NADA Notice: ఐపీఎల్ 2026 సీజన్ సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తుతున్న వేళ భారత క్రికెట్‌లో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు, మహిళా క్రికెట్ స్టార్ షెఫాలీ వర్మ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరు డోప్ టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) తీవ్రంగా పరిగణించింది. అసలేం జరిగిందంటే.. నాడా నిబంధనల ప్రకారం.. ‘రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్’ (RTP)లో ఉన్న ఆటగాళ్లు తాము ఎక్కడ ఉంటున్నామో ముందే సమాచారం అందించాలి. దీనినే ‘వేర్ అబౌట్ క్లాజ్’ అంటారు.
నోటీసులకు స్పందించని స్టార్ ప్లేయర్స్
గత ఏడాది డిసెంబర్ 17న డోప్ కంట్రోల్ ఆఫీసర్ పరీక్ష కోసం వెళ్లగా, జైస్వాల్ తాను చెప్పిన చోట అందుబాటులో లేరు. అలాగే నవంబర్ 7న షెఫాలీ వర్మ కూడా తాను ఇచ్చిన అడ్రస్‌లో లేకపోవడంతో ఆమె టెస్ట్ కూడా మిస్ అయ్యింది. కేవలం టెస్టుకు గైర్హాజరు కావడమే కాకుండా, దీనిపై వివరణ ఇవ్వాలని నాడా పంపిన నోటీసులను కూడా వీరిద్దరూ నిర్లక్ష్యం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 18, 20 తేదీల్లో సమాధానం చెప్పాలని కోరినప్పటికీ, వీరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నాడా వీరిద్దరి పేర్లపై ‘మిస్డ్ టెస్ట్’ నమోదు చేసి, తాజాగా 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని తుది నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI), ఐసీసీ (ICC)లకు కూడా నివేదించింది.
నిషేధం పడే అవకాశం ఉందా..
ప్రస్తుతానికి వీరిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఎందుకంటే నాడా/వాడా (WADA) నిబంధనల ప్రకారం.. ఒక ఏడాదిలో (12 నెలలు) మూడుసార్లు టెస్టుకు అందుబాటులో లేకపోతేనే దానిని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరు కేవలం ఒకసారి మాత్రమే టెస్ట్ మిస్ అయ్యారు. అయితే మరో రెండుసార్లు ఇలాగే జరిగితే మాత్రం సదరు ఆటగాళ్లపై 2 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
