Story Board: బంగారాన్ని మనం తయారు చేయలేం. భూమి నుంచో, సముద్రం నుంచో వెలికి తీయాల్సిందే. కానీ రోజు రోజుకీ పసిడి లభ్యత తగ్గిపోతోంది. భూగర్భంలో, సముద్రగర్భంలో నిల్వలు ఉన్నాయనుకున్నా.. మైనింగ్ గోల్డ్ పరిమాణం తగ్గిపోతోంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి.. ధర దూసుకుపోతోంది. చివరకు ఫ్యూచర్ మార్కెట్ కూడా పట్టుకోలేని విధంగా అపరంజి తళుకులీనుతోంది.
Read Also: Bengaluru: రోడ్లపై వివాదం వేళ డీకే.శివకుమార్‌ను కలిసిన కిరణ్ మజుందార్
కాలాలు, దేశాలు, సందర్భాలతో సంబంధం లేకుండా.. బంగారానికి ఎప్పుడూ విలువ ఉంటుంది. గత వందేళ్ల చరిత్ర తీసుకున్నా.. ఎప్పటికప్పుడు బంగారం ధర పెరుగుతూనే ఉంది. అయితే గత పదేళ్లుగా ఆ పెరుగుదల వేరే స్థాయిలో ఉంది. అందులోనూ ఈ ఏడాది మరీ ఎక్కువగా ఉంది. ఏకంగా 60 శాతం ధర పెరిగింది. ఇది ముందస్తు అంచనాల రికార్డుల్ని కూడా చెరిపేసింది. ఈ స్థాయిలో దూసుకుపోతున్న బంగారం దూకుడు చూసి.. మిగతా పెట్టుబడి మార్గాలన్నీ చేతులెత్తేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులంతా.. పసిడికి జై కొడుతూ.. ఆ లోహం విలువను అమాంతం పెంచేస్తున్నారు. అసలు బంగారం ధర పెరుగుదలకు పైకి కనిపించే కారణాలన్నీ ఓ ఎత్తైతే.. ఆ లోహం లభ్యత తగ్గిపోతుండటం కూడా ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది.
Read Also: Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లలో బిగ్ ట్విస్ట్.. చివరి రోజు భారీగా..!
ప్రపంచవ్యాప్తంగా బంగారం గనులు పరిమితంగా ఉన్నాయి. ఉత్పత్తి ఓ స్థాయికి మించి పెరగటం లేదు. కానీ డిమాండ్ మాత్రం అనూహ్యంగా పెరిగిపోతోంది. అందుకని డిమాండ్ కు అనుగుణంగా బంగారం లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే బంగారం వెలికితీసే ప్రక్రియ చాలా ఖరీదైనది. అలాగే బంగారం లభ్యమయ్యే ప్రతిచోటా వెలికితీయటం కుదిరే పని కాదు. అందుకే భూగర్భంలో, సముద్రగర్భంలో బంగారం నిల్వలకు కొరత లేకపోయినా.. నిల్వలున్న ప్రతిచోటా మైనింగ్ చేయలేని పరిమితి.. గోల్డ్ కు డిమాండ్ పెంచేస్తోంది.
Read Also: Mollywood : మలయాళ సినిమా హిస్టరీని తిరగరాసేందుకు రెడీ అవుతుతున్న మోహన్ లాల్, మమ్ముట్టి
ఇప్పటికే కొన్ని దేశాల్లో బంగారం గనులు ఇక వెలికితీసే పరిస్థితి లేక మూతపడ్డాయి. మన దేశంలోనూ కేజీఎఫ్ దీనికి పెద్ద ఉదాహరణ. అలా ఓవైపు గనులు మూతపడుతుంటే.. అదే స్థాయిలో కొత్త గనులు వెలుగుచూడటం లేదు. కొన్నిచోట్ల బంగారం నిల్వలు గుర్తించినా.. అవి వెలికితీయలేని స్థితిలో ఉన్నాయని తేలిపోయింది. ఇక ఇప్పటికే వినియోగంలో ఉన్న గనుల నుంచి వెలికితీత ఇప్పటికే పతాకస్థాయికి చేరిందని ఓ అంచనా. ఈ స్థితిలో కొత్తగా బంగారం వెలికితీసే పరిస్థితి కనుచూపుమేరలో కనిపించడం లేదు. దీంతో రోజువారీగా వచ్చే బంగారాన్ని జాగ్రత్తగా వాడుకోవడం మినహా వేరే ఆప్షన్ లేదు. దీంతో పరిమిత ఉత్పత్తికి.. అపరిమిత డిమాండ్ కు పొంతన కుదరక.. పసిడి వయ్యారాలు పోతోంది.
Read Also: Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నిక.. ఊహించని మెజారిటీతో గెలుపు
ఊహించని పసిడి డిమాండ్ చూసి.. ప్రపంచ దేశాలన్నీ బిత్తరపోతున్నాయి. కొత్తగా బంగారం వెలికితీసే మార్గాల కోసం కూడా అన్వేషిస్తున్నాయి. కానీ అవి అంతగా ఫలితాన్నివ్వడం లేదు. మన దేశం కూడా మైనింగ్ వేస్ట్ నుంచి బంగారం వెలికి తీయటంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఇలాంటి ప్రయోగాలు అసలు ఫలితాన్ని ఇస్తాయా.. లేదా.. ఇచ్చినా ఎప్పటికి బంగారం వెలికితీయగలరు అనే ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిక కాదు. దీంతో బంగారం కోసం సాధారణ ప్రజలతో పాటు కేంద్ర బ్యాంకులు, దేశాలు కూడా పోటీపడుతున్నాయి. ఈ పోటీ మరింత తీవ్రమయ్యే కొద్దీ.. పుత్తడి రేటు ఇంకా పెరుగుతూ పోతోంది.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు, యుద్ధాలు జరుగుతున్న తరుణంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గుతున్నారు. మార్కెట్లు తారుమారు అయినప్పుడు బంగారం విశ్వసనీయంగా కనిపిస్తుంది. అంతేకాదు వడ్డీరేట్లు తగ్గే సూచనలు ఉన్నందున, బంగారం లాంటి ఆస్తులపై ఆకర్షణ పెరుగుతోంది. అమెరికా డాలర్ బలహీనపడటంతో బంగారం విదేశీ కొనుగోలుదారులకు చౌకగా మారుతోంది. ఇన్వెస్టర్లు, పెద్ద సంస్థలు, వ్యక్తిగతంగా ఈటీఎఫ్‌లు, బార్‌లు, నాణేల రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకుతున్నాయి. ద్రవ్యోల్బణ భయంతో డబ్బు విలువ పడిపోతుంటే, బంగారం సంపదను కాపాడే సాధనంగా మారుతోంది.
ప్రపంచమంతా బంగారానికి డిమాండ్ ఉన్నా.. భారత్‌లో పసిడికి ఉండే ప్రత్యేకత వేరని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయులు పసిడి ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడతారు. అలాగే బంగారం ఎంత ఉంటే అంత గౌరవంగా భావిస్తారు. ఇక పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారం కచ్చితంగా ఉండాల్సిందే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు తోడు.. భారత్ కు వచ్చేసరికి దేశీయ డిమాండ్ కూడా భారీగా ఉంటోంది. దీంతో ఇక్కడ బంగారం మరింతగా కొండెక్కి కూర్చుంటోంది.
గత పదేళ్ల నుంచి బంగారం ధర ఏకంగా లక్ష రూపాయల వరకు పెరిగింది. ఇక చివరి 9 నెలల్లో చూసుకుంటే ఏకంగా బంగారం ధర 44 వేల రూపాయలు పెరిగింది. గతేడాది చివర్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,000 ఉండేది.కానీ ఇప్పుడు అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ ఏకంగా లక్షా 34 వేల రూపాయలు దాటింది. ఈ లెక్కన బంగారం ధర ఎంత వేగంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
గత ఇరవై ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మతిపోతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000వ సంవత్సరంలో రూ.4,400 ఉండగా.. 2005 నాటికి రూ.7 వేలకు పెరిగింది. 2010లో తులం బంగారం ధర రూ.18,500గా ఉండగా.. 2015 నాటికి రూ.26,300కి చేరుకుంది. 2020లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,600గా ఉంది.ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,34,000 దాటింది. పసిడి ప్రతి ఐదేళ్లకు సగటున 50 నుంచి 60 శాతం దాకా పెరుగుతూ వచ్చింది. ఏడాదికి కనీసం 15 శాతం రేటు పెరుగుతోంది. నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగినా.. తులం బంగారం రూ.లక్షకు చేరడానికి మరో పదేళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తప్పని నిరూపిస్తూ.. ఐదేళ్లు తిరక్కుండానే.. పుత్తడి రూ.లక్ష ముప్ఫై నాలుగు వేలు దాటిపోయి ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు కొడుతోంది.
ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశ ఆర్థిక స్థితీ బాగాలేదు. ఇక సామాన్యుడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వేతనాల పెంపు గురించి మర్చిపోయి చాలాకాలమైంది. ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉంటే అదే పదివేలు. నెల జీతం కోతల్లేకుండా వస్తే.. అంతే చాలు అనుకునే గడ్డురోజులు. పైసా పైసా ఆచితూచి ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోంది. ఎక్కడ బడ్జెట్ అదుపుతప్పినా.. అప్పు చేయటానికి కూడా భయమేస్తోంది. ఎందుకంటే బ్యాంకులు బిలియనీర్లు ఎగ్గొట్టిన పారుబాకీలు వదిలేసి.. సామాన్యుడిపై సరికొత్త ఛార్జీలతో విరుచుకుపడుతున్నాయి. దీంతో అప్పు చేయడం కంటే ఉన్నంతలో సర్దుకోవటం మేలనుకునే కాలం నడుస్తోంది. ఖర్చులు తగ్గించుకోవడం ఎలా అనే అంశానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉందంటే నమ్మాల్సిందే. ఆదాయం పెంపుపై ఆశలు అడుగంటిపోవడంతో.. ఉన్న కాస్త డబ్బుపై అతి జాగ్రత్త పెరిగిపోతోంది. అప్పటికీ తరతరాలుగా ఉన్న పొదుపు అలవాటుకూ స్వస్తి చెప్పేశాం. అయినా సరే చాలీచాలని ఆదాయాలతో జీవనప్రమాణాలు ఏమాత్రం పెరగటం లేదు. ఇప్పుడిలా ఉంది సరే.. కనీసం భవిష్యత్తైనా బాగుంటుదనే ఆశావాదంతో బతుకుదామంటే.. ఆ సూచనలూ కనిపించడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ క్లిష్ట పరిస్థితిలోకి జారుకుంటోంది. పాత సమస్యలు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇలా సుదీర్ఘ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటం.. సామాన్యులకు రెండు రకాల నష్టం చేసింది. మొదటిగా జీవనప్రమాణాలు పెరగపోగా.. దిగజారకుండా ఎలా చూసుకోవాలా అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితులకు తోడుగా.. బంగారం మినహా ఇతర పెట్టుబడి సాధనాలన్నీ ఆశించిన రాబడులు ఇవ్వలేక చేతులెత్తేస్తున్నాయి. దీంతో అసలే సేఫ్ హెవెన్ గా ఉండే బంగారం.. మరింత అపురూపమైపోయింది. ప్రస్తుత పరిస్థితులు, సమీప భవిష్యత్ అంచనాలు ఏవి చూసినా.. కాంచనానికి తిరుగులేదనే సంకేతాలే వెలువడుతున్నాయి.
