NTV Telugu Site icon

Womens IPL: విమెన్స్ ఐపీఎల్ ఆరంభం అప్పుడే..ప్లేయర్ల వేలానికి డేట్ ఫిక్స్!

Ipl1

Ipl1

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్‌కు సంబంధించి చకచకా పనులు సాగుతున్నాయి. ఇప్పటికే టెండర్లు పిలిచి ఫ్రాంచైజీలను కూడా ఖరారు చేసింది మేనేజ్‌మెంట్. ఈ లీగ్‌లో పాల్గొనబోయే ఐదు టీమ్స్ ఏంటో తెలిపింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్‌ను మార్చి 4-24 మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్‌-15 సీజన్‌ను మార్చి 31 లేదా ఏప్రిల్ 1న ప్రారంభించి మే 28న ఫైనల్‌ నిర్వహించే అవకాశం ఉంది. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫిబ్రవరి మొదటివారంలో మహిళల ఐపీఎల్​కు సంబంధించిన ప్లేయర్ల వేలం నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఒక్కో జట్టు రూ.12 కోట్లు వెచ్చించాలి. ప్రతి జట్టు 15-18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు.

Renuka Singh: పేసర్ రేణుకకు ఐసీసీ అవార్డు..ఎంట్రీ ఇచ్చి ఏడాది కాకుండానే!

కాగా, విమెన్స్ ఐపీఎల్​లో పాల్గొనే ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలం వివరాలను బీసీసీఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఐదు జట్ల ద్వారా రూ. 4670 కోట్ల భారీ మొత్తం సమకూరినట్లు పేర్కొంది. అహ్మదాబాద్‌ జట్టును అదానీ స్పోర్ట్స్‌లైన్ రూ.1,289 కోట్లకు, ముంబయి జట్టును ఇండియావిన్‌ స్పోర్ట్స్‌ రూ.913 కోట్లకు, బెంగళూరు జట్టును రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ రూ.901 కోట్లకు, దిల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్ రూ.810 కోట్లకు‌, లఖ్‌నవూ జట్టును కాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ రూ.757 కోట్లకు దక్కించుకున్నట్లు తెలిపింది.

అలాగే, ప్రసార హక్కుల ద్వారా సమకూరిన రూ. 951 కోట్లతో కలిపి.. ఒక్క బంతికూడా పడకుండానే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా బోర్డు రూ. 5,650.99 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్టయింది. కోల్‌కతా రూ. 666 కోట్ల బిడ్‌ వేసినా.. మిగతా పోటీదారులు అంతకంటే ఎక్కువ కోట్‌ చేశారు. దాఖలైన టెండర్లలో రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 180 కోట్ల బిడ్‌ అన్నింటికంటే అత్యల్పం. 2008లో ఐపీఎల్‌ టీమ్‌ల ద్వారా వచ్చిన దానికంటే ఈ మొత్తం ఎంతో ఎక్కువని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు.