WPL 2027 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఐదో ఎడిషన్ షెడ్యూల్‌ను బుధవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా వెల్లడించింది. అయితే టోర్నీ నిర్వహించే నగరాల వివరాలను మాత్రం బోర్డు ఇంకా ప్రకటించలేదు. సాదారణంగా మార్చి ఆరంభంలో డబ్ల్యూపీఎల్ ఉంటుంది. కానీ ఈసారి ముందుగానే క్రికెట్ పండగ రానుంది.
డబ్ల్యూపీఎల్ 2027 కోసం ప్లేయర్స్ వేలంను అక్టోబర్ 28న కేరళలోని కొచ్చిలో నిర్వహించనున్నారు. ఈ వేలం ద్వారా ఐదు ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలోపేతం చేసుకోనున్నాయి. కొత్త సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక, జట్ల కూర్పుపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు సెప్టెంబర్ 28ను చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది. ఐదు ఫ్రాంచైజీలు తమ ప్రస్తుత జట్ల నుంచి ఆటగాళ్లను కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. కొత్త సీజన్‌కు అవసరమైన జట్టు కూర్పును సిద్ధం చేసుకునేందుకు ఈ గడువు కీలకంగా మారనుంది.
మహిళల క్రికెట్లో అతిపెద్ద టీ20 లీగ్‌గా డబ్ల్యూపీఎల్ గుర్తింపు పొందిందని బీసీసీఐ పేర్కొంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్రికెటర్లకు ఈ లీగ్ వేదికగా నిలుస్తోందని తెలిపింది. అదే సమయంలో యువ ప్రతిభకు తమ ఆటను నిరూపించుకునే అవకాశాలు కల్పిస్తూ.. మహిళా క్రికెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని బోర్డు వెల్లడించింది. 2026 డబ్ల్యూపీఎల్ ఎడిషన్‌లో స్మృతి మంధాన నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత సీజన్ మ్యాచ్‌లు నవీ ముంబై, బరోడాలో నిర్వహించారు. 2023లో ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రెండేసి టైటిళ్లు సాధించాయి. 2027 సీజన్లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చూడాలి.

