భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 108 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ బీహార్ మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. 14 సంవత్సరాల 250 రోజుల వయసులో వైభవ్ శతకం నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరపున 35 బంతుల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన టీ20 బ్యాటర్‌గా అతను ఇప్పటికే రికార్డు సృష్టించాడు.
Also Read: Ravi Shastri-Gambhir: గంభీర్‌ను సపోర్ట్ చేయను, నేనే కోచ్‌ను అయితే.. రవిశాస్త్రి బిగ్ స్టేట్‌మెంట్!
సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్. కోల్‌కతాలో బీహార్‌లో జరిగిన మొదటి మూడు ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లలో అతను బ్యాటింగ్‌తో రాణించలేదు. నవంబర్ 26న చండీగఢ్‌పై 14 పరుగులకే ఔటయ్యాడు. నవంబర్ 28న మధ్యప్రదేశ్, నవంబర్ 30న జమ్మూ కాశ్మీర్‌లతో జరిగిన మ్యాచ్‌లలో వరుసగా 13, 5 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈరోజు మహారాష్ట్రపై సెంచరీతో చెలరేగాడు.
