Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!

  • మూడో టీ20 మ్యాచ్‌లో తుఫాన్ హాఫ్ సెంచరీ
  • వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు
  • టీ20ల్లో అత్యంత పిన్న వయసులో ఫిఫ్టీ
Vaibhav Sooryavanshi World Record

Vaibhav Sooryavanshi World Record

Vaibhav Sooryavanshi World Record: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 16 ఏళ్లు నిండకముందే అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు అర్ధశతకాలు సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా (పూర్తి స్థాయి ఐసీసీ సభ్యత్వ దేశాలు) రికార్డులకెక్కాడు. హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తుఫాన్ హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధశతకం బాదాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వైభవ్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొదటి టీ20 మ్యాచ్‌లో బుడ్డోడు ఫిఫ్టీ బాదిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయంగా చూస్తే.. నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా మాత్రమే 16 ఏళ్ల వయస్సు రాకముందే రెండు అర్ధశతకాలు చేసి ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పుడు పూర్తి సభ్యత్వ దేశాల జాబితాలో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు టెస్టు హోదా కలిగిన ఏ దేశానికి చెందిన ప్లేయర్ కూడా 16 ఏళ్లకు ముందే రెండు అర్ధ శతకాలు చేయలేదు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డును ఈ యువ బ్యాటర్ తన పేరిట లిఖించుకున్నాడు. తొలి టీ20లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయసులో ఫిఫ్టీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతడి ఊపు చూస్తే.. ఈజీగా సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో అవుట్ అయి పోయాడు. తొలి టీ20లో 19 బంతుల్లో 50, రెండో మ్యాచ్‌లో 9 బంతుల్లో 20 పరుగులతో బుడ్డోడు ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన 15 ఏళ్ల వైభవ్.. జింబాబ్వే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో కలిపి 151 రన్స్ చేశాడు. వైభవ్ మెరుపులతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.