NTV Telugu Site icon

Agnipath :నాలుగేళ్లకు నిరుద్యోగులుగా మార్చే అగ్నిపథ్ పథకం సరైందేనా.? సమస్యగా ఎందుకు మారింది.?

New Project (43)

New Project (43)

అగ్నిపథ్‌ సమస్యగా ఎందుకు మారింది?సైన్యంకంటే ఆయుధాలే కీలకమని ప్రభుత్వం భావిస్తోందా?జీతాలు, పెన్షన్లు భారమనుకుంటోందా?

సైన్యం కేవలం యుద్ధాల కోసమేనా?అగ్నిపథ్‌ అగ్గిరాజేసింది..ప్రభుత్వం యువతను సైన్యంలో భాగస్వాములను చేయటానికి అని చెప్తోంది.యువత మా ఉద్యోగాలను మాకివ్వాలని నినదిస్తోంది..ఇరుపక్షాల వాదనలు బలంగానే కనిపించినా, కనిపించే అంశాల వెనుక అసలు సంగతేమిటనేది కీలకంగా మారుతోంది.

ఏ ఉద్యోగికైనా కొంత పని, దానికి ఆదాయం ఉంటుంది…ఆ పనికి ఉండే డిమాండ్‌ని బట్టి జీతం ఉంటుంది..ఇదే లెక్కలో చూస్తే సైన్యాన్ని కూడా ప్రభుత్వం చూస్తోందా?జనం ప్రాధాన్యత పెద్దగా లేని కాలంలో కూడా …ఇన్ని లక్షల మందిని పోషించటం ఎందుకుని భావిస్తోందా..అదే ఇప్పుడు అగ్నిపథ్‌ కు పునాదులు వేసిందా? అనే అనుమానాలు వస్తాయి

అగ్నిపథ్‌ ప్రకటించగానే ఒక్కసారిగా అనేక రాష్ట్రాలు రణరంగమయ్యాయి..యూపీ, బీహార్‌, తెలంగాణ సహా అనేక చోట్ల రైళ్లు తగలబడ్డాయి.. బస్సుల అద్దాలు పగిలాయి.తుపాకులు పేలాయి. రాళ్లు రువ్వారు. అనేకమందికి గాయాలయ్యాయి..
అగ్నిపథ్‌ ని అంగీకరించేది లేదని నిరుద్యోగ యువత స్పష్టంగా చెప్పింది..
అయితే బోర్డర్‌ లో చస్తాం.. లేదంటే ఈ పోరాటంలోనే ప్రాణాలిస్తాం అని నినదించారు..

అటు ప్రభుత్వం నిరుద్యోగుల వాదనలు కొట్టిపారేసింది..అగ్నిపథ్‌ ని అర్థం చేసుకోలేదంటోంది.సైన్యంలో యువతను పెంచటానికి, దేశ యువతలో సైన్యంపై ఉండే ఆసక్తిని అనుసరించి..అవకాశం ఇవ్వటానికే ఈ పథకం అంటోంది.
అంతే తప్ప, సైన్యంలోకి రావాలనే యువత అవకాశాలు దెబ్బతీయటానికి కాదని చెప్తోంది..

ఏది నిజం? ఎవరి వెర్షన్‌ సమంజనం..అనేది అర్థం కావాలంటే భారత సైన్యం గురించి కొన్ని గణాంకాలు తెలుసుకోవాలి. ఇండియన్‌ మిలిటరీ మూడు విభాగాలుగా ఉంది. అది ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌. ఇందులో ఇండియన్‌ ఆర్మీ సంఖ్య పరంగా అతిపెద్ద విబాగం. ఇండియన్‌ ఆర్మీలో 27 రెజిమెంట్లున్నాయి. ఆర్మీలో మొత్తం 25లక్షలమంది ఉంటే, ఇందులో 12లక్షల మంది రిజర్వ్‌ సైన్యం. అంటే అవసరమైననపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. 13లక్షలకు పైగా యాక్టివ్‌ ట్రూప్స్‌ ఉన్నాయి.

ప్రస్తుతం మన ఆర్మీలో 34 డివిజన్లున్నాయి. ప్రతి డివిజన్‌ లో 15వేల మంది సైన్యం ఉంటారు. ప్రతి డివిజన్ లో కొన్ని బ్రిగేడ్‌ లు, ప్రతి బ్రిగేడ్ లో కొన్ని బెటాలియన్‌ లు, ప్రతి బెటాలియన్‌ లో కొన్ని కంపనీల సైన్యం ఉంటుంది..

మనదేశం వైశాల్యంలో ప్రపంచంలో ఏడోది. జనాభాలో ప్రపంచంలో రెండోది. మిలిటరీ శక్తిలో ప్రపంచంలో నాలుగోస్థానంలో ఉంది. అన్ని దేశాలు మిలిటరీ ఖర్చు పెంచుతున్నట్టుగానే మనదేశం కూడా రక్షణ రంగానికి ఏటా బడ్జెట్‌ పెంచుతూనే ఉంది. మిలిటరీ బడ్జెట్‌ లో ప్రపంచంలో మనం మూడోస్థానంలో ఉన్నాం. అమెరికా 2021లో 801 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తే, చైనా 239 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. అదే ఏడు మనదేశం 76.6బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.

మరి ఇంత ఘనమైన భారత దేశ సైన్యంలో సమస్యలున్నాయా అంటే ఉన్నాయి.
ప్రభుత్వం వైపు నుండి కొన్ని, సైన్యం వైపు నుండి కొన్ని, సైన్యం లోకి రావాలనుకునే యువత నుండి మరికొన్ని సమస్యలు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం.. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవటానికే సైన్యంలో కోతలు మొదలు పెట్టింది అని. అంటే, సైనికుల జీతాలు, పెన్షన్లల భారం తగ్గించుకోవటానికే అగ్నిపథ్‌ స్కీమ్‌ తెచ్చింది అని. ప్రభుత్వం యువతకు అవకాశం అని, లేదా సైన్యంలో అందరికీ భాగస్వామ్యం అనో చెప్తుండొచ్చు. కానీ, అసలు సిసలైన కారణం ఖర్చు తగ్గించుకోవటమే అని స్పష్టమౌతున్న అంశం

ఓ సైనికుడిపై ఎంత ఖర్చవుతుంది?అగ్నిపథ్‌ తెస్తే ప్రభుత్వానికి లాభమెంతపదేళ్ల పాటు ఆర్మీలో పనిచేసే ఓ జవాన్‌పై ప్రభుత్వం 5కోట్ల దాకా ఖర్చు చేస్తోంది.14ఏళ్ల సర్వీసు పూర్తిచేసే జవాన్‌ పై 6.25 కోట్లు ఖర్చవుతోంది. ఇప్పుడు అగ్నిపథ్‌ స్కీమ్‌ అమలైతే, కేంద్రం ఒక్కో జవాన్‌ పై పట్టే ఖర్చు నాలుగేళ్లకు 90లక్షలు మించదు. ఈ లెక్కన రూ. 11వేల కోట్లపైగా ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మనదేశ రక్షణ రంగ బడ్జెట్‌ దాదాపు ఐదులక్షల కోట్లుంటే అందులో 54 శాతం జీతాలు, పెన్షన్‌ల కోసమే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో రక్షణ పెన్షన్‌ పై వ్యయం 12 శాతం పెరిగింది. రక్షణ బడ్జెట్‌లో సగటు పెరుగుదల మాత్రం 8.4 శాతమే ఉంది. దీంతో బడ్జెట్‌ అంతా సైనికులపేనే ఖర్చవుతోందని … దాన్ని నియంత్రిస్తేనే ఆయుధాలను కొనగలుతామని ప్రభుత్వం భావిస్తుందనే వాదనలున్నాయి.

చైనా తన డిఫెన్స్‌ బడ్జెట్‌ లో 30శాతం జీతాలు, పెన్షన్లపై ఖర్చు చేస్తోంది. మిగిలిన 70శాతంతో ఆయుధాలు పోగేసుకుంటోంది. ఇప్పుడు అగ్నిపథ్‌ లాంటి పథకం వస్తే మనం కూడా చైనాలాగే సైన్యం ఖర్చు తగ్గించి ఆయుధాలు పెంచవచ్చనేది ప్రభుత్వ వ్యూహం అని భావిస్తున్నారు.

మరోపక్క సైన్యంలో ఏటా 60 నుంచి 70 వేల మంది రిటైర్ అవుతుంటారు. ఏటా ఆర్మీ ర్యాలీలు నిర్వహించి ఈ సంఖ్యను భర్తీ చేస్తుంది. కానీ, కొంత కాలంగా ర్యాలీలు లేవు. ఎంట్రన్స్‌ టెస్టులు లేవు. భర్తీ జగరలేదు. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగాల కోసం చూస్తున్న లక్షలాదిమందిలో తీవ్ర అసంతృప్తి ఉంది. తమ ఏజ్‌ లిమిట్‌ దాటిపోతోందని ఆవేదన చెందుతున్నారు. రెండున్నరేళ్లుగా ర్యాలీలు జరగకపోవటంతో వయసు పెరిగి కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు ఆర్మీ ఉద్యోగాలపై ఆశలు వదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఒక్కో ర్యాలీలో కనీసం 50 వేల మంది, గరిష్ఠంగా లక్ష మంది పాల్గొంటే,అందులోంచి చివరికి . రెండు వేల మందైనా ఆర్మీలో చేరతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అగ్నిపథ్‌ వచ్చి తమ జీవితాలను నాశనం చేస్తుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఏటా 45వేలమందికి అగ్నివీరులుగా అవకాశం ఇస్తే, పదేళ్ల తర్వాత మన సైన్యం సగటు వయస్సు తగ్గుతుందని, సైన్యంలో మెజారిటీ అగ్నివీరులే ఉంటారనేది మరోలెక్క. ఏటా సాధారణంగా ప్రతి ఆరు లేదా మూడు నెలలకు ఒక ఆర్మీర్యాలీ ఆ జోనల్ లేదా ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీస్ పరిధిలో జరగుతూనే ఉంటుంది. 2020-21లో దేశ వ్యాప్తంగా 97 ర్యాలీలు నిర్వహించాలని అనుకున్నా అందులో 47 మాత్రమే నిర్వహించారు. అందులో నాలుగింటికే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి, రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత 2021-22లో 87 ర్యాలీలు అనుకుంటే కేవలం 4 మాత్రమే నిర్వహించారు. వీటికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించలేకపోవడంతో, రిక్రూట్ మెంట్ జరగలేదు. 2018-19లో 53,431 మంది, 2019-20లో 80,572 మంది సైన్యంలో రిక్రూట్ అయ్యారు. ఇప్పుడు ర్యాలీల్లో పాల్గొని ఎంట్రన్స్‌ జరగక వేలాదిమంది ఎదురుచూపుల్లో ఉన్నారు. వీరందరిపై అగ్నిపథ్‌ పిడుగులా పడింది.

సైన్యం యుద్ధం కోసమేనా?సైన్యమంటే సార్వభౌమాధికారం కాదా?సైన్యం ఈ దేశం ఆత్మగౌరవం కాదా?సైన్యం కంటే ఆయుధాలే కీలకమయ్యాయా?

సైనికుల జీతాలు, పెన్షన్లు భారంగా భావిస్తున్నారా?మనదేశంలో సైన్యంలో పనిచేయటం అంటే ఓ గౌరవం.సైన్యంలో ఉద్యోగం అంటే కేవలం ఉపాధి మాత్రమే కాదు.. దేశం పనిచేస్తున్న తృప్తి అందులో ఉంది.సరిహద్దులో నిలబడి ఆయుధం పట్టిన సైనికుడిలో దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన భావన అణువణువునా ఉంటుంది. అలాంటి అవకాశం కోసం ఈ దేశంలో కోట్లమంది యువత ఎదురు చూస్తుంటారు. అందుకే దేశంలో కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి నుండి మిలిటరీకి వెళ్లిన వాళ్లు కనిపిస్తారు. అయితే, ఉత్తరాదిన బీహార్‌, యూపీ, పంజాబ్‌ రాష్ట్రాల నుండి సైన్యంలో ఎక్కువగా కనిపించినా తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాంధ్ర, తెలంగాణ నుండి సైన్యం నుండి ఉన్నవాళ్లు తక్కువేం కాదు.

ఇక్కడ పాయింట్‌ ఏంటంటే.. సైన్యం ఉపాధిస్తోంది అనే మాట నిజం..మనదేశంలో మిలిటరీ ఊద్యోగం కోట్లాదిమంది కడుపునింపుతోందనేది నిజం.కానీ, అదొక్కటే నిజం కాదు.ఎందుకంటే సైన్యం అంటే ఈ దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం..
సైన్యం అంటే ఈ దేశ ఆత్మగౌరవం…అందుకే ఇతర ఉద్యోగాల కంటే సైన్యానికి అంతగౌరవం.సైనికుడికి అంతటి విలువ.. కానీ, ఇప్పుడు ప్రభుత్వ లెక్కలు గమనిస్తే.సైన్యం కంటే ఆయుధాలే కీలకమయ్యాయనిపిస్తోంది.సైనికుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం భారంగా భావిస్తోందని స్పష్టమౌతుంది.

అసలు సైన్యం ఎందుకు..రోజూ యుద్ధం రావాలని ఎవరూ కోరుకోరు..రోజూ తుపాకులు పేలాలని, బాంబులు విసరాలని, సరిహద్దులు మండిపోవాలని ఎవరూ ఆశించరు.కానీ, యుద్ధమంటూ వచ్చిన రోజున సైన్యం అవసరం ఎంతో, యుద్ధం లేకున్నా,
దేశానిక ఓ ధీమాని ఇచ్చేది కచ్చింతంగా సైన్యం మాత్రమే.సరిహద్దులు లేని, సైన్యం అవసరం లేని ఆధునికానంతర మానవీయ ప్రపంచ కలలు బాగానే ఉంటాయి.కానీ, పక్కనే ఉన్న చైనా, పాకిస్తాన్‌ వాస్తవం..వాటితో పంచుకునే వేల కిలోమీటర్ల సరిహద్దు…
ఆ సరిహద్దులో నిత్యం జరిగే అరాచకాలు..ఆయుధాల చేరవేత, ఉగ్రమూకల చొరబాట్లు..ఇవన్నీ వాస్తవాలే…
వీటిని ఎదుర్కోవాలంటే, వాస్తవ ప్రపంచంలో చైనా, పాకిస్తాన్‌ లాంటి దేశాలకు సమాధానం చెప్పాలంటే సైన్యం బలంగా ఉండాల్సిందే..

మిలిటరీలో ఆయుధాలు కూడా భాగమే.కానీ, ఆయుధాలు మాత్రమే మిలిటరీ కాబోదు..క్షిపణులు, యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధాలు అవసరమే.వాటిని పోగేసుకోవాలి. ఏక్షణమైనా వాడటానికి రెడీగా ఉంచుకోవాలి…
కానీ, వాటిని చూసుకుని సైన్యంలో జనాన్ని తగ్గించుకోవటం సరైన నిర్ణయం కాదని చెప్పాలి.

సైన్యం యుద్ధాలు మాత్రమే కాదు..ఎన్నో సందర్భాల్లో ఏ ఇతర సిబ్బందీ చేయలేని సాహసాలకు సిద్ధంగా ఉంటుంది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు లక్షలాదిమందిని కాపాడిన చరిత్ర దేశ సైన్యానికి ఉంది.
ఎక్కడో సరిహద్దులో ఉన్న సైన్యానికి తప్ప, దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండే మిలిటరీకి పనేముంటుందని భావించవచ్చు..
కానీ, ఏడాదిలో అవసరమైన ఆ ఒక్కరోజు…ప్రాణాలకు తెగించి పనిచేసేది సైనికుడు మాత్రమే..
మరి నాలుగేళ్ల కాంట్రాక్టులో పనిచేసే అగ్నివీరులకు అంతటి తెగువ, సాహసం, శిక్షణ ఉంటాయా?
అసలు మిలిటరీలోఓనమాలు నేర్చుకునేలోపే ఇంటికి పంపేస్తుంటే సైన్యంలో ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎలా పనిచేయాలనే అనుభవం వచ్చిన వాళ్లు ఎంతమంది ఉంటారు. సంక్షోభం వచ్చినపుడు వీళ్లంతా చేతులెత్తేస్తే దేశం పరిస్థితేంటి?
ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించిందా అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.

కానీ, దేశమంతా ఉద్యోగ భద్రతలేని వాతావరణం పెరుగుతోంది.ఇప్పుడు రక్షణ రంగంలో కూడా మొదలైంది.
ఆధునిక రక్షణ పరికరాలు ,యుద్ధ విమానాలు,క్షిపణులు కొనుక్కుంటే, పదాతి దళాలు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్ని పదాతి దళాలు ఉన్నా, ఉక్రెయిన్ రష్యా దాడుల ఎంత వరకు కాపాడుకోగలిగింది?
రెండు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఆకాశంపై నుండే సాగుతోంది.ప్రపంచం నోరు తెరుచుకుని చూడటం తప్ప, చేస్తున్నదేమైనా ఉందా?మనం యుద్ధం చేయాల్సి వచ్చినా ఇంతకంటే మరోలా ఉంటుంది.
అంతెందుకు పాకిస్తాన్‌ పై గుట్టుచప్పుడు కాకుండా చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఇలాగే కదా జరిగింది.
దానికి ఎంతమంది సైన్యాన్ని వాడారు?
అంటే యుద్ధవిమానాలు, మిస్సైళ్లు, వాటిని ఆపరేట్‌ చేసేవాళ్లు ఉంటే ఓ మూలనుండి యుద్ధాన్ని నడిపించేయొచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇదే ఇప్పుడు సైన్యంపై ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచనకు పునాది కావచ్చనే అభిప్రాయాలున్నాయి

నిజానికి ప్రపంచీకరణ తరువాత దేశ సరిహద్దులకు ప్రాధాన్యత పోయింది.
భౌతిక సరిహద్దులను ప్రజలు పట్టుకుని వేలాడటమే కానీ, ప్రభుత్వాలు స్వేచ్ఛా ఒప్పందాలతో
దేశ సరిహద్దులను ఎప్పుడో తెరిచేశారు. అంతర్జాతీయ కంపెనీలు సరిహద్దులతో పనిలేకుండా అన్ని దేశాల్లో వాటి లాభాల కోసం పనిచేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు పరం అవుతూనే ఉన్నాయి. లేబర్‌ కోడ్‌ లు రాబోతున్నాయి. ఇవి పర్మినెంట్‌ కార్మికులను సున్నాకు చేర్చనున్నాయి. దీనిపై దేశమంతా వ్యతిరేకత రానుంది. ఇప్పుడు దేశంలో కశ్మీర్‌ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు, దండకారణ్యం నుండి ఆదివాసీ ప్రాంతాల వరకు…మిలిటరీ, పారామిలిటరీ, బీఎస్‌ ఎఫ్‌ బలగాలు మొహరించి ఉన్నాయి. ఎక్కడ ప్రజలు నిరసన తెలిపితే అక్కడకు ఈ బలగాలు పంపుతున్నాయి ప్రభుత్వాలు.
అంటే చైనా సరిహద్దుల్లో ఆ దేశం ఎన్ని గ్రామాలు కట్టినా బ్రిడ్జిలు కడుతున్నా పట్టని ప్రభుత్వం, సైన్యాన్ని జనంపైకే పంపుతోందనే ఆరోపణలున్నాయి. అంటే యుద్ధాలు, సరిహద్దు భద్రత, ఇతర దేశాలపై పోరాటం కంటే, దేశంలో అంతర్గతంగా ప్రజలను అణచివేసే శక్తిగా మిలిటరీ తయారు చేయాలంటే ఈ నాలుగేళ్ల సర్వీసు, ఈ మాత్రపు ఖర్చు చాలని ప్రభుత్వం భావిస్తోందనే వాదనలున్నాయి

తక్కువ సైన్యం..ఎక్కువ ఫలితం ఇదే ఆధునిక యుద్ధరీతి..అంటే అత్యాధునిక ఆయుధాలు, యుద్ధపరికరాల సాయంతో తక్కువ మ్యాన్‌ పవర్‌ తో భారీ యుద్ధాలను గెలవాలని అన్ని దేశాలూ చూస్తున్నాయి. సంప్రదాయ యుద్ధాలు ఎప్పుడో అంతమయ్యాయి. అన్ని దేశాలు అణ్వాయుధాలతో ఆధిపత్యం ప్రదర్శించే ప్రస్తుత పరిస్థితుల్లో… టెక్నాలజీ అండతో వేగంగా చేసే యుద్ధాలే జరుగుతున్నాయి. గతంలో ప్రధాని మోదీ… వేగంగా, సాంకేతికతతో నడిచే బలగాల ఆవశ్యకత గురించి మాట్లాడారు. వేగవంతమైన యుద్ధాలను గెలిచే సామర్థ్యాలు భారత్‌కు అవసరం అన్నారు. అందులో భాగంగానే అగ్నిపథ్‌ వచ్చిందని భావించాలి

భారత్‌కు భారీ మిలిటరీ దళం ఉంది. వీరిపై ఖర్చు కూడా భారీగానే ఉంటుంది.
రూ. 5.3 లక్షల కోట్ల ఆర్మీ బడ్జెట్‌లో సగానికి పైగా సైన్యం జీతాలు, పెన్షన్లకే పోతే, సైనిక సామగ్రిని ఆధునీకరించేదెలా అని ప్రభుత్వ వాదన. అమెరికా, చైనా తర్వాత మిలిటరీపై ఎక్కువగా ఖర్చు చేసే భారత్, ఆయుధాల దిగుమతిలో రెండో స్థానంలో ఉంది. రక్షణ పరికరాలను దేశీయంగా తయారు చేయడం కోసం బిలియన్ డాలర్ల ఖర్చు చేస్తోంది. భారత్ వద్ద కావాల్సినన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్‌తో పాటు బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇలాంటపుడు రక్షణ వ్యవస్థ వ్యయాన్ని గణనీయంగా తగ్గించి, తక్కువ సిబ్బందితో రాణించాలనేదే అగ్నిపథ్‌ వెనకున్న ఆలోచన. కానీ, చైనా తన 25లక్షల సైన్యంపై ఏటా రూ.23లక్షల కోట్లు ఖర్చు చేస్తే, ఆ స్థాయి ఎదగాలనుకునే భారత్‌ 15లక్షల సైన్యానికి ఖర్చు చేసేది నామమాత్రమనే విమర్శలున్నాయి.

అందుకే రెండేళ్లుగా జరగాల్సిన వందకుపైగా ఆర్మీ ర్యాలీలు జరగలేదు. ఉద్యోగాల భర్తీ ఆగింది. కరోనా కారణమని అధికారులు చెప్తున్నా, అసలు విషయం ఖర్చును తగ్గించుకోవటమే అని స్పష్టంగా కనిపిస్తున్న అంశం. మనకు మూడు చోట్ల సైనికులు భారీగా అవసరం. ఒకటి చైనా సరిహద్దు.. రెండు పాకిస్తాన్‌ మూడు దేశంలోపల అంతర్గత అవసరాలు. చైనా పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఏ సమయంలో అయినా, భారీగా సైనికులు మొహరించి ఉంటారు. అదే సమయంలో కశ్మీర్‌ లక్షల మంది సైన్యం నీడలో ఉంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సైన్యం భారీగానే ఉంటుంది. ఈ మూడు చోట్ల మినహాయిస్తే మిగతా చోట్ల ఉండే సైన్యానికి పని లేదు. వాళ్లపై పెట్టే ఖర్చు వృధా అని ప్రభుత్వం భావించటంలో ఆశ్చర్యం లేదు.

కానీ, సైన్యాన్ని లాభనష్టాలతో, అంకెలతో కొలవటం సరైందేనా?దేశంలో ఖర్చుతో నిమిత్తం లేకుండా చూడాల్సిన వాటిలో సైన్యం కూడా ఒకటి…సైన్యం ఈ దేశసార్వభౌమత్వానికి చిరునామా కదా..అన్నటికి మించి ప్రొఫెషనల్ సైనికులను తాత్కాలిక సైనికులతో భర్తీ చేస్తే కొన్నాళ్లకు ఆర్మీ బలహీనంగా మారిపోదా?ఇప్పటికే దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది.అగ్నిపథ్‌ అమలైతే, నాలుగేళ్లకే ఇంటిబాట పట్టిన యువసైనికులతో నిరుద్యోగం మరింత పెరగదా?నాలుగేళ్లు దేశం కోసం పనిచేసే ఆ తర్వాత సెక్యూరిటీ గార్డులుగా పనిచేయాల్సిందేనా అనేది యువకుల ప్రశ్న

మరీ ముఖ్యంగా, సైన్యంలోని ఏ విభాగాలను కుదించాలనుకుంటున్నారనేది ఇక్కడ తెలియాల్సిన అంశం.గన్‌లను పట్టే సైనికులనా లేక రేషన్ తదితర విషయాలు చూసే సైనికులనా?ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేకుండా సహేతుక నిర్ణయం కాకపోవటమే ఇప్పుడు సమస్యగా మారిందనే వాదనలున్నాయి

ఇప్పుడు జరిగిన ఆందోళనలకు అగ్నిపథ్‌ సృష్టించిన తీవ్ర నిరాశే అసలు కారణమని అభ్యర్థుల మాటల్లో వెల్లడైంది. పాత రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ రద్దు చేయడానికి తోడు.. అగ్నిపథ్‌లో పెట్టిన వయోపరిమితి ఆందోళనకు బీజం వేసింది. తెలంగాణలో 2021 మార్చి 26 నుంచి 31 వరకు నిర్వహించిన పరుగు పందెం, దేహ దారుఢ్య పరీక్షలకు 6,900 మంది హాజరయ్యారు. వీటిల్లో 2,800 మందికిపైగా అర్హత సాధించారు. చివరిగా రాత పరీక్ష జరగాల్సి ఉంది. గత మేలో కరోనాకారణంగా రాతపరీక్షను వాయిదా వేశారు. నవంబర్‌లో రాతపరీక్ష ఉంటుందని ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. కానీ, ఇప్పటి వరకు రాతపరీక్ష పెట్టకుండా రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లను రద్దు చేస్తున్నట్టు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఇదే ఇప్పుడు నిరుద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది.

అంటే ఇప్పుడు పాత నోటిఫికేషన్లు రద్దయ్యాయి. ఇక ర్యాలీలు జరగవు. టూర్‌ ఆఫ్‌ డ్యూటీ ద్వారానే నియామకాలు చేస్తారు. కానీ, పాత పద్ధతిలో 23 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. కానీ అగ్నిపథ్‌లో గరిష్ట వయో పరిమితి 21 ఏళ్లు మాత్రమే. దీనితో అభ్యర్థులు ఆందోళనకు, ఒత్తిడికి గురయ్యారు. కొత్త పద్ధతి వల్ల తీవ్రంగా నష్టపోతామని, పాత పద్ధతిలోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆందోళనకు దిగారు.

ఇప్పటికే రక్షణరంగ బడ్జెట్‌ కు కోత పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు జీతాలు, పెన్షన్‌ ఎగవేత కోసమే అగ్నివీరులను తెరపైకి తెచ్చారనే విమర్శలు పెరుగుతున్నాయి. చైనా, పాకిస్థాన్‌ నుంచి సరిహద్దుల్లో సవాళ్లు ఎదురవుతున్న వేళ సైనిక శక్తిసామర్థ్యాలను కేంద్రం నిర్ణయం పలుచన చేస్తుందనే ఆందోళన కూడా పెరుగుతోంది. అగ్నిపథ్‌ అటు దేశ యువతకు, ఇటు సైన్యానికి చేటు చేస్తుందనే వాదనలున్నాయి.

ఇప్పటికే హోదాలతో సంబంధం లేకుండా పెన్షన్‌ చెల్లించే ప్రయత్నాలపై మాజీ సైనికుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మరోదారిలో అసలు ఖర్చే లేకుండా చేసుకునే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అగ్నిపథ్‌, అగ్నివీర్‌ లాంటి ఆకర్షించే పదాలతో ప్రభుత్వ ప్రకటనలు అంతిమంతా దేశ రక్షణ బాధ్యత నుండి తప్పుకునేలా ఉందంటున్నారు నిరుద్యోగ యువకులు. సైన్యం అంటే ఉద్యోగంగా, జీతం, పెన్షన్‌ భారంగా చూసే అంశం కాదు. సైన్యం అంటే బాధ్యత. సైన్యాన్ని తయారు చేసుకోవటం, నిలబెట్టుకోవటం ముందుజాగ్రత్త. దీన్ని నిర్లక్ష్యం చేసే నిర్ణయాలు తీసుకోవటం సరికాదనే వాదనలు పెరుగుతున్నాయి.