భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక ‘TIME 100 Next India’ తొలి జాబితాలో బుడ్డోడికి చోటు దక్కింది. దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న 100 మంది అసాధారణ నాయకులు, ఎదుగుతున్న ప్రతిభావంతులను గుర్తిస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా.. వైభవ్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తూ భావోద్వేగభరితమైన సందేశాన్ని రాశారు. మైదానంలో వైభవ్ తన బ్యాట్‌తో చెలరేగుతున్నపుడు.. భవిష్యత్తు అనేది భిన్నంగా ఆలోచించే వారిదేనని గుర్తుచేస్తాడని పేర్కొన్నారు.
వైభవ్ కేవలం క్రీడా రంగంలో అద్భుత ప్రతిభ కలిగిన యువ ఆటగాడే కాదని, అంతకుమించిన ప్రాధాన్యం ఉన్న వ్యక్తి అని ఆయుష్మాన్ ఖురానా కొనియాడారు. అతడు మారుతున్న భారతదేశానికి ప్రతీకగా నిలుస్తున్నాడన్నారు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు పొందాడని గుర్తుచేశారు. ఆ తర్వాత ఏడాది కాలంలోనే 2026లో రికార్డులు సృష్టించిన మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగాడని ప్రశంసించారు. అతడి వేగవంతమైన ప్రయాణం.. ప్రతిభ ఎక్కడి నుంచైనా వెలుగులోకి రావచ్చని నిరూపిస్తోందని పేర్కొన్నారు.
వైభవ్ సాధించిన పరుగులు, రికార్డులకే అతడి విజయాన్ని పరిమితం చేయలేమని ఆయుష్మాన్ అభిప్రాయపడ్డారు. అతడి ప్రయాణం, విజయాలు లక్షలాది మంది యువ భారతీయులకు పెద్ద కలలు కనడానికి స్ఫూర్తినిస్తాయన్నారు. కోట్లాది మంది కలలకు తమ ప్రతిభను నిరూపించుకునే స్వేచ్ఛ తోడైతే ఎలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయో కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. అయితే వైభవ్ తన బ్యాట్‌తోనే ఇప్పటికే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడని, అతడి ఆటతీరు, ఆత్మవిశ్వాసం ప్రత్యేకమని కొనియాడారు.
ఆయుష్మాన్ ఖురానా గతంలో TIME100 జాబితాలో చోటు దక్కించుకోవడంతో పాటు TIME Impact Award కూడా అందుకున్నారు. అలాంటి వ్యక్తి నుంచి వైభవ్‌కు ప్రశంసలు లభించడం యువ క్రికెటర్‌కు మరింత ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. వైభవ్‌తో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పూనియా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన విథ్యా రామరాజ్, కూకుమ్ మొహోద్లకు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది.

