Site icon NTV Telugu

Team India: ఇంతకీ ధోనీ వారసుడు ఎవరు? హార్డిక్ పాండ్యానేనా?

Hardik Pandya

Hardik Pandya

Team India: టీమిండియా స్టార్ ఆటగాడు ధోనీ రిటైర్ అయ్యాక ఫినిషర్ పాత్రను పోషించేవాళ్లు కరువయ్యారు. ఎందుకంటే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు గొప్ప ఫినిషర్‌‌గా గుర్తింపు పొందాడు. ఫినిషర్‌కు ఉండాల్సిన లక్షణాలేంటో ధోనీ తన ప్రదర్శనల ద్వారా చూపించాడు. అయితే కొన్నాళ్లు ధోనీ స్థానాన్ని రీప్లేస్ చేసేలా హార్దిక్ పాండ్యా ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత ఫిట్‌నెస్ లేమి, ఫామ్ కోల్పోవడంతో అతడు జట్టులోనే స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ప్రత్యామ్నాయాలుగా కనిపించారు. కానీ ఫినిషర్ పాత్రకు వాళ్లు పూర్తిగా న్యాయం చేయలేదు. ఇటీవల ఐపీఎల్ పుణ్యమా అంటూ దినేష్ కార్తీక్ ఫినిషర్ పాత్రను తీసుకున్నాడు. కానీ కేవలం టీ20లకు మాత్రమే అతడిని జట్టులోకి తీసుకుంటున్నారు. వన్డేల విషయంలో జట్టు వేరే ఆటగాడిపై ఆధారపడాల్సి వస్తోంది.

సాధారణంగా ధోనీలోని కాన్ఫిడెన్స్ ప్రత్యర్థి బౌలర్లను డిఫెన్స్‌లో పడేస్తుంది. ధోనీలోని కూల్ నెస్ ప్రత్యర్థి కెప్టెన్‌ను హీటెక్కిస్తుంది. అతడి షాట్ సెలెక్షన్ ఫీల్డర్లకు అంతుచిక్కదు. అలాంటి లక్షణాలు ప్రస్తుతం మళ్లీ హార్దిక్ పాండ్యాలోనే కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్సీ వహించిన తర్వాత హార్దిక్ పాండ్యాలో కాన్ఫిడెన్స్, పరిపక్వత పెరిగాయి. గతంలో ధోనీలో కనిపించిన లక్షణాలన్నీ ప్రస్తుతం పాండ్యాలో ఉన్నాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ 2022 ఫైనల్లో పాండ్యా అటు బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో అదరగొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. కొన్నిరోజుల కిందట ఇంగ్లండ్ పర్యటనలో డిసైడర్ మ్యాచ్‌గా నిలిచిన మూడో వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరిసి మ్యాచ్ గెలిపించడమే కాకుండా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా పాండ్యా నిలిచాడు. తాజాగా పాకిస్థాన్ వంటి ఉద్వేగభరితమైన మ్యాచ్‌లో కూడా అతడు తానేంటో చూపించాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడమే కాకుండా ఎలాంటి బెరుకు కనిపించకుండా బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధోనీ లేని లోటును హార్దిక్ పాండ్యా స్పష్టంగా పూడ్చేసినట్లు అనిపించింది. ప్రస్తుతానికి దినేష్ కార్తీక్ ఉన్నా.. అతని వయసు 37 కాబట్టి ఒకట్రెండు సంవత్సరాలకు మించి జట్టులో ఉండే పరిస్థితులు లేవు. అందువల్ల హార్దిక్ పాండ్యా జట్టు ఫినిషర్‌గా కీలక పాత్ర పోషించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు.

Read Also: Amazon, Flipkart Parcels: వైరల్ వీడియో.. రైలులో నుంచి పార్శిల్స్‌ను విసిరిపడేస్తున్నారుగా..!!

Exit mobile version