Vaibhav Suryavanshi: ‘నేనే ఇండియా కోచ్‌ అయితే వైభవ్‌ని పీకి పక్కన పెట్టేవాడిని..’టీమిండియా మాజీ ప్లేయర్‌ సంచలన వ్యాఖ్యలు

Vaibhav Suryavanshi (2)

Vaibhav Suryavanshi (2)

Vaibhav Suryavanshi : ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే పేరు..అదే వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే భారీ షాట్లు, భయమే తెలియని బ్యాటింగ్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యువ ఆటగాడు ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి చర్చ అతని బ్యాట్ గురించి కాదు. మైదానంలో జరిగిన ఘర్షణ గురించి.

శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో భారత్ ఏ, శ్రీలంక ఏ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు సమాన స్కోర్లు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. చివరకు శ్రీలంక ఏ విజయం సాధించింది. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఘటనే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మైదానం వీడి వెళ్తున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. మాటల యుద్ధం క్రమంగా ఉద్రిక్తంగా మారి తోపులాట వరకు వెళ్లింది. ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొన్ని రిపోర్టుల ప్రకారం శ్రీలంక ఆటగాళ్ల వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయని చెబుతున్నారు.

×
×
Ad

ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించిన తీరు ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది. తాను ఇండియా ఏ కోచ్‌గా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ఏతో జరిగిన తర్వాతి మ్యాచ్‌కు వైభవ్‌ను జట్టులోకి తీసుకునేవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థి ఎంతగా రెచ్చగొట్టినా మైదానంలో శారీరకంగా స్పందించడం సరైన పద్ధతి కాదని చెప్పారు. ఆటగాడికి క్రమశిక్షణ ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా ఒక మ్యాచ్ పక్కన పెట్టడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

మంజ్రేకర్ వ్యాఖ్యలు ఎందుకు అంత ప్రాధాన్యం సంతరించుకున్నాయంటే… కొన్ని రోజుల క్రితమే ఇదే వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై ప్రశంసలు కురిపించిన వారిలో ఆయనే ఒకరు. ఈ యువ ఆటగాడిలో కేవలం టీ20 స్టార్ మాత్రమే కాదు, భవిష్యత్తులో వన్డే క్రికెట్‌ను శాసించే సామర్థ్యం కూడా ఉందని చెప్పారు. అలాంటి ఆటగాడి విషయంలోనే ఇప్పుడు క్రమశిక్షణపై గట్టిగా మాట్లాడాడు.

మరోవైపు భారత జట్టు కోచ్ సైరాజ్ బహుతులే మాత్రం వైభవ్‌కు మద్దతుగా నిలిచారు. సాధారణంగా అతడు చాలా ప్రశాంతంగా ఉండే ఆటగాడని, అసలు ఎలా రెచ్చగొట్టారో తనకు తెలియదని చెప్పారు. జరిగిన ఘటన నుంచి వైభవ్ పాఠాలు నేర్చుకుంటాడనే నమ్మకం వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు వైభవ్ ముందు ఉన్న అసలు సవాల్ పరుగులు చేయడం మాత్రమే కాదు. తన భావోద్వేగాలను కూడా నియంత్రించుకోవడం. ఎందుకంటే ప్రతిభ అతడిని స్టార్‌గా మార్చవచ్చు. కానీ క్రమశిక్షణ మాత్రమే అతడిని గొప్ప ఆటగాడిగా నిలబెడుతుంది. ఆగ్రహం క్షణికమే కావచ్చు. కానీ దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇకపై ఇలాంటి వివాదాల కంటే తన బ్యాటింగ్‌తోనే వార్తల్లో నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.