NTV Telugu Site icon

World Wrestling Championships 2022: రెండోసారి కాంస్యం నెగ్గిన వినేశ్.. తొలి భారత మహిళగా రికార్డ్

Vinesh Phogat

Vinesh Phogat

Vinesh Phogat Wins Bronze Medal In World Wrestling Championships 2022: వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంస్య పతకం సాధించింది. మహిళల 53 కిలోల విభాగం బౌట్‌లో బుధవారం స్వీడన్‌కు చెందిన ఎమ్మా మాల్మ్‌గ్రెన్‌తో 28 ఏళ్ల వినేశ్ ఫొగట్ పోరాడింది. ఈ పోరులో 8-0 తేడాతో నెగ్గి, కాంస్యం దక్కించుకుంది వినేశ్. దీంతో.. ఈ మెగా ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు 2019లో కజకిస్తాన్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం కైవసం చేసుకున్న వినేశ్.. మూడేళ్ల తర్వాత రెండోసారి కాంస్యం సాధించింది.

మొదట.. తొలి రౌండ్‌లో మంగోలియాకు చెందిన ఖులాన్ బత్‌ఖ్యుగా (2022 ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత) చేతిలో వినేశ్ ఫొగట్ 0-7తో ఓడిపోయింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి దూకుడు ప్రదర్శించడంతో.. ఆదిలోనే వినేశ్ వెనుకబడింది. ఆ తర్వాత కూడా గట్టి పోటీ ఇవ్వడంతో.. వినేశ్‌‌కు ఓటమి తప్పలేదు. అయితే ఖులాన్‌ ఫైనల్‌కు చేరడం వల్ల.. ఫొగట్‌కు రెపిచేజ్‌లో తలపడే అవకాశం లభించింది. రెపిచేజ్‌లో భాగంగా కజకిస్తాన్‌కు చెందిన ఇషిమోవాపై 4-0తో వినేశ్ నెగ్గింది. ఆ తర్వాతి రౌండ్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన లైలా గుర్బనోవాతో వినేశ్ తలపడాల్సింది కానీ.. ఆమె గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దీంతో.. వినేశ్ కాంస్య పతక పోరుకి చేరింది. ఈ పోరులో అద్భుతంగా అద్భుతంగా పోరాడి.. ఎమ్మా జొన్నను చిత్తు చేసి, చివరికి కాంస్య పతకం నెగ్గింది.