NTV Telugu Site icon

PAK Vs ZIM: పాకిస్థాన్, జింబాబ్వే మధ్య శత్రుత్వానికి మిస్టర్ బీన్ కారణమా?

Mister Bean

Mister Bean

PAK Vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో గురువారం సంచలనం నమోదైంది. బలమైన పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో జింబాబ్వే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అటు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో కూడా స్వయంగా ట్వీట్ చేశారు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలోని జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ఈ దఫా తమ దేశానికి ఫేక్ మిస్టర్ బీన్‌ను కాకుండా రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలంటూ ఎద్దేవా చేశారు. దీంతో పలువురు అభిమానులు మధ్య మిస్టర్ బీన్ సంగతేంటని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ రెండు దేశాల మధ్య మిస్టర్ బీన్ ఎందుకు వచ్చాడని.. అసలు మిస్టర్ బీన్ కథేంటని క్రికెట్ అభిమానులు తెగ హైరానా పడుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. 2016లో జింబాబ్వేలోని హరారె ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఒక కామెడీ షో నిర్వహించారు. ఈ షో కోసం రియల్‌ మిస్టర్‌ బీన్‌ అలియాస్‌ రొవాన్ అట్కిన్సన్‌ను పంపుతున్నట్లు పాకిస్థాన్‌ బిల్డప్‌ ఇచ్చింది. ఒక కారులో మిస్టర్ బీన్‌ జింబాబ్వేలో రోడ్‌ షో కూడా నిర్వహించాడు. అప్పటికే బీన్‌ ప్రపంచ ప్రఖ్యాత కమెడియన్‌గా ఉండటంతో జింబాబ్వే ప్రజలు ఆయనతో ఫొటో దిగేందుకు ఎగబడ్డారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్యర్యపోయారు. ఆయన నిజమైన మిస్టర్‌ బీన్‌ కాదు. ఆయన పోలికలతో ఉన్న పాకిస్తాన్ కమెడియన్ ఆసిఫ్ మహ్మద్. అసలైన మిస్టర్‌ బీన్‌లా బిల్డప్‌ ఇస్తూ జింబాబ్వే ప్రజలను మోసం చేశాడు. అంతేకాకుండా మిస్టర్ బీన్ తరహాలో కామెడీ షోలో అతనే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఈ విషయం వివాదాస్పదంగా మారింది. తమను నవ్వుల పాలు చేసిన పాకిస్థాన్‌పై జింబాబ్వే రగిలిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై జింబాబ్వే గెలవడంతో మరోసారి మిస్టర్ బీన్ వివాదం తెరపైకి వచ్చింది.

ఈసారైనా తమ దేశానికి రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలని జింబాబ్వే అధ్యక్షుడు చేసిన ట్వీట్ పట్ల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా స్పందించారు. తమ దగ్గర రియల్‌ మిస్టర్‌ బీన్‌ లేడని.. కానీ.. తమ వద్ద అసలైన క్రికెట్‌ స్ఫూర్తి ఉందని.. అలాగే తమ పాకిస్థానీలకు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యే ఫన్నీ అలవాటు ఉందన్నారు. మిస్టర్‌ ప్రెసిడెంట్‌ శుభాకాంక్షలు.. మీ జట్టు అద్భుతంగా ఆడిందంటూ షెహబాజ్ షరీఫ్‌ ట్వీట్‌ చేశారు.