Story Board: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలు సినిమా డైలాగ్‌లు పేల్చుతున్నారు. మేం అధికారంలోకి వస్తే…మిమ్మల్ని జైలుకు పంపతామంటూ ప్రత్యర్థులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఎప్పుడు జైలుకు పంపేది…ముహూర్తం కూడా ముందుగానే పెట్టేస్తున్నారు. వాళ్లు వీళ్లు అనే తేడా లేదు…అన్ని రాజకీయ పార్టీ నేతలు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు.
Read Also: Minister Anitha: చిన్న పిల్లలతో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
ఒకరేమో అధికారంలోకి రాగానే జైల్లో వేస్తామంటారు. ఇంకొకరేమో కాళ్లు కీళ్లు విరగ్గొడతామంటారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో బాగా తెలుసుని మరో నేత హెచ్చరిస్తారు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ…ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలు బరి తెగించారు. ప్రత్యర్థులను భయపెట్టడానికి…ఆత్మరక్షణలో పడేయడానికి…బెదిరింపు రాజకీయాలను అస్త్రం వాడుకుంటున్నారు. ప్రత్యర్థులకు వార్నింగ్‌లు ఇవ్వడంలో ఎవరు తగ్గడం లేదు. ఒకర్ని మించి మరొకరు సినిమా డైలాగ్‌లతో రెచ్చిపోతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు పోయి…బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇందులో అధికార, విపక్షం అన్న తేడా ఏమీ లేదు. నువ్వొకటి అంటే…నేను రెండు అంటానంటున్నారు. నోటికి ఎంత మాట వస్తే…అంత అనేస్తున్నారు. తాము రాజకీయ నేతలమన్న సంగతి మరిచిపోయి…దిగజారి ప్రవర్తిస్తున్నారు. ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో…బెదిరించడంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
Read Also: NTRNeel : ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్?
ఏపీలో మెడికల్ కాలేజ్‌ల విషయంలో…వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వానికి, కాలేజీలను తీసుకునే వారికి డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే…మెడికల్ కాలేజీలు తీసుకున్న వారంతా జైళ్లలో ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలను ఎవరు తీసుకున్నా…సరే కచ్చితంగా జైలుకు పంపుతానని బెదిరింపులకు దిగారు.
Read Also: Delhi High Court : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్టర్లను జైళ్లలో వేస్తామని బెదిరిస్తే ఏమనుకుంటున్నారు ? బెదిరించే సమూహం ఎవరైనా సరే…మిగతా వాళ్ల సంగతి నాకు తెలియదు… పవన్‌కల్యాణ్‌కు అధికారం ఉన్నా, లేకపోయినా ఒక్కటేనంటున్నారు. ఇంట్లో నుంచి బయటికొచ్చేటపుడు తిరిగి వెళ్తామో.. లేదో… అనే డిసైడ్ అయి వస్తానంటూ పవన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు కూడా భయపడుతున్నారని… ఎందుకలా అంటే, వాళ్ల వెనకాల రౌడీలు, కిరాయి హంతకులున్నారని చెవిలో చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతుందంటూ హెచ్చరించడం హాట్‌టాపిక్‌గా మారింది. రౌడీయిజం అంటే కాలుకు కాలు, కీలుకు కీలు విరగ్గొట్టి, మడత పెట్టి కింద కూచోపెడతానంటూ హెచ్చరించారు. ఇంత బలమైన పోలీస్ యంత్రాంగం పెట్టుకుని, ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే, మళ్లీ ఇలాంటి మాటలు రావని… అక్కడి దాకా తీసుకెళ్లొద్దని వైసీపీ నేతలకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక్కడ కూర్చొని మళ్లీ అధికారంలోకి వస్తామని…ఏదో చేస్తామని హెచ్చరిస్తున్నారని… వచ్చినప్పుడే మీరేం పీకలేదంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు పవన్ కల్యాణ్. పద్ధతులు మార్చుకోవాలని సూచించిన పవన్ కల్యాణ్…ప్రజాస్వామ్యంలో విమర్శ చేయడానికి హక్కులుంటాయన్నారు. గీత దాటితే ముద్రలు వేయడానికి మీ చేతికి ఏమీ వుండవని…మీ చేతుల్లోని గీతల్ని అరగదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. పాత పద్ధతిలోనే అంటామంటే ఊరుకోబోమని…తాను విసిగిపోయామంటూ డైరెక్టుగానే వైసీపీ నేతలను హెచ్చరించారు. ఆశయం కోసం ప్రాణం పోతే ఓకే కానీ…పోయే ముందు చాలా మంది తాట తీస్తానన్న పవన్…రోమం తీసి కింద కూచోపెడతాం…గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ మంత్రి లోకేశ్ కూడా తానేం తక్కువ కాదంటున్నారు. ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడని…అలాగే మనకు కూడా ఓ విలన్ ఉన్నాడంటూ జగన్‌ను టార్గెట్ చేశారు. ఆయన వస్తే అరెస్టు చేస్తారట..మన నాయకుడిని జైల్లో వేసి ఏం చేయగలిగారని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా ? ఆయన కంటే ముందు ఇలాగే మాట్లాడిన వారి పరిస్థితి ఇప్పుడేమైందో గుర్తు తెచ్చుకోండంటూ…జగన్ పేరు ఎత్తకుండా నారా లోకేశ్ పంచ్ డైలాగ్‌లు పేల్చారు.
నారా లోకేశ్.. వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారని.. రప్పా రప్పా అంటున్నారని.. మేం రెండు రప్పాలిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్‌లో కేవలం మూడు పేజీలే అయ్యాయని…ఇంకా చాలా ఉన్నాయంటూ ప్రత్యర్థులను బెదిరించారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూనే.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని లోకేశ్ హెచ్చరించారు.
అధికార పార్టీ నేతలతో పాటు వైసీపీ నేతలు.. ప్రత్యర్థులకు వార్నింగ్‌లు ఇవ్వడంలో ఆరితేరిపోయారు. పంచ్ డైలాగ్‌లు పేల్చడానికి పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకుపైగా సమయం ఉన్నప్పటికీ.. బెదిరింపు డైలాగ్‌లు పేల్చడంలో రాటుదేలిపోయారు. ఒకర్ని ఒకరు బెదిరించుకోవడంలో.. ఎవరు తగ్గడం లేదు. తాము ప్రజాప్రతినిధులమన్న సంగతి మర్చిపోతున్నారు. పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోవడానికి…ప్రత్యర్థులను భయపెట్టడానికి డైలాగ్‌లతో రెచ్చిపోతున్నారు. ఎవరేమనుకుంటే మనకెందుకు.. మనదే పైచేయి కావాలనేలా హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. మేం గెలిస్తే.. మీ కథ జైలుకే అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు అక్కర్లేదు…అవినీతి, స్కామ్‌లు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో మేం గెలిస్తే చాలు…మీకు చిప్పకూడు ఖాయమని బహిరంగంగానే నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇందులో ఏ పార్టీ తక్కువేం తినలేదు. వైసీపీ అధికారంలోకి ఉన్నంత కాలం…టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో…వైసీపీ నేతలు పంచ్ డైలాగ్‌లు పేలుస్తున్నారు. ప్రజలకు ఏం చేయకపోయినా పర్లేదు…రాజకీయ ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకుంటామంటే చాలు…ఓటర్లు త మను ఆదరిస్తారనే భ్రమల్లో మునిగిపోతున్నారు. ముందు వెనుక చూడకుండా సినిమా డైలాగ్‌లు కొడుతున్నారు. మనం ప్రజలకు చెప్పాల్సిందేంటి ? చేస్తున్నదేంటి అన్న విషయాలను పొలిటికల్ లీడర్స్ మరచిపోతున్నారు.
అధికారంలోకి రావడం అంటే.. రాష్ట్రాన్ని పాలించడం.. ప్రజలను ఉద్ధరించడం మాత్రమే కాదు. శతృశేషం లేకుండా ప్రత్యర్ధులను చేయడం కూడా ఇపార్టెంట్. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల నయా ఫార్మూలా. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. అందరూ ఆ తాను ముక్కలే. పాలకులుగా అధికారంలోకి వచ్చే వారికి లక్ష్యాలు ఉంటాయి. ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించినట్లు…రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం…సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం. కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొలిటికల్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకోవడానికే అధికారంలోకి వస్తామంటూ…నేతలు బీరాలు పలుకుతున్నారు. అధికారం చేపట్టిన వెంటనే లోపలేస్తాం…ఉరికించి కొడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
గతంలో అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ…రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రత్యర్థుల వ్యాపారాలు, పరిశ్రమలు, వ్యవహారాల మీద ఫోకస్ చేసేవారు. నిబంధనల పేరుతో కొరడాలు ఝుళిపించేవారు. ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా.. ఆయా పార్టీలు కోలుకోనివ్వకుండా చేసేవారు. ప్రస్తుతం ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఒక్కదానితో సరిపెట్టుకోవడం లేదు. ప్రత్యర్థి నిర్మూలించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. కేరక్టర్ అసాసినేషన్ అనేది ఒక మార్గంగా మారింది. ఆ తరువాత వచ్చిన ఆధునిక పోకడలు.. అసలు ప్రత్యర్థి పార్టీల నాయకులనే లేకుండా చేయడం. అంటే ఇదేదో హత్య చేయడం కాదు…కేసులతో వేధించడం…జైళ్లకు పంపడం. ఈ పార్టీ అధికారంలోకి వస్తే…ఆ పార్టీ నేతల మీద కేసులు…వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ల మీద కేసులు పెట్టడం…జైళ్లకు పంపడం తెలుగురాష్ట్రాల్లో నిత్యకృత్యంగా మారిపోయింది. ఇందులో ఏ పార్టీ తక్కువేం తినలేదు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్నింగ్‌లు నడిచాయి. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి…సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల మనసు గెల్చుకోవాలంటే కుట్రలు, దాడులు కాకుండా మంచి పాలన చేయాలని సూచించారు. వైసీపీ కార్యకర్తలను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం చేస్తే…2029 ఎన్నికల్లో పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే…నేను చెప్పినా మా వాళ్లు వినే పరిస్థితి ఉండదని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు…అందరి పేర్లు రాసుకోవాలని…తర్వాత సినిమా చూపిస్తామంటూ బెదిరించేలా మాట్లాడారు.
వైసీపీ హయాంలో…టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేశ్…రెడ్‌బుక్ గురించి విస్త్రతంగా మాట్లాడారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదన్నారు లోకేశ్. చెప్పినట్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత…పలువురు అధికారులను జైలుకు పంపారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేస్తామనే డౌట్ వద్దన్నారు.
సీఎం చంద్రబాబు కూడా గతంలో వైసీపీ నేతలకు వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇచ్చారు. మీకు ఎక్సైపైరీ డేట్ దగ్గర పడిందని…అందుకే ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. అంత ఎగిరి పడొద్దని…మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని హెచ్చరించారు. మీకు తగిన చోటు చూపించే శక్తి టీడీపీ ఉందని హెచ్చరించారు. టీడీపీ నేతల జోలికి వస్తే…దెబ్బకు దెబ్బ…కర్రకు కర్ర అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
2029లో అధికారంలోకి వస్తామంటూ…వైసీపీ నేతల చేస్తున్న వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డైలాగ్‌లు పేల్చారు. అధికారంలోకి వస్తే రంపాలు తెస్తాం, కుత్తుకలు కోసేస్తాం అని చెప్పే మాటలకు భయపడేవాళ్ళం కాదని స్పష్టం చేశారు. అసలు వాళ్లు ఎలా అధికారంలోకి వస్తారో…తాము కూడా చూస్తామంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. గత పాలకులు మళ్ళీ రౌడీయిజం, గుండాగిరీ చేసే భావనలోనే ఉన్నారు. వీటికి భయపడితే మనం రాజకీయాల్లోకి వస్తామా…2029లో వస్తే మీ అంతు చూస్తాం అంటే.. అసలు మీరు రావాలి కదా..మీరు ఎలా వస్తారో మేమూ చూస్తామన్నారు పవన్ కల్యాణ్.
మాజీ మంత్రి రోజా అయితే…ఓ అడుగు ముందుకేశారు. ఇప్పటికే టీడీపీ, జేనసేన, బీజేపీ నేతలు హైదరాబాద్ పారిపోతున్నారని…రేపు జగనన్న ప్రభుత్వం వస్తే హైదరాబాద్‌కు కాదు…అమెరికాకు పారిపోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని కాపాడటానికి ఎవరు రారని…వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు.
అధికార పార్టీని బెదిరించడంలో తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ లీడర్లు ఆరితేరిపోయారు. నేతలు, అధికారులను తమ దారిలోకి తెచ్చుకోవడానికి బెదిరింపులు, వార్నింగ్‌లనే తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి డైలాగ్‌లో పేల్చిందో…టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కూడా అదే ఫార్మూలాను అవలంభిస్తోంది. మేం గెలిస్తే…మీరు జైలుకే అంటూ బెదిరింపులకు దిగడం కామన్‌గా మారిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో నేతలు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఎన్ని వేషాలు వేసినా.. మేం అధికారంలోకి వచ్చే వరకే.. వచ్చాక చుక్కలు చూపిస్తామని మొహం మీదే చెప్పేస్తున్నారు. కొందరు అధికారుల్ని టార్గెట్ చేసుకుని.. తీవ్రస్వరంతో బెదిరింపులకు దిగుతున్నారు. ఎక్కువచేస్తే మీ సంగతి చూస్తాం అంటున్నారు.
గతంలో రాజకీయాల్లో ప్రజాస్వామ్య పోకడలు కనిపించేవి. అధికార, ప్రతిపక్షాల మధ్య లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేది. దీంతో అధికారుల మీదకు వెళ్లాల్సిన అవసరం నేతలకు వచ్చేది కాదు. కానీ కాలక్రమంలో రాజకీయం బాగా మారింది. ఓ పార్టీ పవర్లోకి రాగానే.. విపక్ష పార్టీని తొక్కేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. దానికి అధికారుల్ని పావులుగా వాడుకోవడంతో సమస్య ముదురుతోంది. దీంతో ముల్లును ముల్లుతోనే తీయాలని విపక్షాలు ఫిక్స్ అవుతున్నారు. ఈరోజు విపక్షమే.. రేపు మాకూ అధికారం వస్తుంది. అప్పుడు మీ సంగతి చూస్తాం అని అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నాయి. ఓవైపు పాలక పక్షమే ఎక్కువ చేస్తుందనుకుంటే.. తగుదునమ్మా అని అధికారులూ చెలరేగిపోవడం ఏంటనేది విపక్షాల ప్రశ్న.
అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ ను నేతలు అధికారులపై చూపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అధికారులే టార్గెట్ అవుతున్నారు. ఏ పార్టీ ఇందుకు అతీతం కాదు. నేతలు ఎవరి స్టైల్లో వారు అధికారులకు వార్నింగులు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే కీలకం. రెండు పక్షాలకూ ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. అధికారులు కేవలం నేతలకు సహాయకారులు మాత్రమే. పాలనా వ్యవహారాల్ని నడిపేది నేతలే. అంతవరకూ ఎవరికీ సందేహాల్లేవు. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నేతలు మాత్రం.. అధికారులకు పాలక పార్టీలు చెప్పినట్టు వింటూ తమను ఇబ్బందిపెడుతున్నారనే భావనతో ఉంటున్నారు. క్యాడర్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, సొంతంగా సేకరించిన సమాచారం మేరకు కొందరు అధికారులు పరిధులు దాటుతున్నారని ఫిక్స్ అవుతున్నారు. అలాంటి అధికారుల సంగతి తాము అధికారంలోకి వచ్చాక చూస్తామని చెప్పి కుండబద్దలు కొడుతున్నారు. కొందరు నేతలైతే మరో అడుగు ముందుకేసి రిటైరైనా.. మరో రాష్ట్రానికి వెళ్లినా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి తప్పించుకోవచ్చనుకుంటే కుదరదని చెప్పేస్తున్నారు.
ప్రజలు పార్టీలకు అధికారం ఇచ్చేది పాలన చేయటానికా.. కక్ష తీర్చుకోవటానికా అంటే.. రెండోదే పార్టీల సమాధానమవుతోంది. ప్రతి నేతా ఈగోకు పోతున్నారు. అధికారం వచ్చేదాకా ప్రజాప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పి.. తీరా గద్దెనెక్కాక సొంత అజెండాలు అమలు చేస్తున్నారు. నేతల మనసెరిగి నడుచుకునే కొందరు ఆఫీసర్లు వారి ఆదేశాలతో.. సొంత మిషన్లు అమలు చేస్తూ.. వ్యవహారాన్ని మరింతగా దిగజారుస్తున్నారు. కొందరు అధికారుల తెలివిమీరిపోయి.. తాము చేసిన తప్పులకు సహచరుల్ని బలి చేయటానికి కూడా వెనుకాడటం లేదు. దీంతో అసలు పరిధులు దాటే అధికారులు కొందరైతే.. బయట చెడ్డపేరు మాత్రం మరికొందరికి వస్తోంది.
తమ రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటున్న వారిని ఏకంగా రాజకీయాల్లో మనజాలని పరిస్థితులు క్రియేట్ చేయడం నిత్యకృత్యం అవుతోంది. అనివార్యంగా రాజకీయాల్లో మాత్రమే కొనసాగాలని అనుకుంటున్న వారిని.. లోబరచుకుని ప్రత్యర్థి పార్టీలో కాకుండా.. తమ పార్టీలోకి వచ్చేలా చేసుకోవడం కామన్ అయింది. ప్రత్యర్థి నిర్మూలన అనేది కొత్త పుంతలు తొక్కి అసలు ప్రత్యర్థి పార్టీలే ఖాళీ చేయడానికి, ప్రత్యర్థి నాయకులను రాజకీయంగా నామరూపాలు లేకుండా చేయడానికి శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వేధింపుల్లో నెక్ట్స్ వెర్షన్ లను కనుగొంటూ ముందుకు వెళ్తోంటే.. ఈ ప్రస్థానం ఎక్కడి వరకు సాగుతుంది ? రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకువెళుతుంది? రాజకీయాల్లో ఉన్నవారు ముఠా నాయకుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే.. రాష్ట్రానికి చేటు జరుగుతుందని మేధావులు అంటున్నారు. భవిష్యత్‌లో వార్నింగ్ పాలిటిక్స్…ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.
ప్రతిపక్షంలో ఉండగానే… కొందరు అధికారుల జాబితా తయారుచేసుకోవడం, అధికారంలోకి రాగానే వారి పని పట్టడంపైనే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ గా మారింది. నచ్చని అధికారులకు ఇచ్చే ట్రీట్ మెంట్.. తమ ప్రత్యర్థులు కూడా భయపడేలా ఉండాలనే వ్యూహరచన చేస్తున్నారు నేతలు. కొన్ని సర్వీస్ రూల్స్ ను అడ్డుపెట్టుకుని, మరికొన్ని సర్కారు విచక్షణాధికారుల్ని వాడుకుని.. అనుకున్న అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ చర్యలు అనివార్యంగా అధికారుల్లో గ్రూపులకు ఆజ్యం పోస్తున్నాయి. చివరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఎవరెవరు అధికారులకు కీలక పోస్టింగులు దక్కుతాయో ఎవరైనా చెప్పేయగలిగే స్థాయిలో రాజకీయం నడుస్తోంది. ఈ పోకడ మంచిది కాదని తెలిసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే కరెక్టని కొందరు నేతలు భావిస్తున్నారు. అవతలివారి ఎత్తుల్ని బట్టే తమ పైఎత్తులుండాలని మరికొందరు నేతలు నమ్ముతున్నారు. ఏతావాతా అన్ని పార్టీల నేతలూ ఈ సంస్కృతిని కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారుల్ని ఆ మాత్రం భయపెట్టకపోతే నేతల్ని లెక్కచేయరనే వాదన గట్టిగా వినిపిస్తున్నారు.
