Site icon NTV Telugu

Increase on GST : పేరేదైనా వాయింపు ఒక్కటే అదే ‘జీఎస్టీ’| GST on Curd, Buttermilk Etc

Tax

Tax

Increase on GST

మజ్జిగ మీద జీఎస్టీ, పాలు మరగబెట్టి పెరుగు తోడుపెడితే జీఎస్టీ. ఇప్పటికే కరోనా, అధిక ద్రవ్యోల్బణంతో సతమతమౌతున్న జనానికి.. పన్నుల మోత తప్పడం లేదు. జీఎస్టీ, డీజిల్ సెస్, లైఫ్ ట్యాక్స్.. పేరేదైనా భారం తప్పడం లేదు. కష్టకాలంలోనూ ఆదాయాలు తగ్గకుండా చూసుకుంటున్న ప్రభుత్వాలు.. అందుకు పన్నులే మార్గమని ఫిక్సౌతున్నాయి. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకుండా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అధిక పన్నులతో ఆర్థిక విధ్వంసం తప్పదని నిపుణులు మొత్తుకుంటున్నా.. వినేవాళ్లు ఎవరూ లేరు.

సామ్యాన్యులపై మరో బాదుడు షురూ అయింది. ఉప్పు నుంచి పప్పు దాకా, కూరగాయల నుంచి పాల పాకెట్‌ దాకా గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ పెంపు అనివార్యంమైంది. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్లు ఖర్చు పెట్టాల్సి పరిస్థితి నెలకొనడంతో కొనుగోలు దారులు లబోదిబోమంటున్నారు.

ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై భారీగా పన్నులేస్తున్న ప్రభుత్వాలు.. ఇప్పుడు దేన్నీ వదలడం లేదు. జీఎస్టీ వచ్చాక అన్నింటి మీదా పన్నులేస్తున్న పాలకులు.. ఉన్న కొన్ని మినహాయింపులు కూడా ఎత్తేస్తున్నారు. లీగల్‌ మెట్రాలజీ యాక్ట్‌ ప్రకారం, జులై 18 నుంచి ప్రీ ప్యాక్‌డ్‌ అండ్‌ ప్రీ లేబుల్డ్‌ రీటైల్‌ ప్యాకెట్‌ ఉత్పత్తులపై జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పెరుగు, లస్సీ, బటర్‌ మిల్క్‌ ప్యాకెట్లపై 5 శాతం పన్ను తప్పదు. అంతేకాకుండా.. చెక్కులు జారీ చేయడానికి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్టీ, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌లో 12 శాతం నుంచి 18 శాతానికి సవరించాలని కౌన్సిల్ సిఫారసుతో.. ఎల్ఈడీ లైట్లు.. మ్యానిఫ్యాక్చరింగ్‌ ఇండస్ట్రీలో ఉపయోగించే ఫిక్సర్లు, ఎల్ఈడీ ల్యాంప్స్ ధరలు పెరిగాయి.

ప్రతి రోగికి రోజుకు రూ.5000 కంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రి గది అద్దె ఐసీయూ మినహాయించి ఐటిసి లేకుండా గదికి 5 శాతం వసూలు చేయనున్నారు. గతంలో దీనికి గూడ్స్ యాడ్ సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉండేది. అయితే.. ప్రస్తుతం పన్ను మినహాయింపు కేటగిరీకి భిన్నంగా హోటల్ గదులను రోజుకు వెయ్యి లోపు కాగా.. 12 శాతం జీఎస్టి శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టి కౌన్సిల్ నిర్ణయించింది. ఒకే దేశం ఒకే పన్ను అంటూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ ఇపుడికి రోగులను కూడా చుట్టుకుంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల బాదుడుకు తోడు కేంద్రం మరో భారాన్ని మోపింది.

ఐసీయూ మినహాయించి, ఆసుపత్రిలో ఒక రోగికి రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ ఉండే బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడు తప్పదు. ఇన్‌పుట్ క్రెడిట్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన దూరం చేయడం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి గది అద్దెపై జీఎస్టీ రోగుల ఆరోగ్య సంరక్షణ భారాన్ని పెంచుతుందని, అలాగే పరిశ్రమకు పెను సవాళ్లతోపాటు, ఆస్పత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇంతవరకు జీఎస్టీ పరిధిలోకి రాని కొన్ని వస్తువులపై పన్ను బాదుడు మొదలైంది. ప్యాక్ చేసి లేబుల్ వేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ వంటి పాల ఉత్పత్తుల ధరలు జీఎస్టీ కారణంగా పెరిగాయి. కొన్ని వస్తువులకు కొత్తగా రేట్లు వర్తింప జేయగా మరికొన్ని వస్తువులను వేరే స్లాబ్ రేటులోకి మార్చారు. దీంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా వినియోగదారులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో రాష్ట్రాలకు తలెత్తిన రెవెన్యూ నష్టాల కోసం చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగ్జరీ వస్తువులపై విధిస్తోన్న జీఎస్టీ పరిహారాల సెస్‌ను మరో నాలుగేళ్లు పొడిగించింది. దీంతో ఈ పరిహారాల సెస్ బాదుడును మరో నాలుగేళ్లు కస్టమర్లు భరించాల్సిందే. సెస్ వసూళ్లు ముగుస్తోన్న సమయంలో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నోటిఫై చేసిన జీఎస్టీనిబంధన ప్రకారం, జీఎస్టీ సెస్ విధింపు, వసూళ్ల కాలాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగిస్తున్నట్టు తెలిసింది. జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనల మేరకు ఈ సెస్ పొడిగింపును చేపట్టింది. దీంతో లగ్జరీ, డీమెరిట్ గూడ్స్‌పై విధించే పరిహారాల సెస్‌ను మార్చి 2026 వరకు చేపట్టనుంది. ఇలా సేకరించే సెస్‌ను జీఎస్టీ రెవెన్యూ నష్టం కోసం రాష్ట్రాలకు పరిహారంగా అందించేందుకు 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు ఉపయోగించనుంది. సెస్ కలెక్షన్లు తగ్గిపోవడంతో.. రాష్ట్రాలకు రెవెన్యూ నష్టాలను పూరించేందుకు 2020-21లో రూ.1.1 లక్షల కోట్లను, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లను కేంద్రం అప్పుగా తీసుకుంది. 2021-22లో ఈ బారోయింగ్స్‌కు సంబంధించిన రూ.7,500 కోట్ల వడ్డీలను తిరిగి చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14 వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. 2023-24 నుంచి ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ పేమెంట్లు మార్చి 2026 వరకు చెల్లించాలి. దీంతో పరిహారాల సెస్ విధింపును 2026 వరకు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఇంధనంపై పన్నులు తగ్గించుకున్న ప్రభుత్వాలు.. ఆ లోటును చిన్నాచితకా వస్తు, సేవలపై జీఎస్టీ బాదుడు ద్వారా పూడ్చుకోవాలని భావిస్తున్నాయి. అన్ని జాతీయ, ప్రైవేటు బ్యాంకులు జారీ చేసే చెక్కులపై18 శాతం జీఎస్టీ వసూలు చేయాలని కౌన్సిల్‌ ప్రతిపాదించింది. ఇక వ్యాపార సంస్థలకు ఉండే నివాస సముదాయాల అద్దెలకు ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా తొలగించారు. బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్లను రాష్ట్రాల మధ్య రవాణా చేసుకునేందుకు ఈ-వే బిల్లును తప్పనిసరి చేసే అంశంపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని మండలి పేర్కొంది. రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్ల రవాణాకు ఎలక్ట్రానిక్ బిల్లు తప్పనిసరి చేయాలని మంత్రుల బృందం సిఫారసు చేసింది. పన్ను ఎగవేతలను అడ్డుకొనేందుకు ఈ విధానాన్ని ప్రతిపాదించారు.

మాంసం, చేపలు, పెరుగు, పన్నీరు, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్‌, లేబుల్డ్‌ ఆహార పదార్థాలకు ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉండగా.. ఇకపై ఆయా పదార్థాల మీద 5శాతం జీఎస్టీ వసూలు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. విద్యార్థులు వాడే మ్యాప్‌లు, చార్టులు, అట్లాస్‌లపైనా 12శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. కాదేదీ పన్నుకు అనర్హం అన్న రీతిలో జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత పెరుగుతోంది. ఏటా పన్నుల వసూళ్లు పెరుగుతున్నా.. కొత్త పన్నులు ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి.

పేదల ఆహారమైన గోధుమ పిండి, పాలు, పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ. పైసలెక్కువై ఖర్చుపెట్టేందుకు ఆడే జూదాలైన కాసినోలు, గుర్రపు పందేలపై జీఎస్టీ రద్దుకు సిఫారసులు.. ఇదీ సర్కారుకు పేదలపై ఉన్న ప్రేమకు నిదర్శనం.

పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, ఎల్‌ఈడీ ల్యాంపులు, కత్తులు, బ్లేడ్లు వంటివాటిపై ఉన్న12 శాతం జీఎస్టీ, 18 శాతానికి పెరిగింది.
అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకంటక ప్రభుత్వాలు. మోడీ ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచే ప్రజలపై పన్నుబాదుడు మొదలైంది. ప్రజల జేబుకు చిల్లు పడుతుండగా, కేంద్రం ఖజానా గలగలలాడుతున్నది. నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం జీఎస్టీ చట్టం లేదు. దీనివల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు భారీగా నష్టపోతారని జీఎస్టీని ప్రారంభించినప్పుడే మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం హెచ్చరించారు. అనేక మంది ఆర్థిక నిపుణులు సైతం ఇదే అభిప్రాయం చెప్పారు. ఇది అక్షరాలా సత్యమని ఇప్పుడు తేలుతోంది.

పెద్ద నోట్ల రద్దుతో కేంద్రం సామాన్యుడిని ఆర్థికంగా దెబ్బకొడితే, కరోనా విపత్తు పూర్తిగా దివాళా తీయించింది. దీంతో లక్షల వ్యాపారాలు మూతబడ్డాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో ప్రజలపై భారం తగ్గించాల్సిన ప్రభు త్వం.. కొత్త పన్నులు విధిస్తోంది. ఇటీవల పాలు, పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించింది. ప్రతి కుటుంబం నిత్యావసరాల్లో ఒకటైన పాలనూ ప్రభుత్వం వదల్లేదు. పెరుగు, లస్సీ, బటర్‌మిల్క్‌ వంటి ప్రీ ప్యాక్డ్‌, ప్రీ లేబుల్డ్‌ పాల ఉత్పత్తులపై ఇప్పటివరకు జీఎస్టీ లేదు. ఇకపై 5 శాతం పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డెయిరీ మిల్కింగ్‌ మిషనరీపై జీఎస్టీ 12% ఉండగా.. 18 శాతానికి పెంచింది. ఈ నిర్ణయంతో పాలు, పెరుగు, లస్సీ, బటర్‌ మిల్క్‌ వంటి వాటి ప్రతి కుటుంబం కనీసం 10-15% అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పశువుల మేత దగ్గరి నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ డెయిరీ సెక్టార్‌. వ్యవసాయ రంగ జీడీపీలో దాదాపు 25 శాతం డెయిరీ నుంచే వస్తోంది. తాజాగా జీఎస్టీ విధించటంతో వినియోగదారులపై భారం పెరిగినా.. ఉత్పత్తిదారులకు రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డెయిరీ సెక్టార్‌ పూర్తిగా దెబ్బతింటుందని, పెద్దపెద్ద సంస్థలు మాత్రమే నిలబడుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాలరంగం మొత్తం కార్పొరేట్‌ వశం అవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

రోగుల గదుల రోజువారీ అద్దె రూ.5 వేలు దాటితే 5 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. దీంతో వైద్యసేవల ఖర్చు మరింత పెరుగనుంది. రోజుకు రూ.5 వేలు కిరాయి చెల్లించినవారు రూ.250 జీఎస్టీ చెల్లించలేరా? అంటూ కేంద్రం ఎద్దేవా చేస్తోంది. దవాఖానల్లో ఉండే బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లపైనా జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచింది. వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాల్సింది పోయి పన్నులు పెంచటంపై నిపుణులు మండిపడుతున్నారు. జీఎస్టీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.95 శాతంగా ఉన్నది. 2017-18లో కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపించినా.. ఆ తర్వాత క్రమంగా పెరుగడం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా 7.79 శాతం నమోదైంది. ప్రస్తుతం దాదాపు 7 శాతంగా ఉన్నది. ద్రవ్యోల్బణం పెరిగిన కొద్దీ ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగిన కొద్దీ సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటారు. జీవన ప్రమాణాలు పడిపోయి, మరింత పేదరికంలోకి జారిపోతుంటారని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అంటూ ఊదరగొట్టి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన కేంద్రం.. తనకు అనుకూలంగా, ప్రజలపై ఆర్థిక భారం మోపేలా దాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. ఐదేండ్లలో జీఎస్టీలో వెయ్యికిపైగా మార్పులు జరిగాయి. అంటే.. రెండు రోజులకు ఒకసారి చట్టాన్నిప్రభుత్వం మారుస్తూనే ఉంది. జీఎస్టీ చట్టం సామాన్యుల నడ్డి విరవటమే కాకుండా రాష్ర్టాల హక్కులను కూడా హరిస్తోంది. ఈ చట్టం వచ్చిన తర్వాత పన్నుల విషయంలో కేంద్రం ఎంత చెప్తే అంత అన్నట్టుగా తయారైంది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు దీనివల్ల ఏర్పడే నష్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం రాష్ర్టాలకు హామీ ఇచ్చింది. ఆ పరిహారం కోసం తెలంగాణతోసహా అనేక రాష్ర్టాలు ఇప్పటికీ కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాయి.

దేశంలో ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం మంది ఆధారపడిన పరిశ్రమ చేనేత. అందుకే చేనేతకు పన్ను మినహాయింపులు ఉండేవి. ప్రభుత్వం ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. జీఎస్టీ అమలుతో 5 శాతం పన్ను భారం ప్రారంభమైంది. అసలే తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమకు ఇది శరాఘాతంగా మారింది. కేంద్రం నిర్వాకంతో కుదేలైన నేతన్నను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో తెలంగాణ సహా అనేక రాష్ర్టాలు ఎదురుతిరిగాయి. చేనేతలను ఆదుకొనేందుకు పన్ను ఎత్తేయాల్సింది పోయి పెంచడం ఏంటని కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో ప్రస్తుతానికి పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినా.. జీఎస్టీ కత్తి ఇంకా చేనేతపై వేలాడుతూనే ఉన్నది.

జీఎస్టీకి ముందు కోటిన్నర రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్‌ ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్‌ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. ఎంఎస్‌ఎంఈలు, చిరు వ్యాపారులకు పన్ను భారం నుంచి ఊరట లభించేది. జీఎస్టీ చట్టంలో కేంద్రం ఈ మొత్తాన్ని రూ.20 లక్షలకు కుదించింది. గత ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా ఆరు వేల ఎంఎస్‌ఎంఈలు మూతబడ్డాయి. వీటిల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ వచ్చాక పన్నుల భారం మోయలేక సూరత్‌లో టెక్స్‌టైల్‌ రంగంలో చిన్న, మధ్య తరహా వ్యాపారులు అదృశ్యమయ్యారు. హౌరాలో ఫౌండ్రీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి.

ప్రజల ఆదాయం పెంచి పన్నులు వసూలు చేసుకుని.. ఆదాయం పెంచుకోవడం ప్రభుత్వ బాధ్యత. అంతేకానీ సామాన్యులు రోడ్డునపడ్డా.. పన్నులు కట్టాల్సిందే అని వేధించడం ఏంటనేది ఆర్థిక వేత్తల ప్రశ్న. ఆదాయ మార్గాలు వెతక్కుండా.. ఉత్పత్తి రంగాన్ని నిర్వీర్యం చేసి.. కేవలం పన్నులే పరమావధి అనుకోవడమే అన్ని సమస్యలకూ మూలకారణం.

ఆర్టీసీకి ఇరు రాష్ట్రాల్లో అప్పులు పెరుగుతున్నాయి. కానీ సంస్థ నిర్వహణ భారం కష్టంగా మారుతుంది. సంస్థలకు మాత్రం ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు, భవనాలు.. వేల కోట్ల రూపాయల విలువ చేస్తాయి. అదొక్కటే సంస్థలకు ఊరట ఇచ్చే విషయం. మిగతా అప్పులు మాత్రం కంటిన్యూ అవుతు వస్తున్నాయి. దీంతో సంస్థల నిర్వహణ వ్యయం భారం అవుతుంది.
స్వాతంత్య్ర భారత దేశంలో తొలిసారి పప్పు, బియ్యం, తృణ ధాన్యాలు, మొక్కజన్న, బెల్లం, తేనే, పెరుగు, లస్సీలపై పన్నులు వేశారు. ఈ పన్నులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు ఉన్నాయి. ఇకపై ప్యాక్‌ చేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ, గోదుమలు, మొక్కజన్న తదితర వాటిపై సోమవారం నుంచి 5 శాతం పన్ను రేటు అమల్లోకి వచ్చింది. గోధుమ పిండి, అప్పడాలు, చేపలు, తేనే, ఎండు చిక్కుళ్లు పైనా పన్నులను ప్రారంభించారు. జీఎస్టీ పెంపు వల్ల తమ వంటగది బడ్జెట్ రూ.5 వేల నుంచి రూ.7 వెలకు పెరిగిందని గృహిణులు వాపోతున్నారు. జీవనం కష్టంగా మారుతోందని అనేక మంది మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జీఎస్టీ పరిధిలోకి రాని ఉత్పత్తులపై తొలిసారిగా కేంద్రం పన్ను విధించింది. ఇందులో భాగంగా పలు ఆహార పదార్థాలన్నింటిపై 5 శాతం జీఎస్టీ విధించింది. ఇది నేరుగా సామాన్యుల జేబుపై ప్రభావం చూపుతుంది. పాలు, పెరుగు, పనీర్, లస్సీ, తేనె, డ్రై మఖానా, డ్రై సోయాబీన్, బఠానీలు, గోధుమలు, పఫ్డ్ రైస్ వంటి ఉత్పత్తులపై ఇప్పుడు 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది.
గుడ్‌, సింపుల్‌ టాక్స్‌ అంటూ కేంద్రప్రభుత్వం గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్ ప్రకటనల్లో హోరెత్తించింది. ఈ నినాదంలో గుడ్‌ కేవలం పెద్ద కంపెనీలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లకే తప్ప; వినియోగదారులు, సామాన్యులకు కాదు. చిన్న వ్యాపార సంస్థలు, చివరికి రాష్ర్టాలకు కూడా అటు గుడ్‌ కాదు, ఇటు సింపుల్‌ కాదు. వినిమయం మీద వేసే పన్ను అయినందున దీని దెబ్బ నేరుగా వినియోగదారులపైనే పడుతోంది.

జీఎస్టీ అడకత్తెరలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. చిన్న సంస్థల్ని జీఎస్టీ పెద్ద దెబ్బతీసిందని ఆర్థికవేత్తల అంచనా. వాటి వ్యాపారాలన్నింటినీ పెద్ద కంపెనీలకు వెండిపళ్ళెంలో సమర్పించుకోవాల్సి వస్తోంది.
జీఎస్టీ కౌన్సెల్‌ సమావేశం జరుగుతున్నదంటే చాలు.. దేని మీద ఎంత పన్ను వేస్తారు? మనం వాడే ఏ ఉత్పత్తిపై పన్ను పెంచుతారంటూ వినియోగదారులు హడలిపోయే పరిస్థితి. సమోసా కొని షాపు దగ్గర తినాలా, ఇంటికి తెచ్చుకొని తినాలా అనే సందిగ్ధంలో పడిపోతాం. అలాంటి నిర్ణయాన్నే గత నెలలో జరిగిన కౌన్సెల్‌ సమావేశం తీసుకున్నది. సమోసా, స్వీట్ల వంటివాటిని స్నాక్స్‌ కౌంటర్లో కొంటే 1 శాతం జీఎస్టీ, వాటినే ఆ షాప్‌, హోటల్‌, ఈటరీ ఔట్‌లెట్‌లో తింటే 5 శాతం పన్ను. పిజ్జా రెస్టారెంట్‌లో తింటే 5 శాతం, హోం డెలివరీ అయితే 18 శాతం జీఎస్టీ.

ఎప్పటికప్పుడు మారుస్తున్న జీఎస్టీ నిబంధనలు వినియోగదారుల్ని గందరగోళ పరుస్తున్నాయి. జీఎస్టీ నిబంధనల మార్పునకు ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వం 869 నోటిఫికేషన్లు, 143 సర్క్యులర్లు, 38 ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి అనుగుణంగానే జీఎస్టీ బెంచ్‌లు రూలింగ్స్‌ ఇస్తున్నాయి. రోటీలు, చపాతీలపై 5 శాతం, పరోటాలపై 18 శాతం జీఎస్టీ అని 2020లో అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ రూలింగ్స్‌ కర్ణాటక బెంచ్‌ రూలింగ్‌ ఇచ్చింది. షాంపూలు, లోహం తో తయారైన పెన్నులను లగ్జరీ ఐటమ్స్‌గా పరిగణించి 28 శాతం జీఎస్టీ వర్తిస్తుందని రూలింగ్‌ ఇచ్చింది. మధ్యతరగతిని లక్ష్యంగా చేసుకుని రూ.5,000 ఖరీదుకు పైబడిన హాస్పిటల్‌ బెడ్స్‌పై జీఎస్టీ విధించారంటే ఏ స్థాయిలో పన్నుభారం మోపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. జనం విరివిగా ఉపయోగించే ఉత్పత్తుల్ని పన్ను జాబితాలోకి జీఎస్టీ కౌన్సిల్‌ చేర్చుకుంటూ పోతోంది. ప్రస్తుతం మినహాయింపులో ఉన్న సేవల్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి.

2017లో జీఎస్టీని ప్రవేశపెట్టినపుడు, రాష్ర్టాల ఆదాయంలో 14 శాతం వార్షిక వృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాలకు గ్యారంటీ ఇచ్చారు. మొదటి ఐదేండ్లూ రెవెన్యూ తగ్గుదలకు పరిహారం చెల్లిస్తామని కూడా కేంద్రం హామీ ఇచ్చింది. ఇది కేంద్రం ఖజానా నుంచి కాకుండా వినియోగదారులపైనే సెస్‌గా వడ్డించి, ఆ నిధిలోంచి పరిహారం ఇస్తున్నది. 2022 జూన్‌ 30తో పరిహారం చెల్లింపు గడువుకాలం కూడా ముగిసిపోయింది. సెస్‌ వసూళ్లను కొనసాగించాలని కౌన్సిల్‌ నిర్ణయించినప్పటికీ, రాష్ర్టాలు డిమాండ్‌ చేస్తున్నట్టు ఇక మీదట కూడా పరిహారం చెల్లించే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం తీసుకోలేదు. 2017 నుంచి ఇప్పటివరకూ ఏ ఒక్క రాష్ట్రమూ 14 శాతం వార్షిక ఆదాయ వృద్ధిని సాధించలేదు. రాష్ర్టాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల్ని కేంద్రం కొట్టిపడేస్తోంది.

కరోనా ముందస్తు కాలంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక ఆదాయ వృద్ధి కేవలం 4.2 శాతానికే పరిమితమైనందున, లోటు పెరిగింది. బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా ఈ విషయంలో ఎంతో అసంతృప్తితో ఉన్నప్పటికీ, కౌన్సిల్‌ సమావేశాల్లో దీన్ని ప్రశ్నించడం లేదని ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ర్టాల ఆర్థిక మంత్రులు వాపోతున్నారు. పరిహారం బకాయిలు నిలిచిపోతాయనో, జాప్యం అవుతాయనో భయంతో జీఎస్టీ కౌన్సిల్‌లో మెజారిటీ అభిప్రాయాన్ని బీజేపీయేతర రాష్ర్టాలు అంగీకరించాల్సి వస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే కౌన్సిల్‌ సమావేశానికి కేంద్ర రెవిన్యూ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ముందుగానే నిర్ణయమైన ఎజెండాను ఆమోదించడానికే జరిగే ఈ సమావేశాల్లో చర్చ నామమాత్రమే. కేంద్రం ఏది నిర్ణయిస్తే దానికి అనుకూలంగా ఓటింగ్‌ జరుగుతోంది. కౌన్సిల్‌ ఆమోదిస్తోంది.

ప్రభుత్వాలకు ఆదాయం కావాలంటే పన్నులు కూడా ఓ మార్గం. అసలు పన్నులు వేయొద్దని ఎవరూ అనడం లేదు. కానీ పన్ను వ్యవస్థలో ఔచిత్యం ఉండాలంటున్నారు. పన్నులు ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకాలుగా ఉండాలే కానీ.. ఉన్న పరిశ్రమలు మూసేసేలా ఉండకూడదు. పన్నులు ఎక్కువైతే.. ఎగవేతలూ పెరుగుతాయనేది ఆర్థిక సూత్రం. పన్ను ఎగవేతదారుల్ని ఏమీ చేయలేకపోతున్న ప్రభుత్వాలు.. సామాన్యుల దగ్గర మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.

 

Exit mobile version