Virat Kohli Lashed Out After His Room Video Leaked: తమ అభిమాన క్రికెటర్లను కలవడం, వారితో కలిసి ఫోటో దిగడం వరకు ఓకే. క్రికెటర్లు కూడా ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపుతారు. అలాగని అభిమానం ఉన్నంత మాత్రాన హోటల్ రూమ్‌లోకి దూరేంత స్వేచ్ఛ తీసుకోకూడదు. ఇది వారి ప్రైవసీకి భంగం కలిగించినట్టే అవుతుంది. ఇలాంటి చేదు అనుభవమే విరాట్ కోహ్లీకి తాజాగా ఎదురైంది. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ కోసం కోహ్లీ ఆస్ట్రేలియాలో ఉంటోన్న సంగతి తెలిసిందే! అయితే.. కోహ్లీ లేని సమయంలో అతని హోటల్ గదిలోకి ఒక వ్యక్తి వెళ్లి, అక్కడి వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఇది తన కంటికి చిక్కడంతో.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇది తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.
‘‘తమ అభిమాన క్రికెటర్లను చూసినప్పుడు అభిమానులు ఎగ్జైట్ అవుతారని, చాలా ఆనంద పడతారని నాకు తెలుసు. ఫోటో దిగాలన్న ఉత్సుకత కూడా ఉంటుంది. అలాంటి అభిమానాన్ని నేను కూడా అభినందిస్తా. కానీ, ఈ వీడియో మాత్రం నన్ను షాక్‌కి గురి చేసింది. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే. నా హోటల్ గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే.. ఇంకెక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని నేను ఆశించగలను. ఇలాంటి అభిమానాన్ని నేనెప్పుడూ అంగీకరించలేను. ఇది కచ్చితంగా గోప్యతా ఉల్లంఘనే. దయచేసి ప్రతి ఒక్కరి ప్రైవసీకి గౌరవమివ్వండి. ఏ ఒక్కరినీ వినోద వస్తువుగా చూడొద్దు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ సుదీర్ఘంగా రాసుకొచ్చాడు. కోహ్లీ పోస్ట్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. ‘ఇది పిచ్చితనం, ఇలాంటివి ఆమోదయోగ్యం కాదు’ అని కామెంట్ చేశాడు.