NTV Telugu Site icon

TTD : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్…ఒక్కరోజే రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం l

Tirumala

Tirumala

గతంలో ఎన్నడూ లేనివిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో
స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. మే నెలలో రికార్డు స్థాయిలో 130 కోట్ల రూపాయల ఆదాయం
వచ్చింది. ఒక్క నెలలోనే ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి. మే నెలలో 22లక్షల 62వేల మంది
భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఎన్నడూ లేనివిధంగా చరిత్రలో తొలిసారి ఒక్క నెలలో స్వామి వారి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఈసారి లడ్డూ
విక్రయాలు 1.86 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇటీవల కాలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రతి రోజు
స్వామివారికి హుండి ఆదాయం నాలుగు కోట్ల రూపాయలకు పైగానే ఉంటోంది. బాగా రద్దీ ఉండే సెలవు రోజుల్లో
స్వామివారి హుండీ ఆదాయం ఐదు కోట్ల రూపాయలుగా ఉంటోంది. నిజానికి గత రెండు సంవత్సరాలుగా కరోనా
మహమ్మారి కారణంగా తిరుపతి దేవస్థానానికి ఆదాయం భారీగా తగ్గింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించి,
చాలాకాలంపాటు తిరుమల శ్రీవారి దర్శనాలను నిలిపివేశారు. అప్పుడు స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా
తగ్గింది. ఆపై తిరిగి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు
అధికారులు. క్రమంగా భక్తుల సంఖ్య పెరిగి ఇప్పుడు దర్శనానికి పోటెత్తుతున్నారు.

కలియుగ ఇల వైకుంఠం తిరుమల.కలియుగంలో వైకుంఠవాసం నుంచి స్వామివారు భూలోకానికి చేరుకుని
సప్తగిరులపై స్వయంభువై వెలసి భక్తులకు దర్శనభాగ్యం ఇస్తున్నారు. ఎనిమిదిన్నర అడుగుల సాలిగ్రామ రూపంలో
కన్నులారా భక్తులకు దర్శనం ఇస్తూన్న శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్దం లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
70 సంవత్సరాల క్రితం శ్రీవారి దర్శనార్దం విచ్చేసే భక్తులు రోజుకి అక్షరాల 600 మంది మాత్రమే. సౌకర్యాలు పెరిగే కొద్ది
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య కూడా పెరుగుతు వస్తోంది. స్వామివారిని తలుచుకుంటే చాలు…తమ కష్టాలు
గట్టెక్కుత్తాయని, శ్రీవారిని మొక్కుకుంటే చాలు తమ ఇబ్బందులు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకు
అనుగుణంగా ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులు సంఖ్యతో పాటు హుండి ఆదాయం పెరుగుతూ
వస్తోంది.

శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతు వస్తూంటే, దర్శన విధానంలో కూడా టిటిడి మార్పులు
చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితుల వలన కులశేఖరపడి వరకు భక్తులును
అనుమతిస్తే, గంటకు వెయ్యి మంది భక్తులుకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తూంది. అదే లఘు దర్శన విధానాన్ని
అమలు చేస్తే గంటకు రెండు నుంచి రెండున్నర వేలమంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది. ఇక
మహలఘు విధానాన్ని అమలు చేస్తే గంటకు నాలుగున్నర వేల నుంచి ఆరు వేల మంది వరకు భక్తులకు స్వామివారి
దర్శనభాగ్యం లభిస్తుంది. ప్రస్తుతం భక్తుల తాకిడికి అనుగుణంగా టిటిడి మహలఘు దర్శన విధానాన్ని అమలు
చేస్తోంది. దీంతో స్వామివారిని 50 అడుగుల దూరం నుంచే మహలఘు విధానంలో భక్తులు దర్శించుకుంటున్నారు.

నిజానికి సామాన్య భక్తులు కూడా శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునే భాగ్యం 1992 వరకు
కొనసాగింది.అప్పట్లో భక్తుల తాకిడి అంతగా లేకపోవడంతో శ్రీవారి భక్తులందరిని కులశేఖరపడి వరకు
అనుమతించేది టిటిడి.1950లో ఏడాది మొత్తానికి శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తుల సంఖ్య 2 లక్షల 26 వేల మంది
భక్తులు మాత్రమే.అంటే రోజుకి 619 మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసేవారు. 1960 నాటికి ఈ సంఖ్య 11
లక్షల 67 వేలుకు చేరుకుంది. అప్పట్లో రోజుకి 3197 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేవారు. 1970లో
స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏడాదికి 33 లక్షల 94 వేల మంది అయితే, ప్రతి నిత్యం 9299 మంది
భక్తులు శ్రీవారిని కులశేఖరపడి నుంచే దర్శించుకునేవారు. 1980లో ఏడాదికి శ్రీవారిని 79 లక్షల 52 వేల మంది
భక్తులు దర్శించుకుంటే, రోజువారిగా శ్రీవారిని దర్శించుకునే భక్తులు సంఖ్య కూడా 21786 మందికి పెరిగింది.
1990లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి కోటి దాటింది.

1990లో కోటి 18 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, ప్రతి నిత్యం సరాసరి 32, 332 మంది భక్తులకు
స్వామివారి దర్శనభాగ్యం లభించింది. ఇక 2000లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రెండింతలైంది. ఆ
ఏడాది 2కోట్ల 37 లక్షల 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే, రోజు వారి భక్తుల సంఖ్య 65 వేలకు
చేరుకుంది. 2010లో 2 కోట్ల 55 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, ప్రతి నిత్యం 70 వేల మంది భక్తులకు
స్వామివారి దర్శనభాగ్యం లభించింది. ఇక 2020 కి భక్తుల సంఖ్య ఏడాదికి 2 కోట్ల 70 లక్షల మంది భక్తులు కాగా,
రోజులో తిరుమలకు వచ్చే వారి సంఖ్య 75 వేలుగా వుంది.

భక్తులు సంఖ్య పెరిగే కోద్ది క్యూ లైను విధానంలో కూడా టిటిడి మార్పులు చేస్తూ వచ్చింది. 1950లో భక్తులు
మహాద్వారం నుంచే నేరుగా ప్రవేశించే సౌలభ్యం వుండగా, 1970 కి భక్తులు సంఖ్య వందల నుంచి వేలకు
చేరుకోవడంతో, పిపిసి షెడ్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది టిటిడి. భక్తుల సంఖ్య 30
వేలకు చేరుకోవడంతో 1984లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను , 2001లో రెండో క్యూ కాంప్లెక్స్ నిభక్తులకు
అందుబాటులోకి తీసుకువచ్చింది టిటిడి. ఆ తర్వాత కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ, దాదాపు 150 రోజులు పాటు
క్యూ లైను వెలుపలికి వస్తూండడంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో కూడా క్యూ లైనులు ఏర్పాటు చేసింది
టిటిడి. ఇలా భక్తులు తాకిడికి అనుగుణంగా క్యూ లైనులు మారుస్తూ వచ్చిన టిటిడి, దర్శనవిధానంలో కూడా భక్తులు
రద్దికి అనుగుణంగా మార్పులు చేస్తూ వచ్చింది.

1992 వరకు భక్తులందరిని కులశేఖర పడి వరకు అనుమతిస్తూ వచ్చిన టిటిడి, 1992 డిసెంబర్ లో లఘు దర్శన
విధానాన్ని ప్రవేశపెట్టింది. రాములవారి మేడ వరకు అనుమతించడం ప్రారంభించింది. 2005లో మహలఘు విధానం
వచ్చిన తర్వాత, టిటిడి జయవిజయల గడప నుంచే స్వామివారి దర్శనభాగ్యం లభించింది. తాకిడి అంతకంతకు
పెరుగులూ ఉండటంతో 2014 లో మహలఘు విధానంలోనే మూడు వరుసల క్యూ లైన్లు ప్రవేశపెట్టింది టిటిడి. ఇలా
శ్రీవారి దర్శన విధానాన్ని భక్తుల తాకిడి పెరిగే కొద్ది మార్పులు చేస్తూ వచ్చిన టిటిడి, ప్రస్తుతం పూర్తి సామర్థ్యానికి
చేరుకుందని చెప్పుకోవచ్చు.

ఆగమశాస్ర్తం మేరకు క్యూ లైను విధానంలో మార్పులు చేసే వెసులుబాటు లేకపోవడంతో, టిటిడి ప్రస్తూతం భక్తులు
క్యూ లైనులో వేచివుండే అవసరం లేకుండా ఏర్పాట్లు చెయ్యడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రత్యేక ప్రవేశ
దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ విధానంలో కేటాయిస్తూ, వారికి కేటాయించిన సమయానికి క్యూ లైను వద్దకు చేరుకుంటే
రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఇదే తరహాలో టోకెన్లు జారీ
చేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినా, పూర్తి స్థాయిలో అమలు చెయ్యలేక పోవడంతో, ఇప్పుడు ప్రత్యామ్నాయం పై
దృష్టి సారించింది టిటిడి.

శ్రీవారి దర్శనార్దం విచ్చేసే భక్తుల సంఖ్య పెరిగే కొద్ది స్వామివారి హుండి ఆదాయం పెరుగుతూ వస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన స్వామివారికి కానుకలు సమర్పించే సంప్రదాయం ఇప్పటిది కాదు.
శ్రీవారి ఆలయ గోడలపై వున్న శాసనాలు ద్వారా లభిస్తున్న సమాచారం మేరకు 9వ శతాబ్దం నుంచే శ్రీవారికి కానుకుల
పరంపర కొనసాగింది.

శ్రీవారి ఆలయ గోడలపై వున్న శాసనాలను పరిశీలిస్తే, పల్లవ రాణి సామవై, శ్రీకృష్ణదేవరాయులు, రాగోజీ భోన్సలే,
వెంకటగిరి రాజులు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు. పల్లవరాణి శ్రీవారి ఆలయంలో
పంచబేరాలలో ఒక్కటిగా పేర్కోనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహంతో పాటు అనేక ఆభరణాలు సమర్పించారు.
శ్రీకృష్ణదేవరాయుల అయితే ఏడుకోండలవాడి దర్శనార్ధం ఏడు విడతలు తిరుమలకు రాగా, వచ్చిన ప్రతిసారి
స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు.ప్రస్తుతం శ్రీవారి అలంకరణకు ఉపయోగిస్తున్న ఆభరణాలలో
కేవలం రగోజి భోన్సలే, వెంకటగిరి రాజావారు సమర్పించిన ఆభరణాలు మాత్రమే పూర్వకాలం నాటివి. మిగిలినవన్ని
1933 తరువాత తయారు చేసిన ఆభరణాలే స్వామివారి అలంకరణకు ఉపయోగిస్తున్నారు అర్చకులు.

శ్రీవారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలను ఆలయంలోను, అలంకరణకు ఉపయోగించని ఆభరణాలను
తిరుపతి పరిపాలన భవనంలోని ట్రెజరిలోను భద్రపర్చింది టీటీడి. శ్రీవారికి రూ.30 కోట్లు విలువ చేసే వజ్రాల కీరిటం, 5
కోట్లు విలువ చేసే వజ్రాల కటి, వరద హస్తాలు, 3 కోట్ల విలువ చేసే బంగారు పీతాంబరం, 3 కోట్లు విలువ చేసే
బంగారు కీరిటం, 75 లక్షలు విలువ చేసే నాగాంబరం, 1740 నాటికే 33 వేలు విలువ చేసే పచ్చలు పోదిగిన ముత్యాల
హారం, 28 వేలు విలువ చేసే వైడ్యూరాలు పొదిగిన బంగారు డాల్లరు, 28వేలు విలువ చేసే 17 పేటల ముత్యాల హారం,
45 వేలు విలువ చేసే 5 పేటల వజ్రాల బంగారు హారం, 8 వేలు విలువ చేసే బంగారు కిరీరిటం వంటివి కాకుండా 35
కిలోల మకరతోరణం, 32 కేజిల ఐదు సవర్ల సహస్రనామమాల, 28కిలోల వజ్రకీరిటం,19కిలోల పీతాంబరం,19 కీలోల
శ్రీవారి పద్మసీఠం,10 కేజిల నాలుగు పేటల మోహరిల దండ ఇలా ఎన్నో ఆభరణాలు వున్నాయి. ఇలా శ్రీవారి
అలంకరణకు 1094 రకాల ఆభరణాలు వుంటే, అందులో 374 వజ్రవైఢ్యురాలతో కూడిన ఆభరణాలు వున్నాయి.
ఇవన్ని కూడా శ్రీవారి ఆలయంలోని బొక్కసంలో భద్రపర్చి వుంటాయి. ఇవి కాకుండా శ్రీవారి అలంకరణకు
ఉపయోగించని ఆభరణాలు మరెన్నో ఉన్నాయి. వీటిని మాత్రం తిరుపతిలోని పరిపాలన భవనంలో భద్రపర్చింది
టీటీడి.

శ్రీవారికి సామంతులే కాదు…సామాన్యులు ఘనంగానే కానుకులు సమర్పిస్తున్నారు.ఇలా శ్రీవారికి హుండిలో సమర్పించే బంగారం విలువ ప్రతి నెల 100 కిలోలు దాటేస్తూంటే,ఏడాదికి 1300 కిలోల వరకు పసిడి శ్రీవారి సొంతమవుతోంది.2008 ముందు వరకు కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి వాటిని డాలర్లుగా విక్రయించేది టిటిడి.2008 నుంచి స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి బ్యాంకులో డిసాజిట్ చేయ్యడం ప్రారంబించింది టిటిడి.ఇలా టిటిడి అకౌంట్ లో ప్రస్తూతం 10 వేల కిలోల బంగారం బ్యాంకులో డిపాజిట్లుగా వుంది…
ఇక స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్యతో పాటే లభిస్తున్న కానుకలు కూడా అంతే స్పీడుగా పెరుగుతూ వస్తున్నాయి.

110 సంవత్సరాల క్రితం శ్రీవారి వార్షిక ఆదాయం మూడున్నర లక్షలు మాత్రమే 1907-08 లో శ్రీవారి వార్షిక ఆదాయం అక్షరాల 3 లక్షల 87 వేల 406 రూపాయలు ఉంటే అది,1923-24 నాటికి రూ.16 లక్షల 35 వేల 517 రూపాయలుకు చేరింది.అలా పెరుగుతు వస్తూన్న శ్రీవారి హుండి ఆదాయం 1951లో నవంబర్ మాసంలో అత్యదికంగా 1 లక్షా 31 వేల 409కు చేరింది.

ప్రపంచ ప్రఖ్యాత ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం టాప్‌ ప్లేస్‌ లో ఉంటుంది. తిరుమలకు తెలుగు రాష్ట్రాల
నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా భక్తులు తరలివస్తూఉంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా
విరాజిల్లుతున్న శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే సాధారణంగా ఏ ఆలయంలో అయినా
సరే ఏదో ఒక సీజన్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ తిరుమల తిరుపతి ఆలయంలో మాత్రం సీజన్తో
సంబంధం లేకుండా భక్తులు భారీగా తరలి వస్తూనే ఉంటారు.

ఎప్పుడు చూసినా శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిట లాడుతూ ఉంటుందనే చెప్పాలి. అయితే కరోనా వైరస్ కారణంగా
మొన్నటివరకూ శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. అటు టీటీడీ అధికారులు
నిబంధనలు విధించడంతో ఎంతోమంది భక్తులు తిరుమల వెళ్ళాలనే ఆలోచనను విరమించుకున్నారు. అయితే
ప్రస్తుతం కరోనా వేవ్‌ భయాలు ఉన్నా, ప్రాణాలు తీసే పరిస్థితిలో లేదనే ధీమా భక్తుల్లో ఉంది. దీంతో తిరుమల వస్తున్న
భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అంతేకాకుండా కరోనా సమయంలో ఒక్కసారిగా పడిపోయిన శ్రీవారి
హుండీ ఆదాయం ఇప్పుడు అంతకంతకు పెరుగుతూ వస్తుంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం తిరుమలలో శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. సోమవారం హుండీ
ఆదాయం రూ6.18 కోట్లు వచ్చింది. తిరుమల చరిత్రలోనే మొట్టమొదటిసారి ఆరు కోట్ల మార్కును హుండీ ఆదాయం
దాటింది. అంతకుముందు 2012 ఏప్రిల్ 1వ తేదీన 5.73 కోట్లు ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక
ఆదాయంగా కొనసాగుతోంది. ఇప్పుడు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో శ్రీవారికి ఏకంగా 6.18 కోట్ల
ఆదాయం ఒకేరోజులో వచ్చింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఒకరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటటం
ఇది రెండోసారి. 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు హుండీలో లభించాయి.

స్వామి వారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల కొద్దీ క్యూలో వేచి ఉంటున్నారు.తిరుమలలోని వసతి కౌంటర్లలో కూడా నో వేకెన్సీ బోర్డులు కనిపిస్తున్నాయి.దాదాపుగా అన్ని ఎగ్జామ్స ఫలితాలు రావటం, విద్యాసంవత్సరం మొదలు కావటంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు.
మునుపెన్నడూ లేనివిధంగా దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం కూడా
భారీగా పెరుగుతోంది.

శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.రద్దీ దృష్ట్యా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకే పరిమితం చేశారు.వీఐపీ బ్రేక్ దర్శనాలపై జూలై 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది.

కరోనా తరువాత ఈ సంవత్సరం నుంచి సర్వదర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించడంతో.. గత రెండేళ్లుగాతిరుమలకు రాలేని భక్తులు స్వామిని దర్శించుకుని భారీగా హుండీ కానుకలు సమర్పించుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,682 మంది స్వామిని దర్శించుకున్నారు. 37,447 మంది తలనీలాలు సమర్పించారు. సోమవారం శ్రీవారిని 77,907మంది దర్శించుకోగా, 38వేల 267మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారికి గతంలో నెలకు వంద కోట్లు లోపు ఆదాయం మాత్రమే లభించేది.రోజు వారి హుండి ఆదాయం మూడు కోట్లకు పరిమితం అయ్యేది.
2010 అక్టోబర్ 23న మొట్టమొదటిసారిగా స్వామివారికి రూ.3 కోట్ల 60 లక్షల రూపాయల హుండి ఆదాయం లభించింది.
ఆ తరువాత 2011 నవంబర్ 1న 3 కోట్ల 80 లక్షల రూపాయలు హుండి ఆదాయంగా లభించింది.ఇక 2012 జనవరి 1న మొదటిసారి స్వామివారి హుండి ఆదాయం నాలుగు కోట్ల మార్క్ దాటింది.అదే ఏడాది హుండి ఆదాయం రూ.5 కోట్ల మార్క్ దాటింది. ఏప్రిల్ 1న టిటిడి చరిత్రలోనే మొదటిసారిగా స్వామివారికి హుండి ఆదాయం రూ. 5 కోట్ల 73 లక్షల రూపాయలు లభించింది. అప్పటి నుంచి స్వామివారి హుండి ఆదాయం 5
కోట్ల మార్క్ అనేకసార్లు దాటినా..రూ.6కోట్లు దాటడానికి చాలా కాలం పట్టింది.

లేటెస్ట్‌ గా స్వామివారికి హుండి ద్వారా 6.18 కోట్లను కానుకలు లభించాయి.కోవిడ్ అనంతరం శ్రీవారి దర్శనార్దం విచ్చేసే భక్తుల సంఖ్య పెరగగా, హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగు నెలలుగా శ్రీవారి హుండి ఆదాయం నెలకు రూ. 120 కోట్ల మార్క్ ని దాటుతోంది. మార్చి నెలలో వడ్డీకాసులవాడికి రూ.128 కోట్ల హుండి ఆదాయం లభించగా, ఏప్రిల్‌లో 127.5 కోట్లు, మే నెలలో 130.5
కోట్లు, జూన్ లో 123.76 కోట్లు హుండి ఆదాయం లభించింది.అంటే, గత నాలుగు నెలల కాలంలోనే 500 కోట్లు పైగా హుండి ఆదాయం లభించింది. దీంతో ఈ ఏడాది శ్రీవారి హుండి ఆదాయం రూ.1500 కోట్ల మార్క్ ని దాటే అవకాశాలు కనిపిస్తూంది. ఇలా వడ్డికాసుల స్వామివారి ఆదాయం
రోజురోజుకు పెరుగుతు వుండడం స్వామివారి వైభవాన్ని విశిష్టతను చాటి చెబుతోంది.