NTV Telugu Site icon

మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న విశ్వ క్రీడలు…

ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ తరఫున అతిపెద్ద బృందం టోక్యోలో ఉంది.కోచ్‌లు, సహాయక సిబ్బంది, అధికారులతో కలిపి మొత్తం 228 మంది ఒలంపిక్స్‌ లో భాగమయ్యారు.

ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందం కేవలం రెండు పతకాలతో తిరిగి వచ్చింది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో పీవీ సింధు రజతం సాధించగా… మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మలిక్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. రియో క్రీడల్లో భారత్‌ నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. రియో వైఫల్యం తర్వాత కేంద్ర క్రీడా శాఖ భారత క్రీడారంగాన్ని బలోపేతం చేసేందుకు నడుం బిగించింది. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ ను రూపొందించి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి 18 క్రీడాంశాల్లో 127 మంది క్రీడాకారులు పతకాల వేటలో ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటం… మేటి క్రీడాకారులను మట్టికరిపిస్తూ పతకాలు కొల్లగొడుతుండటంతో… టోక్యో ఒలింపిక్స్‌లో మనోళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూలేని విధంగా ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య రెండంకెలు దాటుతుందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో భారత క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా ఆర్చరీ, షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాంశాల్లో భారత్‌కు కచ్చితంగా పతకాలు వస్తాయని ఆశిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ఒలింపిక్స్‌. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి. ప్రణాళిక ప్రకారం 2020లోనే ప్రస్తుత ఒలింపిక్స్ జరగాలి. అయితే, కరోనావైరస్ కారణంగా వాయిదా వేశారు. దీంతో ఏడాది ఆలస్యంగా, జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జపాన్‌లోని టోక్యోలో ఈ పోటీలు జరగబోతున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి రెండు రోజుల ముందే, జులై 21నే ఫుకుషిమాలో సాఫ్ట్‌బాల్ పోటీలు మొదలయ్యాయి

33 విభాగాల్లో 339 పతకాల కోసం ఈ సారి క్రీడాకారులు పోటీ పడబోతున్నారు. తొలి పతాక ప్రధాన కార్యక్రమం జులై 24న నిర్వహిస్తారు. ఇప్పుడు కూడా ఈ పోటీలతో కరోనావైరస్ కేసులు పెరగవచ్చనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. అయితే, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న అనంతరం జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ పచ్చజెండా ఊపాయి.

టోక్యోలో జరుగుతున్న ఈ వేడుకలను జపాన్ మినహా విదేశీయులు నేరుగా చూసేందుకు అనుమతి లేదు. గతంలో 1964, 1972, 1988 ఒలింపిక్స్‌కు జపాన్ ఆతిథ్యమిచ్చింది.

టోక్యో ఒలింపిక్స్ చిహ్నాన్ని మిరాయిటోవా గా పిలుస్తున్నారు. దీన్ని జపాన్ సంప్రదాయ నీలం రంగుతో సిద్ధంచేశారు. జపనీస్ సాహిత్యంలో మిరాయిటోవాకు ప్రత్యేక స్థానముంది. ఇటు సంస్కృతి, అటు ఆధునికీకరణలను ఇది ప్రతిబింబిస్తుంది. జపనీస్‌లో మిరాయ్ అంటే భవిష్యత్తు. టోవా అంటే శాశ్వతమైనది అని అర్థం.

పోటీల్లో గెలుపొందే క్రీడాకారులకు ఇచ్చే పతకాలను పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్ వ్యర్థాలతో తయారుచేశారు. దీని కోసం పాత ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తమకు ఇవ్వాలని 2017 ఫిబ్రవరిలో ప్రజలను ఒలింపిక్స్ నిర్వాహకులు అభ్యర్థించారు. 2010లో వాంకూవర్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులతోనే పతకాలను తయారుచేశారు. పతకం వెనుకవైపు టోక్యో ఒలింపిక్స్ లోగో ఉంటుంది.

మరోవైపు ఒలింపిక్స్ స్టేడియానికి ముందు… విజయానికి చిహ్నంగా భావించే గ్రీక్ దేవత నైక్ విగ్రహం కూడా ఏర్పాటుచేశారు. గ్రీస్‌లోని చరిత్రాత్మక ఒలింపియా పట్టణంలో హెరా దేవాలయంలో గత ఏడాది మార్చి 12నే టోక్యో ఒలింపిక్స్ జ్వాలను వెలిగించారు. గ్రీస్‌లోని పనాథెనియక్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ జ్వాలను జపాన్‌కు అందించారు. జపాన్‌లో మార్చి 25నే టార్చ్ రిలే మొదలైంది. 2011లో సునామీతో తీవ్రంగా ప్రభావితమైన ఫుకుషిమాలో ఈ కవాతు మొదలైంది. 121 రోజులపాటు 47 ప్రావిన్స్‌లలో తిరిగిన అనంతరం చివరగా జులై 23తో ఈ ప్రదర్శన ముగుస్తుంది.

ఈ సారి ఐదు ప్రత్యేక స్పోర్ట్స్ విభాగాలను కూడా ఒలింపిక్స్‌లో చేర్చారు. సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, కరాటే, బేస్‌బాల్‌లను కొత్తగా ఒలింపిక్స్‌లో భాగం చేశారు. ఇటీవల కాలంలో రద్దుచేసిన మరికొన్ని స్పోర్ట్స్ కూడా మళ్లీ ఒలింపిక్స్‌లో భాగం కాబోతున్నాయి. టేబుల్ టెన్నిస్ మిక్సిడ్ డబుల్స్‌ను మళ్లీ నిర్వహించబోతున్నారు. జూడోను 1964 నుంచే నిర్వహిస్తున్నా, ఈ సారి మిక్సిడ్‌ టీమ్ జూడోను కూడా నిర్వహిస్తున్నారు.

అటు స్విమ్మింగ్లో కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. పురుషుల విభాగంలో 800 మీటర్ల రేసును కూడా నిర్వహించబోతున్నారు. మరోవైపు మహిళల విభాగంలో 1,500మీటర్ల ఫ్రీస్టైల్ పోటీలను కూడా నిర్వహిస్తారు. అటు వాటర్‌పోలో టీమ్‌ లు పెరిగాయి. పురుషుల రోయింగ్ విభాగంలో నాలుగు రోయింగ్ పోటీలను తొలగించారు. వీటి స్థానంలో నాలుగు మహిళల రోయింగ్ పోటీలను చేర్చారు. ఇక ఆర్చరీ పోటీల్లో ఈ సారి మిక్సిడ్ టీం పోటీలు కూడా నిర్వహించబోతున్నారు. అటు మహిళల బాక్సింగ్‌ పోటీల సంఖ్యను పది నుంచి పన్నెండుకు పెంచారు. పురుషుల పోటీల సంఖ్యను పది నుంచి 13కి పెంచారు.