఉక్కపోతకు గురయ్యారు. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడగానే.. అదను చూసి ధిక్కారస్వరం వినిపించారు. పనిలోపనిగా సోదరుడు కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ప్రముఖ నేతల వారసురాళ్లు.. సోదరులపై తిరుగుబావుటా ఎగరేయడం.. తెలుగు రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించింది.
గత పాతికేళ్లలో తెలుగునాట జరిగిన మరో కీలక పరిణామం జైలు కెళ్లొచ్చిన నేతలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి సీఎంలు కావడం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు నేతల విషయంలో ఈ సెంటిమెంట్ నిజమైంది. దీంతో మరికొందరు నేతలు కూడా సీఎం కావడం కోసం జైలుకి వెళ్లటానికి సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొదటిగా జగన్ 17 నెలల జైలు జీవితం తర్వాత ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా జైలుజీవితం తర్వాతే ఎన్నికల్లో గెలిచి తెలంగాణ సీఎం అయ్యారు. వీరి బాటలోనే జైలుజీవితం గడిపిన చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడంతో.. తెలుగునాట జైలు.. పవర్ సెంటిమెంట్ బాగా బలపడింది. వరుసగా ముగ్గురు నేతల విషయంలో ఒకే రకమైన సీక్వెన్స్ నిజం కావడం కాకతాళీయమని చెబుతున్నారు. అలాగని ప్రతి నేత జైలుకెళ్లగానే సీఎం అవుతారనే గ్యారంటీ లేదనే వాదన లేకపోలేదు. జైలుకెళ్లటానికి దారితీసిన పరిస్థితులు, నేతల స్థాయి, ఆ నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, వారి ఛరిష్మా.. అన్నీ కలగలిస్తేనే అధికారం సాధ్యమౌతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు నాట మరికొన్ని చిన్నాచితకా పార్టీలు గత పాతికేళ్లలో పురుడు పోసుకున్నాయి. వాటిలోనూ కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంకొన్ని ఉనికి కోసం పాట్లుపడుతున్నాయి. ఏతావాతా ఇవేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయాల్లో తమ ప్రభావం చూపించలేకపోయాయి. ప్రజలు కూడా చెప్పుకోదగ్గ పార్టీలను మాత్రమే ఆదరించి.. మిగతావాటికి కర్రు కాల్చి వాతపెట్టడం ద్వారా.. తమ రాజకీయ పరిణతిని చాటుకున్నారు. తెలుగు ప్రజల విషయంలో చాన్నాళ్లుగా ఓ రాజకీయ అభిప్రాయం ఉంది. అదేమిటంటే ఎన్నికల్లో ఓటర్ల తీర్పును బట్టి.. ఏ పార్టీకి భవిష్యత్తు ఉందో.. ఏ పార్టీకి లేదో ఇట్టే చెప్పేయొచ్చనేది రాజకీయ పండితుల మాట. ఆ మాటను తెలుగు ప్రజలు ఎప్పటికప్పుుడు నిజం చేస్తూనే వచ్చారు. రాజకీయంగా ధర్మసందేహం ఎదురైన ప్రతిసారీ ఏ పార్టీకైనా.. వాటి అధినేతలకైనా ప్రజలే దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఒక్కసారి ఎన్నికల్లో ప్రజాతీర్పును నిజాయతీగా అధ్యయనం చేసిన ఏ పార్టీకైనా తమ తక్షణ కర్తవ్యం బోధపడుతుందనటంలో సందేహం లేదు. కొన్నిసార్లు జాతీయ పార్టీలకు కూడా రాజకీయ మార్గదర్శనం చేసిన చరిత్ర తెలుగు ప్రజలకు ఉంది. కొత్త శతాబ్దంలో తొలి పాతికేళ్లను తెలుగు రాజకీయం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది. తర్వాతి పాతికేళ్లకు బలమైన పునాదులు వేసుకుంది. మునుపటిలా పట్టు చేజిక్కించుకుని వదిలేసే ధోరణికి స్వస్తి పలికింది. ఒక్కసారి తెలుగు నేతలకు పట్టు చిక్కిందంటే.. ఇక అంతే అనే పోకడ వచ్చేసింది. మొదట్నుంచీ పరిణతి చెందిన తెలుగు రాజకీయం.. గత పాతికేళ్లలో ఇంకా పదును తేలింది. గతంలో కేంద్రంలో అనుకూల సర్కారు కోసం చూసేవాళ్లు. ఇప్పుడు కేంద్రంలో ఎవరున్నా.. మన పనులు చేసుకోవడమెలా అనే విషయంలో పట్టు సాధించారు. చివరకు ప్రత్యర్థి పార్టీ కేంద్రంలో ఉన్నా.. రాజకీయం రాజకీయమే.. ప్రభుత్వం ప్రభుత్వమే అనే పరిణతి బాగా కనిపిస్తోంది. పనిగట్టుకుని కేంద్రంతో ఢీ కొట్టకుండా.. మన వాదనలు బలంగా వినిపించి.. జాతీయ నేతలు కాదనలేని స్థితిని కల్పించే లౌక్యం ఎక్కువైంది. ఎవరితో అయినా వాదించవచ్చు కానీ.. తెలుగు నేతల లాజిక్ కు సమాధానం చెప్పలేమనే పరిస్థితి కేవలం జాతీయ నేతలకే కాదు.. ఢిల్లీలో అధికార యంత్రాంగానికి కూడా కల్పించడంలో కొంత మేర మనోళ్లు కృతకృత్యులయ్యారు. అలాగని కేంద్రం నుంచి మనకు రావాల్సినవన్నీ ఠంచనుగా వస్తున్నాయని కాదు కానీ.. కచ్చితంగా పాతికేళ్లలో పరిస్థితుల్లో కొంత మేర మార్పు వచ్చిన మాట నిజం.
గతానికి భిన్నంగా తెలుగు ప్రజలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కర్రు కాల్చి వాత పెట్టడంలో ఆరితేరారు. ఎన్నికల్లో ఓడినవారికీ ఎలాగూ ప్రజలు బుద్ధి చెప్పారని తెలిసిపోతోంది. కానీ గెలిచినవారికీ తమదైన ఝలక్ ఇవ్వటం తెలుగు ఓటర్లకు మాత్రమే తెలిసిన విద్య అనడంలో మరో మాటకు తావు లేదు. ఏతావాతా ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందేనని, లేకపోతే ఏ క్షణమైనా పరిస్థితులు తలకిందులౌతాయని గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చివరకు జాతీయ నేతల సభల్లోనూ జన స్పందనలో చాలా తేడా వచ్చింది. నేతలు చెప్పే ప్రతి మాటకూ చప్పట్లు కొట్టడం మానుకున్న తెలుగు జనం.. తమకు నిజంగా అవసరమయ్యే పని చేసినప్పుడు మాత్రమే అభినందిస్తున్నారు. దీంతో ఏదోటి చెప్పి జనాన్ని ఉబ్బేయాలనుకునే జాతీయ నేతల పాచికలు ఇక్కడ అంత తేలికగా పారడం లేదు. అదే సమయంలో జాతీయ నేతల ఛరిష్మా, మిగతా రాష్ట్రాల వారి బలాన్ని తెలుగు ప్రజలు ఏమాత్రం ఖాతరుచేయటం లేదు. మాకు పని చేయనప్పుడు.. ఎవరైతే మాకేంటి అనే ధోరణితోనే ఉంటున్నారు. దీంతో తెలుగు ఓటర్ల నాడి పట్టడం కోసం జాతీయ నేతలకు కచ్చితంగా ఇక్కడి నేతల అవసరం ఏర్పడుతోంది. అలాగని ఇక్కడి నేతలైనా ఎక్స్‌ట్రాలు చేస్తే సహించేది లేదని తెలుగు ప్రజలు గట్టిగానే చెబుతున్నారు. జాతీయ నేతల సమక్షంలోనే మన నేతల్ని నిలదీసిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో భాష అర్థం కాకపోయినా.. ప్రజల భావమేంటో జాతీయ నేతలకూ అనుభవంలోకి వస్తోంది. అందుకే గతంలో మాదిరిగా ఉత్తిత్తు ప్రకటనలకు కాకుండా.. ఏదో ఒక నిర్మాణాత్మక పని పెట్టుకునే తెలుగు రాష్ట్రాలకు వచ్చే పోకడ పెరిగింది. గత పాతికేళ్లలో వచ్చిన ఈ మార్పు.. తెలుగు రాజకీయం ఎంతో ఓపికతో, పోరాటపటిమతో.. అంతకుమించిన రాజకీయ పరిణతి, తెగువతో తెచ్చిందే అనడంలో సందేహం లేదు. ఇలా గత పాతికేళ్లలో ఓ రకమైన పరిణామక్రం చూసిన తెలుగు రాజకీయం.. రాబోయే రోజుల్లో మరింత వేగంగా రూపాంతరం చెందే దిశగా పయనిస్తోంది. ఇకపై రాజకీయ వ్యూహాల్లో కొత్త మార్పులు కూడా వస్తాయనే అంచనాలున్నాయి.
