NTV Telugu Site icon

IPL : ఐపీఎల్ క్రేజ్ క్రమంగా తగ్గుతోందా..? ఫిక్సింగ్ వార్తల్లో నిజమెంత.? l

Sb

Sb

అంచనాలు లేకుండా వచ్చి గుజరాత్‌ టైటాన్స్‌ ఎలా అదరగొట్టింది?పెద్ద టీమ్‌ లు ఎందుకు విఫలమయ్యాయి?
ఐపీఎల్‌ క్రేజ్‌ క్రమంగా తగ్గుతోందా?ఫిక్సింగ్‌ వార్తల్లో నిజమెంత?క్రికెట్‌ పండగ కళ తప్పిందా?
రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి వచ్చారు. ఫైనల్ ఈవెంట్ వేడుకల్లో మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ పాల్గొన్నారు

మ్యాచ్ విన్నర్‌ గుజరాత్ టైటాన్స్‌కు 20 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ, ట్రోఫీ దక్కింది. రన్నరప్‌‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు 13.5 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతో సరిపెట్టుకుంది.

పది టీమ్‌ లు, 70 లీగ్‌ మ్యాచ్‌ లు, సెమీస్‌, ఫైనల్‌ అన్నీ కలిపి 74 మ్యాచ్‌ లతో రెండున్నర నెలల పాటు సుదీర్ఘ క్రీడా సంబరంగా ఐపీఎల్‌ అదరగొట్టింది. ఐపీఎల్‌ లోకి కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన సీజన్‌లోనే హార్దిక్ పాండ్య టైటిల్ గెలిచేశాడు. కెప్టెన్సీ అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ ఎనిమిదేళ్లు ప్రయత్నించినా టైటిల్ గెలవలేకపోగా.. ఎలాంటి కెప్టెన్సీ అనుభవం లేని హార్దిక్ ఫస్ట్ సీజన్‌లోనే తన మార్క్ చూపించేశాడు.

గత ఏడాది వరకూ ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడిన హార్దిక్ పాండ్య.. ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా ఆడి అరంగేట్రం సీజన్‌లోనే ఆ జట్టుని టైటిల్ విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన నాలుగో భారత క్రికెటర్‌గా హార్దిక్ పాండ్య నిలవగా.. ఇప్పటి వరకూ ఈ రికార్డ్‌లో మహేంద్రసింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ మాత్రమే ఉన్నారు. 2013 నుంచి 2021 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. కనీసం ఒక్క టైటిల్‌ని కూడా గెలవలేకపోయాడు. హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్ గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.

గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీని ఐపీఎల్‌ నిర్వహకులు రూపొందించారు. దీంతో ఐపీఎల్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. ఐపీఎల్‌-2022 ఫైనల్‌ జరగుతున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ జెర్సీని ఆవిష్కరించారు. ఈ జెర్సీపై ఐపీఎల్‌ 15లో ఆడుతున్న 10 జట్ల లోగోలు ఉన్నాయి. ఈ జెర్సీ 66 మీటర్ల పొడవుతో పాటు 42 మీటర్ల వెడల్పు ఉంది. ఇక ఈ జెర్సీకి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్‌-2022 ముగింపు వేడుకులు అంబరాన్ని అంటాయి. ముగింపు కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తమ ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మరోపక్క ఫైనల్‌ మ్యాచ్‌​కు లక్ష పైగా ప్రేక్షకులు హాజరయ్యారని తెలుస్తోంది. దీంతో భారత్‌లో అత్యధిక ప్రేక్షకులు హాజరైన క్రికెట్‌ మ్యాచ్‌గా ఐపీఎల్‌ ఫైనల్‌ గుర్తింపు పొందింది. ఇంతవరకు బాగానే ఉన్నా, ఓవరాల్‌ గా టోర్నీపై, మరీ ముఖ్యంగా ఫైనల్‌పై అభిమానులు పెదవివిరుస్తున్నారు. మెగాఫైట్ లో రాజస్తాన్ జట్టు ఫ్యాన్స్‌ ని దారుణంగా నిరాశపర్చింది. కేవలం 130 పరుగులకే పరిమితమైంది. ఐపీఎల్‌ అంటేనే పరుగుల వరద. అలాంటిది భారీ స్కోరు చుద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. మెగా ఫైట్ లో రాజస్తాన్ బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేసింది. జోస్‌ బట్లర్ ఒక్కటే ఫర్వాలేదనిపించాడు అటు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో దుమ్మురేపాడు. సంజూ, బట్లర్, హెట్మెయర్ వంటి స్టార్ ఆటగాళ్ల వికెట్లు తీసి.. ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు హార్దిక్.

ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి.. అందరి లెక్కలను తలకిందులు చేస్తూ గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ టైటిల్ నెగ్గింది. రాజస్థాన్ రాయల్స్ 2008లోనే టైటిల్ కొట్టి అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే అది తొలి సీజన్. అప్పటికింకా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ దిగ్గజ జట్లుగా ఎదగలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకోలేదు. హైదరాబాద్ సన్‌ రైజర్స్‌కి అంతగా గా పేరు రాలేదు. కోల్ కతా నైట్ రైడర్స్ కూడా నామమాత్రంగానే ఉంది. కానీ ఈ జట్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్లున్నారు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ లో షేన్ వార్న్ మినహా పెద్ద స్టార్లు ఎవరూ లేరు. అయినప్పటికీ 2008లో రాజస్థాన్ రాయల్స్ సాధించిన విజయం గొప్పదిగా నిలిచింది.

అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తో పాటు, సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాట్స్ మన్ ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లున్నారు. కీరన్ పొలార్డ్ వంటి ఆల్ రౌండర్లున్నారు. చెన్నైకి ఎంఎస్ ధోనీ రవీంద్ర జడేజా వంటి స్టార్లున్నారు. బెంగళూరుకు కోహ్లి డుప్లెసిస్ మ్యాక్స్ వెల్ వంటి ఆటగాళ్లున్నారు. ఇంకా మిగతా అన్ని జట్లకు హిట్టర్లు, భీకర బౌలర్లున్నారు. కానీ గుజరాత్ కు మాత్రం వారెవరూ లేరు. హార్దిక్ పాండ్యా.. డేవిడ్ మిల్లర్ శుబ్ మన్ గిల్ సాహా, షమీ, రషీద్ ఖాన్, తెవాతియా..ఈ మాత్రం జట్టుతోనే హార్దిక్ విజయం సాధించాడు.

ఏమాత్రం అంచనాల్లేని జట్టుగా అడుగుపెట్టి.. ఇద్దరు ముగ్గురు స్టార్లతోనే బరిలోకి దిగి మేటి జట్లను ఓడించి సంచలన విజయాలు సాధించింది గుజరాత్‌. అయితే గుజరాత్‌ విజయం వెనుక, ఇతర టీముల్లో ఉన్న దిగ్గజ ఆటగాళ్లు దారుణంగా విపలం కావటమే గుజరాత్‌కు కలిసొచ్చిందనే వాదనలూ ఉన్నాయి. అయితే, గత సీజన్లకు భారీ హైప్‌ వచ్చిన ఈ సీజన్‌ 15 కు చాలా తేడా ఉందని ఫ్యాన్స్‌ నిరాశచెందారనే వాదనలున్నాయి. భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు దారుణంగా విఫలం కావటంతో పాటు, ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన తీరు. రెండు నెలల పాటు, భారీసంఖ్యలో 74 మ్యాచ్‌ లు జరగటంతో కూడా క్రేజ్‌ తగ్గిందనే అంచనాలున్నాయి.

ఐపీఎల్‌ మ్యాచ్ లన్నీ ఓ లెక్క, ఫైనల్‌ ఒక్కటీ ఓ లెక్క అన్నట్టు సాగుతుంది. ప్రతి బంతి ఉత్కంఠగా సాగుతుంది. అలాంటిది ఇప్పుడు జరిగిన ఫైనల్‌ పేలవంగా ముగియటంతో అభిమానులు నిరాశపడ్డారు. భారీ సిక్సులు, కళ్లు చెదిరే క్యాచ్‌ లు, క్షణక్షణం ఉత్కంఠ లేకుండానే, ఏ మాత్రం మసాలా కనిపించకుండానే గుజరాత్‌ వన్‌ సైడ్‌ మ్యాచ్‌ తో కప్‌ ఎగరేసుకుపోవటంపై ఫ్యాన్స్‌ నిరాశచెందారు.

ఐపీఎల్‌ లో ప్రతిసారి 8 టీమ్‌ లుంటాయి. ఈ సారి కొత్తగా గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ రెండు టీమ్‌ లు కలవటంతో 10 టీమ్‌ లయ్యాయి. దీంతో మెగా ఆక్షన్ తో ప్లేయర్‌ లంతా షఫిల్‌ అయ్యారు. దీంతో అభిమానులకు ఎవరు ఏ టీమ్‌ లో ఉన్నారో అర్థమయ్యే లోపే సగం టోర్నీ ముగిసింది. ఐపీఎల్‌ పై ఆసక్తి తగ్గటానికి ఇదో కారణం.

మరోపక్క ఐపీఎల్‌ అంటేనే భారీ స్కోర్లు, సిక్సర్లు, ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఈసారి అలాంటి మెరుపు ఇన్నింగ్స్‌ ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. మెజారిటీ మ్యాచ్‌ లు చప్పగా సాగాయి..ప్రతిసారి ఒక్కటైనా సూపర్‌ ఓవర్‌ ఉండేది.. కానీ ఈ సారి ఒక్కటి కూడా సూపర్‌ ఓవర్‌ వరకు రాలేదు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ ఉంటేనే అది ఐపీఎల్‌.కానీ, అన్ని మ్యాచ్‌ లు చప్పగా సాగాయి.

ముంబయి చెన్నై టీమ్‌ ల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఛాంపియన్‌ టీమ్‌ లు రెండూ వరుసగా ఓటమిపాలయ్యాయి .నిజానికి ఎక్కువ ఫ్యాన్స్‌ కూడా ఈ రెండు టీమ్‌ లకే ఉంటాయి. ఈ టీమ్‌ లు రెండూ పూర్తిగా నిరాశపరచటంతో ఫ్యాన్స్‌ ఐపీఎల్‌ చూడటానికి ఆసక్తి చూపలేదు.

ఇప్పటివరకు చెన్నై, ముంబయి లేకుండా ప్లేఆఫ్‌ మ్యాచ్‌ లు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఎక్కడో అడుగున చివరి రెండు స్థానాల్లో ఉండిపోయాయి. ముంబయి, చెన్నై చెరో 14 మ్యాచ్‌ లు ఆడితే నాలుగు మాత్రమే గెలిచాయి. ఇక ఈ సాలా కప్‌ నమ్‌ దే అని చెప్పుకున్న ఆర్సీబీ ప్లే ఆఫ్‌ వరకు వచ్చింది. కానీ, ఫైనల్‌ చేరే అవకాశం ఉన్నా కూడా ఓడిపోయింది.

మరోపక్క భారీ మొత్తం పెట్టి కొన్ని ఆటగాళ్లు చాలా మంది ఈ టోర్నీలో విఫలమయ్యారు.ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లకు క్రేజ్‌ ఎక్కువ. కానీ ఈ సారి బట్లర్‌ మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలయ్యారు..అండ్రూ రస్సెల్‌, పొలార్డ్‌, ఎవిన్‌ లెవిస్‌, డేవిడ్‌ వార్నర్‌, డూప్లెసిస్‌, హెట్‌ మెయిర్‌, కేన్‌ విలియమ్‌ సన్‌, సునీల్‌ నరైన్‌ లాంటి ఆటగాళ్లంతా దారుణంగా ఫ్లాప్‌ అయ్యారు. యువ ఆటగాళ్లు సత్తా చాటినా, ఒకటి బాగా ఆడితే, మరొకటి బోల్తా కొట్టారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, అంచనాలు పెట్టుకున్న మ్యాచ్‌ ల లో ప్లేయర్లు బాగా నిరాశపరిచారు.

ఇక కోట్లకు కోట్లు వెచ్చించి కొన్న ఆటగాళ్లు టీమ్‌ లకు బరువుగా మారారు. ముంబయి ఇండియన్స్‌ 17 కోట్లు పెట్టిన కొన్ని ఇషాన్‌ కిషన్‌ ఈ టోర్నీలో పేలవమైన ప్రదర్శన చూపాడు. కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ 12.25 కోట్లు పెట్టి కొన్న శ్రేయాస్‌ అయ్యర్‌
కెప్టెన్‌ గా అవకాశం వచ్చినా విఫలమయ్యాడు. ఆర్సీబీ 10.25 కోట్లతో కొన్న హస రంగ విఫలమయ్యాడు.
అటు ఇదే టీమ్‌ లో 10.75 కోట్లతో వచ్చిన హర్షల్‌ పటేల్‌ కూడా పెద్దగా రాణించలేదు..

ఇక సీఎస్‌ కె 14 కోట్లతో దీపక్‌ చహార్‌ ని కొంటే, టోర్నీకి ముందు గాయపడి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.
డబ్బులు పెట్టడానికి ఆలోచించే సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా 10.75 కోట్లు పెట్టి నిక్లస్‌పూరన్‌ ని కొనుక్కుంది. నిక్లస్‌ ఆట కూడా అంతంత మాత్రమే. అటు లక్నో టీమ్‌ 8.25కోట్లతో కొనుక్కున్న కృణాల్‌ పాండ్యా , 8.75కోట్లు వెచ్చించి ఆర్సీబీ తీసుకున్న వాషింగ్టన్‌ సుందర్‌ , 8 కోట్లతో కోల్‌ కతా టీమ్‌ లోకి వచ్చిన నితీష్‌ రాణా , పంజాబ్‌ టీమ్‌ 9.25 కోట్లతో సొంతం చేసుకున్న కగిసో రబాడా కూడా విఫలమయ్యారు. ఈ సీజన్‌ లో ఆర్సీబీ రిటెయిన్‌ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లు కొంపముంచారు. మ్యాక్స్‌వెల్‌ ను 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది బెంగళూర్ జట్టు. కానీ ఈ సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు. అటు కొహ్లి, సిరాజ్‌ కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారు.

ఇవన్నీ ఒకటైతే ఫైనల్‌ జరిగిన తీరుపై అనేక అనుమానాలు వినిపించాయి. టోర్నీలోకి కొత్తగా వచ్చిన టీమ్స్‌ గుజరాత్‌, లక్నో కుదురుకోవటానికే టైమ్‌ పడుతుందని వాటిపై ఫ్యాన్స్‌ అంచనాలు పెట్టుకోలేదు. కానీ, అవే అంచనాలకు భిన్నంగా రాణించాయి. ఇక్కడే గెలిచిన ప్రతిమ్యాచ్‌ పైనా అనుమానాలు ముసురుకున్నాయి. ఎలాంటి కెప్టెన్సీ అనుభవం లేని హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ ను గెలిపించటంపైనే ఫ్యాన్స్‌ నుండి ప్రశ్నలు వస్తున్నాయి. ఆటగాడిగా ప్రతిభ ఉన్న గుర్తింపు ఉన్నా, కెప్టెన్‌ గా హార్దిక్‌ రాణించటంపై అనేక అనుమానాలు..వచ్చాయి.

ముఖ్యంగా ఫైనల్‌ సంగతి తీసుకుంటే, టాస్‌ ముందు వరకు కూడా టైటిల్‌ పేవరేట్‌ గా రాజస్థాన్‌ ఉంది. అనుకున్నట్టుగానే రాజస్థాన్‌ టీమ్‌ టాస్‌ గెలిచింది. ఐపీఎల్‌లో సాధారణంగా టాస్‌ గెలిస్తే ముందు బౌలింగ్‌ తీసుకుంటారు. తక్కువ స్కోర్‌ కు ప్రత్యర్థిని కట్టడి చేయటానికి ఇది ఉపయోగపడుతుందని. కానీ, అనుకూలంగా లేని పిచ్‌పై రాజస్థాన్‌ బ్యాటింగ్‌ తీసుకుంది. ఇది అనేక అనుమానాలకు కారణమైంది. పోనీ గుజరాత్‌ కు భారీ టార‌్గెట్‌ ఇచ్చిందా అంటే అదీ లేదు. బ్యాట్స్‌ మెన్‌ అంతా దారుణంగా విఫలయ్యారు.

గుజరాత్‌ టీమ్‌ తో పోలిస్తే రాజస్థాన్‌ బౌలింగ్‌ బ్యాంటింగ్‌ , ఫీల్డింగ్‌ అన్నింటిలో చాలా స్ట్రాంగ్‌. రాజస్థాన్‌ విజయాల్లో కీలకంగా ఉన్న బట్లర్‌ కూడా నిన్నటి మ్యాచ్‌ లో రాణించలేదు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన సంజు సామ్సన్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. గత సీజన్‌ లో అద్భుతంగా రాణించిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఈ సీజన్‌ లో తక్కువ పరుగులకే ఔటయ్యాడు. చివర్లో సిక్సర్లతో విరుచుకుపడే రియాన్‌ పరాగ్‌, హెట్‌ మెయిర్‌ కూడా వెంటనే వెనుదిరిగారు.. అంత బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న రాజస్థాన్‌ టీమ్‌ 130 పరుగులకే పరిమితమైంది. దాంతో ఫైనల్‌ పై అనేక అనుమానాలు బలపడ్డాయి. ఫిక్సింగ్‌ జరిగిందనే కామెంట్స్‌ పెరిగాయి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు కొత్తేం కాదు. 2013 ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం రేపింది. రాజస్తాన్‌ రాయల్స్‌కు చెందిన ఆటగాళ్లు సహా ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్లు సహా పలువురు వ్యక్తులు అరెస్టవడం సంచలనం కలిగించింది. ఈ ఉదంతం ఐపీఎల్‌ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. ఒక రకంగా ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ అని చాలా మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌లో నాటుకుపోయేలా చేసింది. ఇప్పుడు గుజరాత్‌ గెలవటంతో, మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ తెరమీదకు వచ్చింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభం నుంచి అందరూ ఊహించినట్లుగానే హార్దిక్‌ సేన కప్‌ కొట్టడంపై సోషల్‌ మీడియాలో కొన్ని ట్రోల్స్‌, మీమ్స్‌ వైరల్‌గా మారాయి. గుజరాత్‌ టైటాన్స్‌ నిజాయితీగా కప్ కొట్టుంటే సమస్య లేదు గానీ.. ఒకవేళ ఫిక్సింగ్‌ లాంటివి ఏమైనా ఉంటే మాత్రం చర్చించాల్సిన విషయమే అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ.. బీసీసీఐ సెక్రటరీ జై షా దగ్గరి వ్యక్తులకు చెందింది. జై షా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు కూడా కావడం.. తొలిసారి ఒక ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్‌లో బరిలోకి దిగడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాదు ప్రధాని మోదీ, అమిత్‌ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌ పేరుతో ఒక ఫ్రాంచైజీ బరిలోకి దిగుతుందంటే మాములుగా ఉండదు. ఎలాగైనా ఆ జట్టే కప్‌ కొట్టాలని ముందుగానే నిర్ణయించినట్లు వార్తలు వినిపించాయి. అందుకే లీగ్‌లో విజయాలతో అప్రతిహాతంగా దూసుకెళ్లిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్‌, ఫైనల్లోనూ అదే దూకుడు కనబరిచింది. ఇంకో విషయమేంటంటే.. ఫైనల్‌కు హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా వచ్చారు. దేశాన్ని పరిపాలిస్తున్న ఒక పార్టీ నుంచి ముఖ్యమైన వ్యక్తి వేలాది మంది భద్రత మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు రావడం కూడా ఫిక్సింగ్‌ అనే పదం వినిపించడానికి కారణం అయింది.

ఐపీఎల్‌పై ఎన్ని అసంతృప్తులు, ఫ్యాన్స్‌ ఆరోపణలు ఉన్నా, ఈ సీజన్‌ లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు. ఐపీఎల్ 2022 విజేత గుజరాత్‌ టైటాన్స్‌కి బీసీసీఐ రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ అందజేసింది. అలానే రన్నరప్‌ రాజస్థాన్ రాయల్స్‌కి రూ.12.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. క్వాలిఫయర్-2లో ఓడి ఇంటిబాట పట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కి రూ.6.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. వాస్తవానికి ఐపీఎల్ 2016 సీజన్‌లో విజేత ప్రైజ్‌మనీ రూ.15 కోట్లు మాత్రమే. ఆ తర్వాత 2018, 2019 సీజన్‌కి ఆ ప్రైజ్‌మనీ రూ.20 కోట్లకి పెంచారు. కానీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతించకపోవడంతో, బీసీసీఐ ఆదాయం తగ్గింది. దాంతో.. ప్రైజ్‌మనీని కూడా రూ.10 కోట్లకి తగ్గించారు. కానీ.. ఐపీఎల్ 2022 సీజన్‌లో మాత్రం ప్రేక్షకుల్ని స్టేడియాల్లోకి అనుమతించగా.. స్పాన్సర్లు కూడా పెరిగారు. దీంతో ప్రైజ్‌ మనీ పెరిగింది..

హాజరైన అభిమానుల సంఖ్య చూస్తే ఐపీఎల్-15 ఘనంగా ముగిసిందనే చెప్పాలి. టైటిల్ విజేత ఎవరనే విషయం పక్కనబెడితే ఈ మ్యాచ్ ద్వారా రెండున్నరేండ్లుగా టీమిండియాతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు మిస్ అయిన జోష్‌ మళ్లీ కనిపించిది. ఖాళీ స్టేడియాల్లో ఆడి క్రికెటర్లకు కూడా బోర్ కొట్టింది. క్రికెట్ అంటేనే క్రౌడ్ మధ్యలో ఆడే ఆట. కరోనా పుణ్యమా అని రెండున్నరేండ్లుగా క్రికెట్ అభిమానులు ఆ జన హోరును ఎంతో మిస్ అయ్యారు. కానీ ఐపీఎల్-15 ఫైనల్ ఆ గ్లోరీని మళ్లీ తెప్పించిందనడంలో సందేహం లేదు. క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు వచ్చిన మ్యాచ్‌ గా పైనల్‌ నిలిచింది.

ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో 2 వేల ఫోర్లు పూర్తయ్యాయి. 2013 సీజన్‌లో 2052 ఫోర్లు నమోదుకాగా, ఒకే సీజన్‌లో 2 వేలకు పైగా ఫోర్లు రావడం ఇది రెండోసారి మాత్రమే. ఈ సీజన్ లో83 ఫోర్లు కొట్టి టాప్ ప్లేసు దక్కించుకున్నాడు రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్. 52 ఫోర్లతో డేవిడ్ బాయ్ రెండో స్థానంలో ఉండగా, 49 ఫోర్లతో డుప్లెసిస్ థర్డ్ ప్లేస్ దక్కించుకున్నాడు. సీజన్‌లో మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయిలో 1000 సిక్సర్లు నమోదయ్యాయి. టోర్నీ ప్రారంభమై 15 సీజన్లు పూర్తి అయినా.. ఈసారి నమోదైనన్ని సిక్సర్లు ఇంతకుముందెప్పుడూ నమోదుకాలేదు. ఈ సీజన్‌లో 162 మంది ఆటగాళ్లు బ్యాటింగ్‌ చేసి మొత్తం 1,062 సిక్సర్లు బాదారు. అందులో జోస్‌ బట్లర్‌ అత్యధికంగా 45 సిక్సర్లు కొట్టాడు. కేఎల్‌ రాహుల్‌ 30, క్వింటన్‌ డికాక్‌ 23 తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మరోపక్క ఫైనల్‌ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ లూకీ ఫెర్గూసన్‌ సరికొత్త రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఫెర్గూసన్‌ ఏకంగా గంటకు కు 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన తొలి బౌలర్‌గా ఫెర్గూసన్‌ నిలిచాడు.

మరోపక్క హార్దిక్ పాండ్యా.. ఫైనల్‌ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కెప్టెన్ గా ఉంటూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం చాలా అరుదు. ఇలా సాధించిన వారిలో పాండ్యా మూడో వాడు

సహజంగా ప్రతి సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ల జాబితాలో ప్రధానంగా పేస్‌ బౌలర్లే చోటు దక్కించుకుంటారు. తమ పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తూ వికెట్లు సాధిస్తారు. కానీ, ఈసారి పరిస్థితి మారింది. తొలి రెండు స్థానాలను స్పిన్నర్లు కైవసం చేసుకోవడం విశేషం. రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ 27 వికెట్లతో ఈసారి టాప్‌ బౌలర్‌గా నిలిచి పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. బెంగళూరు స్పిన్నర్‌ హసరంగ 26 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

2016లో బెంగళూరు కెప్టెన్‌గా ఆడిన విరాట్‌ కోహ్లీ 4 సెంచరీలు బాదినట్లే ఈసారి రాజస్థాన్‌ ఓపెనర్‌ బట్లర్‌ 4 శతకాలతో ఆ రికార్డును సమం చేశాడు. లఖ్‌నవూ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ ఈ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 140 నాటౌట్ సాధించాడు. కోల్‌కతా ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధ శతకం 6 సిక్సులు, 4 ఫోర్లతో సాధించాడు. ముంబయితో ఆడిన మ్యాచ్‌లో అతడు 14 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. దీంతో 2018లో కేఎల్‌ రాహుల్‌ సాధించిన రికార్డును సమం చేశాడు.

ఇక అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ మెన్‌ గా జోస్‌ బట్లర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.
పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌గా, అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా, మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ గా
గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ద సీజన్‌ గా బట్లర్‌ నిలిచాడు. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ గా ఉమ్రాన్‌
పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌ గా ఎవిన్‌ లూయిస్‌, సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద సీజన్‌ గా దినేశ్‌ కార్తీక్‌ నిలిచారు.

భారత్‌ లో క్రికెట్‌ ఓ మతం. క్రికెట్‌ అంటే కళ్లు చెవులు అన్నీ అప్పగించి రోజులు గడిపేసే ఫ్యాన్స్‌ కోట్లలో ఉన్నారు. ఐపీఎల్‌ రాకతో ఫ్యాన్స్‌ కి ప్రతిసీజన్‌ లో పూనకం వచ్చినట్టే అవుతోంది. అలాంటి టోర్నీని అంతే రంజుగా నిర్వహించాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా, ఆటగాళ్ల ప్రతిభను న్యాయం జరిగేలా, ఫ్యాన్స్‌ ని అలరించేలా సాగాలి. ఐపీఎల్‌ 15లో ఫిక్సింగ్‌ జరిగి ఉండొచ్చనేది ఫ్యాన్స్‌ ఆరోపణలు మాత్రమే కావచ్చు. కానీ, క్రికెట్‌ మతంగా ఉన్న దేశంలో అలాంటి ఆరోపణలు దరిదాపులకు కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంటుందని చెప్పాలి.