NTV Telugu Site icon

Sunil Gavaskar: సచిన్ రికార్డ్‌ను అతడు బ్రేక్ చేయడం కష్టమే!

Sunil Gavaskar On Joe Root

Sunil Gavaskar On Joe Root

టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ (15,921) అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉన్నాడు. దాదాపు దశాబ్దకాలం గడిచినా, ఎవ్వరూ దాన్ని బ్రేక్ చేయలేకపోయారు. మధ్యలో కొందరు యువ ఆటగాళ్లు ప్రదర్శించిన అద్భుత ఆటతీరుని చూసి, బహుశా వాళ్లు సచిన్ రికార్డ్‌ని అధిగమిస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ, ఫామ్ కోల్పోయి సచిన్ రికార్డ్‌కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.

అది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ విషయంలోనూ రిపీట్ కావొచ్చని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల రూట్ టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకోగా, అతడు సచిన్ రికార్డ్‌ని తప్పకుండా బద్దలుకొడతాడని కొందరు మాజీలు తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే సచిన్ రికార్డ్‌ను రూట్ చేరుకోవడమన్నది దాదాపు కష్ట సాధ్యమని గవాస్కర్ పేర్కొన్నాడు. సచిన్ క్రికెట్‌కు దూరమై దాదాపు దశాబ్ద కాలం గడిచినా, ఇప్పటికీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని అన్నాడు.

‘‘టెస్టుల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డ్‌ని చేరుకోవడమనేది దాదాపు అసాధ్యం. అది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ రికార్డ్‌ని బ్రేక్ చేయాలంటే, రూట్‌కి సుమారు మరో ఆరు వేల పరుగులు చేయాల్సి ఉంటుంది. అంటే, రాబోయే ఎనిమిదేళ్లలో ఏడాదికి 800 నుంచి 1000 పరుగులు చొప్పున చేయాలి. ఇప్పుడు రూట్ వయసేమో 31. ఆటగాళ్లు నిరంతరం ఆడుతూ ఫామ్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ శారీరక, మానసిక అలసట ఎదురవుతుంది. కాబట్టి, సచిన్ రికార్డ్‌ని రూట్ అధిగమించడం చాలా కష్టమే’’ అని గవాస్కర్ తెలిపాడు.

అయితే.. ఇదే సమయంలో గవాస్కర్ క్రికెట్‌లో ఏదైనా సాధ్యమేనని కూడా చెప్పాడు. ఒకప్పుడు రిచర్డ్ హ్యాడ్లీకి చెందిన 431 వికెట్ల రికార్డ్‌ని ఎవరూ చేరుకోలేరని అనుకున్నామని, కానీ అది బద్దలైందని పేర్కొన్నాడు. అలాగే వాల్ష్ సృష్టించిన 519 వికెట్ల రికార్డ్ కూడా తుడిచిపెట్టుకుపోయిందన్నాడు. దీన్ని బట్టి, ఆటలో ఏదైనా సాధ్యమని చెప్పొచ్చని అభిప్రాయపడ్డాడు. కాకపోతే.. ఆ రికార్డుల్ని అధిగమించడానికి చాలాచాలా కష్టపడాలన్నాడు. ఒకవేళ సచిన్ రికార్డ్‌ని రూట్ బ్రేక్ చేయాలంటే, తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.