దాదాపు మూడేళ్లు సరైన ఫామ్‌లేక, సెంచరీలు కొట్టలేక గడ్డుకాలాన్ని అనుభవించాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం మాత్రం ఫుల్ జోష్‌మీదున్నాడు. అన్ని ఫార్మాట్లలో సెంచరీలు సాధిస్తూ దూకుడు కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కింగ్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐసీసీ అత్యుత్తమ టెస్ట్ టీమ్, వన్డే టీమ్, టీ20 జట్టుల్లో భాగమైన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రతీ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేస్తూ ఉంటుంది. గతంలోనే ఐసీసీ టెస్ట్ టీమ్, వన్డే టీమ్‌ల్లో పలుమార్లు చోటు దక్కించుకున్న విరాట్.. టీ20 టీమ్‌కు ఎంపికవ్వడానికి మాత్రం టైమ్ తీసుకున్నాడు. గతేడాది అద్భుత పెర్ఫామెన్స్‌తో దుమ్మురేపిన కోహ్లీ ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన 2022 అత్యుత్తమ జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. దాంతో క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లకు చెందిన ఐసీసీ బెస్ట్ ఎలెవెన్స్‌లో చోటు దక్కించుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
VishnuKumar Raju: విశాఖ వస్తే లోకేష్‌ను కలుస్తా.. పొత్తులపై అధిష్టానానిదే నిర్ణయం
ఐసీసీ అవార్డులన్నీ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా మూడు సార్లు నిలిచిన కోహ్లీ.. వన్డే కెప్టెన్‌గా నాలుగు సార్లు ఎంపికయ్యాడు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. దశాబ్దపు క్రికెటర్‌గా.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్‌గా కూడా నిలిచాడు. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న విరాట్.. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఒకసారి, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా మూడు సార్లు నిలిచాడు. టెస్ట్, వన్డే, టీ20 టీమ్ ఆఫ్ ద డికేడ్, టెస్ట్ టీమ్ కెప్టెన్ ఆఫ్ డికేడ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటికీ 10 సార్లు ఐసీసీ అత్యుత్తమ ఇయర్ టీమ్స్‌లో విరాట్ భాగమయ్యాడు.
గతేడాది జూలై వరకు విరాట్ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటే కోల్పోతాడని ప్రచారం జరిగింది. నెల రోజుల పాటు ఆటకు దూరమైన విరాట్.. ఆసియాకప్ 2022తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ టోర్నీలో ఆఫ్ఘానిస్తాన్‌పై సెంచరీ బాది.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అక్కడి నుంచి విరాట్ జోరు కొనసాగుతూనే ఉంది. ఆసియాకప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 276 పరుగులు చేసిన కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌లో 296 రన్స్‌తో ఈ మెగాటోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌పై 82 రన్స్ చేసి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఇది అతడి కెరీర్‌లో పదితరాలు పాటు గుర్తుండిపోయే ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు.
2023లోనూ కింగ్ కోహ్లీనే..
ఈ ఏడాది కూడా విరాట్ కోహ్లీ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. శ్రీలంకతో తొలి వన్డేలో 113 పరుగులు చేసిన విరాట్.. చివరి వన్డేలో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో తొలి రెండు వన్డేల్లో విఫలమైన విరాట్.. కాన్పుర్ వేదికగా జరిగే ఆఖరి వన్డేలో భారీ స్కోర్‌పై కన్నేశాడు. ఈ సిరీస్ అనంతరం టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్న కోహ్లీ.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు.