T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. పాకిస్థాన్ జట్టును జింబాబ్వే ఓడించింది. పెర్త్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చారిత్రక విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని కూడా పాకిస్థాన్ ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో బాగానే ఆడిన జింబాబ్వే అనంతరం పాక్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాన్ విలియమ్స్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో పేసర్ మహ్మద్ వసీమ్ జూనియర్ 4 వికెట్లు తీయగా, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ కొత్త బంతి బౌలర్లు షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయారు.
Read Also: T20 World Cup: యువరాజ్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
అనంతరం 131 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను జింబాబ్వే బౌలర్లు కట్టడి చేశారు. బాబర్ ఆజమ్ (4) మరోసారి విఫలమయ్యాడు. ఫామ్‌లో ఉన్న రిజ్వాన్ కూడా 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో జట్టును ఆదుకున్న షాన్ మసూద్ మరోసారి ఆపద్భాందవుడి అవతారం ఎత్తాడు. 44 పరుగులతో గెలుపు అంచుల వరకు తీసుకువెళ్లాడు. కానీ కీలక సమయంలో అవుట్ అవ్వడంతో పాకిస్థాన్ ఒత్తిడికి గురైంది. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సిన దశలో జింబాబ్వే బౌలర్ ఎవాన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆఖరి బంతికి మూడు పరుగులు రావాల్సిన దశలో పాకిస్థాన్ బ్యాటర్ షాహిన్ షా అఫ్రిది రన్ అవుట్ కావడంతో పాకిస్థాన్ ఓటమి ఖరారైంది. ఇప్పటికే టీమిండియా చేతిలో ఓడిన పాకిస్థాన్ జట్టు తాజాగా జింబాబ్వే చేతిలో ఓడటంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి.
