WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!

Uma Kashvi Wpl 2027

Uma Kashvi Wpl 2027

WPL Auction Youngest Player Uma Kashvi: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్) 2027 వేలంలో కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల యువ క్రికెటర్‌ ఉమా కాశ్వి అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్‌ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆమెను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. గత ఏడాది 16 ఏళ్ల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోకి వచ్చిన దియా యాదవ్‌ పేరిట ఉన్న రికార్డును ఉమా అధిగమించింది. చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఈ యువ ఆల్‌రౌండర్‌.. ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది.

ఎవరీ ఉమా కాశ్వి?:


కర్ణాటకకు చెందిన ఉమా కాశ్వి రైట్ హ్యాండ్ బ్యాటర్‌. ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ కూడా చేయగలదు. ఇటీవల బీసీసీఐ నిర్వహించిన మహిళల అండర్‌-15 వన్డే టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. 172 సగటుతో 516 పరుగులు సాధించింది. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. ఈ గణాంకాలే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఉమా భారత అండర్‌-19 జట్టు తరఫున శ్రీలంక అండర్‌-19 జట్టుతోనూ ఆడింది. మూడు టీ20 మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాటు వన్డే మ్యాచ్‌ల్లో మరో రెండు వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించగల సామర్థ్యం ఉండటంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆమెను జట్టులోకి తీసుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

సోఫీ మోలిన్యూకు అత్యధిక ధర:
కొచ్చిలో బుధవారం జరిగిన డబ్ల్యూపీఎల్‌ 2027 మినీ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ సోఫీ మోలిన్యూ అత్యధిక ధర పలికింది. ఆమెను యూపీ వారియర్జ్‌ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె బేస్‌ ప్రైస్‌ రూ.50 లక్షలు కాగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కూడా రూ.1.05 కోట్ల వరకు పోటీపడింది. చివరకు ఆర్‌సీబీ తప్పుకోవడంతో సోఫీ యూపీ సొంతమైంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన సోఫీ.. గతంలో ఆర్‌సీబీ తరఫున ఆడి టైటిల్‌ సాధించడంలో భాగమైంది. గాయం కారణంగా 2026 డబ్ల్యూపీఎల్‌ సీజన్‌కు దూరమైన ఆమె.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చింది. 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఆమెకు ఉంది.

కిరణ్‌ నవ్‌గిరేకు రూ.75 లక్షలు:
భారత బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరేను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఆమె కోసం ముంబై ఇండియన్స్‌ కూడా పోటీపడగా.. రూ.70 లక్షల వద్ద వెనక్కి తగ్గింది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో కిరణ్‌ రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు 2025 అండర్‌-19 ప్రపంచకప్‌ విజేత భారత జట్టులో సభ్యురాలైన యువ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జి. కమలినిని గుజరాత్‌ జెయింట్స్‌ రూ.40 లక్షల బేస్‌ ప్రైస్‌కు కొనుగోలు చేసింది.

గంటలోపే ముగిసిన మినీ వేలం:
డబ్ల్యూపీఎల్‌ 2027 మినీ వేలంలో మొత్తం 25 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. తక్కువ వ్యవధిలోనే వేలం ముగియగా.. యూపీ వారియర్జ్‌ అత్యధికంగా ఎనిమిది మంది ఆటగాళ్లను తీసుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్‌సీబీ మాత్రం సోఫీ మోలిన్యూ కోసం పోటీపడి.. చివర్లో తమ కొనుగోళ్లను పూర్తి చేసింది. మొత్తంగా ఉమా కాశ్వి వంటి యువ ప్రతిభావంతులకు డబ్ల్యూపీఎల్‌ వేదికగా అవకాశం లభించగా.. సోఫీ మోలిన్యూ, కిరణ్‌ నవ్‌గిరే వంటి ఆటగాళ్లు భారీ ధరలు పలికారు.