NTV Telugu Site icon

Financial crisis : మీ తలపై లక్ష రూపాయలు అప్పు! మీకు తెలీకుండా ఆ అప్పు పెరిగిపోతుందని తెలుసా?

Sb

Sb

దేశం అప్పుల కుప్పలా ఎందుకు మారింది?రాష్ట్రాలు, కేంద్రం పోటీ పడి అప్పులు చేస్తున్నాయా?కోటి కోట్ల అప్పు తీరేదెలా?దేశం శ్రీలంకలా మారే ప్రమాదం ఉందా?

అప్పుడే తెల్లారిందా అంటూ… అప్పునే తలుచుకుంటూ నిద్రలేస్తాం..ఓ ఫైవ్‌ ఉందా గురూ అనేది ఒకప్పటి మాటైతే.. ఇప్పుడది ఓ వందుందా అనే వరకు చేరింది. ఇది సామాన్యుడి చిల్లర అప్పుల సంగతి మాత్రమే. కానీ, ప్రభుత్వాల అప్పులు వంద లక్షల కోట్లను దాటేశాయి. అంటే దేశంలో ప్రతిఒక్కరూ… అప్పుడే పుట్టిన బిడ్డతో సహా లక్ష రూపాయల బాకీ ఉందంటే దేశం ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రాలకు, దేశానికి వేలు లక్షల కోట్లకు మించిన అప్పులున్నాయి. ఆ రుణభారమంతా మనకు పెనుభారంగా మారనుంది. అయినా సరే ఏ సర్కారు వెనక్కి తగ్గడం లేదు. అప్పు చేసైనా పప్పు కూడా తినాలంటూ తెగ అప్పులు చేసేస్తున్నారు. ఇలా కొండలా పేరుకుపోతున్న అప్పులతో మన ఆధునిక భారతం అప్పుల కుప్పలా మారిపోయింది. తలసరి ప్రతి భారతీయుడి మీదా లక్ష రూపాయల అప్పు ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

అప్పు… అప్పు… అప్పు… ఇప్పుడు ఎక్కడ చూసినా అప్పే. ఇల్లు నడవడానికి మనం ఒక్కరిమే అప్పు చేశామనుకుంటే అది తప్పే. కానీ ఇప్పుడు ఊరంతా అప్పులు చేస్తోంది. ఇంకా చెప్పాలంటూ రాష్ట్రమంతా… కాదు.. కాదు… దేశమంతా అప్పులు చేస్తోంది. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజల్ని ముందుకు నడిపిస్తున్నాయి.

ప్రభుత్వాల్ని నడిపించాలంటే అప్పులు చేయడం తప్పనిసరవుతోంది. రాష్ట్రాలు కేంద్రం ముందు చెయ్యిచాచుతుంటే, కేంద్రం విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటోంది. అప్పుల విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి దేని ట్రాక్‌ రికార్డ్ దానిదే. ఎవరి పన్నులు వాళ్లవే. ఎవరి అప్పులు వాళ్లవే. భారం మాత్రం ప్రజల మీదే. ప్రతియేటా ఎన్నో పన్నులేసి ప్రజల పళ్లు రాలగొడుతున్నా…సరిపోని పరిస్థితి. దీనికితోడు…మరోపక్క తమ కర్మిష్మా పెంచుకోడానికి…. సంక్షేమ పథకాలకు కోట్లకు కోట్లు కేటాయిస్తున్నారు. అడిగిన వాళ్లకు అడగని వాళ్లకూ సబ్సిడీలు ప్రకటిస్తున్నారు. ఇలా ఆదాయం లేకుండా ఖర్చులు పెంచుకుంటూ పోతే.. అప్పులు చేయడక తప్పుతుందా? ఇలా కోటి కోట్ల రూపాయిల అప్పులతో దేశం అప్పుల భారతంగా మారిపోయింది.

2011 డిసెంబర్‌ చివరి నాటికి భారత్‌కున్న అప్పు అక్షరాలా 267 బిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు పదమూడున్నర లక్షల కోట్లు. ఈ అప్పును ఒక్కొక్కరికీ పంచితే… తలా 12 వేల అప్పు వచ్చింది. గత డిసెంబర్‌ నాటికే కేంద్రం అప్పులు రూ. 128.4 లక్షల కోట్లు. దీనికి రాష్ట్రాల అప్పులు అదనం. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల చిట్టా లెక్కేస్తే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడింది.

గత 8 ఏండ్లలో కేంద్రం చేసిన అప్పు రూ.80 లక్షల కోట్లు. అంటే సగటున
ఏడాదికి పది లక్షల కోట్ల అప్పు చేసింది. 67 ఏండ్లలో అన్ని ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.55 లక్షల కోట్లు మాత్రమే. కానీ, ఈ ఎనిమిదేళ్లలో కేంద్రం చేసిన అప్పు రూ.80లక్షల కోట్లు. 2014కు ముందు ఏటా రూ.83 వేల కోట్లు అప్పులు చేస్తే, ఇప్పుడు సగటున నెలకు రూ.83 వేల కోట్లు అప్పులు చేస్తోంది కేంద్రం.
అంటే 67 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో తీసుకొన్న అప్పులకన్నా 8 ఏండ్ల బిజెపి ప్రభుత్వం తీసుకొన్న అప్పులే ఎక్కువయ్యాయని గణాంకాలు చెప్తున్నాయి. గతంలో పనిచేసిన 13 మంది ప్రధాన మంత్రులకంటే ఎక్కువగా ఒక్క నరేంద్ర మోదీ ప్రభుత్వమే అప్పుల్లో రికార్డ్‌ నెలకొల్పింది.

2021 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం దేశ స్థూల జాతీయోత్పత్తి అంటే జీడీపీలో అప్పులు 60.5 శాతం ఉన్నాయి. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి స్వయంగా పార్లమెంటులోనే చెప్పిన విషయం ఇది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 51.5 శాతంగా ఉంది. 2021 మార్చి నాటికి విదేశాల నుంచి మనదేశం తీసుకొన్న అప్పు 570 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరిందని ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. అంటే జీడీపీలో విదేశీ అప్పులు 21.1 శాతం. మరి అప్పులు తీసుకోగానే సరికాదు కదా.. వాటికి వడ్డీలు తడిసి మోపెడవుతాయి కదా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం నుంచి విదేశీ అప్పులు, వాటికి చెల్లించిన వడ్డీలే 8.2 శాతం.

గత డిసెంబర్‌ నాటికే దాదాపు 130 లక్షల కోట్ల అప్పు కేంద్రం చేస్తే, ఇప్పుడది రూ.135.87 లక్షల కోట్లు దాటి రూ.150 లక్షల కోట్ల దిశగా పెరుగుతోందని అంచనాలున్నాయి. అంటే బిజెపి సర్కారు తన ఎనిమిదేళ్ల పాలనలో రూ.80 లక్షల కోట్లు అదనంగా అప్పులు చేసింది. సగటున ఏటా రూ.10 లక్షల కోట్లు అన్నమాట. ఈ ఏడాది మరో 17 లక్షల కోట్ల అప్పు తీసుకోవడానికి మోదీ సర్కారు ప్లాన్‌ చేసింది. దీంతో లక్షన్నర లక్షల కోట్లకు మన అప్పు చేరుతుంది. అప్పుల్లో భారత్‌ చెరగని రికార్డు సృష్టించబోతోంది

ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లు తప్ప మిగిలిన అన్ని సంవత్సరాలు బడ్జెట్‌ అంచనాలు కంటే అధికంగా అప్పులు చేశారు. మొదటి రెండేళ్ళు మాత్రం బడ్జెట్‌ అంచనాల కంటే, కాస్త తక్కువ అప్పులు చేశారు. అయితే మొదటి రెండేళ్ళు కూడా అప్పులు పెరిగాయి. 2014-15లో రూ.అయిదు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయగా, 2015-16లో రూఅయిదు లక్షల 32 వేల కోట్ల అప్పులు చేశారు. 2014-15 కంటే 2015-16లో రూ.22,066 కోట్లు అప్పులు పెరిగాయి. 2016-17 నుంచి గడిచిన ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్‌ అంచనాలు కంటే అధికంగా అప్పలు చేశారు. ఆ తర్వాత నుంచి ఏటా అప్పులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.

కేంద్రం అప్పులు ఇదే లెక్కన పెరిగితే 2023 నాటికి దేశ మొత్తం బాకీ రూ. 153లక్షల కోట్లకు చేరనుందని అంచనాలున్నాయి. మరోపక్క ఎనిమిదేండ్ల గరిష్ఠానికి పెరిగిన ద్రవ్యోల్బణంతో నిత్యావసరాలు ఆకాశాన్నంటాయి. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా దిగజారుతోంది. మరోవైపు దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు 600 బిలియన్‌ డాలర్ల దిగువకు చేరుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో దేశం నుంచి అత్యధిక ఎగుమతులు జరిగినప్పటికీ దిగుమతులు కూడా 24.21% పెరగటంతో వాణిజ్య లోటు 19.76% పెరిగి 18.51 బిలియన్‌ డాలర్లకు చేరింది.

అప్పుడే పుట్టిన బిడ్డ నుండి, రిటైరైన వ్యక్తి వరకు.. అందరూ తలా లక్ష రూపాయలు బాకీ పడి ఉన్నారంటే ఎంతో ఆందోళన చెందాల్సిన అంశం. ఈ అప్పుని ఎవరూ తలుపుకొట్టి వసూలు చేయకపోవచ్చు. వ్యక్తిగత ఎకౌంట్ల నుండి చెల్లించాల్సినవి కాకపోవచ్చు. కానీ, నూట ముప్పై కోట్ల మందికి ప్రాతినిధ్యంవహించే ప్రభుత్వం చేసే అప్పులు ఉమ్మడి ఆస్తి నుండి అంటే ఈ దేశ వనరుల నుండి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అప్పులు పెరుగుతున్న కొద్దీ, అనేక రకాలుగా సామాన్యుడి బతుకు కుచించుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన ఉంది.

కేంద్రమే కాదు.. ఇటు రాష్ట్రాలు కూడా అప్పుల్లో కూరుకుపోతున్నాయి. జనవరి 2022 నాటికి దేశంలోనే అప్పుల్లో టాప్‌ ప్లేస్ లో ఉంది పంజాబ్‌. ఆ రాష్ట్రం రుణభారం 3.01లక్షల కోట్లు. కానీ, ఆ రాష్ట్రం జీఎస్‌ డీపీలో అప్పులు 53.3శాతం ఉన్నాయి. ఇక రెండో స్థానంలో రాజస్థాన్‌ ఉంది.. ఆ రాష్ట్ర అప్పు 3.46లక్షల కోట్లున్నా, జీఎస్‌డీపీలో 39.8శాతం ఉంది. బెంగాల్‌ అప్పుడు 5.28లక్షల కోట్లు ఇది జీఎస్‌ డిపిలో 38శాతం ఉంది. ఈ జాబితాలో ఏపీ ఐదో స్థానంలో ఉంది. 3.89లక్షల కోట్ల అప్పులతో జీఎస్‌ డీపీలో 37.6శాతం అప్పులున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రాల అప్పుల చిట్టాలో ఎనిమిదో స్థానంలో ఉంది. తెలంగాణ జీఎస్‌ డీపీలో 25శాతం అంటే 2.45 లక్షల కోట్ల అప్పులున్నాయి.

ఇక్కడ ఓ వాదన తరచూ వినిపిస్తుంది. రాష్ట్రాలు ఎడా పెడా అప్పులు చేస్తున్నాయని కొందరు..లేదు కేంద్రమే లెక్కాపత్రం లేకుండా అప్పులు చేస్తోందని మరికొందరు వాదిస్తుంటారు. నిజానికి అప్పులు చేయటంలో, ఆర్ధిక క్రమశిక్షణ లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పరిమితులను పాటించటం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.
అప్పులు, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఎఫ్‌ ఆర్‌ బిఎమ్‌ నిర్దేశించిన పరిమితులను ఉల్లంఘిస్తునే ఉన్నాయి.

ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేనేజ్మెంట్ నే షార్ట్ గా ఎఫ్‌ ఆర్‌ బీఎం అంటారు. సాధారణంగా ప్రతీ సంవత్సరం ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రభుత్వ రాబడికి, వ్యయానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వ రాబడి కన్నా ఖర్చు అధికంగా ఉంటుంది. ఇలా రాబడితో పోలిస్తే బడ్జెట్ వ్యయం మించిన పక్షంలో ఆ వ్యత్యాసాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటుగా పరిగణిస్తారు. ప్రభుత్వాలు ఈ లోటుని అప్పుల ద్వారా పూడుస్తాయి. ఐతే ప్రతీ సంవత్సరం ఈ ఫిస్కల్ డెఫిసిట్‌ని భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తుండడంతో ప్రభుత్వాలు చెల్లించాల్సిన అప్పులు పెరిగి ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంటాయి. చివరికి ప్రభుత్వాలకు వచ్చే రాబడిలో ఎక్కువ శాతం అభివృద్ధిపై కాకుండా ఈ అప్పులకయ్యే వడ్డీలకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

ప్రభుత్వాలు తమ చేతికి ఎముక ఉండదనుకుంటాయి. ఆ ఖర్చు ప్రజలు ఉపయోగపడినా లేకున్నా, చేతినిండా సొమ్ముండాలని ఆశిస్తాయి. కానీ, దానికోసం ఇష్టానుసారంగా అప్పులు చేయకుండా, ఆర్ధిక వ్యవస్థ నియంత్రణలో ఉంచేందుకు 2003లో కేంద్రం ఎఫ్‌ ఆర్‌ బీఎం ఆక్ట్ ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా కేంద్ర, రాష్ట్రాల జీడీపీలో ఫిస్కల్ డెఫిసిట్ శాతంపైనా, జీడీపీలో అప్పుల శాతంపైనా పరిమితులు విధించారు. ఐతే 2017లో ఈ చట్టాన్ని పునఃసమీక్షించడానికి ఒక కమిటీని వేశారు. ఇది ఆర్థిక నిబంధనలకు సంబంధించి కొన్ని సవరణలు చేసి అవలంబించాల్సిన ఆర్ధిక పరిమితులను నిర్దేశించింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వాలు పాటించాలి. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం జీడీపీలో ఫిస్కల్ డెఫిసిట్ శాతాన్ని 0.3% తగ్గించుకుంటూ 2023 మార్చి 31 నాటికి ఫిస్కల్ డెఫిసిట్ ని జీడీపీలో 2.5% వరకు పరిమితం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రభుత్వ రుణాలు జీడీపీలో 60% మించకుండా ఉండేలా ప్రయత్నించాలి. 2024-25 చివరికల్లా కేంద్ర ప్రభుత్వ రుణాలు GDPలో 40% మించకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు GDPలో 20% మించకుండా ఉండేలా ప్రయత్నించాలి.ఐతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పడు ఈ పరిమితిని సవరిస్తూ ఫిస్కల్ డెఫిసిట్ పరిమితులకు మించి అప్పులు చేస్తున్నాయి. ఇందువల్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. మొదటిసారి ద్రవ్య నియంత్రణ చట్టాన్ని తెచ్చినప్పటి నుండి ఇప్పటివరకు GDPలో అప్పుల నిష్పత్తి తగ్గుతూ వస్తున్నప్పటికీ, 2018లో నిర్దేశించిన లక్ష్యాలను మాత్రం ఇంకా చేరుకోలేదు.

మార్చ్ 2014 నాటికి భారత దేశం విదేశాల నుండి, అంతర్జాతీయ సంస్థల వద్ద నుండి చేసిన అప్పులు 440.6 బిలియన్ డాలర్లు. డిసెంబర్‌ 2021నాటికి ఇది 614.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2013-14లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు కలిపి జీడీపీలో 67.06% గా ఉంటే, 2019-20 చివరికల్లా 69.62%కి చేరుకుంది. అంటే ఎఫ్‌ ఆర్‌ బీఎం రూల్స్‌ ని తుంగలో తొక్కుతున్నాయని స్పష్టంగా అర్థమౌతుంది. దీనికి కేంద్ర, రాష్ట్రాలు ఏదీ అతీతం కాదు. రెండూ వేటికవే ఎడాపెడా అప్పులు చేస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఇతర రాష్ట్రాలు కూడా అప్పుల వాటా విషయంలో FRBM పరిమితులను దాటేస్తున్నాయి. ఒకటి రెండు రాష్ట్రాలు మాత్రమే జీఎస్‌డీపీలో అప్పుల వాటాని పరిమితుల లోపు ఉంచుతున్నాయి.

కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రాలకు అప్పులు చేయటంలో కొన్ని పరిమితులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశించిన పరిమితులకు లోబడే ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితులను దాటి అప్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాలి. కరోనా కాలం తర్వాత, రాష్ట్రాలు ఆదాయం తగ్గటంతో ఈ నిబంధనలు సడలించాలని డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. మరోపక్క కొన్ని రాష్ట్రాలు జీఎస్‌డీపీ అంచనాలు తప్పుగా చూపి ఎక్కువ అప్పు సాధిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ, రాష్ట్రం ఏదైనా కేంద్రం నిర్దేశించిన పరిమితులకు లోబడే రుణాలు తీసుకుంటాయి తప్ప, ఈ పరిమితులు కాదని అప్పులు చేసే అధికారం వాటికి లేదు.

కానీ, అప్పులుచేయడంలో రాష్ట్రాలకు చెక్‌ పెట్టే కేంద్రం తనకు తాను కావలసినన్ని వెసులుబాట్లు ఇచ్చుకుంటోందనే ఆరోపణలు రాష్ట్రాల నుండి వినిపిస్తున్నాయి. రాష్ర్టాల అప్పులను బూతద్దంలో చూస్తూ, ఆంక్షలు పెట్టే కేంద్రం తాను చేసే అప్పులకు మాత్రం ఎలాంటి రూల్స్‌ పాటించటం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. పైగా తాను చెప్పిన సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకే అదనపు రుణాలని చెప్తోంది కేంద్రం. మరోపక్క అప్పులు తీర్చటంలో కేంద్రానికి ఉన్నంత వెసులుబాటు రాష్ట్రాలకు లేదు. సహజంగానే కేంద్రానికి ఆదాయ వనరులు ఎక్కువ. పైగా సబ్సిడీలు తగ్గించడం, పన్నుల భారం పెంచడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునే అవకాశం కూడా ఉంది. రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో అప్పుల్లో కూరుకుపోతున్నాయి.

అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడూ పారే ఏరు ఉన్న ఊర్లోకే వెళ్లమన్నారు పెద్దలు. అంటే ఎప్పుడొస్తుందో తెలియని అవసరంలో ఆదుకోడానికి అప్పు తీసుకోవడం తప్పనిసరి అనే విషయం అందరూ ఒప్పుకుంటారు. కానీ, ఇప్పుడు అప్పు అత్యవసరం కాదు.. నిత్యవసరంలా మారిపోయింది. దేశాన్ని తాకట్టు పెట్టే స్థాయికి మన అప్పులు ఎదిగిపోయాయి. ఇప్పుడు అప్పు చేయడం అవసరమా అంటే… అవసరమే కాదు.. అత్యవసరం అన్న సమాధానం వస్తుంది. అవును ఒకరకంగా చెప్పాలంటే అప్పే మన దేశాన్ని నడిపిస్తోంది. సరళీకృత ఆర్థిక విధానాలు మొదలయ్యాక… ఆర్థిక సంస్థలన్నీ అప్పుల పునాదుల మీదే నిలబడుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో అమెరికా ఆర్థిక విధానాలన్నీ ఇక్కడా అమలయ్యే పరిస్థితి నెలకొంది. కానీ, 2008లో అమెరికాతో పాటు.. ప్రపంచాన్నీ కుదిపేసిన మాంద్యానికి మూల కారణం కూడా ఈ అప్పే.

అయితే, కేంద్రమైనా, రాష్ట్రమైన చేసే అప్పుల ప్రభావం పడేది అంతిమంగా ప్రజలపైనే. అందుకే అప్పులకు నియంత్రణ ఉండాలి. కానీ, ఉన్న నియంత్రణలు నామమాత్రంగా మారిపోయాయి. దీంతో, దేశ అప్పులు తడిసిమోపెడై, నూటముప్పై కోట్ల జనాభాకు తలా లక్ష రూపాయల అప్పు పోగైంది. మరోపక్క గత కొద్దిరోజులుగా భారత ఆర్ధిక వ్యవస్థ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.80 వరకు పడిపోవచ్చని అంచనాలున్నాయి. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల కూడా డాలర్ పై ప్రభావం పడుతోంది. ఇలాగే కొనసాగితే దిగుమతులు మరింతగా భారం కానున్నాయి. దీని వల్ల క్రూడ్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే మనదేశంలో ధరల మోత.. మరింత పెరిగిపోనుంది. ఇది సామాన్యుల జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది

ఇక వంట నూనె మొదలు అన్ని నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్‌, మందులు, ఎలక్ట్రానిక్స్‌ వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెరుగుతున్న ధరలతో పేదలు, సామాన్యులు విలవిలలాడుతున్నారు. బడ్జెట్‌ లెక్కలు తారుమారై అవస్థలు పడుతున్నారు. రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. కూరగాయలు, పాలతో పాటు అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఈ భారంతో.. అన్ని ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యుడు ఏమీ కొనలేని.. ఏమీ తినలేని పరిస్థితి ఉంది..

ఓ పక్క పెరుగుతున్న అప్పులు, మరోపక్క పెరుగుతున్న ధరలు… ఈ రెండూ చూసిన వారికి వెంటనే గుర్తొచ్చేది శ్రీలంక పరిస్థితే. మనదేశం పరిస్థితి కూడా శ్రీలంక లాగే అవుతుందా? అప్పులు పెరిగిన రాష్ట్రాలు శ్రీలంకలాంటి సంక్షోభంలో పడతాయా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. శ్రీలంకలో పరిస్థితి దిగజారింది. పూటగడవటం కష్టమైంది. ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. రాజపీఠాలను కదిలిస్తున్నారు. అలాంటి పరిస్థితి మనదేశానికి వస్తుందా అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న. శ్రీలంక జీడీపీ, అప్పుల రేషియో 2019లో 50శాతంలోపే ఉంటే ఇప్పుడది వంద దాటింది. అందుకే ఆ దేశం అల్లకల్లోలమౌతోంది. అయితే, మనదేశంలో జీడీపీ వృద్ధి రేటు తగ్గడం కారణంగానే జీడీపీలో అప్పుల శాతం పెరిగిందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.కానీ, అప్పులు పెరిగితే క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గుతుంది. దీంతో తీసుకునే అప్పులకు ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది.. ఒకవేళ ఈ అప్పులన్నీ ఒకేసారి చెల్లించాల్సి వస్తే, అప్పుడు దేశం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

మరోపక్క డాలర్‌ రిజర్వ్‌ లు 600బిలియన్‌ డాలర్లపై నుండి కొద్ది వారాల్లోనే అనూహ్యంగా తగ్గాయి. ఇన్‌ ఫ్లేషన్‌ భారీగా పెరిగింది. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికలే. కానీ, ఇవన్నీ ఎలా ఉన్నా, దేశ వృద్ధి రేటు ఇంకా ఆశావహంగానే ఉంది. అందువల్ల ఒడిదుడుకులున్నా శ్రీలంకకు వచ్చినంత కష్టం మన దేశానికి రాదనే అభిప్రాయాలే బలంగా ఉన్నాయి.

మరోపక్క ఏపీ లాంటి రాష్ట్రాలు బడ్జెట్‌ లో ఎక్కువ భాగాన్ని సంక్షేమ పథకాలకు ఖర్చుచేసి అప్పుల్లో కూరుకుపోతున్నాయనే అభిప్రాయాలున్నాయి. కానీ, సబ్సిడీలు, ప్రజలకు నగదు బదిలీ కూడా తిరిగి ఏదోరకంగా మార్కెట్‌ కు చేరే మార్గాలే అనే వాదనలు కూడా ఉన్నాయి.

మరోపక్క దేశం అప్పులు 150 లక్షల కోట్లవైపు పెరుగుతుంటే ప్రభుత్వాలు మాత్రం కొందరు బడా బాబుల అప్పులను ఉత్సాహంగా మాఫీ చేస్తున్నాయి. దేశీయ బ్యాంకులు 2021 ఆర్థిక సంవత్సరంలో బడా వ్యాపారవేత్తలకు చెందిన రూ.2.02 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. దీంతో 2014 నుంచి మాఫీ అయిన మొత్తం రుణాలు రూ.10.7 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో 75% ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే. మరోపక్క ఏటా వేల కోట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వాలు ప్రజలకు పన్నుల్లో ఉపశమనం కలిగిస్తున్నది కూడా లేదు. అది కూడా చేస్తే మరింత అప్పులు చేస్తారేమో. మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌పై పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు రూ.74,158 కోట్లు చేరాయి. 2020-21కి వచ్చేనాటికి ఈ మొత్తం ఏటా రూ.3 లక్షల కోట్లకు చేరింది. మొత్తంగా ఈ ఏడేండ్లలో రూ.16.7 లక్షల కోట్లు వసూలు చేసింది. అంటే ఓ పక్క పన్నులూ పెరిగాయి.. అప్పులూ పెరిగాయి. ఇటు ప్రజలపై ప్రత్యక్ష భారం పెరుగుతూనే ఉంది. పరోక్షంగా అప్పులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. అప్పుల కుప్పలా మారిన భారత ఆర్థిక వ్యవస్థ…సామాన్యుణ్ని ఎలాంటి సంక్షోభంలో పడేస్తుందో అనే ఆందోళన రాకమానదు.