Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్‌ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ వైభవ్‌ను ఆడించాలి!

  • ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
  • బుడ్డోడికి అవకాశం ఇవ్వాలని అంటున్న మాజీలు
  • తొలి టీ20లోనే వైభవ్ వైభవ్‌ను ఆడించాలి
Vaibhav Sooryavanshi Debut

Vaibhav Sooryavanshi Debut

Vaibhav Sooryavanshi To Play 1st T20 vs England: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడం భారత క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే బుడ్డోడికి అవకాశం ఇవ్వాలని అందరూ అంటున్నారు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా చేరిపోయారు. వైభవ్ నిర్భయంగా ఆడే తీరు ఇంగ్లండ్‌కు పెద్ద సవాలుగా మారుతుందని, అతడి గురించి ప్రత్యర్థి జట్టుకు పూర్తి అవగాహన లేకపోవడం భారత్‌కు అదనపు ప్రయోజనమని పేర్కొన్నారు. ఇంగ్లండ్‌పై వైభవ్‌ను తప్పక ఆడించాలని.. ఒక్కడే మ్యాచ్‌ను గెలిపిస్తాడని సన్నీ చెప్పుకొచ్చారు.

తొలి మ్యాచ్‌లోనే అవకాశం ఇవ్వాలి:

సోనీ స్పోర్ట్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఐర్లాండ్ సిరీస్‌లో 0-2తో ఓడిన తర్వాత భారత్‌కు బలమైన ఆరంభం అవసరమని, అందుకు వైభవ్ సూర్యవంశీ సరైన ఎంపిక అని చెప్పాడు. ‘వైభవ్ తొలి టీ20లోనే ఆడాలని నేను కోరుకుంటున్నా. ఇంగ్లండ్ సిరీస్‌ను అతడు దూకుడుగా ప్రారంభించి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించగలడు. ఐర్లాండ్ సిరీస్ ఓటమి నుంచి కోలుకోవడానికి ఇది ఉత్తమ మార్గం’ అని సన్నీ చెప్పారు.

జట్టులో చోటు కల్పించడం సవాలే:

వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవడం అంత సులభం కాదని కూడా సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనింగ్ జోడీ గతంలో జట్టుకు మంచి విజయాలు అందించిందని.. అలాంటి భాగస్వామ్యాన్ని విడదీయడం కూడా సరికాదని సూచించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఆలోచన చేస్తే.. వైభవ్‌కు అవకాశం ఇవ్వాలన్నారు. వైభవ్‌ ఆటతీరుపై ఇంగ్లండ్ బౌలర్లకు స్పష్టమైన అవగాహన లేకపోవడం మనకు కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. ‘ఐర్లాండ్ సిరీస్‌ను చూసి ఇంగ్లండ్ బౌలర్లు భారత బ్యాటర్లపై కొంత అవగాహన పెంచుకున్నారు. కానీ వైభవ్ ఆడలేదు. కాబట్టి అతడిని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలియదు. ఐపీఎల్‌లో అతడి వీడియోలు మాత్రమే చూసి ఉంటారు. ఒకసారి వైభవ్ దూకుడుగా ఆడటం ప్రారంభిస్తే మ్యాచ్‌ను ఒక్కడే మార్చేయగలడు. ప్రస్తుతం భారత్‌కు అలాంటి ప్రభావం చూపగల ఆటగాడు అవసరం’ అని వివరించారు.

సీనియర్ల మార్గదర్శకత్వం గొప్ప విషయం:

వైభవ్‌కు భారత సీనియర్ ఆటగాళ్లు అందిస్తున్న సహకారాన్ని కూడా గవాస్కర్ ప్రశంసించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అతడితో నిరంతరం మాట్లాడటం ఎంతో మంచి సంకేతమని పేర్కొన్నారు. ‘అభిషేక్ శర్మ అతడికి ప్రత్యక్ష పోటీదారుడే. అయినా వైభవ్‌కు సూచనలు ఇస్తున్న తీరు అభినందనీయం. అలాగే ఇషాన్ కిషన్ కూడా అతడికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. వైభవ్ ముందు ఇంకా రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ కెరీర్ ఉంది. అతడిని సరైన దిశలో తీర్చిదిద్దుతున్నారు’ అని గవాస్కర్ అన్నారు. ప్రతి సారి తుది జట్టులో చోటు దక్కకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఉండటం కూడా యువ క్రికెటర్ల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

శ్రేయస్‌కు సమయం ఇవ్వాలి:

‘ఆటగాళ్లు ఎలా ప్రాక్టీస్ చేస్తారు, పరాజయాలను ఎలా ఎదుర్కొంటారు, ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు వంటి విషయాలను దగ్గర నుంచి గమనించడం కూడా ఒక గొప్ప పాఠమే. అత్యున్నత స్థాయిలో టెక్నిక్ కంటే మానసిక ధైర్యం, సహనం, సరైన స్వభావం చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం వైభవ్‌కు లభిస్తున్న ఈ అనుభవం భవిష్యత్తులో అతడికి ఎంతో ఉపయోగపడుతుంది’ అని గవాస్కర్ వివరించారు. ‘శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. కానీ అంతర్జాతీయ స్థాయి పూర్తిగా భిన్నమైనది. ఐర్లాండ్‌పై తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ముగిశాయి. ఓటమి బాధాకరమే అయినా.. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి. ఆ తర్వాతే అతడి నాయకత్వంపై సరైన అంచనా వేయాలి’ అని గవాస్కర్ చెప్పుకొచ్చారు.