NTV Telugu Site icon

Ryan Burl: చిరిగిన షూస్‌కు గమ్ అతికించుకున్నాడు.. ఆస్ట్రేలియాపై చెలరేగాడు..!!

Ryan Burl

Ryan Burl

Ryan Burl:  అంతర్జాతీయ క్రికెట్‌లో జింబాబ్వే దశాబ్దాలుగా ఆడుతున్నా ఆ జట్టు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో జింబాబ్వే ఆటగాళ్లకు స్పాన్సర్లు కూడా కరువయ్యారు. దీంతో ఆటగాళ్లు తమ క్రికెట్ కిట్ల కోసం బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాపై చెలరేగిన జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్‌కు 15 నెలలుగా స్పాన్సర్లు లేరు. మరోవైపు సొంతంగా క్రికెట్ కిట్‌ను కొనే స్థోమత కూడా లేదు. షూస్ చిరిగిపోతే కొత్తవి కొనడానికి డబ్బుల్లేని దుస్థితిని ర్యాన్ బర్ల్ ఎదుర్కొంటున్నాడు. దీంతో చిరిగిన షూస్‌కు గమ్ అతికించుకుని మరీ క్రికెట్ ఆడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Read Also: హీరో దుల్కర్ సల్మాన్ గురించి ఆసక్తికర విషయాలు

శనివారం ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ర్యాన్ బర్ల్ తన చిరిగిన షూస్‌కు గమ్ అతికించుకుని ఆడాడు. అయితే అనూహ్యంగా ఆస్ట్రేలియాపై అతడు చెలరేగిపోయాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని.. ఆర్ధిక పరిస్థితితో సంబంధం లేకుండా ఆటల్లో రాణించవచ్చని క్రీడా లోకానికి ర్యాన్ బర్ల్ చాటిచెప్పాడు. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో ఆసీస్‌ను పేకమేడలా కుప్పకూల్చాడు. మూడు ఓవర్లల్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లను తీసుకున్నాడు. అటు ఫీల్డింగ్‌లోనూ ర్యాన్ బర్ల్ రాణించి మూడు క్యాచ్‌లు పట్టాడు. బ్యాటింగ్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 11 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాపై రాణించడంతో ఇప్పటికైనా అతడికి స్పాన్సర్లు వస్తారేమో వేచి చూడాల్సిందే. కాగా మ్యాచ్ అనంతరం ర్యాన్ బర్ల్ మాట్లాడుతూ.. ఈ విజయం జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపిందని, టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్‌కు ముందు ఇలాంటి విజయాన్ని అందుకోవడం మాటలు కాదని పేర్కొన్నాడు.