Vaibhav Sooryavanshi Harare Record: నేడు జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మంచి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తొలి టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం తనకు ఎంతో ప్రత్యేకమని, నాలుగు నెలల క్రితమే ఇదే వేదికపై అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిచిన మధుర జ్ఞాపకాలు ఇంకా కళ్లముందే ఉన్నాయని బుడ్డోడు తెలిపాడు. ఇప్పుడు అదే మైదానంలో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నాడు. భారత జట్టు కోసం 100 శాతం కృషి చేయడమే తన లక్ష్యం అని వైభవ్ చెప్పాడు.
వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం మేము హరారేలో ఉన్నాం. ఈ మైదానం నాకు చాలా ప్రత్యేకమైనది. నాలుగు నెలల క్రితం ఇక్కడే అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిచాం. భారత జెర్సీ ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్రికెటర్ కల. అలాంటి అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే మైదానంలో మళ్లీ ఆడబోతుండటం చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తోంది. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటా’ అని చెప్పాడు. గత ఫిబ్రవరిలో హరారేలో ఇంగ్లండ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో వైభవ్ భారీ సెంచరీ చేశాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేసి టీమిండియాకు టైటిల్ అందించాడు. తనకు అచ్చొచ్చిన మైదానంలో వైభవ్ చెలరేగనున్నాడు.
హరారే పిచ్, అక్కడి పరిస్థితులపై తనకు మంచి అవగాహన ఉందని వైభవ్ వెల్లడించాడు. ‘ఈ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు ఓ అవగాహన, అనుభవం ఉంది. ఇప్పుడు ఆ అనుభవంతో ఈరోజు మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పటివరకు ప్రాక్టీస్‌లో ఆడిన షాట్లనే మ్యాచులో ఆడుతాను. నా సహజమైన ఆటనే కొనసాగిస్తాను. జట్టుకు సాధ్యమైనంత ఎక్కువగా సహకారం అందించడమే నా లక్ష్యం’ అని బుడ్డోడు స్పష్టం చేశాడు.
హరారేలో తాను ఆడిన రెండు మ్యాచ్‌లలో బాగా రన్స్ చేశానని, అదే ఫామ్‌ను ఇప్పుడు కొనసాగించాలని చూస్తున్నానని వైభవ్ చెప్పాడు. ‘ఈ మైదానంలో నేను ఆడిన రెండు మ్యాచ్‌లు నాకు బాగా కలిసొచ్చాయి. అదే జోరును మరలా కొనసాగించాలని చూస్తున్నా. కోచ్‌లు నాకు కావాల్సిన ప్రతి సాయం చేస్తున్నారు. అవసరమైన ప్రాక్టీస్ కూడా లభించింది. ప్రస్తుతం నాలో మంచి ఆత్మవిశ్వాసం ఉంది. గత నాలుగు నెలల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ అవన్నీ క్రికెట్‌లో భాగమే. జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా నేను నా ప్రక్రియను నమ్ముకుంటాను. భారత జట్టు కోసం ప్రతిసారీ నా వంతు 100 శాతం కృషి చేయడమే నా లక్ష్యం’ అని వైభవ్ చెప్పుకొచ్చాడు.

