NTV Telugu Site icon

Goods and Services Tax : ఏం తినేటట్టు లేదు..ఏం కొనేటట్టు లేదు..సామాన్యుడిపై జీఎస్టీ బాదుడు

Goods & Service Tax

Goods & Service Tax

Goods and Services Tax : ఒకప్పుడు పన్నులంటే ధనికులు, కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారంగా ఉండేది. కానీ జీఎస్టీ వచ్చాక.. అడుక్కుతినేవాడు కూడా పన్ను కట్టాల్సిన దుస్థితి వచ్చింది. జీఎస్టీ వస్తే సామాన్యులకు మేలు జరుగుతుందని ఊదరగొట్టిన కేంద్రం.. చివరకు బతుకును భారంగా మార్చింది.
.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టడం వెనుక గల ఉద్దేశం ఇప్పుడు పూర్తిగా ప్రజల అనుభవంలోకి వస్తోంది. బియ్యం, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగు, రొట్టె పిండి వంటి సామాన్యులు ప్రతిరోజూ వాడే ఆహార పదార్థాలపై కూడా పన్ను భారం వేసింది. కొన్నింటిపై జీఎస్టీ పెంచడం వల్ల ఆయా వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. చెంచాలు, గంటెలను కూడా వదలకుండా పన్నులు వడ్డించడం ప్రభుత్వ స్వభావాన్ని వెల్లడిస్తోంది. జీఎస్టీ ప్రవేశపెట్టి ఐదేండ్లవుతున్నది. ఈ ఐదేండ్లలో కార్పొరేట్‌ సంస్థల పన్నులు తగ్గాయి. ప్రజలపై మాత్రం పన్నుల భారం పెరిగింది. ఇప్పటి వరకు జీఎస్టీ పరిధిలో లేని వాటికీ క్రమంగా ఈ పన్నును వర్తింపచేయడం, తక్కువ పన్ను ఉన్న వస్తువులను మరింత ఎక్కువ భారం పడే తరగతిలోకి మార్చడం ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుందనీ, ఈ క్రమంలో ప్రజలపై భారం పెరుగుతూనే ఉంటుందని చూస్తే అర్థమవుతోంది.

జీఎస్టీ ద్వారా కేంద్రం చేపట్టిన మరో తిరోగమన చర్య.. రాష్ర్టాల హక్కులను హరించడం. జీఎస్టీ మండలి వ్యవస్థనే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది. దీనివల్ల రాష్ర్టాలు ఆదాయం కోసం కేంద్రం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడినందున సమాఖ్య స్వభావం కూడా దెబ్బతింటున్నది. పైకి ఒకే దేశం, ఒకే పన్ను అంటూ చెబుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం చేతిలో ప్రజల, రాష్ర్టాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అస్త్రంగా జీఎస్టీ మారిపోయింది. జీఎస్టీ వల్ల తగ్గే ఆదాయాన్ని భర్తీ చేస్తామని మొదట్లో రాష్ర్టాలకు హామీ ఇచ్చిన కేంద్రం ఆ తరువాత మొండి చేయి చూపించింది. కరోనా కారణంగా సంభవించిన నష్టాన్ని భర్తీచేయాల్సింది పోయి, ఆ మహమ్మారిని దైవకార్యంగా పేర్కొంటూ తప్పించుకుంది. ఈ విధంగా కేంద్రం మాయమాటలతో రాష్ర్టాలకు జరిగిన మోసానికి జీఎస్టీ ఒక సంకేతంగా మారింది. పన్నుల వ్యవస్థను, మొత్తంగా ఆర్థిక నిర్ణయాధికారాలను గుప్పెట పెట్టుకొని కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ విధానం దీర్ఘకాలికంగా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది.

ఆర్థిక నిపుణులతో, రాజకీయ పక్షాలతో, రాష్ర్టాలతో చర్చించి కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామిక విధానం. కానీ, కేంద్రం ఏకపక్ష ధోరణి వల్ల తప్పుడు నిర్ణయాలు జరిగి దేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమవుతున్నది. పేదల జీవనం దుర్భరంగా మారుతున్నది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడి, నిత్యావసర ధరలు పెరిగి, పట్టణ, గ్రామీణ ప్రజల బతుకు భారంగా మారింది. మున్నెన్నడూ లేనివిధంగా ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దేశ స్థూలజాతీయోత్పత్తి దారుణంగా పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు, పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్యం మొదలు ఏ సూచీ చూసినా ప్రపంచంలో కడగొట్టు దేశంగా భారత్‌ మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు పులి మీద పుట్రలా మారింది.

గుడ్‌, సింపుల్‌ టాక్స్‌ అంటూ కేంద్రప్రభుత్వం గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ ప్రకటనల్లో హోరెత్తించింది. ఈ నినాదంలో గుడ్‌ కేవలం పెద్ద కంపెనీలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లకే తప్ప; వినియోగదారులు, సామాన్యులకు కాదు. చిన్న వ్యాపార సంస్థలు, చివరికి రాష్ర్టాలకు కూడా అటు గుడ్‌ కాదు, ఇటు సింపుల్‌ కాదు. వినిమయం మీద వేసే పన్ను అయినందున దీని దెబ్బ నేరుగా వినియోగదారులపైనే పడుతోంది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతున్నదంటే చాలు.. దేని మీద ఎంత పన్ను వేస్తారు? మనం వాడే ఏ ఉత్పత్తిపై పన్ను పెంచుతారంటూ వినియోగదారులు హడలిపోయే పరిస్థితి. సమోసా కొని షాపు దగ్గర తినాలా, ఇంటికి తెచ్చుకొని తినాలా అనే సందిగ్ధంలో పడిపోతాం. అలాంటి నిర్ణయాన్నే గత నెలలో జరిగిన కౌన్సిల్‌ సమావేశం తీసుకున్నది. సమోసా, స్వీట్ల వంటివాటిని స్నాక్స్‌ కౌంటర్లో కొంటే 1 శాతం జీఎస్టీ, వాటినే ఆ షాప్‌, హోటల్‌, ఈటరీ ఔట్‌లెట్‌లో తింటే 5 శాతం పన్ను. పిజ్జా రెస్టారెంట్‌లో తింటే 5 శాతం, హోం డెలివరీ అయితే 18 శాతం జీఎస్టీ. కేసినోలు, లాటరీలు, హార్స్‌ రేసులపై జీఎస్టీ నిర్ణయాన్ని ఈ మీటింగ్‌ వాయిదా వేసిందిగానీ, అంతకుముందు మినహాయింపుల జాబితాలో ఉన్న పాల ఉత్పత్తులు, బెల్లం, చేపలు, లెడ్‌ బల్బులూ, చివరికి పెన్సిల్‌, షార్ప్‌నర్లపై కూడా 12 నుంచి 18 శాతం వరకూ జీఎస్టీ విధించింది.

విద్యార్థులు వాడే పెన్సిళ్లు, ఇంకు, షార్ప్‌నర్‌, రైటింగ్‌, డ్రాయింగ్‌, ప్రింటింగ్‌ మెటీరియల్‌పై 12 శాతం జీఎస్టీ విధించారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, చార్ట్‌, మ్యాప్‌ పేపర్లు, గ్రాఫ్‌ పేపర్లు, ఎక్ససైజ్‌ బుక్స్‌పైన 18 శాతం జీఎస్టీ విధించి విద్యార్థుల చదువులు మరింత భారంగా మార్చారు. చివరకు స్మశానంలో కాంట్రాక్టు వర్కులపై కూడా 18 శాతం జీఎస్టీ ఉంది. మనిషి చచ్చాక కూడా పన్ను కట్టాల్సిందే అన్నట్టుగా ఉంది ప్రభుత్వ వైఖరి.

కేవలం విద్య విషయంలోనే కాదు.. ఆరోగ్య రంగాన్ని కూడా కనికరించలేదు. ఇప్పటికే మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు కొత్తగా ఆస్పత్రి గది అద్దెల మీదా జీఎస్టీ విధించారు. నివాస గృహాలు అద్దెకిచ్చినా జీఎస్టీ కట్టి తీరాల్సిందే. కాదేదీ జీఎస్టీకి అనర్హం అన్న రీతిలో బాదేస్తోంది కేంద్రం. జీఎస్టీ విధించడానికి కేంద్రం ఎప్పటికప్పుడు బుర్రకు పదును పెడుతోంది. సృజనాత్మక పద్ధతుల్లో సామాన్యుల్ని వాయిస్తోంది. సరిగ్గా ఎక్కువమంది తప్పనిసరిగా వాడే వస్తువులేంటో లిస్ట్ రెడీ చేయడం, ఠంచనుగా అన్నింటి మీదా పన్ను వడ్డించడం పరిపాటిగా మారిపోయింది. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో చర్చలు కూడా తంతుగా మారాయి. అసలు జీఎస్టీపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా.. అధిక ఆదాయమే లక్ష్యంగా అస్తవ్యస్తంగా శ్లాబులు ఖరారు చేశారు. మొదట్లో తర్వాతి మీటింగుల్లో మారుస్తామని చెప్పినా.. తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఎప్పటికప్పుడు కొత్తగా పన్ను వేయకపోతే చాలు.. అదే పదివేలు అన్నట్టుగా ప్రజల మైండ్ సెట్ చేశారు.

కోట్లాదిమంది పేదలను కేంద్రం పన్ను పోటు పొడిచింది. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్‌ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు.

ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అన్నట్టుగా ఉంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పాలనలో సగటు మనిషి జీవితం. ఒకే దేశం.. ఒకే మార్కెట్‌.. ఒకే పన్ను పేరుతో కేంద్ర, రాష్ర్టాల పన్నులను ఏకం చేసి ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన జీఎస్టీ సామాన్యుల ఉసురు తీస్తోంది. ఆరోగ్యం బాలేక ఆస్పత్రికి వెళ్లినా.. ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితి. ఆస్పత్రి బెడ్డు దగ్గర్నుంచి స్మశానంలో కాటిదాకా జీఎస్టీ వర్తిస్తున్నది మరి. పాలు, పెరుగు, పెన్సిళ్లు ఇలా చెప్పుకొంటూపోతే కాదేదీ జీఎస్టీకి అనర్హం అనాల్సిందే.

అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబును కేంద్రం ఇలా దర్జాగా పన్నుల పేరుతో దోచేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా అన్నింటికీ పన్నుపోటు తప్పట్లేదు. ప్రస్తుతం 99 శాతం సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతున్నదంటే అతిశయోక్తి కాదు. వీటిలో నిత్యావసరాలే ఎక్కువగా ఉండటం కలవరపెడుతోంది. జాతి ప్రయోజనాల కోసమే జీఎస్టీని తెచ్చామని బీజేపీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఈ ట్యాక్స్‌కు ముందు 50 శాతాన్ని మించి ఆయా వస్తు ఉత్పత్తులు పన్ను పరిధిలో లేవు.

ఉదయం నిద్రలేచినప్పట్నుంచి పడుకునేదాకా సగటు మనిషికి అవసరమైన ప్రతీదానిపై జీఎస్టీ పడుతోంది. ఫలితంగా ఏది కొనాలన్నా సామాన్యుడికి పెను భారంగా పరిణమించింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు.. దేశంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తున్నాయి. సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటుండగా, పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు క్రమేణా పేదరికంలోకి జారుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సామాన్యుడికి మేలు చేసేందుకే జీఎస్టీని తీసుకొస్తున్నట్టు ఐదేండ్ల క్రితం ప్రధాని మోడీ ప్రకటించారు. ధాన్యాలు, పెరుగు, లస్సీ వంటివాటన్నింటికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నామన్నారు. కానీ.. దేన్నీ వదలట్లేదు. ఇప్పటికే చింతపండు, చక్కెర, వంటనూనెలు తదితర అన్నింటిపైనా జీఎస్టీ విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు పసిపిల్లల నోటికాడి పాలనూ ఉపేక్షించలేదు. పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటి ప్రీప్యాక్డ్‌, ప్రీలేబుల్డ్‌ పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వేశారు. అంతేగాక డెయిరీ మిలింగ్‌ మిషనరీపై జీఎస్టీని 12% నుంచి 18 శాతానికి పెంచారు. ఈ నిర్ణయాలతో పాలు, పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటివాటి కోసం ప్రతి కుటుంబం కనీసం 10-15% అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటికే పశువుల మేత దగ్గర్నుంచి అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయి. ఈ జీఎస్టీతో వినియోగదారులపై భారం పెరిగినా.. ఉత్పత్తిదారులకు మాత్రం రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డెయిరీ రంగం పూర్తిగా దెబ్బతింటుందని, పెద్దపెద్ద సంస్థలు మాత్రమే నిలబడుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పాల రంగం మొత్తం కార్పొరేట్‌ వశమవుతుందని ఆర్థికవేత్తలూ అంటున్నారు.

సగటు మనిషి రోజువారీగా ఉపయోగించే వాటిపైనే కేంద్రం పన్నులు వేస్తున్నది. దీంతో ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతున్నది. కిలో పెరుగు ధరే 3-4 రూపాయలు పెరిగింది. ఇక లెదర్‌ ఉత్పత్తులపై జీఎస్టీ భారంతో సామాన్యులు చెప్పులు తొడుక్కునే స్వేచ్ఛ కూడా లేకుండాపోతున్నది. రైతు ప్రభుత్వమని చెప్పుకునే మోదీ.. అన్నదాతలనూ కోలుకోలేని దెబ్బతీశారు. విత్తనాలు, పప్పు దినుసుల శుద్ధికి, గ్రేడ్‌ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలకూ పన్నుపోటు పడింది మరి. అసలే కొవిడ్‌తో ఆర్థికంగా చితికిపోయిన హోటల్‌ రంగాన్ని చిదిమేశారు. చిన్నపాటి హోటళ్లలో రూ.1,000 వరకూ ఉన్న రూమ్‌లపై 12 శాతం పన్ను విధించారు. వంటింట్లో ఉపయోగించే స్పూన్లు, ఫోర్కులపైనా పన్నేశారు. చివరికి స్కూల్‌ పిల్లలను సైతం వదల్లేదు. పెన్సిళ్లు, షార్ప్‌నర్లు వంటి వాటిపైనా జీఎస్టీ వచ్చిపడింది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్లకు కోట్లు తెచ్చేలా.. పేదలు ఆకలితో మగ్గేలా ఉన్నాయి. ఒకప్పటితో పోల్చితే కొనుగోలుశక్తి చాలావరకూ తగ్గిపోయింది. నిజానికి బ్రాండెడ్‌ నిత్యావసరాలు మార్కెట్‌లో అధిక ధరలుంటాయి. ప్యాక్‌ చేసిన వస్తువులే నాణ్యతగా ఉంటాయని కేంద్రం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. మొదట ప్యాకింగ్‌ విధానాన్ని బాగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అప్పట్నుంచి కిరాణా షాపుల్లో సైతం ప్యాకింగ్‌ చేసి అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుతం ప్యాకింగ్‌ చేసిన నిత్యావసరాలపై 5 శాతం జీఎస్టీ విధించారు. ఫలితంగా వ్యాపారులు ఇక ప్యాకింగ్‌ చెయ్యరు. ప్రజలు కార్పొరేట్‌ దుకాణాల్లోని ప్యాకింగ్‌ చేసిన వాటినే కొనుగోలు చేస్తారు. దీనివల్ల చిరు వ్యాపారులు నలిగిపోయే అవకాశం ఉంది. గత ఎనిమిదేండ్లలో నిత్యావసరాలు అమాంతం పెరిగిపోయాయి. పేదరికం పెరిగిపోయిందని సూచీలన్నీ చెప్తున్నాయి. ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటొద్దనేది రిజర్వ్‌ బ్యాంక్‌ లక్ష్యం. కానీ ప్రస్తుతం దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉన్నది. ఇవే విధానాలు కొనసాగితే దేశం.. శ్రీలంకగా మారే ప్రమాదం ఉంది.

వస్తువులపై జీఎస్టీ విధింపుపట్ల కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయమే ఆఖరు అంటూ ఊదరకొడుతున్న కేంద్రం.. ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ముందుగానే నిర్ణయమైన ఎజెండాను ఆమోదించడానికి జరిగే ఈ సమావేశాల్లో చర్చ నామమాత్రంగానే ఉంటోందని రాష్ట్రాలు వాపోతున్నాయి. గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆమోదం పొందడానికి మాత్రమే జీఎస్టీ కౌన్సిల్ మీటింగులు జరుగుతున్నాయి. ఈ నిర్ణయాలను రాష్ర్టాలు ఆమోదించక తప్పని పరిస్థితి.

ఇంతవరకు జీఎస్టీ పరిధిలోకి రాని కొన్ని వస్తువులపై పన్ను బాదుడు మొదలైంది. ప్యాక్ చేసి లేబుల్ వేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ వంటి పాల ఉత్పత్తుల ధరలు జీఎస్టీ కారణంగా పెరిగాయి. కొన్ని వస్తువులకు కొత్తగా రేట్లు వర్తింప జేయగా మరికొన్ని వస్తువులను వేరే స్లాబ్ రేటులోకి మార్చారు. దీంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. జీఎస్టీ కొత్త రేట్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

పన్నీరుపై 5 శాతం జీఎస్టీ, బటర్‌పై 12 శాతం జీఎస్టీని, మసాలాపై 5 శాతం జీఎస్టీని ప్రభుత్వం విధించింది. అయితే పన్నీర్ బటర్ మసాలాపై జీఎస్టీ ఎంత నిర్మలా సీతారామన్ జీ అంటూ ఓ ట్విటర్ యూజర్ వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు. పన్నీర్‌పై 5 శాతం జీఎస్టీ అంటే మీరు నమ్ముతారా..? అంటూ మరో యూజర్ ప్రశ్నించాడు. ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌పై 5 శాతం జీఎస్టీ సిటిజన్లకు బ్లాక్ డే అంటూ మరో యూజర్ మండిపడ్డాడు. నేను పెరుగు తినను. నేను రైసు తినను.. నేను కేవలం పెరుగన్నం మాత్రమే తింటాను.. ఎందుకంటే పెరుగన్నంపై జీఎస్టీ లేదు కదా.. అంటూ మరో యూజర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

ఉదాహారణకు ఒకరోజు ఆసుపత్రి బెడ్‌కు అద్దె రూ.5,000 అనుకుందాం ఆపై రూ.250 జీఎస్టీగా చెల్లించాల్సి ఉంటుంది. రోగి రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే గది అద్దె రూ.10వేలు, జీఎస్టీతో రూ.10.500. రోగి ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉండవలసి వస్తే, చికిత్స మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఎప్పటికప్పుడు మారుస్తూపోతున్న జీఎస్టీ నిబంధనలూ వినియోగదారుల్ని గందరగోళ పరుస్తున్నాయి. జీఎస్టీ నిబంధనల మార్పునకు ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 869 నోటిఫికేషన్లు, 143 సర్క్యులర్లు, 38 ఉత్తర్వులూ జారీచేసింది. వీటికి అనుగుణంగానే జీఎస్టీ బెంచ్‌లు రూలింగ్స్‌ ఇస్తున్నాయి. రోటీలు, చపాతీలపై జీఎస్టీ 5 శాతంగా, పరోటాలపై 18 శాతమని 2020లో అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌ (ఏఏఆర్‌) కర్నాటక బెంచ్‌ రూలింగ్‌నిచ్చింది. రెడీ కుక్‌ ఉత్పత్తుల్ని విక్రయించే ఐడీ ఫ్రెష్‌ ఫుడ్స్‌…పరోటాలపై వర్తించే జీఎస్టీ రేటుపై ఏఏఆర్‌ను ఆశ్రయించగా ఈ రూలింగ్‌ వచ్చింది.

పెరుగు, ల‌స్సీ, బ‌ట‌ర్‌మిల్క్‌, ప‌న్నీర్‌, బియ్యం, గోధుమ‌లు, బార్లి, ఓట్స్‌, బెల్లం, తేనే వంటి వాటిపై ఐదు శాతం జీఎస్టీ విధించ‌డంతో వాటి ధ‌ర‌లు పెరిగి సామాన్యులు కొనుగోలు చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. గ‌తంలో రూ.5 వేలు లోపు ఉన్న ఆసుప‌త్రుల గ‌దుల అద్దెపై 5శాతం, వెయ్యి రూపాయాల లోపు ఉన్న హోట‌ల్ రూముల అద్దెపై 12శాతం జీఎస్టీ విధించారు. ఆర్థిక లావాదేవీల్లో కీల‌క‌మైన బ్యాంకు చెక్కుల‌పై 18శాతం జీఎస్టీ విధించ‌డం తీవ్ర ప్రభావం చూపనుంది.

నిత్యావసరాలపై జీఎస్టీని చూసిన తర్వాత.. తినడం కూడా దేశసేవే అని సరిపెట్టుకోవాలేమో. పన్నుల వ్యవస్థలో ఉండాల్సిన ఔచిత్యాన్ని గాలికొదిలేసిన కేంద్రం.. దారిదోపిడీ తరహాలో జీఎస్టీ విధిస్తోందనే విమర్శలున్నాయి. ఈ పన్నులు ఇలాగే పెంచుకుంటూ పోతే.. చివరకు ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందనే హెచ్చరికలున్నాయి. అయితే నెలనెలా లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ల మైకంలో ఉన్న ప్రభుత్వం.. ఈ వార్నింగులు పట్టించుకునే పరిస్థితి లేదు. భవిష్యత్తు సంగతి దేవుడెరుగు.. సాగినంత కాలం దండుకుందాం అనే ధోరణే కనిపిస్తోంది. జీఎస్టీ వచ్చాక పన్నులు తగ్గుతాయనుకుంటే.. పాతరోజులే బాగున్నాయనకునేలా బాదేస్తోంది కేంద్రం. మొదట్లో జీఎస్టీని సమర్థించిన ఆర్థికవేత్తలు కూడా ఇప్పుడు కేంద్రం తీరు చూసి మొత్తుకుంటున్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో జీఎస్టీ ఉంది. కానీ ఎక్కడా లేనంత సంక్లిష్టత ఇండియాలో ఉంది. పన్ను వేసేటప్పుడు సామాన్యులు, ధనికులు వాడే వస్తువులు, నిత్యావసరాలు, లగ్జరీ అనే కొలమానాలు చూసుకోవాలి. కానీ కేంద్రం అన్నీ మర్చిపోయింది. ఏ వస్తువూ పన్ను పరిధికి బయట ఉండకూడదనే దృఢ సంకల్పంతో ముందడుగేస్తోంది.

ట్యాక్సులు కట్టేవాళ్లందరూ దేశభక్తులని ఇప్పటికే ప్రచారం చేస్తున్న కేంద్రం.. ప్రజలందర్నీ బలవంతంగా అయినా దేశభక్తులుగా మార్చాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. గోధుమలపై పన్ను వేయడంతో ఆగకుండా.. రోటీ, చపాతీకి ఓ పన్ను, పరోటాకి మరో పన్ను వేయడంపై కూడా సెటైర్లు పడుతున్నాయి. వచ్చే జీఎస్టీ సమావేశానికి ఇంకేం వింతలు చూడాల్సి వస్తుందని జనం భయపడుతున్నారు. ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టని కేంద్రం.. జీఎస్టీ విషయంలో మాత్రం వినూత్న పద్ధతులకు తెరతీస్తోంది. ఎవరేమనుకున్నా పర్లేదన్నట్టు వ్యవహరిస్తోంది. గతంలో కాబూలీవాలాలు, ఇప్పుడు మైక్రో ఫైనాన్స్, రుణయాప్ లను మించిపోయి జీఎస్టీ పేరుతో వేధిస్తోంది కేంద్రం. ప్రభుత్వం ఇంత నిర్దాక్షిణ్యంగా పన్నులు వసూళ్లు చేయడం దీర్ఘకాలంలో ఆర్థిక అనారోగ్యానికి దారితీస్తోందనే హెచ్చరికలున్నాయి.

పన్నులు ఎలా విధించాలన్న విషయంలో చాలా రకాల ఆర్థిక సూత్రాలు, సిద్ధాంతాలూ ఉన్నాయి. కానీ జీఎస్టీ మాత్రం ఏ సూత్రానికీ అందడం లేదు. అసలు భవిష్యత్తులో జీఎస్టీని ఏ స్థాయిలో విస్తరిస్తారో అనే భయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బయట కొనుక్కునే, తినే వస్తువులపై పన్నేస్తున్నారు. తర్వాత ఇంట్లో చేసుకునే వంటపై కూడా జీఎస్టీ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలున్నాయి.