టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విరాట్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. రాంచీ వన్డేలో కోహ్లీ 135 పరుగులు చేసిన కింగ్.. రాయ్‌పూర్ వన్డేలో 102 పరుగులు చేశాడు. కోహ్లీ తన వన్డే కెరీర్‌లో మొత్తం సెంచరీల సంఖ్య 53కి చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ మొత్తం 84 సెంచరీలు చేశాడు. వన్డేలతో పాటు టెస్టులు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా కోహ్లీ అద్భుతంగా రాణించాడు.
టెస్టుల్లో 30 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ.. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒక సెంచరీ చేశాడు. విరాట్ గత సంవత్సరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సంవత్సరం మేలో టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ ఆయాడు. కోహ్లీ భారత్ తరపున వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయినా మంచి ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. భారత జట్టు తరఫున కోహ్లీ ఒకే ఫార్మాట్‌లో ఆడతాడు కాబట్టి.. అతను 100 సెంచరీలు (సుప్రీం సెంచరీలు) చేరుకోగలడా అనేది అతిపెద్ద ప్రశ్న. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. 2027 ప్రపంచకప్‌ను కూడా కలుపుకుంటే కోహ్లీ గరిష్టంగా 40 వన్డేలు ఆడగలడు. విరాట్ 100 ‘సెంచరీ’లపై మాజీలు జోస్యం చెబుతున్నారు.
Also Read: Shikhar Dhawan: విదేశాల్లో విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లు.. వందల కోట్లకు యజమాని గబ్బర్!
భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా విరాట్ కోహ్లీ 100 అంతర్జాతీయ సెంచరీలపై తన అభిప్రాయం చెప్పారు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉన్నా.. 100 సెంచరీలు చేయడం మాత్రం అంత సులభం కాదన్నారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ… ‘కోహ్లీ 100 సెంచరీలు సాధించగలడా అనేది పెద్ద ప్రశ్న. అతను ఇంకా 16 సెంచరీల దూరంలో ఉన్నాడు. వరుసగా రెండు సెంచరీలు చేశాడు కాబట్టి.. ఇకపై కూడా పరుగులు చేస్తూనే ఉంటాడనుకుంటున్నా. 2027 వన్డే ప్రపంచకప్ ముగిసే సమయానికి ఇంకా 35-40 మ్యాచ్‌లు ఆడవచ్చు. కాబట్టి విరాట్ సెంచరీల మైలురాయిని చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేస్తాడనే లాగ ఆడుతున్నాడు. చూడాలి మరి ఆ అరుదైన మైలురాయి చేరుకుంటాడో లేదో’ అని అన్నారు.
