NTV Telugu Site icon

ICC Test Rankings: ఐసీసీ టాప్-10 నుంచి కోహ్లీ అవుట్.. ఆరేళ్ల తర్వాత తొలిసారి

Virat Kohli Test Rankings

Virat Kohli Test Rankings

భారత్-ఇంగ్లండ్ చివరి టెస్ట్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఈ మ్యాచ్‌ రెండు ఇ న్నింగ్స్‌లలోనూ కోహ్లీ విఫలం కావడంతో అతడి ర్యాంక్ పడిపోయింది. దీంతో ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఐసీసీ టాప్-10లో విరాట్ కోహ్లీ పేరు గల్లంతయ్యింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11, 20 స్కోర్లు చేసిన కోహ్లి తాజా టెస్టు ర్యాంకుల్లో 13వ స్థానానికి దిగజారాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. రూట్ ఖాతాలో 923 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ 20 ఆటగాళ్ల జాబితాలో రూట్ చేరాడు.

Read Also: IND Vs WI: కెప్టెన్‌గా ధావన్.. వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా.. మూడు వన్డేలకు జట్టు ప్రకటన

అటు అద్భుత ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్‌స్టో ఐసీసీ ర్యాంకుల్లో దూసుకెళ్లాడు. అతడు ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకుకు చేరాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ చివరి రెండు మ్యాచ్‌లలో సెంచరీలు చేసిన బెయిర్ స్టో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ శతకం బాదాడు. కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెరీర్‌లోనే తొలిసారిగా ఐసీసీ ర్యాంకుల్లో 5వ స్థానానికి చేరుకున్నాడు. పంత్ తన గత ఆరు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌కు కరోనా కారణంగా దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో అశ్విన్, మూడో స్థానంలో బుమ్రా ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు.