Site icon NTV Telugu

Brij Bhushan: ‘కుట్రను బయటపెడతా..రెజ్లర్ల ఆరోపణలు అవాస్తవం’

Brij Bhushan

Brij Bhushan

Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్లు చేస్తున్న ఆందోళన మూడో రోజూ కొనసాగుతోంది. రెజ్లర్లతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ జరిపిన చర్చలు ఫలించకపోవడమే ఇందుకు కారణం. కాగా, ఈ ఆరోపణలపై డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ మరోసారి స్పందించారు. అవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు బయటపెడతానని చెప్పారు. దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. “మహిళా రెజ్లర్ల మర్యాదకు భంగం కలిగిస్తూ రెజ్లింగ్‌కు వ్యతిరేకంగా కొందరు రాజకీయ కుట్రలకు దారితీస్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు ఈ విషయంపై మీడియా సమావేశం నిర్వహిస్తా. ఇందులో ఈ కుట్ర గురించి అన్ని విషయాలు బయటపెడతా” అని ఆయన ఆ పోస్ట్‌లో వెల్లడించారు.

Read also: Allu Arjun : గోల్డెన్‌ వీసా అందుకున్న పుష్ప రాజ్‌.. తగ్గేదెలే..

రెజ్లర్ల సమస్యకు వెంటనే పరిష్కారం ఇచ్చేందుకు క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. స్టార్ రెజ్లర్లు భజ్‌రంగ్‌ పునియా, రవి దహియా, వినేశ్‌ ఫోగాట్‌, సాక్షి మలిక్‌లతో తన నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గురువారం రాత్రి 10 గంటలకు మొదలైన ఈ చర్చలు.. శుక్రవారం ఉదయం 2 గంటల వరకూ కొనసాగినట్లు తెలుస్తోంది. ఆరోపణలపై సమాఖ్య నుంచి వివరణ వచ్చేంతవరకు వేచి చూడాలని క్రీడల మంత్రి రెజ్లర్లను కోరారు. అయితే ఇందుకు వారు అంగీకరించలేదని సమాచారం. బ్రిజ్ భూషణ్‌ రాజీనామా చేయడంతో పాటు సమాఖ్యను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టినట్లు ఓ అధికారి తెలిపారు. అయితే.. బ్రిజ్‌ భూషణ్‌ 24 గంటల్లోపు రాజీనామా చేయాలంటూ క్రీడల శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. ఈ నెల 22న డబ్ల్యూఎఫ్‌ఐ జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఆ సమావేశంలో బ్రిజ్‌ భూషణ్‌ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌పై అదనపు డబ్బులు ఇవ్వడం ఆపేయండి.. లేదంటే..

Exit mobile version