Site icon NTV Telugu

Ind vs Eng 5th Test: భారత్ – ఇంగ్లాండ్‌ మ్యాచ్కి వర్షం అంతరాయం.. తొలి రోజు రద్దయ్యే ఛాన్స్..?

Eng Vs Ind

Eng Vs Ind

Ind vs Eng 5th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఐదో టెస్టు అత్యంత కీలకంగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంది. కానీ, మ్యాచ్ ఓడినా, డ్రా అయినా సిరీస్‌ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం టీమిండియాను ఆందోళనకు గురి చేస్తుంది. ఐదో టెస్టు లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు రిషభ్ పంత్, బెన్ స్టోక్స్ దూరం అయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకునే ఛాన్స్ ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా టీమ్ ప్లానింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉండటంతో టాస్ కీలక పాత్ర పోషించనుంది.

Read Also: Malegaon Blast Case: మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

అయితే, ప్రస్తుతం లండన్‌లో భారీ వర్షం పడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆక్యూవెదర్ రిపోర్టు ప్రకారం లండన్ టైమ్ ప్రకారం ఉదయం 10 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. వర్షం తగ్గినా ఉరుములు కొనసాగుతాయని, ఎల్లో అలర్ట్ కూడా అధికారులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ వర్షం కారణంగా టాస్ ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే, స్టేడియం సిద్ధం చేయడానికి అదనపు సమయం అవసరం పడుతుంది. మొదటి రోజు పూర్తిగా వర్షం కారణంగా ఆట క్యాన్సిల్ అయినా ఆశ్చర్యం లేదు. రెండో రోజు (శుక్రవారం) కూడా వర్షం ముప్పు కొనసాగుతుందని సమాచారం. కానీ, మధ్యాహ్నం నుంచి వాతావరణం మారే ఛాన్స్ ఉండటంతో కనీసం కొన్ని ఓవర్లు అయినా ఆడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, భారత్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకమైందిగా ఉండటంతో వర్షం ప్రభావం లేకుండా ఆట సాగాలని టీమిండియా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version