Site icon NTV Telugu

Tilak Varma Record: తొలి భారత బ్యాట్స్‌మన్‌గా తిలక్ వర్మ రేర్ రికార్డు!

Tilak Varma 1000 Runs

Tilak Varma 1000 Runs

మంగళవారం రాత్రి ఒడిశాలోని కటక్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ అద్భుతమైన విజయంతో పాటు ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అనేక రికార్డులను నెలకొల్పారు.

ఈ మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాను 74 పరుగులకే ఆలౌట్ చేసింది. దక్షిణాఫ్రికా టీ20 చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రతి బౌలర్ కనీసం ఒక వికెట్ తీశారు. గతంలో దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరు 87. 2022లో రాజ్‌కోట్‌లో ఈ స్కోర్ నమోదైంది. టీ20 చరిత్రలో దక్షిణాఫ్రికా నాలుగు అత్యల్ప స్కోర్లు చేస్తే.. అందులో మూడుసార్లు ప్రత్యర్థిగా టీమిండియానే ఉంది.

హార్దిక్ పాండ్యా టీ20ల్లో 100 సిక్సర్లు బాదాడు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్లబ్‌లో చేరాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు రోహిత్ పేరిట ఉంది. టీ20ల్లో హిట్‌మ్యాన్ 205 సిక్సర్లు బాదాడు. సూర్య 155 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. విరాట్ 124 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 100 సిక్సర్లతో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. కేఎల్ రాహుల్ 99 సిక్సర్లు బాది అరుదైన క్లబ్‌లో చేరేందుకు సిద్దమయ్యాడు.

టీ20ల్లో తిలక్ వర్మ 1000 పరుగుల మార్కును చేరుకున్నాడు. 25 ఏళ్ల లోపు 1,000 టీ20 పరుగులు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2023 ఆగస్టులో వెస్టిండీస్‌పై 23 సంవత్సరాల 31 రోజుల వయసులో తిలక్ టీ20 అరంగేట్రం చేశాడు. టీ20ల్లో 1,000 పరుగులు చేసిన 13వ భారతీయుడు తిలక్. ఈ హైదరాబాద్ ఆటగాడు భారత్ తరఫున ఇప్పటివరకు 5 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. ఇక భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండవ టీ20 డిసెంబర్ 11న పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లో జరుగుతుంది.

Exit mobile version