NTV Telugu Site icon

Amit Shah Meeting With Jr NTR: ఊరికే ఇవ్వరు అపాయింట్‌మెంట్లు

Amith Shah Story Board

Amith Shah Story Board

Amit Shah Meeting With Jr NTR : రాజకీయాల్లో పార్టీలు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి చాలా మార్గాలున్నాయి. భారీ సభలు, ర్యాలీలతో ఎక్కువమందికి మెసేజ్ ఇవ్వొచ్చు. డోర్ టు డోర్ క్యాంపైనింగ్ కూడా మంచి ఆప్షనే. అయితే అంత కష్టపడకుండా కేవలం కొన్ని నిమిషాలు వ్యక్తులతో భేటీ అయినా కూడా రాజకీయ ప్రయోజనం ఎలా పొందొచ్చనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.

బీజేపీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో.. అమిత్ షా మీటింగులు మరోసారి చాటిచెప్పాయి. మునుగోడు బహిరంగ సభ కోసం వచ్చిన అమిత్ షా.. అంతకు మించి ఇద్దరు వ్యక్తులతో జరిపిన భేటీలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మీడియా దిగ్గజం రామోజీరావు, ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తారక్ తో అమిత్ షా సమావేశం కావడం చర్చోపచర్చలకు తెరతీశాయి. జూనియర్ ఎన్టీఆర్ తో పొలిటకల్ మీటింగ్ కాదని చెబుతున్నా.. ఎవ్వరూ నమ్మడం లేదు. ఆర్ఆర్ఆర్ లో నటనకు అభినందనలు చెప్పడానికి పిలిచారనే వాదన లాజిక్ కు అందడం లేదు. అలాగని కొడాలి నాని చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ను బీజేపీ దేశవ్యాప్తంగా వాడుకుంటుందనే విషయం కూడా అర్థం కావడం లేదు. ఏకాంతంగా 20 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారనేది టాప్ సీక్రెట్ గా మారింది. కేవలం జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత, వృత్తిగత ప్రతిభను గుర్తించి కలిశారంటే ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. రాజకీయాలపై ఇంట్రస్ట్ లేదని తారక్ పదేపదే చెబుతున్నా.. ఆయన పేరు మాత్రం ఎప్పటికప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూనే ఉంటోంది. ఈ క్రేజ్ ను వాడుకుని ప్రత్యర్థి పార్టీల్ని కన్ఫ్యూజ్ చేయాడనికే అమిత్ షా మీట్ అయ్యుండొచ్చనే విశ్లేషణ గట్టిగా వినిపిస్తోంది. ఒక్క భేటీతో మల్టిపుల్ టార్గెట్స్ రీచ్ అయ్యేలా స్కెచ్ వేశారనే వాదన కూడా ఉంది. ఎన్టీఆర్ సామాజిక వర్గం, రాజకీయ నేపథ్యం, సినిమా బ్యాక్ డ్రాప్.. అన్నీ పొలిటికల్ గా కలిసొచ్చే అంశాలే. దీంతో పాటు టీడీపీలో చంద్రబాబు వ్యతిరేకుల్ని ఆకర్షించడం, పార్టీలకు అతీతంగా ఉన్న తారక్ అభిమానుల్ని ఆకట్టుకోవడంతో పాటు అన్ని పార్టీల్లోనూ రాజకీయ కలకలం రేపడంతో అమిత్ షా సక్సెస్ అయ్యరనే చెప్పాలి. అయితే ఈ భేటీతో పర్యవసానాలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది. త్వరలో తారక్ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా.. లేకపోతే ఎప్పటిలాగే సినిమాలపై ఫోకస్ కంటిన్యూ చేస్తారా అనేది ఆసక్తికరం.

తారక్ 2009లోనే టీడీపీ తరపున ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారంచేశారు. మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయాలతో దూరం మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ తారక్ ను కదిలించడం ద్వారా.. ఏపీలో బలం లేకపోయినా.. రాజకీయ సమీకరణాలను మార్చే సత్తా తమకు ఉందని బీజేపీ చెప్పదలుచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్క తారక్ తో అటు టీడీపీని, ఇటు జనసేనను కండిషన్లో పెట్టాలనే ఆలోచన కూడా ఉండొచ్చు. రేపు పొత్తులు కుదిరితే.. సీట్ల బేరాల దగ్గర ఈ మీటింగ్ ను వాడుకునే ఉద్దేశం లేదని గట్టిగా చెప్పలేం. అధికార వైసీపీలో ఉన్న తారక్ మిత్రులకు కూడా సంకేతాలు పంపడానికే అమిత్ షా ఈ ఎత్తు వేశారనే అభిప్రాయం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి రాజకీయంగా చాలారకాల ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి. తారక్ టీడీపీకి అనుకూలమా.. వ్యతిరేకమా అనే చర్చతో పాటు.. చంద్రబాబుపై కోపంగా ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటికి ఎప్పటికప్పుడు తారక్ వివరణ ఇస్తూనే వచ్చారు. అయినా సరే జగన్, తారక్ మధ్య డీల్ ఉందనే విషయం సంచలనం సృష్టించింది. ఇది అబద్ధమని జూనియర్ ఎన్టీఆర్ తేల్చేసినా.. ఏదో ఉందనే అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి. నందమూరి ఫ్యామిలీతో తారక్ సంబంధాలు కూడా రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ గా ఉంటున్నాయని కొందరు ప్రస్తావిస్తున్నారు. ఇదంతా పనిగట్టుకుని చేసే విషప్రచారమని టీడీపీ వర్గాలు కూడా ఖండిస్తూ వచ్చాయి. చివరకు టీడీపీలో కూడా కొందరు నేతలు ఎన్టీఆర్ రావాలని డిమాండ్ చేయడం, కొందరు కార్యకర్తలు చంద్రబాబు ముందే తారక్ జై అంటూ నినాదాలు చేయడం కూడా అందరూ చూశారు. ఎవరికీ ఏమీ సంబంధం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అనే మీమాంస అందరిలో ఉంది. వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు ఈ అగ్నికి మరింత ఆజ్యం పోస్తూ.. అనుమానాలు బలపడేలా చేశారు. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారనే వాదన వినిపిస్తోంది.

అమిత్ షా తారక్ తో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు, పాలన గురించి ప్రస్తావించారన్న విషయం ఆసక్తి కలిగిస్తోంది. దీని వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందనే వాదన ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తారక్ అర్జెంటుగా పాలిటిక్స్ లోకి వచ్చే పరిస్థితి లేదు. ఆయనకు సినిమాల్లో మంచి భవిష్య్తత్తు ఉంది. ఐదు, పదేళ్లకు చేయాల్సిన సినిమాల లైనప్ ఉంది. అయితే ఓ బలమైన సామాజికవర్గాన్ని బీజేపీవైపు ఆకర్షించే ప్రయత్నం మాత్రం గట్టిగ జరుగుతోంది. తెలంగాణలో సదరు సామాజికవర్గానిక ఆరు శాతం ఓటు బ్యాంకు ఉంది. 10 నుంచి20 నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని డిసైడ్ చేసే సత్తా ఉంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో రెడ్లు, బీసీల నుంచి బలమైన నేతలున్నారు. అయితే తారక్ సామాజికవర్గం నుంచి ప్రముఖ నేతలెవరూ లేరు కాబట్టి.. వారిని ఆకర్షించడానికి అమిత్ షా వ్యూహరచన చేసినట్టు కనిపిస్తోంది. రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో తిష్ట వేసి అపాయింట్ మెంట్లు అడిగినా.. రోజుల తరబడి వెయిట్ చేసినా కలవని అమిత్ షా.. హైదరాబాద్ వచ్చి మరీ ఓ సామాజికవర్గ ప్రముఖుల్ని కలవడం చిన్న విషయం మాత్రం కచ్చితంగా కాదు. దీని వెనుక పెద్ద మతలబే ఉంది. బీజేపీపై రకరకాల కారణాలతో సదరు సామాజికవర్గంలో కాస్త అసంతృప్తి ఉంది. అమరావతి ఇష్యూ కానీ.. చంద్రబాబును గద్దె దించింది బీజేపీయే అనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటివరకు ఆ సామాజికవర్గాన్ని స్థానిక బీజేపీ నేతలు సరిగ్గా అడ్రస్ చేయలేదనే అభిప్రాయం బీజేపీ అధిష్ఠానంలో ఉంది. అందుకే స్వయంగా రంగంలోక దిగిందనే వాదన కూడా ఉంది. బలమైన సామాజికవర్గాన్ని నిర్లక్ష్యం చేయడం ఎందుకనే ధోరణి కనిపిస్తోంది.

ప్రస్తుత రాజకీయాల్లో ఏ పార్టీకైనా మీడియా సహకారం చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే రామోజీరావుతో అమిత్ షా సమావేశమయ్యారనే ఊహాగానాలున్నాయి. గతంలో ఆర్కేతో కూడా ఆయన భేటీ అయిన విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. బీజేపీకి రాజకీయ లబ్ధి లేకుండా మోడీ, అమిత్ షా ఎవరితోనూ నిమిషం కూడా మట్లాడరనే మాట మాత్రం నిజమనే వాదన వినిపిస్తోంది. మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోణంలోనే బీజేపీ చూస్తోందనేది నిన్నటిదాకా వినిపించిన మాట. కానీ అమిత్ షా టూర్ షెడ్యూల్, ఆయన జరిపిన భేటీలు చూస్తే.. అది నిజం కాదనిపిస్తోంది. మునుగోడు నుంచే ఏకంగా లోక్ సభ ఎన్నికలకే స్కెచ్ వేస్తున్న వైనం.. రాజకీయ వ్యూహకర్తలకు ఆసక్తి కలిగిస్తోంది.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. తెలంగాణలో కూడా ఊపే కానీ విషయం లేదనే మాట ప్రచారంలో ఉంది. ఏపీలో అయితే నోటా కంటే తక్కువ ఓట్ల శాతం ఉంది. అయినా సరే రాజకీయ ఎత్తుగడలతో అన్ని పార్టీల దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేయడంలో బీజేపీ ఆరితేరిపోయింది. మునుగోడు సభ కోసం అమిత్ షా షెడ్యూల్లో ముందుగా అనుకున్న దానికి భిన్నంగా చాలా మార్పులు జరిగాయి. కేవలం సభకు హాజరు కావడం, వెళ్లిపోవడంగా ఉన్న షెడ్యూల్లోకి దళిత కార్యకర్త ఇంటి సందర్శన, ఉజ్జయిని మహంకాళి దర్శనం. ప్రముఖ వ్యక్తులతో భేటీలు వంటి అంశాలు చేరడంతో.. టూర్ దాదాపు పదిన్నర గంటల పాటు సాగింది. ఇంతసేపు అమిత్ షా టైమ్ స్పెండ్ చేశారంటే.. దీర్ఘకాలిక వ్యూహాలుంటాయని బీజేపీలోనూ అంతర్గతంగా వాదన ఉంది. అయితే అవేంటో రాష్ట్రనేతలు కూడా చెప్పలేకపోతున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ మీటింగ్ సంగతైతే.. కేవలం నలుగైదుగురు నాయకులకు మాత్రమే తెలుసంటే నమ్మాల్సిందే. ఇంత అతి రహస్యంగా మంత్రాంగం నెరపాల్సిన అవసరమేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు.

కొన్ని సమావేశాలు అనుకోకుండా జరుగుతాయి. మరికొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి. ఇంకొన్ని షెడ్యూల్లో లేకపోయినా జరుగుతాయ. కానీ అమిత్ షా సమావేశాలు మాత్రం భవిష్యత్తులో జరిగే కీలక రాజకీయ మార్పులకు నాంది పలుకుతాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. గతంలో మహారాష్ట్రలో అమిత్ షా భేటీల తర్వాతే కూటమి సర్కారు కూలిందని, బెంగాల్ లో కూడా అమిత్ షా సమావేశాల తర్వాతే ఈడీ దూకుడు పెరిగిందనే అభిప్రాయాలున్నాయి. అయితే అక్కడ ప్రధాన పార్టీల నేతలతో సమావేశాలు జరగ్గా.. ఇక్కడ మాత్రం క్రియాశీల రాజకీయాల్లో లేకపోయినా.. పాలిటిక్స్ ను ఎంతోకొంత ప్రభావితం చేయగలిగే వ్యక్తులతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.

అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చినంత మాత్రాన వాళ్లు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పలేం. కానీ ఏదో జరగోబతోందనే ఊహాగానాలైతే మొదలయ్యాయి. రామోజీరావు వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. తారక్ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్లిద్దరిలో ఎవరూ బీజేపీలో ఇప్పటికిప్పుడు చేరే అవకాశం లేదనే వాదన ఉంది. కానీ కుదిరితే ప్రత్యక్షంగా.. లేకపోతే పరోక్షంగా మీటింగుల్ని వాడుకునే విద్య బీజేపీకి వచ్చు. అయితే కేవలం ఒక్క మీటింగ్ తోనే రాజకీయం మారదని, దీనికి అనుబంధంగా మరిన్ని పరిణామాలు జరగాలనే అంచనా కూడా ఉంది. అదీ నిజమే. ప్రస్తుతం చదరంగంలో పావులు కదిపి చూస్తున్నారని, ఏ పావును ఎప్పుడు వాడాలో తెలుసుకోవడానికి ట్రయల్ రన్ వేశారనే చర్చ కూడా జరుగుతోంది. అమిత్ షా వ్యూహాలు తెలిసిన ప్రత్యర్థి పార్టీలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ఈ మీటింగుల్ని తగ్గించి చూపడాని, బీజేపీ గతంలో చేసిన కుయుక్తుల్ని గుర్తుచేయడానికి వెనుకాడటం లేదు. స్వయంగా బీజేపీలోనే ఈ మీటింగులపై క్లారిటీ లేదు. కేంద్రమంత్రి స్థాయి వ్యక్తులు కూడా పొలిటికల్ మీటింగులు కాదని చెప్పినా.. ఎవ్వరూ నమ్మడానికి సిద్దంగా లేరు. అమిత్ షా వచ్చారు. కొందర్ని కలిశారు. వెళ్లారు. ఇక ముందు ఏం మారుతుందో చూడాల్సి ఉంది. మునుగోడు ఉపఎన్నికలు అయ్యాక ఈ విషయంపై కొంత క్లారిటీ రావచ్చనే అభిప్రాయాలున్నాయి. కానీ అంత త్వరగా రిజల్ట్స్ రావనే వాదన కూడా ఉంది. మరి అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల నాటికైనా కాషాయ వ్యూహం తెరవీడుతుందో లేదో చూడాలి.

రాజకీయాల్లో మంత్రాంగాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటాయి. సమయం వచ్చేదాకా వ్యూహాలు వెల్లడి చేయకపోవడమే వ్యూహకర్తల లక్షణం. దాదాపు అన్ని పార్టీలూ ఇదే రకమైన ప్లాన్ అవలంబిస్తాయి. ఏ ఎన్నికల్లో అయినా అసలు ప్రచారం కంటే కొసరు మీటింగులకే ఫలితాల్ని తారుమారు చేసే శక్తి ఉంటుంది. కాబట్టి దేన్నీ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. బీజేపీకి ఏదో ఒక రాజకీయ ప్రయోజనం ఆశించే అమిత్ షా ఆ ఇద్దర్నీ కలిశారు. అది ఏంటనేది కొద్దిరోజులయ్యాక క్లారిటీ రావచ్చేమో చూడాలి.

ఓ తెలుగు సినిమాలో హీరో పాపులర్ డైలాగ్ ఒకటుంది. కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను అని. ఇక్కడ బీజేపీ ఉద్దేశం కూడా అలాగే కనిపిస్తోంది. నేరుగా వ్యూహాలు రచించి విజయవంతమయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి.. ప్రత్యర్థుల్ని అయోమయంలో పడేసి.. ఎక్కువ సీట్లు గెలవాలనే తాపత్రయం ఉన్నట్టుగా ఉంది.

ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలు ఆలోచించాలో కూడా అర్థం కాని విధంగా చేయాలనేది బీజేపీ అసలు వ్యూహంగా ఉంది. ఏదో రకంగా ఓటుబ్యాంకును నిర్మించుకోవడం, ఉన్న ఓటుబ్యాంకు పెంచుకోవడం, ఓటర్లు చెదరిపోకుండా చూసుకోవడం, ఎన్నికల నాటికి బీజేపీకి సరికొత్త కలర్ ఇవ్వడం ద్వారా తటస్థుల్ని కూడా ఆకర్షించడం.. ఇలా బీజేపీ దగ్గర చాలా ఎత్తుగడలుంటాయ. అయితే ఇవి ప్రతిసారీ సక్సెస్ అవుతాయని గ్యారెంటీ లేదు. అయినా సరే కాషాయ పార్టీ మాత్రం గజినీ మొహమ్మద్ లాగా దండయాత్రలు చేయడం ఆపదు. ఓటర్లను విసిగించైనా ఓట్లు పెంచుకోవాలనే విచిత్రమైన కాన్సెప్ట్ బీజేపీ దగ్గర ఉందనే వాదన కూడా ఉంది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనపెడితే.. ఒక్క ఓటు కోసం కూడా బీజేపీ చివరిదాకా ప్రయత్నిస్తోందనే మాట వాస్తవం. ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే టార్గెట్ పెట్టుకునే బీజేపీ.. కనీసం ప్రధాన ప్రతిపక్షంగానైనా ఉండాలని కోరుకుంటోంది. అందుకోసం విభిన్నమైన వ్యూహాలు అనుసరిస్తోంది.

ఇటీవలి కాలంలో బీజేపీ మార్క్ పాలిటిక్స్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అప్రజాస్వామిక విధానాలతో, పార్టీల్ని బెదిరిస్తోందనే విమర్శలు గట్టిగా ఉన్నాయి. ఇలాంటి స్థితిలో తమవి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కాదు.. బెస్ట్ పాలిటిక్స్ అని నిరూపించుకోవాల్సిన అవసరం కాషాయ పార్టీకి ఉంది. దర్యాప్తు సంస్థల్ని వాడుకుని రాజకీయం చేస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టాలంటే.. అసలు రాజకీయమేంటో చూపించాల్సి ఉంది. ఈ విషయంలో బీజేపీ ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి. సంప్రదాయంగా బలం లేని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్లాన్ వర్కవుట్ అయితే.. ఆటోమేటిగ్గా ఆరోపణలు చేసేవారి నోరు మూతపడుతుందనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఆ టాస్క్ అంత వీజీ కాదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఒరగబెట్టందేమీ లేదు. ఏ రాష్ట్రానికీ విభజన హామీలు నెరవేరలేదు. కనీసం నీటివాటాలు తేల్చలేదు. పైగా పక్షపాతం చూపుతున్నారనే అపవాదు ఉంది. ఇన్నింటిని తట్టుకుని విజయవంతమైన రాజకీయం చేస్తే.. వ్యూహం ఫలించినట్టే. మరి ఏమవుతుందో చూడాలి.

బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్లాన్ అమలు చేస్తుంది. సమయం, సందర్భాన్ని బట్టి వ్యూహాలు మారుస్తుంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఏదో చేయాలని చూస్తోంది. కానీ ఏం చేయగలదు అనేది ఊహకు అందడం లేదు. తెలంగాణలో అధికారం ఊరిస్తున్నా.. ఉట్టి కొట్టేదాకా చెప్పలేం అనే మాట ఉంది. ఏపీలో అయితే ఒక్క సీటు గెలిచే గొప్పే అనే పరిస్థితి. ఇలాంటి చోట రెండు మీటింగులతో రాజకీయం మారుతుందుకోవడం అత్యాశే అవుతుంది. అయితే ఏ పార్టీ అయినా.. గట్టెక్కాదాకా.. ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుందనుకోవాలి. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో బలపడటానికి చేసిన ప్రయత్నాలేవీ ఆశించినంత సక్సెస్ కాలేదు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.

2014లో మోడీ-షా మార్క్ పాలిటిక్స్ దేశానికి కొత్త. కానీ గత ఎనిమిదేళ్లలో అన్ని పార్టీలు వాళ్ల ఆయువుపట్ల గుట్టు తెలుసుకున్నాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. అంత ఈజీగా చేతులెత్తేయడం లేదు. బీజేపీ మాదిరిగానే చివరి వరకూ పోరాడుతున్నాయి. బీజేపీని ఓడించడానికి ఎవరితో అయినా చేతులు కలపడానికి వెనుకాడటం లేదు. బీజేపీని నమ్మే పరిస్థితుల్లేవు. పార్టీల్నే ముంచేస్తున్న కాషాయ పార్టీ. ప్రజల్నేం ఉద్ధరిస్తుందని ప్రచారం చేస్తున్నాయి. వీటిలో కొన్ని ఆరోపణలు ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈ చర్చ పెద్దస్థాయికి వెళ్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంత త్వరగా వ్యూహాలకు మెరుగులు దిద్దుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందనే వాదన ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉన్న పార్టీ కాబట్టి.. ఇక్కడ ప్రయోగం చేస్తే పోయోదేం లేదనే ధోరణి కూడా ఉండొచ్చు. ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలయదు. ఏకాంత సమావేశాల్లో విషయాలు.. ఎవరో ఒకరు చెబితేనే తెలుస్తాయి. ఒక్కోసారి బయటకు చెప్పేదొకటి. లోపల జరిగేది మరొకటి. మరి ఇప్పుడు అమిత్ షా ఏకాంత సమావేశాల్లో ఏం జరిగిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రధాన సామాజికవర్గాన్ని ఆకర్షించడంలో భాగంగానే రామోజీరావు, తారక్ తో అమిత్ షా భేటీ అయ్యారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. బీజేపీలో కొందరు నేతలు కూడా ఇదే విషయంపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అనుకున్నట్టుగా జరిగితే.. కచ్చితంగా రాజకీయంగా పెనుమార్పులు సాధ్యమే అనే చర్చ జరుగుతోంది. బీజేపీ మార్క్ సామాజిక ఇంజినీరింగ్ ఏంటనే ఆసక్తి అందరిలో ఉంది. రాజకీయాల్లో సోషల్ ఇంజినీరింగ్ పాత్ర చాలా కీలకం. చాలాసార్లు ఈ అంశమే గెలుపోటముల్ని ప్రభావితం చేస్తోంది. 2015, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. కొన్ని సామాజికవర్గాలు స్వతహాగా ఒక్కమాటపై ఉంటాయి. మరికొన్ని ఇతర వర్గాలకు కూడా డ్రైవింగ్ ఫోర్స్ గా ఉంటాయి. ఇలాంటి సామాజికవర్గాలను ఏ పార్టీ దూరం పెట్టే ప్రయత్నం చేయదు. అనుకోకుండా దూరం పెరిగినా.. మళ్లీ దగ్గర చేసుకుంటాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఓ సామాజికవర్గం విషయంలో అదే ప్లాన్ లో ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది.

 

Show comments