Site icon NTV Telugu

AUS Vs ZIM: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది..!!

Zimbabwe

Zimbabwe

AUS Vs ZIM: ఎన్నో సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా పసికూనగానే మిగిలిపోయిన జింబాబ్వే ఎట్టకేలకు చరిత్ర సృష్టించింది. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం నమోదు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఏ ఫార్మాట్‌లో అయినా జింబాబ్వేకు ఇదే తొలి విజయం కావడం విశేషం. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైనప్పటికీ మూడో వన్డేలో జింబాబ్వే ఆటగాళ్లు తెగించి ఆడారు. దీంతో విజయం సొంతం చేసుకుని ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టుకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. శనివారం టౌన్స్ విల్లే వేదికగా జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 31 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది.

Read Also: Why You Need Advisors: అడ్వైజర్లు అవసరమా? ఇన్వెస్టర్లు చేస్తున్న తప్పులేంటి?

జింబాబ్వే స్పిన్ బౌలర్ ర్యాన్ బర్ల్ మూడు ఓవర్లు వేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతడి బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఒక్క ఫోర్, ఒక్క సిక్స్ గానీ కొట్టలేకపోయారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ఒక్కడే జింబాబ్వే బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. 96 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. వార్నర్ రాణించకపోయి ఉంటే ఆసీస్ పరిస్థితి దారుణంగా ఉండేది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 39 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది కైటానో 19, మరుమని 35, రెజిస్ చకబ్వా 37 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లల్లో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినీస్, అష్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు. ర్యాన్ బర్ల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.

Exit mobile version