Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!

Mohit Ulva India U19 Hero

Mohit Ulva India U19 Hero

India U19 Star Mohit Ulva: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత యువ జట్టు అద్భుత విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో టీమిండియా ఒక వికెట్ తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన యువ ఆటగాడు మోహిత్ ఉల్వా.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అజేయంగా 49 పరుగులు చేసిన అతడు.. అసాధ్యమనుకున్న విజయాన్ని భారత్‌కు అందించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు ఫైనల్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది.

మ్యాచ్‌ను మలుపు తిప్పాడు:


మస్కట్ వేదికగా జరిగిన ఫైనల్‌లో భారత్ 252 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టు విజయానికి మరో 84 పరుగులు అవసరమయ్యాయి. అలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 18 ఏళ్ల మోహిత్ ఉల్వా ఏమాత్రం తడబడలేదు. కేవలం 26 బంతుల్లోనే అజేయంగా 49 పరుగులు చేసి భారత విజయానికి బాటలు వేశాడు. తొలుత మనల్ చౌహాన్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత చివరి వికెట్‌కు సి. వెంకటతో కలిసి మరో 29 పరుగులు జోడించాడు. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలోనూ ఒత్తిడిని అధిగమించి.. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన మోహిత్ ఎవరు అని క్రికెట్ అభిమానులు గూగుల్ చేస్తున్నారు.

జడేజాను తీర్చిదిద్దిన కోచ్ దగ్గరే శిక్షణ:
మోహిత్ ఉల్వా గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన యువ క్రికెటర్. అతడు క్రికెట్ బంగ్లా అకాడమీలో మహేంద్రసిన్హ్ చౌహాన్ దగ్గర శిక్షణ పొందాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా తీర్చిదిద్దిన కోచ్‌గా మహేంద్రసిన్హ్ చౌహాన్‌కు పేరుంది. అదే కోచ్ వద్ద శిక్షణ పొందిన మోహిత్ ఇప్పుడు అండర్-19 స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడం విశేషం. చిన్నతనంలోనే మోహిత్‌కు క్రికెట్‌పై ఆసక్తి ఏర్పడటానికి అతడి తండ్రి కారణమయ్యారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేసే ఆయన ప్రోత్సాహంతో మోహిత్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కుటుంబ ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో క్రమంగా ఎదుగుతూ భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు.

బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ సత్తా:
మోహిత్ ఉల్వా కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు. భారత అండర్-19 జట్టుకు ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలింగ్ చేసే బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాడు. ఈ ఆసియా కప్ టోర్నీలో మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లోనూ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్‌తో ఫైనల్‌లో ఒత్తిడిని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌తో మోహిత్ పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. కీలక సమయంలో జట్టును ఆదుకోవడమే కాకుండా..భారత క్రికెట్‌కు మరో ప్రతిభావంతమైన యువ ఆటగాడు దొరికాడనే నమ్మకాన్ని కలిగించాడు. భవిష్యత్తులో సీనియర్ జట్టులోనూ చోటు సంపాదిస్తాడా అన్నది చూడాలి.